జమ్మూలోని కథువా జిల్లాలో హీరా నగర్ పోలీస్ స్టేషన్పై ఈ రోజు తెల్లవారుజామున తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్లుతో తీవ్ర గాయాల పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని వారు తెలిపారు.
తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు. గ్రానెడ్లు, అధునిక ఆయుధాలు చేత పట్టి తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి మరి ఆ దాడికి ఒడిగట్టారని చెప్పారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
స్థానికంగా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అన్నారు. భారత్ - పాక్ సరిహద్దులకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో కథువా జిల్లా ఉందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.