Pending cases
-
జడ్జీలపై పెండింగ్ కేసుల కొండ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని న్యాయస్థానాలన్నీ కేసుల భారం, విపరీతమైన పని ఒత్తిడితో సతమతమవుతున్నాయి. పెరుగుతున్న కేసుల కొండను కరిగించేంత స్థాయి పరిమాణంలో న్యాయమూర్తులు లేరు. క్రింది స్థాయి కోర్టులు మొదలు హైకోర్టు దాకా చాలా జడ్జీ పోస్టులు ఖాళీలున్నాయి. దీంతో ఉన్న కొద్దిమంది న్యాయమూర్తుల మీదనే విపరీతమైన పని భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4,94,907 కేసులు న్యాయస్థానాల్లో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణలో ఒక్కో న్యాయమూర్తిపై 9,144, ఆంధ్ర ప్రదేశ్‌లో 8,576 కేసుల భారం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 4,54,55,345 పెండింగ్ కేసులు ఉండగా.. వాటిలో 57 శాతం సివిల్ కేసులు, 62 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో 83,410 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కేసులతో పెండింగ్ భారం విపరీతంగా పెరిగిపోతోందని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. ‘2005 నాటికి ట్రయల్ కోర్టుల్లోని న్యాయమూర్తుల సంఖ్య ప్రతి 10లక్షల జనాభాకు 50 మంది జడ్జిలుగా ఉండాలని 2002లో ఉత్తర్వులు జారీ చేశాం. ఉత్తర్వులు జారీ చేసి 22 సంవత్సరాలు గడిచినా ఈ నిష్పత్తి 2024 ఏడాదిలో ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 25 మంది న్యాయమూర్తులకు చేరుకోలేదు’అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.. ఢిల్లీకి చెందిన ఓ సెషన్స్ జడ్జికి ఉపశమనం కలి్పస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసింది. సెషన్స్ జడ్జికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో ఒక్కో న్యాయమూర్తికి సగటున 2 వేలకు పైగా కేసుల భారం ఉంది. మూడు హైకోర్టుల్లోని జడ్జీలపైనే అత్యధిక పనిభారం రాజస్థాన్, మధ్యప్రదేశ్, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులపై దేశంలోనే అత్యధిక పనిభారం ఉందని తెలుస్తోంది. 25 హైకోర్టుల్లో 61,09,862 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో పెండింగ్‌లో ఉన్న కేసుల విషయంలో ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉందని నివేదిక చూపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 6,56,141 కేసులు పెండింగ్‌లో ఉండగా కేవలం 32 మంది న్యాయమూర్తులు మాత్రమే ఈ కేసుల పరిష్కారానికి బాధ్యత వహిస్తున్నారు. ఇక్కడ సగటున ప్రతి న్యాయమూర్తి 20,504 కేసుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం పాతిక హైకోర్టులలో ఇదే అత్యధికం. దీని తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు రెండో స్థానంలో నిలిచింది. 4,69,462 కేసుల పరిష్కారం బాధ్యత 35 మంది న్యాయమూర్తులపై ఉంది. ఇక్కడి న్యాయమూర్తిపై సగటున 13 వేల 414 కేసుల భారం ఉంది. అలాగే అలహాబాద్ హైకోర్టు దేశంలోనే మూడో స్థానంలో ఉంది. 10,67,614 కేసులను పరిష్కరించే బాధ్యత 82 మంది న్యాయమూర్తులపై ఉంది. -
ఇది ‘న్యాయ’మేనా!
ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్తలకు సారథులు లేక అనాధలుగా మారాయి. హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల పదవీ కాలం ముగిసి ఏడునెలలు గడిచింది. అలాగే, లోకాయుక్త చైర్మన్ పదవి కాలం కూడా సెప్టెంబరు 14తో ముగిసింది. దీంతో రెండు సంస్థలకు సారథులు లేకపోవడంతో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. నిజానికి.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీరి నియామకాలు 90 రోజుల్లో జరపాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పేదలకు ఉచిత న్యాయ సేవలు అందడంలేదు. –కర్నూలు (సెంట్రల్)ఏడు నెలలు గడిచినా చలనంలేదు..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా మాంథాత సీతారామమూర్తి, జ్యూడిషియల్ సభ్యుడిగా దండే సుబ్రమణ్యం, నాన్ జ్యూడిషియల్ æసభ్యుడు జి. శ్రీనివాసరావుల మూడేళ్ల పదవి కాలం 2024 మార్చి 23తో ముగిసింది. దీంతో అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 15 నుంచి 30 వరకు కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఎన్నికలు రావడంతో అప్పట్లో ఈ ప్రక్రియ ఆగిపోయింది. చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తిగా పనిచేసిన వారిని.. జ్యూడిషియల్ సభ్యుడిగా న్యాయ సంబంధ అంశాల్లో పట్టున్న వారు, నాన్ జ్యూడిషియల్ సభ్యుడు ఎన్జీఓల్లో పనిచేసిన అనుభవం ఉన్న వారిని ఎంపిక చేస్తారు.ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, స్పీకర్, కేబినెట్లో సీనియర్ మంత్రి, శాసనమండలి చైర్మన్, విపక్ష నేత సభ్యులుగా ఉండే ప్యానల్ చైర్మన్, సభ్యులను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదం తరువాత కమిషన్ మూడేళ్లపాటు అమల్లోకి వస్తుంది. కాగా, హెచ్ఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం కోసం స్వీకరించిన అర్జీలు న్యాయశాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.లోకాయుక్తలో స్తంభించిన కార్యకలాపాలు..ఇక లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ పి. లక్ష్మణ్‌రెడ్డి పనిచేశారు. 2024 సెప్టెంబర్ 14న ఆయన పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో లోకాయుక్తలో కార్యకలాపాలు స్తంభించాయి. లోకాయుక్త చైర్మన్‌ను కూడా సీఎం, ప్రతిపక్ష నేత, స్పీకర్, సీనియర్ మంత్రి, శాసన మండలి చైర్మన్, విపక్ష నేతలతో కూడిన కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ ఎంపిక చేస్తారు. లోకాయుక్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు, హైకోర్టులలో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారిని నియమిస్తారు. మూడేళ్ల నుంచి కర్నూలు కేంద్రంగా..రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త సంస్థల ద్వారా ఏటా ఒక్కోదానిలో దాదాపు వెయ్యికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. పైగా ఆయా సంస్థల్లో పైసా ఖర్చులేకుండా న్యాయ ఫిర్యాదులు చేసుకునే వీలుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తమ ఫిర్యాదులను పంపుతారు. లెటర్ రాసి పంపినా కేసు నమోదు చేస్తారు. లేదంటే.. ఆయా సంస్థల ఈ–మెయిళ్లు, వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేసినా వాది, ప్రతివాదులకు నోటీసులిచ్చి విచారణలు జరుపుతుండడంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు.పేదలకు ఉచిత న్యాయ సేవలు..హెచ్ఆర్సీ, లోకాయుక్తల ద్వారా పేదలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయి. న్యాయం కోసం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా హెచ్ఆర్సీ, లోకాయుక్తలను ఆశ్రయించి న్యాయం పొందుతారు. కానీ, ఇప్పుడివి లేకపోవడంతో ఆయా సంస్థల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. – కృష్ణమూర్తి, బార్ అసిసోయేషన్ అధ్యక్షుడు, కర్నూలు -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్‌ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్‌లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. -
సీబీఐ దర్యాప్తు పూర్తయినా 6,900 కేసులు కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది. సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది. దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది. సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలిపింది. -
CJI D Y Chandrachud: వారం రోజుల స్పెషల్ లోక్ అదాలత్
న్యూఢిల్లీ: వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, తద్వారా పెండింగ్ భారాన్ని తగ్గించుకునేందుకు సుప్రీంకోర్టు సోమవారం ప్రత్యేక లోక్ అదాలత్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులోని మొదటి ఏడు ధర్మాసనాలు మధ్యాహ్నం 2 గంటలకు కేసులను విచారిస్తాయి. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వెల్లడించారు. ప్రత్యేక లోక్ అదాలత్ వారం పాటు కొనసాగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న కక్షిదారులు, లాయర్లు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడంలో కక్షిదారులకు సాయపడితే కలిగే తృప్తి వెల కట్టలేనిదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యల పరిష్కారంలో లోక్ అదాలత్‌ల ప్రాధాన్యతకు సంబంధించి స్వీయానుభవాన్ని ఉదాహరించారు. ‘‘నా ముందుకు ఒక విడాకుల కేసు వచి్చంది. భార్య నుంచి విడాకులు కోరుతూ భర్త కింది కోర్టుకు వెళ్లాడు. అతడి నుంచి పరిహారం, పాప సంరక్షణ హక్కులు కోరుతూ భార్య కూడా కోర్టుకెక్కింది. వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడిన మీదట మనసు మార్చుకున్నారు. కలిసుండేందుకు ఒప్పుకున్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తామని చెబుతూ కేసులు వెనక్కు తీసుకున్నారు’’ అని వివరించారు. ఇలా లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి! పైగా సోమవారం జరిగిన విచారణల కవరేజీ కోసం మీడియాను కోర్టు రూముల లోపలికి అనుమతించడం విశేషం. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్‌లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్‌ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
లోక్ అదాలత్‌లో 10,35,520 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. ఒకేరోజు 10,35,520 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 5,81,611, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 4,53,909 ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.743 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్ట్రవ్యాప్తంగా లోక్ అదాలత్‌లను పర్యవేక్షించారు. ఈ మేరకు కేసుల పరిష్కార వివరాలను సాయంత్రం రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్.పంచాక్షరి మీడియాకు వెల్లడించారు. రెట్టింపు ఉత్సాహంతో కేసులను పరిష్కరించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టులో 132 కేసులు.. హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఆధ్వర్యంలో జరిగిన జాతీ య లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్, న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. హైకోర్టులో 132 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం.. రంగారెడ్డి కోర్టులు: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌లో పరిష్కారమైన కేసులతో సత్వర న్యాయంతోపాటు కక్షిదారులు చెల్లించిన కోర్టు రుసుమును కూడా తిరిగి పొందవచ్చునని పేర్కొన్నారు.కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి పట్టాభిరామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గులగారి కృష్ణ, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్స్, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి/సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి.శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం శనివారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో 33 లోక్ అదాలత్ ధర్మాసనాలు ఏర్పాటు చేయగా సుమారు లక్షా 27వేల పైచిలుకు క్రిమినల్, సివిల్ ఇతర కేసులు పరిష్కరించారు. కక్షిదారులకు మొత్తంగా 5 కోట్ల 85 లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. -
జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లో ‘సుప్రీం’ సమాచారం
న్యూఢిల్లీ: జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్(ఎన్‌జేడీజీ)తో సుప్రీంకోర్టు కేసుల వివరాలు అనుసంధానించారు. ఇకపై సుప్రీంకోర్టులో ఉన్న పెండింగ్ కేసుల తాజా సమాచారం ఎప్పటికప్పుడు కక్షిదారులుసహా అందరూ చూడొచ్చు. ఈ వివరాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కోర్టురూమ్‌లో వెల్లడించారు. తాలూకా స్థాయి నుంచి సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టులో ఎన్నెన్ని కేసుల విచారణ పూర్తయింది, ఇంకా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి అనేదంతా తెల్సిపోతుంది. ‘ ఇదో చిన్న ప్రకటనే. కానీ ఈ రోజు చరిత్రాత్మకమైన రోజు. ఎన్ఐసీ బృందం, సుప్రీంకోర్టు టీమ్ కలిసి ఈ వేదికను అభివృద్ధిచేశాయి. సంవత్సరాలవారీగా, రిజిస్ట్రర్ అయిన, రిజిస్టర్‌కాని, కోరమ్ వారీగా ఇలా భిన్న విధాలుగా కేసుల వివరాలు పొందొచ్చు. 62,946 సివిల్ కేసులు, 16,555 క్రిమినల్ కేసులు మొత్తంగా 80,501 పెండింగ్ కేసులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణకు ఎదురుచూస్తున్నాయి. అన్ని వివరాలను వెబ్‌పేజీలు అందిస్తాయి. ఎన్‌జేడీజీలో సమాచారం అప్లోడ్ ద్వారా న్యాయవ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరింత ఇనుమడిస్తుంది’ అని సీజేఐ చెప్పారు. 585 కేసులను త్రిసభ్య ధర్మాసనాలకు అప్పజెప్పాల్సి ఉంది. త్వరలోనే ఆయా ధర్మాసనాలను ఏర్పాటుచేస్తానని సీజేఐ పేర్కొన్నారు. ‘స్వేచ్ఛా సమాచార పాలసీ’లో భాగంగానే ఇవన్నీ అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ఎన్‌జేడీజీలో 18,735 జిల్లా, సబార్డినేట్ కోర్టులు, హైకోర్టుల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఈ–కోర్ట్స్ ప్రాజెక్టు కింద దీనిని ఏర్పాటుచేశారు. కక్షిదారులకు వెబ్ సేవల ద్వారా అన్ని హైకోర్టులు ఎన్‌జేడీజీతో అనుసంధానమయ్యాయి. వేర్వేరు రకాల కేసులు సంవత్సరాలవారీగా ఈ పోర్టల్‌లో ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. కేసుల సంబంధ సమస్త సమాచారాన్ని ఈ పోర్టల్ ద్వారా పొందొచ్చు. పారదర్శకతలో పై మెట్టు: మోదీ ‘ సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు సీజే జస్టిస్ చంద్రచూడ్ వేసిన గొప్ప ముందడుగు ఇది. అధునాతన సాంకేతికతతో న్యాయవితరణలో, న్యాయవ్యవస్థలో పారదర్శకత మరో మెట్టు పైకి ఎక్కింది’ అంటూ ఎన్‌జేడీజీలో సుప్రీంకోర్టు అనుసంధానాన్ని ప్రధాని మోదీ శ్లాఘించారు. -
కోర్టుల సంఖ్య పెంచాలి
హుజూర్నగర్: పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి కోర్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. మంగళవారం సూ ర్యాపేట జిల్లా హుజూర్నగర్ అదనపు జిల్లా కోర్టును హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తమ కేసుల కోసం జిల్లా న్యాయ స్థానాన్ని ఆశ్రయించటానికి పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యుల విజ్ఞప్తి మేరకు హుజూర్‌నగర్‌కు జిల్లా అదనపు న్యాయస్థానాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజల సౌకర్యార్థమే అదనపు జిల్లా కోర్టు మంజూరు చేశామని, కోర్టు ప్రారంభమైనందున ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉండటమే కాకుండా సత్వర న్యాయం ల భించడానికి మార్గం సుగమమైందన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ లక్ష్మణ్, సూర్యాపేట పోర్టుపోలియో జడ్జి జస్టిస్ శ్రీ సుధా, జస్టిస్ సుజన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజగోపాల్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాంకుమార్, జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు సాముల రాంరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సా..గుతున్న కేసులు.. సవాలక్ష కారణాలు!
తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీనికిముందు దాదాపు 7 దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగింది. ఎట్టకేలకు ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు వెలువడింది. పంట నాశనం చేశాడన్న ఆరోపణలతో 1996లో నాగోసింగ్తో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది. దీంతో కొంతకాలం పాటు విచారణ ఖైదీలుగా జైలు జీవితం గడిపారు. బెయిల్ రావడంతో బయటకు వచ్చినా మొత్తం మీద 26 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. చివరకు 2022లో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ సంతోషంలో నాగోసింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బిహార్ బంకా జిల్లాలో ఇది జరిగింది. ఒకటికాదు..రెండు కాదు.. లక్షల కేసులు ఏళ్ల తరబడి కోర్టుల్లో మగ్గుతున్నాయి. దాఖలవుతున్న పిటిషన్లకు అనుగుణంగా కేసులు పరిష్కారం కావడం లేదు. 30 ఏళ్లకు పైగా ‘సాగుతున్న’కేసులు ఎన్నో ఉన్నాయి. ‘ఏళ్లకు ఏళ్లు విచారణ సాగిన తర్వాత బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చినా అది న్యాయం అందినట్లు కాదు’, ‘సత్వర న్యాయం అందనంత కాలం బాధితులకు న్యాయం జరగనట్టే’.. ప్రభుత్వాధినేతలు, న్యాయనిపుణులు పదే పదే చెప్తున్న మాటలివి. అయినప్పటికీ కేసుల పరిష్కారంలో సంవత్సరాల జాప్యం జరుగుతోంది. పెండింగ్ కేసులు కోర్టులకు గుదిబండలా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య (కిందికోర్టు, హైకోర్టులు కలిపి) ఈ జూలై 1 నాటికి 5 కోట్లు దాటిందని కేంద్ర న్యాయ మంత్రి గతవారం రాజ్యసభలో ప్రకటించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ కోర్టుల్లో పెండింగ్ కేసులు మూడేళ్లలో 18 శాతం, అంటే ఏటా 6 శాతం చొప్పున పెరిగాయి. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టు 70 వేల పెండింగ్ కేసుల భారం మోస్తూ ఏడాదికి సుమారు వెయ్యి తీర్పులిస్తోంది. 2018 నవంబర్ నాటికి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్లో 40 శాతం అయిదేళ్ల కంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. 8 శాతం కేసులు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 2004తో పోల్చినప్పుడు అయిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 7 శాతం పెరిగింది. ట్రయల్ కోర్టులో మొదలై సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి ఒక్కో కేసుకు సగటున 13 సంవత్సరాల 6 నెలల కాలం పడుతోంది. ఇందులో మూడో వంతు కాలం ప్రొసీడింగ్స్ సుప్రీంకోర్టులోనే ఉంటోంది. పెండింగ్‌కు ముఖ్య కారణాలివే.. ► జడ్జిలు సహా కోర్టు సిబ్బంది లేమి ► న్యాయ వ్యవస్థకు అరకొర నిధుల కేటాయింపు ► కోర్టులు, ఇతర చోట్ల మౌలిక సదుపాయాల కొరత ► చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగం, చట్టంలో లోటుపాట్లు (వాయిదా వేస్తూ వెళ్లడం) ► న్యాయస్థానాల్లో అంతంత మాత్రంగా సాంకేతికత ► చట్టాలపై ప్రజలకు అవగాహన పెరగడం ► ఆర్టీఐ, ఆర్టీఈ లాంటి కొత్త చట్టాలు వస్తుండటం ► జనాభా మేరకు కోర్టుల సంఖ్య లేకపోవడం ► ప్రభుత్వం నుంచి కూడా లిటిగేషన్లు పెరగడం ► పలు చట్టాల్లో ఇంకా అస్పష్టత ఉండటం అవగాహన.. సాంకేతికత అభివృద్ధితో ప్రయోజనం ► ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కోర్టులకు వచ్చే కేసులను కొంతవరకు తగ్గించవచ్చు. ► కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి. ముఖ్యంగా సాంకేతికతను అభివృద్ధి పరచడంతో పాటు పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తే కేసుల సత్వర పరిష్కారం సాధ్యమవుతుంది. అన్ని కోర్టుల్లో వర్చువల్ విచారణ చేపట్టాలి. సాక్షులు, అధికారులు, కక్షిదారులు కోర్టుకు రాకున్నా ఆన్లైన్ ద్వారా వారి వాంగ్మూలాలను స్వీకరించవచ్చు. తద్వారా వాయిదాలను కొంతవరకు తగ్గించొచ్చు. ► టెక్నాలజీతో ఒకే రకమైన కేసులను ఒక్క దగ్గరే విచారణ చేపట్టవచ్చు. ► మోటార్ వెహికిల్ కేసుల్లో చాలా కేసులు హైకోర్టులకే వస్తున్నాయి. వీటిని జిల్లా కోర్టుల్లోనే పరిష్కరిస్తే ఉన్నత న్యాయస్థానాలపై భారం కొంత తగ్గుతుంది. హైకోర్టులో ఈ కేసులను చాలా వరకు సింగిల్ జడ్జికే పరిమితం చేయాలి. ► చిన్న చిన్న కేసుల విచారణకు గడువు పెట్టుకోవాలి. ఆ గడువులోగా ఉత్తర్వులు ఇచ్చేయాలి. ► పలు కారణాల రీత్యా ఒక్కోసారి వాద ప్రతివాదులు, కొన్ని సమయాల్లో న్యాయవాదులు కోర్టుకు హాజరుకాలేపోతుండటంతో కేసులు వాయిదా పడుతున్నాయి. ► ఫ్యామిలీ కేసుల్లో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న భర్త, భార్య ప్రతిసారీ కోర్టుకు హాజరు కావడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ► ప్రభుత్వ లిటిగేషన్లు కూడా తగ్గాలి. అధికారులు హాజరుకాలేని పక్షంలో వారు ఆన్లైన్ ద్వారా వివరణ ఇచ్చే వెలుసుబాటు ఉండాలి. దీంతో హాజరు కోసం వాయిదా వేయాల్సి అవసరం ఉండదు. ప్రభుత్వం కూడా ఓ లిటిగేషన్ పాలసీని తీసుకొస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. –జస్టిస్ నవీన్‌రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జడ్జిల రోస్టర్ వేర్వేరుగా ఉండాలి ప్రజలు, పనిచేస్తున్న జడ్జిల నిష్పత్తిలో చాలా తేడా ఉంది. కేటాయించిన సంఖ్యలోనూ పెద్ద ఎత్తున ఖాళీలుంటున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఇక చిన్న చిన్న కేసులను వాయిదాలు వేయకుండా నిర్ణీత గడువుతో సత్వరం పరిష్కరించాలి. జడ్జిల రోస్టర్ కూడా క్రిమినల్, సివిల్, రిట్.. ఇలా వేర్వేరుగా ఉండాలి. ఎవరికి ఎందులో నైపుణ్యం ఉందో ఆ సబ్జెక్టును కేటాయిస్తే వేగంగా పూర్తి చేయగలుగుతారు. – సీనియర్ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు నేనిక కోర్టుకు రాలేను! మేడమ్.. మా బాబుకు ఐదేళ్లు ఉన్నప్పుడు విడాకుల కోసం కోర్టుకు వచ్చా. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇంకా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఉద్యోగం చేసుకుంటూ నా పిల్లలను పోషించుకుంటున్నా. వాయిదాల కోసం సెలవులు పెట్టడానికి నానాయాతన పడాల్సి వస్తోంది. మీరు విడాకులు ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఇకపై కోర్టుకు రాలేను –జడ్జితో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళ -
హైదరాబాద్ జిల్లాలో 1,02,611 కేసులు పరిష్కారం
నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్‌బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్‌అదాలత్‌లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్‌ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు. 1,02,611 కేసులు పరిష్కారం ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్‌లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్‌లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
మధ్యవర్తిత్వంతో కోర్టులపై భారం తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా వ్యవస్థపై అది భరించే శక్తికి మించి ఒత్తిడి పెంచితే ఆ వ్యవస్థ దెబ్బతింటుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ భారాన్ని తగ్గించడం ‘మధ్యవర్తిత్వం’తోనే సాధ్యమని తెలిపారు. ఇంట్లోని చిన్నచిన్న తగాదాలు కూడా కోర్టుకు చేరడంతో పెండింగ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయన్నారు. ఇలాంటి కేసులన్నీ మధ్యవర్తిత్వంతోనే పరిష్కారం కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ–మీడియేషన్ రైటింగ్స్ (ఈఎండబ్ల్యూ) ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈఎండబ్ల్యూ మూడేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం అభినందనీయమని ప్రశంసించారు. ‘అత్తాకోడలు, భార్యాభర్తలు, అన్నదమ్ములు.. ఇలా చిన్నచిన్న వివాదాలను ఇంటి స్థాయిలోనో లేదా గ్రామ స్థాయిలోనో ఎవరో ఒకరు మధ్యవర్తిత్వంతో పరిష్కరించే ఏర్పాట్లు జరగాలి. పేదలకు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే ఆర్థిక స్తోమత తక్కువ. అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం మధ్యవర్తులు ముందుకురావాలి’అని తమిళిసై పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. భరించే శక్తికి మించి న్యాయవ్యవస్థ భారం మోస్తోందని చెప్పారు. గతంలో గ్రామీణ స్థాయిలో, కుటుంబాల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, సత్వర న్యాయం అందుతుందన్నారు. కోర్టు తీర్పు తర్వాత సదరు పార్టీల మధ్య బంధం ఉండకపోవచ్చని, అదే మధ్యవర్తిత్వ పరిష్కారంలో వారి అంగీకారంతోపాటు బంధం బలహీనపడదని చెప్పారు. మీడియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని, అది పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు పార్టీలకు సమ న్యాయం.. కోర్టుల్లో వివాదాల పరిష్కారంతో పోలిస్తే మధ్యవర్తిత్వ పరిష్కారం అన్నివిధాలా ఉత్తమమైనదని పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి పేర్కొన్నారు. మధ్యవర్తిత్వంలో పార్టీలు ఇద్దరూ సఫలీకృతం అవుతారని, ఇద్దరికీ సమ న్యాయం అందుతుందని చెప్పారు. ఇంట్లో, ఊరిలో, సమాజంలో మధ్యవర్తులు ఉండి ఎక్కడికక్కడే సమస్యలకు చెక్ పెడితే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించారు. ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న కోవిడ్ సమయంలో ఈఎండబ్ల్యూ ఊపిరిపోసుకుందని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష కోర్టులు లేని సమయంలో కక్షిదారులకు సేవలందించిందని, ఇలా మూడేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. మధ్యవర్తిత్వం కోసం.. మధ్యవర్తిత్వం చేత.. మీడియేటర్లే నిర్వహిస్తున్న కార్యక్రమం ఈఎండబ్ల్యూ అని మీడియేషన్ ట్రైనర్ పుష్ప్ గుప్తా అన్నారు. అనంతరం మీడియేషన్ ట్రైనర్ థన్కచన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సైనిక బలగాల ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ రాజేంద్ర మీనన్, పలు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఈఎండబ్ల్యూ తెలంగాణ కో–ఆర్డినేటర్ మంజీరా వెంకటేశ్, కేఎస్ శర్మ, చిత్రా నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
పెండింగ్’కు ‘మధ్యవర్తిత్వం’ చక్కటి పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: భరించలేనంత భారం మోపితే ఏ వ్యవస్థ అయినా దెబ్బతింటుందని.. ఆ ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయం అవసరం అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివాద పరిష్కారంలో మధ్యవర్తిత్వం అమలు విధానంపై చర్చా కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు, రాష్ట్ర లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం మూడు రోజులు జరగనుంది. ఈ సందర్భంగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ ఏటికేడు పెరిగిపోతున్న పెండింగ్ కేసులతో న్యాయవ్యవస్థపై విపరీత భారం పడుతోంది. న్యాయమూర్తులపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీనికి చక్కని పరిష్కారమే ‘మధ్యవర్తిత్వం’ అని వెల్లడించారు. అవగాహన పెంచుకోవాలి..: ‘హైకోర్టు న్యాయమూర్తులు కూడా మధ్యవర్తిత్వ విధానంపై మరింత అవగాహన పెంచుకోవాలి. దేశంలో దాదాపు 5 కోట్లు, రాష్ట్రంలో 10 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రోజూ ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారో.. అంతకు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుంది? ఈ పరిస్థితులను అధిగమించేందుకు మధ్యవర్తిత్వం తోడ్పడుతుంది.’అని జస్టిస్ లావు నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ‘జిల్లాస్థాయిల్లోనూ మీడియేషన్ సెంటర్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కుటుంబ వివాదాలు, భూ సమస్యలు, భార్యభర్తల గొడవలకు అక్కడే పరిష్కారం చూపిస్తే.. పెండింగ్ కేసుల భారం తగ్గే అవకాశం ఉంది’ అని జస్టిస్ నవీన్‌రావు అభిప్రాయపడ్డారు. సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జి లిమ్ వర్చువల్‌గా మాట్లాడారు. అనంతరం జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ అనుమప చక్రవర్తి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ వినోద్‌కుమార్‌లు అడిగిన ప్రశ్నలకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, జార్జి లిమ్ సమాధానం చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు, లీగల్ సరీ్వసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి(జడ్జి) గోవర్ధన్‌రెడ్డి, జడ్జి రాధిక, ౖహె కోర్టు రిజిస్టార్, అసిస్టెంట్ రిజిస్టార్లు పాల్గొన్నారు. -
ఒకేరోజు 3,30,866 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 3,30,866 కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 9,262.. వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 3,21,604 ఉన్నాయి. బాధితులకు రూ.255.48 కోట్ల పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి.నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ టి.వినోద్‌కుమార్ రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో 365 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి, జస్టిస్ జి.శ్రీదేవి, మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతి పాల్గొన్నారు. హైకోర్టులో 365 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.26.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. -
వివాద్ సే విశ్వాస్–2 స్కీము ముసాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన వివాద్ సే విశ్వాస్ 2 స్కీము ముసాయిదాను కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం విడుదల చేసింది. ప్రభుత్వ విభాగాలు, సంస్థలు, కాంట్రాక్టర్లు, ప్రజలు దీనిపై మార్చి 8లోగా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. ముసాయిదా ప్రకారం వివాదంపై విచారణ దశను బట్టి కాంట్రాక్టర్లకు సెటిల్మెంట్ మొత్తాన్ని ఆఫర్ చేస్తారు. ఒకవేళ న్యాయస్థానం లేదా ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసి ఉంటే .. క్లెయిమ్ అమౌంటులో 80 శాతం లేదా ఉత్తర్వుల్లో పేర్కొన్న దానిలో 60 శాతం మొత్తం ఆఫర్ చేయవచ్చు. ఇక పనులు నిలిపివేసినా లేదా రద్దయిన కాంట్రాక్టులకు సంబంధించి ఇది నికరంగా క్లెయిమ్ చేసిన దానిలో 30 శాతంగా ఉంటుంది. వివాదాస్పద కాంట్రాక్టుపై లిటిగేషన్, పనులు కొనసాగుతుంటే ఇది 20 శాతానికి పరిమితమవుతుంది. ఒకవేళ మొత్తం క్లెయిమ్ అమౌంటు రూ. 500 కోట్లు దాటిన పక్షంలో ఆర్డరు ఇచ్చిన సంస్థలకు కాంట్రాక్టరు ఇచ్చే సెటిల్మెంట్ ఆఫర్‌ను తిరస్కరించే ఆప్షను ఉంటుంది. కానీ, అందుకు తగిన కారణాన్ని చూపాలి. సంబంధిత శాఖ, విభాగం కార్యదర్శి లేదా కంపెనీ అయితే సీఈవో దీన్ని ఆమోదించాలి. -
దేశంలో 4.90 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపుగా 4.90 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పెండింగ్ కేసుల త్వరితగతి విచారణ కోసం ప్రభుత్వం, న్యాయవ్యవస్థ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. అప్పుడే కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని కేసుల విచారణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఈ–కమిటీ చీఫ్‌గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ‘‘4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది చాలా పెద్ద సంఖ్య. అంటే చాలా మంది న్యాయం కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. న్యాయం జరగడం ఆలస్యమవుతోందని అంటే న్యాయం చెయ్యడం తిరస్కరించడంగానే భావించాలి. వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడాలి’’ అని రిజిజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాల ఉమ్మడి కృషి కారణంగానే పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించగలమని వివరించారు. -
5 కోట్లకు పెండింగ్ కేసులు!
న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జీఎస్టీ అడిషనల్ కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు -
ఒకేరోజు 2,76,861 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన వచ్చింది. ఒకేరోజు రికార్డు స్థాయిలో 2,76,861 కేసులను పరిష్కరించారు. వీటిలో ప్రి–లిటిగేషన్ కేసులు 23,205, వివిధ కేటగిరీల్లోని పెండింగ్ కేసులు 2,53,656, ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.145.07 కోట్లు పరిహారం చెల్లింపులకు ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ పి. నవీన్‌రావు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి రాష్టవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను పర్యవేక్షించారు. హైకోర్టులో 233 కేసులు.. హైకోర్టు పరిధిలో జరిగిన అదాలత్ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ. శ్రవణ్‌కుమార్, జస్టిస్ కె.శరత్‌లు పాల్గొన్నారు. హైకోర్టులో 233 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.9.5 కోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక జిల్లా కోర్టుల్లో స్థానిక న్యాయమూర్తులు కేసులను పరిష్కరించారు. ‘వినియోగదారుల’కమిషన్ ఆధ్వర్యంలో.. పరస్పర అంగీకారంతో కేసుల పరిష్కారం కోసం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్‌లో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిధిలోని 13 ఫోరంలలో ఈ కేసులను పరిష్కరించినట్లు రాష్ట్ర కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర కమిషన్‌తో పాటు 10 పాత జిల్లాల పరిధిలోని 12 జిల్లా ఫోరంలలో 355 కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్‌కు రిఫర్ చేశారు. వీటిలో 248 కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వగా, 74 కేసులను ఒక్కరోజే పరిష్కరించారు. ఈ కేసుల విలువ రూ.2.11 కోట్లు ఉంటుందని కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా రాష్ట్ర కమిషన్ పరిధిలో 29 కేసులను పరిష్కరించారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
కోర్టుల సంఖ్య పెంచాలి.. ఎందుకంటే!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోకసభలో, దేశవ్యాప్తంగా జైళ్లలోని ఖైదీలు, పొలీసు కస్టడీలోని నిందితులు 2016 నుండి 2022 వరకు 11,656 మంది మరణించినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో, చివరి స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. పొలీసు కస్టడీలో 7 శతం, జైళ్లలో 93 శతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1184 మరణాలకు ప్రభుత్వాలు బాధ్యతవహించి సంబంధిత కుటుంబాలకు 28.5 కోట్ల రూపాయలు నష్ట పరిహారం చెల్లించారు. భాద్యులైన అధికారులపై, పోలీసులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. సంబంధిత మరణాలు సహజ, అసహజ, అనారోగ్య, పొలీసు ఎన్కౌంటర్లు, పోలీసుల చిత్ర హింసలు, జైళ్లలో తోటి ఖైదీలు చంపడం వంటి మొదలగు కారణాలని తెల్పింది. ఆధునిక భారతావనిలో దినదినం పెరుగుతున్న కస్టోడియల్ మరణాలు కల్లోలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా 672 న్యాయస్థానాల్లో 4.70 కోట్ల కేసులు విచారణ దశలో పెండింగులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో సుప్రీమ్ కోర్టులో 71 వేలు, హైకోర్టుల్లో 59 లక్షలు మిగితావి క్రింది స్థాయి కోర్టుల్లో, ట్రిబ్యునళ్లలో పెండింగులో ఉన్నాయి. దేశంలో న్యాయమూర్తుల సంఖ్యను దేశ జనాభాతో పోల్చిచూసినప్పుడు ప్రతి 50 వేలమంది పౌరులకు కేవలం ఒక్క న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. దేశంలో ప్రభుత్వాలు మంజూరు చేసిన న్యాయమూర్తుల సంఖ్య 25 వేలు ఇందులో, ఎప్పుడూ సుమారు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉంటాయి. 1987లో లాకమీషన్ ప్రతీ 20 వేలమంది పౌరులకు ఒక్క న్యాయమూర్తిని నియమించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ప్రపంచ దేశాల న్యాయవ్యవస్థను పోల్చిచూసినప్పుడు చైనాలో ప్రతీ 3500 మంది పౌరులకు ఒక్క న్యామూర్తి, అమెరికాలో ప్రతీ 7,000 మంది పౌరులకు ఒక్క న్యాయ మూర్తి చొప్పున నియమించారు అందుకే, ఆయా దేశాల్లో పౌరులకు సత్వర న్యాయం లభిస్తుంది. దేశంలోని 1350 జైళ్లలో సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు, శిక్షలు ఖరారైన వాళ్లు మరియు విచారణలో కొనసాగుతున్న వాళ్లు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారు కాకుండానే విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరికి రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని, ఇటీవల సుప్రీంకోర్టు సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మధ్య జరిగిన కేసు తీర్పులో, నేరాలను నాలుగు రకాలుగా విభజించి పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేస్తూ, నిందితులు చేసిన నేరానికి విధించే శిక్షలో 50 శాతం జైళు జీవితాన్ని పూర్తిచేసి జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీలను వెంటనే బేయిలుపై విడుదల చెయ్యాలని అన్ని మేజిస్ట్రేట్, జిల్లా, హైకోర్టులను ఆదేశించింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కును కల్పించింది. కానీ, దురదృష్టవశాత్తు మనదేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అనేక క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ, కొంత మంది పోలీసులు అమాయకులపై తప్పుడు కేసులు పెడుతూ, బ్రిటిష్ కాలంనాటి మూస పద్ధతిలోనే పనిచేస్తున్నారు. పోలీసులు నిందితులను, నిందితులుగా చూడకుండా నేరస్తులుగానే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి క్రిమినల్ చట్టాల ప్రకారం ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను/అనుమానితులను గుర్తించి, విచారించి సదరు నిందితులను కోర్టు ముందు హాజరపరిచి విచారణలో, వారు నేరం చేసినట్లుగా తగు సాక్ష్యాధారాలతో న్యాయమూర్తుల ముందు పోలీస్ యంత్రాంగం చూపించవలసి ఉంటుంది. అంతిమంగా న్యాయస్థానాలు నిందితులను నేరస్తులుగా గుర్తించి శిక్షలు ఖరారు చేసి జైలుకు పంపిస్తాయి. దేశంలో సుమారు 4 లక్షల 88 వేలకు పైగా విచారణ ఖైదీలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయి జైలు జీవితం గడుపుతున్నారు. న్యాయస్థానాలు వీరిలో కొందరిని నిర్దోషులుగా తేల్చినప్పుడు, వీరు కోల్పోయిన జీవితానికి ఎవరు బాధ్యులు?. వీరిలో నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా పేదవారే ఉండడం గమనించతగ్గ విషయం. భారత రాజ్యాంగం నిందితులకు సత్వర న్యాయం పొందే హక్కును కల్పించింది. కానీ, నేడు నిందితులకు విచారణ ఖైదీగా జైలు జీవితం గడపడం అతిపెద్ద శిక్షగా మారింది. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం, న్యాయస్థానాలకు కావలసిన భవన సముదాయాలు, వసతులు, యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడమే. దేశంలో జైళ్ల సంఖ్యను పెంచి, జైళ్లలో కనీస వసతులతో ఖైదీలకు పౌష్ట ఆహారం, మెరుగయినా వైద్య సదుపాయాలు అందించాలి. అప్పుడే కస్టోడియల్ మరణాలు తగ్గి, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛగా జీవించే హాక్కును రక్షించనివారిగా పాలకులు చరిత్రలో నిలిచిపోతారు. అదే సమయంలో దేశంలోని పౌరులకు విద్యార్థి దశ నుండి పోలీసు, జైళ్ల వ్యవస్థలపై, నేరాలపై, కేసుల నమోదు ప్రక్రియ నుండి న్యాయవ్యవస్థ విచారణ వరకు ప్రాథమిక అంశాలను విద్యా బోధనలో నేర్పించాలి. తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులపై, అవే క్రిమినల్ చట్టాల ప్రకారం వారిపై కేసులు నమోదు చేసే స్థాయికి యువకులు, ప్రజలు ఎదుగవలసి ఉంది. (క్లిక్ చేయండి: విన్నారా? ‘మెదడే’ ప్రమాదకరమట!) – కోడెపాక కుమార స్వామి, హైదరాబాద్ -
6,700 సీబీఐ కేసులు.. కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: సీబీఐ దర్యాప్తు ముగించిన 6,700 కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తెలిపింది. ఇందులో 275 కేసులు 20 ఏళ్లు పైబడి న్యాయస్థానాల్లో విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని 2021 సంవత్సరం నివేదికలో వెల్లడించింది. వీటితోపాటు 10,974 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నట్లు వివరించింది. వీటిలో 361 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లకు పైగా హైకోర్టులు, సుప్రీంకోర్టులో మూలుగుతున్నాయంది. పనిభారం, సిబ్బంది కొరత, అనుమతుల్లో జాప్యం, కరోనా కారణాలతో దర్యాప్తు జాప్యం అవుతోందని సీవీసీ పేర్కొంది. -
కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రబ్యునల్ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్‌కు కిరణ్ హాజరయ్యారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు. -
ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల పెండింగ్ కేసులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కుటుంబ న్యాయస్థానాల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటంపై లోక్‌సభ సభ్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసుల విచారణను త్వరితగతిన ముగించాలని పిలుపునిచ్చారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం లోక్‌సభలో ఫ్యామిలీ కోర్టుల సవరణ బిల్లు–2022ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనతాదళ్ (యు)కు చెందిన కౌశలేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఫ్యామిలీ కోర్టుల్లో పెండింగ్ కేసుల భారం ప్రస్తుతం 11.4 లక్షలకు పెరిగిందని, ఈ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 715 కుటుంబ న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారానికి తీసుకునే చర్యలను ప్రభుత్వం వెల్లడించాలని బిజూ జనతాదళ్‌కు చెందిన మహ్తాబ్ కోరారు. చర్చను ప్రారంభిస్తూ బీజేపీకి చెందిన సునితా దుగ్గల్.. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కుటుంబ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కుటుంబం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి కేంద్రం 1984లో ఫ్యామిలీ కోర్టుల చట్టం ద్వారా ఈ న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 2008లో నాగాలాండ్‌లో రెండు, 2019లో హిమాచల్ ప్రదేశ్‌లో మూడు కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటయ్యాయి. గత ఏడాది హిమాచల్ హైకోర్టు విచారణ సందర్భంగా రాష్ట్రంలోని ఫ్యామిలీ కోర్టులకు అధికార పరిధి లేదనే అంశం తెరపైకి వచ్చింది. ఫ్యామిలీ కోర్టు చట్టాన్ని హిమాచల్‌కు పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయనందునే ఇలాంటి పరిస్థితి వచ్చిందని హిమాచల్ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పేర్కొంది. నాగాలాండ్‌లోని ఫ్యామిలీ కోర్టులు కూడా 2008 నుంచి ఎలాంటి చట్టపరమైన అధికారం లేకుండా పనిచేస్తున్నాయి. ఈ చట్టంలో తాజాగా చేపట్టిన సవరణల ద్వారా ప్రభుత్వం ఇటువంటి లోపాలను సవరించే ప్రయత్నం చేసింది. కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు, వాటి పరిధిపై సంబంధిత హైకోర్టులతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపింది. -
ఏడున్నర లక్షల కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపుతో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ నిర్వహించిన లోక్ అదాలత్‌కు స్పందన లభించింది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా ఏడున్నర లక్షల కేసులు పరిష్కారమయ్యాయి. వీటిలో 8,175 ప్రిలిటిగేషన్ కేసులు కాగా, మిగతావి వివిధ రకాలైన పెండింగ్ కోర్టు కేసులు. ఈ కేసుల కింద రూ.109.45 కోట్ల పరిహారం లబ్ధిదారులకు చెల్లించేలా ఆదేశాలిచ్చినట్లు న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ, జిల్లా, సెషన్స్ జడ్జి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మూడేళ్లలోపు శిక్ష పడే కేసులు, రాజీకి అవకాశమున్న చిన్న కేసులనే లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. మెట్రోపాలిటన్ కోర్టుల్లో 3.55 లక్షల కేసులు: మెట్రోపాలిటన్ కోర్టుల పరిధిలోనే 24 బెంచ్‌లు ఏర్పాటుచేసి, 3,55,727 కేసులు పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాపిరెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి, సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ తెలిపారు. రూ.2,43,88,400 పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చామన్నారు. హైకోర్టులో 629 కేసులు రాజీ: హైకోర్టు లోక్‌అదాలత్‌లో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశాల మేరకు ప్రత్యక్ష, పరోక్ష విధానాల్లో ఆసక్తి చూపిన కక్షిదారుల కేసుల్ని రాజీ చేశారు. న్యాయ మూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ సాంబశివనాయుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి.యతిరాజులు అధ్యక్షతన వేర్వేరుగా 629 కేసుల్ని పరిష్కరించారు. 1150 మంది లబ్ధిదారులకు రూ.36.60 కోట్ల పరిహారం చెల్లింపులకు ఆదేశించినట్లు కమిటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.