Out posts
-
సరిహద్దుల్లో భారత్ ప్రతీకారం!
జమ్మూ: అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కుయుక్తులకు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ హెడ్‌కానిస్టేబుల్‌పై పాక్ సైనికులు కాల్పులు జరిపి హతమార్చటంతో రాత్రికి రాత్రే భారత బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. బుధవారం రాత్రి సాంబా సెక్టార్ సమీపంలో దాయాదిపై విరుచుకుపడిన భారత బలగాలు మూడు పాక్ ఔట్‌పోస్టులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 8–10 పాకిస్తాన్ రేంజర్లు హతమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించగా.. పాక్‌కు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ ఐజీ రామ్ అవతార్ వెల్లడించారు. అటు, జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుగుండా చొరబాటుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. ఓ ఉగ్రవాదిని కాల్చి చంపగా మిగిలిన వారు పారిపోయారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాక్‌తో 200 కిలోమీటర్ల మేర ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’ ప్రారంభించింది. వేడెక్కిన సరిహద్దు బుధవారం రాత్రి ఆర్పీ హజారా అనే కానిస్టేబుల్ సాంబా సెక్టార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుండగా.. పాకిస్తాన్ వైపునుంచి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. భారత బలగాలు అప్రమత్తమై ప్రతిస్పందించేలోపే హజారా బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. వెంటనే బీఎస్ఎఫ్ ప్రతీకారానికి దిగింది. సాంబా సెక్టార్లో పాక్ మోర్టార్లున్న ప్రాంతాన్ని గుర్తించి భారత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ స్థాయిలో ప్రతిఘటనను ఊహించని పాక్‌కు ఈ మెరుపుదాడితో తీవ్ర నష్టం వాటిల్లింది. సోలార్ ప్యానళ్లు, ఆయుధాలు నష్టపోయాయని.. ప్రాణనష్టం భారీగానే ఉండొచ్చని భారత ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. చొరబాట్లపై ‘ఆపరేషన్ అలర్ట్’ శీతాకాలంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మంచు తీవ్రస్థాయిలో కురుస్తుంది. ఈ పరిస్థితుల్లో గస్తీకాసేందుకు ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీన్ని ఉపయోగించుకుని పాక్ వైపునుంచి చొరబాట్లకు అవకాశం ఉంటుంది. అందుకే వీటిని నిరోధించేందుకు బీఎస్ఎఫ్ అంతర్జాతీయ సరిహద్దు వెంట ‘ఆపరేషన్ అలర్ట్’ను ప్రారంభించింది. మరోవైపు, పీవోకే సరిహద్దుల్లోని ఆర్ఎస్ పుర సెక్టార్లో ముగ్గురు ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానిత ఉగ్రవాది చనిపోగా మిగిలిన వారు పారిపోయారని అధికారులు వెల్లడించారు. -
వైఖరి మారకుంటే మరిన్ని దాడులు
{పభుత్వానికి మావోయిస్టు నేత వేణు హెచ్చరిక మన్యంలో తక్షణం బాక్సైట్, ఔట్‌పోస్టుల పనులు ఆపాలి పెదబయలు: మన్యంలో విలువైన ఖనిజ సంపదను దోచుకునే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఔట్ పోస్టులు యుద్ధప్రాతిపదికన నిర్మిస్తోందని మల్కన్‌గిరి- విశాఖ - కోరాపుట్టు బోర్డర్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి వేణు పేర్కొన్నారు. ఇప్పటికైనా మన్యంలో మాక్సైట్ తవ్వకాల ప్రయత్నాలు విరమించుకొని.. ఔట్ పోస్టుల నిర్మాణాలు ఆపకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక విలేకరులకు ఒక ప్రకటన పంపారు. నిర్బంధంలో మన్యం ప్రజలు పెదబయలు మండలం రూడకోట గ్రామంలో నిర్మిస్తున్న ఔట్ పోస్టు ప్రాంతంలో తీవ్రమైన నిర్బంధ పరిస్థితులను ప్రజలు అనుభవిసున్నారని, తనిఖీ లు, మిలటరీ ఆంక్షల పేరుతో మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి ప్రజలకు భయపెట్టి వారితో నిర్మాణ పనులు చేయించుకుంటున్నారని, మహిళలు తాగునీటి గెడ్డలకు వెళ్లాలన్నా, ఇంట్లో ఒంటరిగా ఉండాలన్న భీతిల్లిపోతున్నారని, ఈ ప్రాంతాల్లో శుభ, ఆశుభ కార్యక్రమాలకు బంధువులు నిర్భయంగా రాలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. మన్యంలో ఉన్న అపారమైన ఖనిజంపై పాలకవర్గాల కన్ను పడటమే ఈ పరిస్థితికి కారణమన్నారు. రెండేళ్లుగా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు పెద్దఎత్తున బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పోలీసు బలగాలతో పాశవిక నిర్భందానికి, అణిచివేతకు పూనుకుంటోందన్నారు. ప్రజలు ఎక్కడైతే అవమానాలకు, అన్యాయానికి, అణిచివేతకు గురవుతారో తప్పకుండా అక్కడ ప్రతిఘటన ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 6న ప్రజలతో కలిసి రూడకోట క్యాంపు నిర్మాణ పనులకు రక్షణ కల్పిస్తున్న పీఆర్పీఎఫ్ పోలీసులపై పీఎస్జీఏ (పీపుల్స్ లెబలేషన్ గెరిల్లా ఆర్మీ) దాడి చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు మారకుంటే ఇలాంటి దాడులు పునరావృతం కాకతప్పదని హెచ్చరించారు. మన్యంలో పోలీసు క్యాంపు నిర్మాణాలకు ఎవరూ సహకారం అందించరాదని, మన్యం ప్రజల మనుగడ కోసం సాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల వారు మద్దతు ఇవ్వాలని కోరారు.