మరో ఇరవై రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగబోతుండగా సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది. మహిళల శారీరక పరిస్థితులను సాకుగా చూపి లేదా సామాజిక నియమాలను కారణాలుగా చూపి సైన్యంలో వారిపట్ల వివక్ష అమలు చేయడం తగదని స్పష్టం చేసింది. పురుషులతో సమానంగా వారికి కూడా అన్ని బాధ్యతలనూ అప్పగించాలన్న తొమ్మిదేళ్లనాటి ఢిల్లీ హైకోర్టు తీర్పును అమలు చేయడంలో అలసత్వం ఎందుకని ప్రశ్నించింది. ఈ తీర్పు ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి మాత్రమే కాదు...అంతక్రితం దేశాన్ని పాలించినవారికి కూడా చెంపపెట్టు. మహిళలను కీర్తించవలసి వచ్చేసరికి మనకు ఆది పరాశక్తి గుర్తుకొస్తుంది. భద్రకాళి స్ఫురణకొస్తుంది. ఇంకా రణరంగంలో శౌర్యపరాక్రమాలను ప్రదర్శించిన మాంచాల, మల్లమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ వంటి వీరనారులు గుర్తుకొస్తారు. తీరా సైన్యంలో తీసుకోవాల్సివచ్చేసరికి అన్నీ ఆవిరైపోతాయి. మహిళలకు తగిన సామర్థ్యం ఉండదని, శారీరకంగా వారు బలహీనులని అనుకుంటారు. అంతేకాదు... వారి ఆదేశాలు పాటించడానికి వారి పరిధిలో పనిచేసే పురుష సైనికులు ఇబ్బందిపడతారని అంటారు. మహిళలకు కీలక బాధ్యతలు అప్పజెప్పడానికి సైన్యం వెనకడుగు వేస్తుంటే, ఆ ధోరణిని మార్చి, సరిచేయాల్సిన ప్రభుత్వాలు కూడా అందుకు వత్తాసు పలుకుతున్నాయి. సైన్యంలోకి తమను అనుమతించాలని స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మహిళలు డిమాండు చేస్తూనే వున్నారు. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
1950లో వచ్చిన సైనిక చట్టం సైన్యంలో పరిమితంగా మహిళల సేవలు వినియోగించుకోవచ్చునని చెప్పినా అది సాకారం కావడానికి మరో 42 ఏళ్లుపట్టింది. 1992లో తొలిసారి సైన్యంలో మహిళలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ అదంతా కాంట్రాక్టు నియామకాలకే పరిమితమైంది. 2006నాటికి స్వల్పకాల సేవల్లో మహిళలను నియమించటం మొదలైంది. ఆ తర్వాత మరో మూడేళ్లకు వైద్య సేవలు, మరికొన్ని ఇతర రంగాల్లో మహిళల శాశ్వత నియామకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నియామకాలు కూడా ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్, జడ్జి అడ్వొకేట్ జనరల్ బ్రాంచ్ వంటి కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైంది. ఇలా శాశ్వత నియామకాల ద్వారా వచ్చినవారికి 60 ఏళ్ల వయసు వచ్చేవరకూ పనిచేసే అవకాశం లభిస్తుంది. మరోపక్క స్వల్ప కాల సేవల కోసం చేరే మహిళలకు అయిదేళ్ల సర్వీసు గడిచాక మరో అయిదేళ్లు మాత్రమే పొడిగింపునకు అవకాశం ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా మెరుగ్గా పనిచేస్తున్నారని భావించే మహిళలకు మరో నాలుగేళ్లు అవకాశం ఇచ్చి రిటైర్ చేస్తున్నారు. అంటే, మహిళలను గరిష్టంగా 14 ఏళ్ల తర్వాత రిటైర్ కావాల్సిందే. అదే పురుషులకైతే 14 ఏళ్ల తర్వాత వారు కోరితే మినహాయింపు ఇస్తున్నారు. ఈ పద్ధతిలో చేరినవారికి శాశ్వత నియామకాలకు కూడా అవకాశం లభిస్తోంది. కానీ మహిళలకు అవేమీ లేవు సరికదా... రిటైరైన తర్వాత దక్కే లబ్ధి కూడా పురుషులతో పోలిస్తే తక్కువే.
రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ సమానమేనని, వారికి సమానావకాశాలు లభించి తీరాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చాక వైమానిక దళం దాన్ని శిరసావహించింది. కానీ నావికాదళం, సైన్యం తమ తప్పు సరిదిద్దుకోలేదు. సైన్యమైతే బాహాటంగా వ్యతిరేకించింది. అప్పట్లో శాశ్వత ప్రాతిపదికన తీసుకోవాల్సిన మహిళా అధికారులు 40మందికి మొండిచేయి చూపింది. దీనిపై వారు మళ్లీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. మరోపక్క ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సుప్రీంకోర్టుకెక్కింది. తాజా తీర్పు ఢిల్లీ హైకోర్టు తీర్పునే ధ్రువీకరించింది. సమానత్వానికి పూచీపడుతున్న రాజ్యాంగంలోని 14వ అధికరణకు భిన్నంగా వ్యవహరించడం తగదని తాజా తీర్పు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సైన్యంలో వున్నవారు ఎవరైనా తగిన శక్తిసామర్థ్యాలు కలిగివున్నారో లేదో, లక్ష్యాలను పరిపూర్తి చేయగలుగుతున్నారో లేదో చూడాలి. ఈ అంశాల్లో మహిళల పనితీరు సంతృప్తికరంగా లేదనుకుంటే ఆ సమాచారాన్ని న్యాయస్థానం ముందుంచాలి. కానీ సైన్యం, ప్రభుత్వం చేసింది అది కాదు. సమాజం నరనరానా జీర్ణించుకున్న పితృస్వామ్య భావజాలాన్ని, పురుషాధిపత్య ధోరణులనూ ప్రోత్సహించేవిధమైన వాదనలు చేయడం!
కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం దాడులకు దిగినప్పుడు మహిళా సైనికులు ఎక్కడా వెరవలేదు. తక్షణ స్పందనలో పురుష సైనికులకు వారెక్కడా తీసిపోలేదు. సుశిక్షిత సైనికులు తమకు ఆదేశాలిచ్చే అధికారిలో తగిన శక్తిసామర్థ్యాలున్నాయా లేదా, చిత్తశుద్ధి ఉందా లేదా అని చూస్తారు తప్ప ఆడా మగా అని చూడరు. పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులే ఇందుకు నిదర్శనం. ఆ శాఖలో ఎందరో ఐపీఎస్ అధికారిణులు, ఇతర మహిళా అధికారులు విధి నిర్వహణలో అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ప్రదర్శిస్తున్నారు. సంక్షోభాలు, ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సిబ్బందిని మెరుగ్గా నడిపిస్తున్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సైన్యంలో అది సాధ్యం కాదని చెప్పడం పురుషాధిపత్య ధోరణులను ప్రోత్సహించడమే అవుతుంది. తాజా తీర్పు పర్యవసానంగా మహిళలు కల్నల్ స్థాయికి, అక్కడినుంచి బ్రిగేడియర్, మేజర్ వగైరా స్థాయిలకు చేరుకుంటారు. అయితే గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారు యుద్ధరంగంలో అవకాశం ఇవ్వడమనేది విధానపరమైన నిర్ణయం కనుక తాము కోరడం లేదని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం ఆ జోలికి పోలేదు. జర్మనీ, నార్వే, అమెరికా వంటి దేశాలు మహిళలను యుద్ధాల్లో కూడా భాగస్వాముల్ని చేస్తున్నాయి. ఏదేమైనా ఈ తీర్పు చరిత్రాత్మకమైనది. భవిష్యత్తులో మహిళల రణరంగ ప్రవేశానికి సైతం ఇది బాటలు పరుస్తుందనడటంలో సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment