Kathua district
-
ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురి సజీవదహనం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
లాయర్ దీపిక సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్ : బాధితుల తరపున న్యాయం కోసం పోరాడుతుంటే తోటి న్యాయవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని లాయర్ దీపికా సింగ్ రాజవత్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం చేసిన కతువా గ్యాంగ్ రేప్, హత్య కేసులో బాధితుల తరపున ఆమె వాదిస్తున్నారు. జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో నోమాడియక్ బకెర్వాల్ తెగకు చెందిన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 60 ఏళ్ల సాంజి రామ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బాలిక తల్లిదండ్రుల పక్షాన జమ్మూ హైకోర్టులో వాదనలు వినిపిస్తున్న దీపిక సంచలన వాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో బాధితుల తరపున నిలబడ్డ క్షణం నుంచి అనేక రకాల బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఎన్ని హెచ్చరికలు వచ్చినా న్యాయం కోసం వాటిని పట్టించుకోను. హైకోర్టులో తోటి న్యాయవాదులే నన్ను దూషిస్తున్నారు. 8 ఏళ్ల బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపేస్తే అక్కడ స్థానిక లాయర్లు కేసు నమోదు కాకుండా నిందింతులకు సహాయం చేశారు. దీని వెనుక వారి ఉద్దేశం అర్థవవుతుంది. జమ్మూ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బీఎస్ సలాథియా నన్ను ఈ కేసు వాదించవద్దన్నారు. ఒకవేళ నువ్వు వాదిస్తే నిన్ను ఎలా అడ్డుకోవాలో తెలుసని ఆయన బెదిరించారు. భయంతో నేను భద్రత కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించానని.. వారు తనకు రక్షణ కల్పించాలని పోలీసు శాఖను ఆదేశించార’ని దీపిక వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారని, అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం ఏముందని ఆమె అభిప్రాయపడ్డారు. -
గోవధ నేపథ్యంలోనే లైంగిక దాడి..?
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి హతమార్చిన కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 22 మంది సాక్షులను విచారించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం బకర్వాల్ వర్గీయులు గో వధకు పాల్పడ్డారనే ఆగ్రహంతో ఈ ఘటన జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. మైనర్ బాలికపై ఘాతుకానికి బకర్వాల్ వర్గీయులు గోవును వధించారనే అనుమానాలు కూడా ఓ కారణమని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. ఎనిమిది మంది నిందితులపై లైంగిక దాడి, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో రెండు చార్జిషీట్లు నమోదయ్యాయి. నిందితుల్లో సంఝీరాం, ఆయన కుమారుడు విశాల్, స్పెషల్ పోలీస్ అధికారులు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఎస్ఐ ఆనంద్ దత్తా, పర్వేష్ కుమార్, సంఝీరాం మేనల్లుడులున్నారు. బకర్వాలా వర్గీయులు గో వధకు పాల్పడతారని, డ్రగ్ ట్రాఫికింగ్ నడిపిస్తారనే అభిప్రాయం ఓ నిర్ధిష్ట వర్గంలో వేళ్లూనుకున్నదని అధికారులు తెలిపారు. బకర్వాలా వర్గీయులపై ఆగ్రహం పెంచుకున్న క్రమంలో మైనర్ బాలికపై కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. -
మరోసారి పాక్ కవ్వింపు కాల్పులు
జమ్మూ: పాకిస్థాన్ మరోసారి కవ్వింపు కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ లోని కతువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పులకు దిగింది. హిరానగర్ ప్రాంతంలోని బీఎస్ఎఫ్ అవుట్ పోస్టుపై పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కరోల్ కృష్ణ బోర్డర్ అవుట్ పోస్టును లక్ష్యంగా చేసుకుని చిన్న ఆయుధాలు, ఆటోమాటిక్ వెపన్స్ తో దాడికి దిగిందని తెలిపారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. దీనికి బీఎస్ఎఫ్ దీటుగా స్పందించింది. -
జమ్మూలో తీవ్రవాదుల దాడి: ఏడుగురికి తీవ్ర గాయాలు
-
జమ్మూలో తీవ్రవాదుల దాడి: ఏడుగురికి తీవ్ర గాయాలు
జమ్మూలోని కథువా జిల్లాలో హీరా నగర్ పోలీస్ స్టేషన్‌పై ఈ రోజు తెల్లవారుజామున తీవ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో మొత్తం ఏడుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. బుల్లెట్లుతో తీవ్ర గాయాల పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని వారు తెలిపారు. తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారిలో ఐదుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు ఉన్నారని ఉన్నతాధికారులు వివరించారు. గ్రానెడ్లు, అధునిక ఆయుధాలు చేత పట్టి తీవ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి మరి ఆ దాడికి ఒడిగట్టారని చెప్పారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. స్థానికంగా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అన్నారు. భారత్ - పాక్ సరిహద్దులకు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో కథువా జిల్లా ఉందని ఉన్నతాధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.