శ్రీనగర్ : వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి టెర్రర్ లాంచ్ ప్యాడ్ల వద్ద రబ్బర్ బోట్లు కనిపించడంతో సరిహద్దుల్లో భద్రతా దళాలు పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశాయి. రబ్బర్ పడవలను నిఘా వర్గాలు గుర్తించడంతో సరిహద్దు వెంబడి చిన్న నీటివనరులు, తీరప్రాంతాల్లో భద్రతా దళాలు గస్తీని తీవ్రతరం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అఖ్నూర్, సాంబ, కథువ, జమ్మూ డివిజన్లలో నిఘా సంస్థలు 13 చిన్ననీటి వనరులను గుర్తించి ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించాయి. తీరప్రాంతంలో నౌకలు, పడవల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రవేశించి దాడులకు తెగబడతారని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఉగ్రవాదులు కృష్ణ గటి నది ద్వారా దేశంలోకి చొరబాట్లను ప్రేరేపించవచ్చని భద్రతా దళాలను నిఘా వర్గాలు హెచ్చరించాయి. గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించి దాడులకు తెగబడవచ్చని, అండర్ వాటర్ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు చేసిన హెచ్చరికలతో భద్రతా దళాలు, నేవీ కోస్ట్‌గార్డ్స్ అప్రమత్తమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment