న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్‌లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన.
మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు.
.. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment