
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కుయుక్తులకు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న బీఎస్‌ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌పై పాక్ సైనికులు కాల్పులు జరిపి హతమార్చటంతో రాత్రికి రాత్రే భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బుధవారం రాత్రి సాంబా సెక్టార్ సమీపంలో దాయాదిపై విరుచుకుపడిన భారత బలగాలు మూడు పాక్ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాయి.
ఈ ఘటనలో 8–10 పాకిస్తాన్ రేంజర్లు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించగా.. పాక్‌కు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని బీఎస్‌ఎఫ్ ఐజీ రామ్ అవతార్ వెల్లడించారు. అటు, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని బీఎస్‌ఎఫ్ భగ్నం చేసింది. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపగా మిగిలిన వారు పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాక్‌తో 200 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్‌ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’ ప్రారంభించింది.
వేడెక్కిన సరిహద్దు
బుధవారం రాత్రి ఆర్పీ హజారా అనే కానిస్టేబుల్ సాంబా సెక్టార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్ వైపునుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బలగాలు అప్రమత్తమై ప్రతిస్పందించేలోపే హజారా బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. వెంటనే బీఎస్‌ఎఫ్ ప్రతీకారానికి దిగింది. సాంబా సెక్టార్‌లో పాక్ మోర్టార్లున్న ప్రాంతాన్ని గుర్తించి భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ స్థాయిలో ప్రతిఘటనను ఊహించని పాక్‌కు ఈ మెరుపుదాడితో తీవ్ర నష్టం వాటిల్లింది. సోలార్ ప్యానళ్లు, ఆయుధాలు నష్టపోయాయని.. ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
చొరబాట్లపై ‘ఆపరేషన్ అలర్ట్’
శీతాకాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంచు తీవ్రస్థాయిలో కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో గస్తీకాసేందుకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని పాక్ వైపునుంచి చొరబాట్లకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నిరోధించేందుకు బీఎస్‌ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. మరోవైపు, పీవోకే సరిహద్దుల్లోని ఆర్‌ఎస్ పుర సెక్టార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానిత ఉగ్రవాది చనిపోగా మిగిలిన వారు పారిపోయారని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment