‘పెండింగ్‌’కు మంచి దోవ! | Sakshi Editorial On Pending Cases in courts | Sakshi
Sakshi News home page

‘పెండింగ్‌’కు మంచి దోవ!

Published Fri, Jun 28 2024 12:04 AM | Last Updated on Fri, Jun 28 2024 12:35 AM

Sakshi Editorial On Pending Cases in courts

న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్‌ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్‌ అదాలత్‌లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్‌లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు.  ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్‌ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. 

జస్టిస్‌ చంద్రచూడ్‌ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్‌ కేసులూ, 18,049 క్రిమినల్‌ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ చెబుతోంది. క్రిమినల్‌ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నవి పది లక్షల సివిల్‌ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్‌ పడిన కోట్లాది కేసులు అదనం.

న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. 

ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్‌డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. 

సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్‌డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. 

నీతి ఆయోగ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్‌ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్‌డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్‌ అదాలత్‌ల పనితీరు భిన్నమైనది. 

ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయం కల్పిస్తున్నారు. 

ఇది పెండింగ్‌ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్‌ బౌన్స్‌ కేసులు ఇందుకు ఉదాహరణ. 

గతంలో సివిల్‌ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్‌ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement