షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు.
ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి.
సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి.
చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు.
స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది.
ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్‌లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది.
అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు.
ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది.
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
Published Sat, Nov 9 2024 5:00 AM | Last Updated on Sat, Nov 9 2024 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment