మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది.
ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.
పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్‌లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు.
ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ.
ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది.
నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు.
పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.
పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి.
పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు.
సత్వర చర్యలే రక్ష!
Published Thu, Jul 11 2024 12:08 AM | Last Updated on Thu, Jul 11 2024 9:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment