Madabhushi Sridhar
-
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ -
ఎవరిని మభ్యపెట్టాలని ఈ చట్టాలు?
కొత్త న్యాయ చట్టాలను తీసుకు వచ్చామని ఆర్భాటంగా ప్రకటించి అమలుకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం ఒక్క విషయాన్ని స్పష్టం చేయాలి: ఆ చట్టాలను ప్రభుత్వం కొత్తగా రూపొందించిందా లేక పాత చట్టాల నుంచి వివిధ అంశాలను స్వీకరించిందా? ఎందుకంటే పేరుకు కొత్త చట్టాలే కాని వీటిలో అధిక భాగాలు పాత చట్టాల నుంచి కాపీ కొట్టినవేనని న్యాయశాస్త్ర కోవిదులు చాలా మంది ప్రకటిస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ తరుణబ్ ఖైతాన్ ఈ చట్టాలను ‘టర్ట్ ఇట్ ఇన్’ అనే టెక్నాలజీని ఉపయోగించి పరిశీలించినప్పుడు బయటపడిన అంశాలు ఈ సందర్భంగా గమనార్హం.1. భారతీయ న్యాయ సంహిత –2023లోని 83 శాతం అంశాలు ఇండియన్ పీనల్ కోడ్ 1860 (పాత బ్రిటిష్ చట్టం) నుంచి కాపీ, పేస్ట్ చేసిందే.2. భారతీయ నాగరిక సురక్ష సంహిత– 2023ను అంతకు ముందున్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్–1973 నుండి 82 శాతం తీసుకున్నదే.3. భారతీయ సాక్ష్య చట్టం–2023 అంతకుముందు అమ లులో ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ చట్టం–1872 నుంచి 82 శాతం మక్కీకి మక్కీ కాపీ కొట్టినదే.ఈ సందర్భంగా కాపీ కొట్టడం గురించి కొంత వివరణ చూద్దాం. నల్సార్ యూనివర్సిటీలో నేను పనిచేస్తున్న ప్పుడు వేపా పార్థసారథి (వీపీ సారథి) అనే అద్భుతమైన ప్రొఫెసర్ ఉండేవారు. ఆయన సాక్ష్య చట్టంలో ప్రముఖ నిపుణుడు. మొత్తం చట్టం ఒక్కో అక్షరం, పదం, కామా, ఫుల్స్టాప్ వంటి అర్థాలను చక్కగా వివరించేవారు.ఓసారి జడ్జీలకు క్లాస్ చెబుతున్నారు. ‘సాక్ష్య చట్టంలో ఇలా ఉంది సార్’ అని ఓ వ్యాఖ్యానం ప్రతిపాదించారు ఓ జడ్జిగారు. వారు చాలా బాగా అధ్యయనం చేసిన జడ్జి గారు. అప్పుడు సారథిగారు ‘మీరు ఈ కామా గురించి చూడాలి. అందువల్ల దాని అర్థం మారిపోతుంది’ అని వివరించడంతో జడ్జి అవాక్కయ్యారు. అంత సునిశితంగా పరిశీలించే సారథిగారు మన పాత నేర చట్టాలపై తన అభిప్రాయాన్ని ‘పాతదే అయినా మన సాక్ష్య చట్టాన్ని 90 శాతం సవరించాల్సిన అవసరం లేదు, కొన్ని మంచి సంస్క రణల అవసరం ఉంది’ అని కుండబద్దలు కొట్టారు. ప్రతి పాఠాన్నీ సున్నితమైన హాస్యంతో కలిపి అద్భుతంగా క్రిమినల్ లా సూత్రాలను చెప్పేవారాయన.ఆయన కాపీ కొట్టే విషయంలో ఒక జోక్ చెప్పేవారు. ఓ విద్యార్థికి ఓ అంశం మీద 5 పేజీల వ్యాసం రాయాలని పరీక్ష పెట్టారు. ఆ విద్యార్థి ఎవరిదో పరిశోధనాపత్రంలోని విషయాలను చక్కగా దించేశాడు. కానీ పరిశోధనా పత్రం రాసిన స్కాలర్ పేరును మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అయితే ఆ పరీక్ష పేపర్ దిద్దుతున్న ప్రొఫెసర్ అది తన వ్యాసాన్ని కాపీ కొట్టి రాసిన జవాబుగా గుర్తించారు. ప్రశ్నకు 10 మార్కులకు గాను 8 మార్కులు ఇచ్చారు. విద్యార్థి ‘సార్ నేను ఫెయిల్ అవుతాననుకున్నాను. మీరు 8 మార్కులు ఇచ్చారే ఆశ్చర్యం’ అన్నాడా విద్యార్థి క్లాసులో. అందుకు ‘నిజమే, అప్పట్లో మా ప్రొఫెసర్ నే రాసిన ఈ జవాబుకు చాలా తక్కువగా 4 మార్కులే ఇచ్చారు. ఇప్పటికీ నేనే కరెక్టు రాశానని నా నమ్మకం. అదే రాసిన నీకు నేను 8 మార్కులు ఇచ్చాను’ అన్నారట ప్రొఫెసర్. దీంతో విద్యార్థి నోరెళ్ల బెట్టా డట. అటువంటి పార్థసారథిగారు ఇప్పుడు జీవించి లేరు. కానీ, ఆయన అభిప్రాయాలు మాత్రం నిలిచే ఉన్నాయి.ఇండియన్ ఎవిడెన్స్ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేనే లేదనీ, ఒకవేళ ఎవరైనా మార్చితే దాన్ని ప్రభుత్వాలు దుర్మార్గం చేయడానికే వాడతాయనీ ఆయన అనేవారు. ఎవిడెన్స్ చట్టాన్ని నేను కూడా బోధించే వాడిని. అందుకే నేను కొన్ని మార్పులు, సూచనలు చేశాను. సారథిగారు ఒక రోజంతా చదివి ఆలోచించి, మరునాడు నల్సార్‌లో నా గదికి వచ్చి, ‘మీరన్నది కరెక్టే, కొన్ని మార్పులు చేయడం అవసరమే’ అని ఒప్పుకోవడమే కాకుండా, తరువాత వచ్చే ఎడిషన్‌లో ‘ప్రొఫెసర్ శ్రీధర్ సలహా ఇచ్చారు’ అనిముందుమాటలో నా పేరు రాశారు. ఎంత గొప్పవ్యక్తి ఆయన! ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒకరి అభిప్రాయమో, లేక పుస్తకం, వ్యాసాల్లో ఉన్న విషయాలనో మనం ఉపయోగించి ఏమైనా రాసేటప్పుడు తప్పనిసరిగా సోర్స్‌ను ఉటంకించడం కనీస ధర్మం. ప్రొఫెసర్ పార్థసారథి చేసింది అదే. ఇంగితం ఉన్న ఎవరైనా చేయాల్సిందీ అదే!పాత బ్రిటిష్ కాలపు క్రిమినల్ చట్టాలను పూర్తిగా సంస్కరించుకునే బంగారంలాంటి అవకాశాన్ని ప్రభుత్వం, పార్లమెంట్, ఎంపీలు పూర్తిగా వదిలేసుకున్నారని మా నల్సార్ విశ్వవిద్యాలయం విద్యార్థి... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ‘నేషనల్ లా యూనివర్సిటీ’ ప్రొ‘‘ అనూప్ సురేంద్రనాథ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఏమర్థమవు తోంది? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ కొత్త నేర చట్టాలు?– మాడభూషి శ్రీధర్. వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ఇవి చదవండి: Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు! -
పాత, కొత్తల గందరగోళం..
భారతదేశంలో నేరాల దర్యాప్తులో సుదీర్ఘమైన ఆలస్యం ఒక మహమ్మారిలా పరిణమించింది. ఇందువల్ల నిందితులైన అనేకమంది అమాయకులు అనవసరంగా జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గ వలసి వస్తోంది. కొందరైతే పది పదిహేనేళ్లు జైల్లో ఉండి చివరకు నిర్దోషిగా విడుదలయినవారూ ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు ఇలాంటి అమాయకుల సంఖ్య పెరగడానికి దోహదపడ తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ చట్టాలు పోలీసులకు అరెస్ట్ చేసి నిర్బంధించేందుకు అపరిమిత అధికారాలను కట్ట బెడుతున్నాయి.నేర విచారణ అత్యంత ఆలస్యంగా జరగడం వల్ల కొందరు డబ్బున్న పెద్దవాళ్లు బెయిలుపై బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నారు. అదేసమయంలో అమాయకులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఆ విధంగా కొత్త చట్టాలు ఉన్నవారికి చుట్టాలు కాబోతున్నాయి. చట్టాలలో మార్పులు తెస్తే మంచిదే. ఈనాటి అవసరాలకు అనుగుణంగా వాటిని సవరించాలనే లక్ష్యం ఉంటే సంతోషం. చట్టాల మరింత ఆధునికీకరణ, సరళీ కరణ నేటి సమాజానికి అవసరం. కానీ కొత్త నేరాల చట్టాల వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరిగేలా ఉంది. ఈ చట్టాల ద్వారా జరిమానాలను చాలా పెంచారు.ఇది సరికాదు. పోనీ కనీసం కొత్త చట్టాల అమలు ద్వారా అయినా సత్వర తీర్పులు వచ్చే అవకాశం కలిగితే కొంత సంతోషం కలిగేది. కానీ కనుచూపు మేర అది సాధ్య మయ్యేలా కనిపించడంలేదు. ఎందుకంటే కొత్తగా నమోదయ్యే కేసులను కొత్త చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న లక్షలాది కేసులను పాత క్రిమినల్ చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో పాత, కొత్త చట్టాల కింద విచారించడానికి తగిన సిబ్బంది, వసతులూ భారతీయ న్యాయ వ్యవస్థకు లేకపోవడం ఇక్కడ గమనార్హం.కొత్త మూడు చట్టాల్లో రెండింటిలో కొంచెం మార్పులు చేసినట్లు కనిపించినా మూడోదైన సాక్ష్య చట్టం మక్కీకి మక్కీ పాతదే. ఇండియన్ శిక్షాస్మృతి అనే 1860 నాటి పరమ పాత (లేదా సనాతన) చట్టం... ‘భారతీయ న్యాయ సంహిత– 2023’ పేరుతో మళ్లీ తీసుకురావడం విడ్డూరం. ఏం సాధించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఈ చట్టాలను కొత్తగా తీసుకువచ్చిందో అర్థం కావడం లేదు. పార్లమెంట్లో స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన స్థితిలో లేని బీజేపీపై... భాగస్వామ్య పక్షాల్లో బలమైన టీడీపీ, జేడీయూ వంటివైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకపోవడం విచారకరం. ఇందువల్ల ఈ కొత్త చట్టాలు నిరా ఘాటంగా కొనసాగేందుకు అడ్డంకీ లేకుండా పోయింది. ఇప్పటికే పౌర హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలను దారుణ నిర్బంధానికి గురి చేస్తున్నారు.రాజకీయ కక్ష సాధింపులకు పాత నేరచట్టాలను ఉపయోగించే ఎన్నో దారుణాలకు పాల్పడింది బీజేపీ సర్కార్. ఇప్పుడు కొత్త చట్టాలను ఉపయోగించి మరెంత అన్యాయంగా వ్యవహరిస్తుందో అనే భయం ఎల్లెడలా కనిపిస్తోంది. వీటిని అడ్డుపెట్టుకొని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి మరింతగా ప్రయత్నించవచ్చు. ఇప్పటికే అనేక కేసులు బనాయించిన ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు తమ పార్టీలో చేరిన తరువాత వారిపై కేసులు ఎత్తివేయడమో, లేక విచారణను వాయిదా వేసేలా చూడడమో బీజేపీ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో అమలులోకి వచ్చిన కొత్త చట్టాలు కేంద్ర పాలకు లకు ఇంకెంత మేలు చేకూర్చనున్నాయో! అంతి మంగా సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనేది సుస్పష్టం.– మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త, మహేంద్ర యూనివర్సిటీ, ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
చిహ్నం విషయంలో చర్చ జరగాలి!
ఐదు దశాబ్దాల పైగా అస్తిత్వం కోసం పోరాడిన తెలంగాణకు జనగీతం ఏది? పదేళ్ల క్రితం ‘మా రాష్ట్రం’ అని చెప్పుకునే అవకాశం తెలంగాణ ప్రజలకు దక్కింది. ఒక రాష్ట్రంగా చిహ్నం, విగ్రహం రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ అవతరణ పదేళ్ల తరువాత, కాంగ్రెస్ పార్టీవారి ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ‘తెలంగాణ రాష్ట్ర గీతం’గా ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని కూడా మార్చి కొత్త చిహ్నాన్ని రూపొందిస్తోంది. ఈ సందర్భంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి.దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్లే రాష్ట్రానికి ఓ రాష్ట్ర గీతం ఉండాలని కోరుకోవడం సహజమే. రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తరువాత ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... దానిపై వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి.జాతీయ గీతంలాగే రాష్ట్ర గీతం...జాతీయ గీతం ‘జన గణ మన’, జాతీయ గేయం ‘వందేమాతరం’... రెండింటినీ సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగ సభ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యంగ సభలో ప్రకటించారు. అప్పటి నుంచి భారతీయులు ఆ యా గీతాలను అత్యంత గౌరవంతో ఆలాపిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పర్వదినాలను నిర్వహించే సమయంలో చిన్నా పెద్ద, అధికారి, అనధికారి అనే భేదం లేకుండా అందరూ గౌరవంగా నిలబడాలనేది ఒక నియమం. కనీసం జాతీయ గీతాలాపన సమయంలో మౌనంగా ఉండి తమ గౌరవాన్ని వ్యక్తం చేయాలి. అయితే అలా గౌరవించనివారూ ఉంటారు. అందుకు శిక్షలు ఉండవు. కాని, అవమానిస్తే మాత్రం నేరమే. రెండు జాతీయ గీతాలకూ, జాతీయ చిహ్నానికీ, జాతీయ పతాకానికీ సంబంధించి ఒక చట్టం కూడా చేసుకున్నాం.దేశ సౌభాగ్యాన్నీ, సంస్కృతీ వారసత్వాలూ, గొప్పదనాన్నీ ప్రతిబింబించే మన జాతీయ గీతాలను గర్వంగా భారతీయులమంతా ఎలా ఆలపిస్తున్నామో... అంతే గర్వంగా రాష్ట్రాల ప్రజలు తమ తమ రాష్ట్ర గీతాలను ఆలపించడం సహజం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లయినా ఇంతవరకూ రాష్ట్ర గీతం అంటూ ఏదీ లేకపోవడాన్ని కొందరు చర్చిస్తూ వచ్చారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వాల పేర సాగిన ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం కావడంతో ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అందెశ్రీ రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడంతో చాలామంది స్వాగతించారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణలో ఉన్న పాత జిల్లాల అన్నింటి ప్రత్యేకతలనూ, వైశిష్ట్యాన్నీ అద్భుతంగా ఆవిష్కరించింది కనుక. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఒక ఊపు ఊపింది కనుక. అలాగే దీని రచయిత అందెశ్రీ తెలంగాణ మట్టిమనిషి, ఉద్యమకారుడు. తన కలం, గళం ద్వారా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయినవారు. అందుకే చాలామంది రాష్ట్ర గీత ప్రకటనను స్వాగతిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ కొత్త చిహ్నం..గత తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి అమలులో పెట్టిన ప్రభుత్వ చిహ్నాన్ని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం మరో నమూనాను రూపొందిస్తున్నది. ఇప్పటికే దానిపై సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి వంటి రాజకీయ పార్టీల నేతలతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ నమూనా చాలా బాగుందని కొందరూ, బాగులేదనీ మరికొందరూ అంటున్నారు.అసలు ఇప్పుడు రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, రాష్ట్ర గీతం అంటూ ఒక గీతాన్ని ప్రకటించడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోనీ వాటిని నిర్ణయించేటప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించాలి కదా? దాన్నీ ఈ ప్రక్రియలో భాగం చేయలేదనేది ప్రధానమైన విమర్శ. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించి ఏమార్చడానికే అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.విధానం, సంవిధానం? దేశానికి కానీ, రాష్ట్ర స్థాయిలో ప్రతి రాష్ట్రానికి కానీ ఒక ప్రత్యేక నిర్ణయ విధానం (పాలసీ) అంటూ ఒకటి ఉండాలి. ప్రజలందరికీ సంబంధించిన కొన్ని అంశాలపై నిర్ణయాలను కేవలం ‘మంత్రివర్గం’ తీసుకుంటే సరిపోదు. విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాల్సి ఉంటుంది. సభలు, సదస్సులు, జిల్లా స్థాయి చర్చలు, సంప్రదింపులు జరపాలి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా వివిధ వర్గాలవారి అభిప్రాయాలను సేకరించిన తర్వాతే కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలూ, అసెంబ్లీ సమావేశాల్లో చేసిన చర్చలూ, నిర్ణయాలను అందరికీ అందుబాటులో ఉండేలా వైబ్సైట్లో పెట్టాలి. మొత్తంమీద రాష్ట్ర గీత ప్రకటన, ప్రభుత్వ చిహ్నం మార్పు వంటి అంశాల్లో అధికార పక్షం ఏకపక్షంగా వ్యవహరించడం అన్యాయం. – వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీఅభిప్రాయం: మాడభూషి శ్రీధర్ -
తినే హక్కు గురించి కదా అడగాలి?
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) వెంటనే రావాలనే వైపుంటారా, వ్యతిరేకంగా ఉంటారా అని లెక్కలు ఎందుకు? యూసీసీ కావాలా, వద్దా అనే పోటీ పెట్టి, ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది సమాధానం కాదు. ఫేస్ బుక్‌లో, సామాజిక మీడియాలో, ఆలోచించే వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. హిందువులు, ముస్లింలు, జైనులు, క్రైస్తవులు, యూదులు, ఇతర మతాల వారు, ముఠాల వారు, అనేక రకాల వర్ణాల వారు, కులాల వారు, అటూ ఇటూ చీలిపోవడం న్యాయం కాదు. ఏమైనా చేసి ఎన్నికల్లో గెలవడం అత్యవసరమైపోయింది. కొన్ని పార్టీలు ఓడిపోయేందుకు సిద్ధం. వందల కోట్ల రూపాయలు రాజకీయ నాయకులకు ఇస్తున్నారంటే అనేక పార్టీలు ఓడిపోవ డానికీ, ఓట్లు చీల్చడానికీ సిద్ధం. అందుకే రాజకీయ అవస రాలతో సంస్కరణ చేయాలనడం దారుణం. పర్సనల్ లా అంటే ‘వ్యక్తిగతమైన’ అని అర్థం కాదు. ఒక మతానికి చెందిన చట్టాల ప్రకారం అని అర్థం. వివాహం, ఆస్తుల వారసత్వం ఇందులోని అంశాలు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి వైవిధ్యపూరిత దేశంలో ముందు సమానత్వం, దాంతో మొత్తం మీద భారతదేశానికి ఏకత్వాన్ని కూడా సాధించాల్సి ఉంటుంది. ఇంతవరకు ఉమ్మడి పౌర స్మృతి మీద కోర్టులు సలహాలు ఇచ్చాయే గానీ స్పష్టమైన తీర్పులు ఇవ్వలేదు. గత 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా ‘దేశ సమైక్యత’ కోసం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలంటూ సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. ఇటువంటి సంక్లి ష్టమైన యూసీసీ విషయంలో పార్లమెంట్ చట్టం చేయా ల్సిందే కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు కావాలని స్పష్టం చేయడం సాధ్యం కాదు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు తమ తమ మతాలకు వర్తించే విభిన్న చట్టాలున్నాయి. భారత రాజ్యాంగం కింద ఈ మతాలలో అమలు చేసుకునే హక్కులు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం మైనారీలకున్న ఈ హక్కులను ఉల్లంఘించి పార్లమెంటులో చట్టం చేస్తుంది కావచ్చు. కొన్ని సంవత్సరాల తరు వాత దాన్ని సవరించి కొట్టివేసేదాకా జనం ఎన్నికల్లో తమను సమర్థించాలనే ఆలోచన కూడా ఉండవచ్చు. అనేక చట్టాలు అందరికీ వర్తించేలా ఉంటాయి. ఉదాహరణ: ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్. గృహ హింస నిరోధక చట్టం! ఈ చట్టం అన్ని మతాల వారికీ ఉపయోగమే. అందులో ‘వయొలెన్స్’ అన్నంత మాత్రాన దాన్ని క్రిమినల్ చట్టం అనుకుంటారు. కానీ అది సివిల్ కేసు. అవన్నీ సివిల్ కోర్టులో విచారణ చేస్తారు. క్రిమినల్ కేసులు కూడా అన్ని మతాల వారికీ ఉప యోగపడేవి. వీటిని ఎక్కువగా వాడుకునేది హిందువులే. వారితోపాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా వినియోగిస్తున్నారనడం నిజం. చాలామంది దుర్వినియోగం అంటారు. దానికి కారణం ఎక్కువమంది అబద్ధాలు ఆడతారు. భార్యలైనా భర్తలైనా లేదా వారి బంధువులైనా అబద్ధాలు విపరీతంగా చెబుతూ అంటారు. లాయర్లని బద్నాం చేస్తాం గానీ, అబద్ధాలు ఆడని వారెవరు? ఎవరూ కోరని యూసీసీ ఇప్పుడెందుకు? తినే హక్కు గురించి ఎవరూ అడగడం లేదు. సంపాదించుకున్న ప్రకారం వండుకొని తినే హక్కు, ఇష్టమైన వస్త్రాలు వేసుకునే హక్కు, నచ్చిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుకుని, పాడుకునే హక్కు ఉన్నాయి. ఇవి యూసీసీకి అతీతమైనవి కదా! రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలనే శాసనం, లేదా చట్టం ఉండనవసరం లేదు. అది స్వాతంత్య్రానికి సంబంధించిన అంశం. టమాటా ధరలను నియంత్రించే చట్టం ప్రభుత్వాలు చేయగలవా? దేశంలో పెళ్లి, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తి, పిల్లలను దత్తత తీసుకోవడం వంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. ఆచరించే మతం, విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంటుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా,మహీంద్రా యూనివర్సిటీ -
‘పెద్దలు’ కుమ్మక్కైతే న్యాయం గతేమిటి?
మన రాజ్యాంగం ఎవరో ఒకరు రచించిన పుస్తకం కాదు. అది అంబేడ్కర్ వంటి మహానుభావులు నిర్మించిన ఒక సంవిధానం. రాజ్యాంగ నియమాలతో పాటు కొన్ని సంప్రదాయాలూ అనేక ఏళ్ల నుంచీ కొనసాగుతున్నాయి. అందులో సుప్రీం కోర్టు కొలీజియం వ్యవస్థ ఒకటి. ఈ వ్యవస్థ ద్వారా న్యాయమూర్తుల నియామకాలనూ, బదిలీలనూ చేపడతారు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ పార్లమెంట్ చేసిన చట్టం ద్వారానో లేదా రాజ్యాంగ నిబంధనలను అనుసరించో ఏర్పడింది కాదు. అది సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా పరిణామం చెందిన వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి మార్గదర్శకత్వం వహిస్తారు. నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. హైకోర్టు కొలీజియానికి ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వం వహిస్తారు. ఇద్దరు సీనియర్ హైకోర్టు న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. కొలీజియం సిఫార్సు చేసినవారిని ప్రభుత్వం నియమిస్తుంది. అయితే ఇటీవల కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలనే ప్రతిపాదన చేస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ వివాదాస్పదమయింది. సుప్రీం కోర్టు ధర్మాసనాలు ఇచ్చిన అనేక తీర్పుల వల్ల... నియమాల కన్నా ఎక్కువగా సంప్రదాయాల ఆధారంగానే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కొలీజియం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యవస్థలో ప్రభుత్వ ప్రతి నిధి ఉండాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తినే దెబ్బ తీసేవిధంగా ఉందని పలువురు న్యాయనిపుణులు అంటు న్నారు. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధికి స్థానం గురించి మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుల అభిప్రాయాలను ప్రస్తావించారు. ఆ సందర్భంగా రాజ్యాంగ మౌలిక నిర్మాణం లేదా స్వభావాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే సమాఖ్య, కార్యనిర్వాహకవర్గం, స్వతంత్ర న్యాయవ్యవస్థ రాజ్యాంగ ముఖ్య విభాగాలు అని రాజ్యాంగ ధర్మాసనం నిర్దేశించిన సంగతిని పేర్కొన్నారు. కొలీజియంలో పార్లమెంట్, ప్రభుత్వ పెద్దలకు స్థానం కల్పించడానికి చేసిన 99వ రాజ్యాంగ సవరణ చట్టాన్నీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్నీ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్నీ ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ‘పెద్దలు’ (ముగ్గురు) పరోక్షంగా సుప్రీం ఇచ్చిన ఈ తీర్పును ఒప్పుకోవడం లేదనీ, ఆ నిర్ణయాన్ని మరో దారిలో అమలుచేయాలని చూస్తున్నారనీ ట్విట్టర్ వేదికగా ఆయన అన్నారు. ‘1967–77 సంవత్సరాల మధ్య దేశ చరిత్రను ధన్ఖర్, బిర్లా, రిజిజులు చదివే ఉంటారని నేను భావిస్తున్నాను. రెండు భిన్న విషయాలను ధన్ఖర్ కలగలిపి వేశారు. రాజ్యాంగంలోని ప్రతీ లేదా ఏదైనా ఒక నిబంధనను పార్లమెంటు సవరించ గలదా; ఆ సవరణ న్యాయ వ్యవస్థ సమీక్ష పరిధిలోకి రాదా అన్నది ఒక అంశం. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు సరైనదేనా అన్నది రెండో అంశం. సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీసుకున్న నిర్ణయం సరైనదనీ, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం కేసులో తప్పుడు నిర్ణయం తీసుకున్నదనీ అభిప్రాయపడేందుకు ఆస్కారమున్నది. నిజానికి న్యాయశాస్త్ర పండితులు అనేక మంది ఇదే విధంగా అభిప్రాయపడుతున్నారు’ అని చిదంబరం అన్నారు. అంతేకాదు ‘‘న్యాయవ్యవస్థ నిర్ణయాల కంటే పార్లమెంటు నిర్ణయాలే సర్వోన్నతమైనవనే వాదనను అంగీకరించామను కోండి. జరిగేదేమిటి? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. జమ్మూ –కశ్మీర్లో వలే ఒక రాష్ట్రాన్ని విభజించి పలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడాన్ని మీరు ఆమోదిస్తారా? వాక్ స్వాతంత్య్రాన్నీ, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే స్వేచ్ఛనూ, ఏ వృత్తినైనా ఆచరించే, ఏ వ్యాపారాన్ని అయినా చేసే స్వేచ్ఛను రద్దుచేయడాన్ని మీరు ఒప్పుకుంటారా? స్త్రీ పురు షులను సమానంగా పరిగణించని, హిందువులు, ముస్లింల పట్ల రాజ్య వ్యవస్థ భిన్న రీతుల్లో వ్యవహరించడాన్ని అనుమతించి... స్వలింగ సంపర్కులకు హక్కులు నిరాకరించే చట్టాలను మీరు ఆమోదిస్తారా? ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, యూదులు, ఇతర మైనారిటీ వర్గాలకు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను రద్దు చేయడాన్ని మీరు అంగీకరిస్తారా? ఏడవ షెడ్యూలు నుంచి రాష్ట్ర జాబితాను తొలగించి, శాసన నిర్మాణాధికారాలు అన్నిటినీ పార్లమెంటుకు అప్పగించడాన్ని మీరు సమ్మతిస్తారా? ఒక నిర్దిష్ట భాషను యావద్భారతీయులు తప్పనిసరిగా నేర్చుకు తీరాలనే ఆదేశాన్ని మీరు పాటిస్తారా? నేరారోపణకు గురైన ప్రతీ వ్యక్తి అమాయ కుడుగా నిరూపణ కానంతవరకు అతడిని అపరాధిగా భావించాలని నిర్దేశిస్తున్న చట్టాన్ని మీరు అంగీకరిస్తారా? పార్లమెంటు నేడు అటువంటి చట్టాలు చేయదు, చేయలేదు. చేసినా వాటిని సమీక్షించి తిరస్కరించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నది. ఇందుకు భిన్నంగా ‘పార్లమెంటరీ పూర్ణాధిపత్యం, న్యాయవ్యవస్థ సంయమనం’ సిద్ధాంతం కింద అటువంటి చట్టాలపై న్యాయ సమీక్ష జరగదు’’ అని చిదంబంరం పేర్కొన్నారు. రాజ్యాంగ సంవిధాన మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీలులేదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పినా, దశాబ్దాలుగా స్థాపితమైన సంప్రదాయాలు మార్చడానికి ప్రయత్నాలు జరుగు తున్నాయి. 99వ రాజ్యాంగ సవరణను, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా... ప్రధానమంత్రీ, ఇతర ముఖ్యమైన మంత్రులూ, నాయకులూ తమ బాధ్యతను మరచి రాజ్యాంగ మౌలిక స్వరూ పాన్ని దెబ్బతీయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొలీజియంలోని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు కాకుండా చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి, న్యాయమంత్రి కలిసి న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో పాల్గొనే విషయాన్ని ఈ ‘ముగ్గురు’ పెద్దలు నిర్ణయిస్తారట. ఇదే జరిగితే న్యాయం బతుకు తుందా? - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
Dhanurmasam 2022: తిరుప్పావై ప్రతిధ్వనించే మాసం
గోదాదేవి పేరుతో తిరుప్పావై కావ్యాన్ని ఉపనిషత్తుల సారాంశం అని వర్ణిస్తారు. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషత్ అంటూ తిరుప్పావైని గోదోపనిషత్ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయం లోనే పఠించాలి. అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చింది. అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి తమను ఆదుకోమని గోప గోపీజనులు కోరారు. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించి, తెల్లవారు ఝామున రావాలని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడు. దాంతో తిరుప్పావై కథావస్తువు మొదలైంది. శ్రీకృష్ణుడితో గడిపితే కలిగే ఆనందం, ఉత్సాహం గుర్తుకు వచ్చి గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రి గడిపారు. తెల్లవారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నాందీ ప్రస్తావన. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగు వేల కవితలను నాలాయ రమ్ (నాల్ అంటే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవేద్యం తరువాత నాలాయిర ప్రబంధ పారాయణం... తిరుప్పావై మంగళా శాసనం ప్రణవ నాదంతో ముగుస్తుంది. ఈ తమిళ ప్రబంధ పారాయణానికి ఏ ప్రతి బంధకాలూ లేవు. కఠినమైన నిబంధనలు లేవు. వర్ణ భేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. నారాయణ మంత్ర సారాంశాన్ని పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, నారాయణుని తిరుమంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ రహస్యాలు విప్పినవాడు రామానుజుడు. కుల మత భేదాలు లేకుండా అంద రికీ నారాయణుని చేరే జ్ఞాన, వ్రత, మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ– గోదాదేవి, శ్రీరామానుజుడు. తిరుప్పావై జీయర్ అని రామానుజుని అంటారు. గోదాదేవి పుట్టి కావేరి నది తీరంలో శ్రీరంగనిలో లీనమైన రెండు వందల ఏళ్ల తరువాత క్రీస్తు శకం 1000లో జన్మించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం ఒక కారణమైతే... తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో శ్రీ సుందర బాహుస్వామికి వేయి బిందెల పాయసం చేయిస్తానన్న మొక్కును ఆయన తీర్చడం మరో కారణం. గోదాదేవి శ్రీరంగడిలో లీనం కావడం వల్ల ఆమె తన మొక్కు తీర్చలేకపోయారు. ఆ విషయం విన్న మరుక్షణమే రామానుజుడు శ్రీసుందర బాహుస్వామి ఆలయా నికి వెళ్లి వేయిబిందెల పాయసం సమర్పించారట. శంగత్తమిళ్ అంటే అందమైన తమిళ భాష అని అర్థం. డిసెంబర్ మధ్యలో ఉండే ధనుర్మా సంలో వచ్చే తమిళ నెల. సూర్యుడు ధనుర్ రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. గోదాదేవి రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. ఆ విధంగా 30 అందమైన ఎనిమిది పాదాల కవితలు గోదా గళం నుంచి జాలు వారాయి ఈ నెలలో. పదం పదంలో పుణ్యకథ కనిపిస్తుంది. వాటిని వింటుంటే రామాయణ ఘట్టాలూ, భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు కళ్ల ముందు కదలాడుతాయి. ఇందులో భక్తి సాహిత్యం, శరణాగతి, విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కానీ ఇది సిద్ధాంత తత్వ గ్రంథం కాదు. ఒక్కో పాశురం ఒక్కొక్క బోధనా, సాధనా... ఒక పిలుపు, వ్రతం, ఆరాధన కలిసిన ప్రేమరస ప్రవాహం. ఆద్యంతం భక్తిభావ బంధురం. తిరుమల తిరుపతిలో ఈ ధనుర్మాసపు ముప్పయ్ రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. ‘తిరుప్పళ్లియజిచ్చి’ అని విప్రనారాయణుడు రచించిన పాశురాలు విన్న తరువాత... శ్రీనివాసుడు పొద్దున్నే లేవగానే శ్రావ్యంగా ఈ తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున మొత్తం 30 వింటాడు. గోదా గీతాగోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాసపు గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంథ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మి కోద్యమం ఇది. (క్లిక్ చేయండి: అదొక విచిత్ర బంధం! పట్టు విడుపులు ఉంటేనే..) - మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్ర యూనివర్సిటీ (డిసెంబర్ 16న ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా) -
దేశమే ఓ ‘సంఘం’.. అది విద్వేష కేంద్రం కాదు!
