పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్‌ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్‌లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment