ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్‌! | Sakshi Editorial On Delhi Mayor Election | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్‌!

Published Sat, Feb 18 2023 2:58 AM | Last Updated on Sat, Feb 18 2023 2:58 AM

Sakshi Editorial On Delhi Mayor Election

ఎన్నికలు జరిగి మూడు నెలలవుతున్నా మేయర్‌ సంగతి తేలక అయోమయంలో పడిన ఢిల్లీ ఓటర్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మంచి కబురందించింది. ఢిల్లీ కార్పొరేషన్‌ తొలి సమావేశానికీ, మేయర్‌ ఎన్నికకూ 24 గంటల్లో ప్రకటన విడుదల చేయాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి గనుక, పౌరుల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని నింపటం అవసరం గనుక స్థానిక స్వపరిపాలనను ప్రోత్సహించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.

పంచాయతీల మొదలుకొని నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వరకూ ఎన్నికలు నిర్వహించేది అందుకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తావనకొచ్చే అంశాలు, వాటి అవసరాలు వేరు గనుక ఆ ఎన్నికల స్వరూపమే భిన్నంగా ఉంటుంది.

కనుక రాష్ట్రాన్ని పాలించే పార్టీ కాకుండా మరో పార్టీ స్థానిక సంస్థల్లో పాగా వేయొచ్చు. దీన్ని వమ్ము చేసి, బలాబలాలను తారుమారు చేయటానికి అధికారపక్షం తమ ఎమ్మెల్యేలనూ, ఎంపీలనూ ఆ సంస్థల్లో సభ్యులుగా చేర్చే ధోరణి చాన్నాళ్లుగా కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగింది అదే.

అక్కడ మూడు పురపాలక సంస్థలనూ విలీనం చేసి ఒకే కార్పొరేషన్‌గా మార్చాక జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఘన విజయం సాధించింది. పదిహేనేళ్లుగా మూడు పురపాలక సంఘాల ద్వారా ఆ నగరాన్ని అవిచ్ఛిన్నంగా ఏలిన బీజేపీ ఓటమి చవిచూసింది. 250 స్థానాలుండే కార్పొరేషన్‌లో ఆప్‌కు 134 వచ్చాయి. బీజేపీ బలం 104. ఢిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు జరిగాయి.

బీజేపీకి మద్దతుగా 15 మంది కేంద్రమంత్రులు, ఆరుగురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వీధుల్లో నెల్లాళ్లపాటు అలుపెరగకుండా ప్రచారం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. అప్పటినుంచి కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారుకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ చేయనిదంటూ లేదు. మొదట ఆప్‌ సభ్యులను లోబరుచుకునేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు వచ్చాయి.

ఆ తర్వాత నగరపాలక సంస్థ తొలి సమావేశంలోనే తమ నామినేటెడ్‌ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించే ఎత్తుగడకు దిగింది. ఇందుకు అనుగుణంగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఉత్తర్వులిచ్చారు. కానీ 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ముందు ఎన్నికైన సభ్యులు ప్రమాణస్వీకారం, ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయి సంఘం సభ్యుల ఎన్నిక పూర్తయ్యాకే నామినేటెడ్‌ సభ్యుల ప్రమాణస్వీకారం ఉండాలి.

ఈ నిబంధనలు తొలి సమావేశానికి మాత్రమే వర్తిస్తాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అప్రజాస్వామిక ఉత్తర్వులు పాటించబోమంటూ ఆప్‌... వాటిని తలదాల్చాల్సిందేనని బీజేపీ వాగ్యుద్ధాలకు దిగటంతో గత నెల 6న, ఆ తర్వాత 24న జరిగిన సమావేశాలు రసాభాసగా ముగిశాయి. ఫిబ్రవరి 6న సైతం ఇదే పునరావృతమైంది. తాజాగా సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఆప్‌ మాటే నెగ్గినట్టయింది.

దేశవ్యాప్తంగా తిరుగులేని మెజారిటీ సాధించి కేంద్రంలో రెండో దఫా పరిపాలన సాగిస్తూ కూడా ఢిల్లీ కోసం అర్రులు చాచటం బీజేపీ మానుకోలేదు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా రెండు దఫాలు అధికారం అందుకున్న ఆప్‌ మొన్నటి నగర పాలక ఎన్నికల్లో సైతం విజయం సాధించటం సహజంగానే బీజేపీకి కంటగింపుగా ఉంది.

రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా నచ్చని ప్రభుత్వాలను నియంత్రిస్తున్నట్టే, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా ఢిల్లీలో ఆప్‌ సర్కార్‌కు చికాకులు తీసుకురావటం, న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు కొనసాగటం తరచు కనబడుతూనే ఉంది. ఢిల్లీ మహానగరంలోనే కేంద్ర ప్రభుత్వ అధికార పీఠానికి సంబంధించిన సమస్త యంత్రాంగమూ ఉంటుంది గనుక అక్కడి అసెంబ్లీ, అక్కడి నగర పాలక సంస్థ కూడా తన అధీనంలోనే ఉండాలని బీజేపీ కోరుకోవటంలో విపరీతమేమీ లేదు.

ఉన్న అధికారాన్ని పదిలపరుచుకోవటానికి, దాన్ని మరింత విస్తృత పరుచుకోవటానికి ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకీ హక్కుంటుంది. అయితే అదంతా నిబంధనలకు అనుగుణంగా జరగాలి.  అడ్డదారుల్లో అధికారాన్ని అందుకోవాలని ఎవరూ తాపత్రయపడకూడదు. 2014 ఎన్నికల తర్వాత తనకొచ్చిన బలంతో సరిపెట్టుకోక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి చేర్చుకున్న చంద్రబాబునాయుడుకు ఆంధ్రప్రదేశ్‌లో జనం ఏ గతి పట్టించారో కళ్లముందుంది.

నిజానికి ఢిల్లీలో కొత్తగా నామినేట్‌ అయ్యే పదిమందితో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌ను అధిగమించటం ఇప్పటికప్పుడు బీజేపీకి అసాధ్యం. అయితే ఈ చర్యవల్ల ఇద్దరి బలాబలాల్లోని వ్యత్యాసం తగ్గిపోతుంది. అనంతరకాలంలో సభ్యులను ప్రలోభపెట్టడం ద్వారా దాన్ని మరింత పెంచుకుని అధికారం దక్కించుకునే ఆస్కారం ఉంటుంది.

నిజానికి అన్ని పార్టీలూ హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించటం నేర్చుకుంటే దాదాపు మూడు నెలలపాటు ఎన్నికైన పాలకవర్గం లేకుండా ఢిల్లీ నగర పాలక సంస్థ అనాథగా మిగిలేది కాదు. అందరికీ సహజంగా తెలియాల్సిన నిబంధనల గురించి సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సిన అగత్యం ఏర్పడేది కాదు.

పెండింగ్‌ కేసుల సంఖ్య అపారంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలా విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయటం పార్టీలకు తగునా? అన్ని పార్టీలూ ఆలోచించాలి. ఇకనుంచైనా తన విధులు తాను నిర్వర్తించే వెసులుబాటు ఢిల్లీ నగర పాలక సంస్థకు కలుగుతుందని ఆశించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement