
మాడభూషి శ్రీధర్
ఇండియాలో బతికుండగా తీర్పు రాదు కనుక తాము పెట్టుబడులు పెట్టబోమని, విదేశీ కంపెనీలు పేర్కొంటున్నాయి.
విశ్లేషణ
ఇండియాలో బతికుండగా తీర్పు రాదు కనుక తాము పెట్టుబడులు పెట్టబోమని, విదేశీ కంపెనీలు పేర్కొంటున్నాయి. కోర్టుల్లో మూడు కోట్ల పైచిలుకు కేసుల సంగతి తేల్చకుండా ప్రపంచీకరణ అని మనం నినదిస్తూ ఉంటే ప్రపంచం నవ్వుకుంటోంది.
మన కోర్టులలో పేరుకుపోతున్న కేసులు తలచుకుంటే ఎన్ని శతాబ్దాలకైనా తుది తీర్పు దొరికేనా అనే అనుమా నం వస్తుంది. కేంద్రంలో పాత, ప్రస్తుత ప్రభుత్వాలకు కూడా ఈ విషయం తెలుసు. మన దేశంలో పేరుకుపోయిన పెండింగ్ కేసులకు సంబంధిం చి కొన్ని గణాంకాలు.. -2,73,60,814... ఇది కింది స్థాయి న్యాయస్థానాల్లో ఉన్న కేసుల సంఖ్య. 44,79, 023.. ఇది హైకోర్టుల్లో మూలుగుతున్న ఉన్నత వివా దాల సంఖ్య. 65,970.. ఇవి మన సుప్రీంకోర్టులో ఉన్న అప్పీళ్ల సంఖ్య.
లాయర్లకు, కోర్టులకు దోచిపెట్టడం, ఎన్నాళ్లయి నా ఏదీ తెమలకపోవడం, ఒకవేళ గెలిచినా అప్పీలులో పడిపోవడం, గెలవగలిగిన కేసులలో ఎదుటి లాయర్ దుర్మార్గపు తెలివితేటలకు తోడుగా అపరిమిత ఆలస్యా లు.. నిలిచి గెలిచిన వాడిని కూడా ఓడిపోయేట్టు చేయ డమే మన న్యాయస్థానాలు ఇన్నేళ్లుగా సంపాదించిన ఘనత. ఇందులో తగాదాకోరు వ్యక్తులు, కోర్టులను శాసించే లాయర్లు, జడ్జీల పాత్ర ఎంత ఉందో, పట్టించు కోని ప్రభుత్వాల పాత్ర కూడా అంతే.
ఏదైనా వివాదం వస్తే ఇండియాలో బతికుండగా తీర్పు రాదు కనుక మేం పెట్టుబడులు పెట్టబోమనీ, ఇక్కడ వ్యాపారాలు చేయబోమనీ, బహుళజాతి కంపెనీ లు మనవారిని ఏడిపిస్తున్నాయి. కోర్టుల్లో మూడు కోట్ల పై చిలుకు కేసుల సంగతి తేల్చకుండా ప్రపంచీకరణ అని, మనం జయధ్వానాలు, ఘన నినాదాలు చేస్తూ ఉంటే విశ్వజనాలు నవ్వుకుంటున్నారు.
అయితే ఈ మూడు కోట్ల కేసులలో కనీసం కోటి కేసులు సర్కారు వారు నడిపే కేసులు లేదా సర్కారు వారు చేసే అన్యాయాల మీద పౌరులు వేసిన కేసులే. వీటిలో చాలా వరకు సర్కారు అధికారులు పరిష్కరించ గలిగినవే. మిగిలినవి కోర్టు ఆదేశాలను ఒప్పుకోకుండా ప్రభుత్వం సామాన్య పౌరుడి మీద పోరాటాన్ని పై కోర్టు లకు అనవసరంగా తీసుకువెళ్లిన అప్పీళ్లు. సర్కారు వకీలు, అధికారి ప్రభుత్వ ఖర్చు మీద విమానాల్లో, ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్లలో, హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు వెళ్లి, అక్కడ పెద్ద హోటళ్లలో బస చేసి కేసు వాయిదా పడిం దని వాపస్ వస్తుంటారు. సామాన్యడు మాత్రం అప్పు లు చేసి సర్కారుతో పోరాడవలసివస్తుంది.
న్యాయపాలికలతో పాటు ఏలికలకు కూడా ఈ విష యం తెలిసొచ్చిందనిపించే విధంగా 2010లో జాతీయ కోర్టు తగాదాల విధానం ఒకటి రూపొందించారు. దాని అతీగతీ ఏమయిందని సజత్ భారత్ అనే సామాజిక సేవాసంస్థకు చెందిన సురేశ్, సమాచార హక్కు కింద అడిగాడు. ప్రతి ప్రభుత్వ విభాగంలో ఒక నోడల్ అధి కారిని నియమించి, అనవసరమైన కేసులను గుర్తించి పని చేయవలసి ఉంది. అటార్నీ జనరల్ అధ్యక్షతన ఒక కమిటీ పెండింగ్ కేసులు పరిశీలించి నివేదిక ఇవ్వాలి. అభ్యర్థికి ఒక ఫైలు మాత్రం చూపి మిగిలిన ఫైళ్లు లేవ న్నారు. 2013లో 2014లో అడిగిన అభ్యర్థనలకు అసలు స్పందనేలేదు. జడ్జీలు పాత తగాదాల పరిష్కారానికి మనసు పెట్టి పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు. పనికిరాని కేసులు తీసేస్తామని న్యాయశాఖ కూడా ప్రకటించింది. ఉన్నతాధికార కమిటీలు వేసి ఎత్తే సే కేసులను ఎంపిక చేయాలన్నారు. చెత్త కేసుల విచా రణ ఆపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో 258 విభా గపు అధికారాన్ని కోర్టులు వినియోగించాలని కోరారు.
పరిపాలనా లోపాలవల్ల, అనిర్ణయాల వల్ల, దుర్మా ర్గ నిర్ణయాలవల్ల దశాబ్దాల నుంచి పాపాలవలె పేరు కుపోతున్న కేసులన్నీ రాత్రికి రాత్రి పరిష్కారం కావు. ప్రభుత్వమే పెద్ద తగాదా కోరు అన్నది నిజమే. సర్కారు మీద సాగించే అన్యాయాలను ఎదిరించవలసిందే. అయి తే ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించడం రాజ్యాంగ విధి. కోర్టులు తేల్చనీ మనకెందుకు? మనమెందుకు నిర్ణయం తీసుకోవాలి? అని కేసు వేసి చేతులు దులుపు కునే ధోరణివల్ల కేసుల పెండింగ్ పెరిగిపోతోంది. విచి త్రమేమంటే.. ఒక ప్రభుత్వ సంస్థ మరొక సంస్థ మీద కేసులు పెడుతుంది. పై అధికారులు పట్టించుకోరు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి విధానాన్ని తయారు చేసింది. ప్రభుత్వం బాధ్యతాయుతమైన లిటిగెంట్‌గా వ్యవహరించాలని హిత బోధ చేసే పాలసీ ఇది.
ప్రజాశ్రేయస్సు ఉన్న సమాచార అభ్యర్థన ఇది. దీనికి జవాబు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. నిజానికి ప్రభుత్వం ఈ అవకాశాన్ని తీసుకుని నిజంగా కేసుల భారం ఏవిధంగా తగ్గిస్తున్నదో చెప్పాలి.
న్యాయమూర్తుల స్థానాలు ఖాళీ కావడం ముందే తెలిసిన సందర్భాలలో, ముందే ఎందుకు భర్తీ ఏర్పాట్లు చేయరు? కోర్టులను అవసరాన్ని బట్టి పెంచి, అనవసర వివాదాలు ఎందుకు తగ్గించరు? అనే ప్రశ్నలకు తమం త తాము సమాధానాలు ఎవరూ అడగాల్సిన అవసరం లేదు. చెప్పి తీరాలని సెక్షన్ 4(1) వివరిస్తున్నది. అడి గినా చెప్పకపోవడం అన్యాయం. న్యాయం కోసం, దేశం కోసం, జాతి ప్రయోజనాల కోసం.. జాతీయ లిటిగేషన్ పాలసీ అమలు ప్రస్తుతం ఏ దశలో ఉందో ప్రభుత్వ విభాగం (పబ్లిక్ అథారిటీ) వివరించాలి. అందుకు ఒక సమగ్రమైన వివరణ తయారు చేసి అభ్యర్థికి ఇవ్వాలి, ఎప్పటికప్పుడు ఈ విధానం అమలు తాజా వివరాలను అధికారిక వెబ్‌ైసైట్‌లో ప్రకటించాలని రెండో అప్పీలులో తీర్పు ఇవ్వడం జరిగింది. (సురేశ్ కుమార్ రంగీ వర్సెస్ లీగల్ అఫైర్స్ విభాగంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com