ద్వేషపు విషాలు విరజిమ్మే నేతలకు రాజ్యాంగ పాఠాలు చెప్పవలసిన అవసరం ఉంది. భారత్ ఒక సంఘం, విద్వేష కేంద్రం కాదు అనేది తొలి పాఠం. నిజానికి కేంద్రం అన్నమాటే రాజ్యాంగంలో లేదు. ఢిల్లీలో ఉన్న జాతీయ ప్రభుత్వాన్ని ‘సంఘం’ అని రాజ్యాంగం అంటోంది. దేశం అంటే సంఘం. సంఘం అంటే కలిసి ఉండడం. మనం విద్వేష విధ్వంస ఉద్వేగ ఉద్రేక వాక్యాలతో జాతిని విభజించి, భజనలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత సమయంలో... రాజ్యాంగం దేశాన్ని సంఘం అన్నదని తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది. మనం జాతి అంటూ ఉంటాం. ‘నేషనల్’ అన్న పదానికి తెలుగులో మనం ‘జాతీయ’ అని అర్థం చెప్పుకుంటున్నాం. హిందీలో జాతి అంటే కులం. రాష్ట్రీయ ఏకతా అంటే జాతీయ సమైక్యత. ఈ విధంగా మన దేశభక్తి భావాలను రక రకాల పదాలతో వాడుతూ మన దేశాన్ని గందరగోళంలో పడేస్తున్నాం. మన నాయకుల సంగతి మరీ దారుణం. చంపండి, నరకండి అని తెలుగు సినిమా ఫ్యాక్షన్ కథల హత్యాకాండ పరిభాషను తలపించే విధ్వంసక భాషను వేదికల మీద వాడుతున్నారు. ఇది నేర భాష. ద్వేష విధానం. ఈ విధంగా మాట్లాడే వారు దేశద్రోహులు. వాడుకగా పత్రికల్లో, టీవీల్లో మనం ‘కేంద్రం’ అనేమాట వాడుతున్నాం. రాజ్యాంగంలో కేంద్రం అనే మాటే లేదు. ఆ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తొలి తెలుగుదేశం వ్యవస్థాపకుడు (చంద్రబాబు నాయుడికి ముందు తెలుగుదేశం) ఎన్టీ రామారావు ‘కేంద్రం’ అనే పదం ‘మిథ్య’ అనేవారు. రాష్ట్రాలు లేకపోతే దేశం ఎక్కడ అనేవారు. అన్ని రాష్ట్రాల హద్దులన్నీ కలిపితేనే ఈ దేశం అని కూడా వాదించేవారు. మనదేశ రాజ్యాంగం ప్రకారం కేంద్రం గొప్పదా? రాష్ట్రం గొప్పదా? అందరూ తడుముకోకుండా చెప్పే సమాధానం కేంద్రం అని. గొప్పదంటే ఏమిటీ? ఎక్కువ అధికారాలున్నాయనా? పెద్దదనా? కాదు. ఎన్నికల ద్వారానే ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా సమానమే కదా? సమానమే కానీ కేంద్రం ‘ఎక్కువ సమానం’. ఎందుకంటే... దేశ రక్షణ, విదేశీ వ్యవహారాల నిర్వహణ, కమ్యూనికేషన్లు, ఇవన్నీ యూనియన్ ప్రభుత్వమే నిర్వహించాలి. ఇందులో రాష్ట్రాలకు ప్రమేయమే లేదు. యూనియన్ లిస్ట్ అని ఏడో షెడ్యూల్లో కొన్ని అంశాలపై పాలనాధికారాలనూ, శాసనా ధికారాలనూ ప్రత్యేకించి యూనియన్‌కే పరిమితం చేశారు. యూనియన్ అంటే సంఘం. సంఘ ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది. హిందీలో రాష్ట్రం అంటే దేశం. రాష్ట్రపతి అంటే దేశాధ్యక్షుడని తెలుగులో కూడా ఒప్పుకుంటాం. కానీ వాడుకలో రాష్ట్రం అంటే ద్వితీయ స్థాయి పాలనా ప్రదేశం. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటాం. రాజనీతి పరంగా... రాజ్యాంగ వాడుకలో స్టేట్ అంటే వేరే అర్థం ఉంది. స్టేట్ అంటే రాజ్యం అనీ, దేశ పాలనా వ్యవస్థ అనీ అర్థం. మార్గ దర్శకంగా ఉండే ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానతను సాధించడానికీ, పేద ధనిక వ్యత్యాసాలు తగ్గించడానికీ కృషి చేయాలనే సూత్రం ఒకటి ఉంది. స్టేట్‌ను మనం తెలుగులో ఇతర భాషల్లో కూడా ఫలానా రాష్ట్రం అనే అర్థంలో వాడతాం. విచిత్రంగా ‘రాజ్యం’ రాష్ట్రమైంది. ‘రాష్ట్రం’ దేశమైంది. ‘దేశం’ కేంద్రమైంది. రాష్ట్రం కేంద్రం దగ్గర నిలబడి నిధులు అభ్యర్థించే ప్రజా ప్రభుత్వమైంది. రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజనీతి శాస్త్రానికి అనుగుణంగా వాడిన కీలకపదాలను అర్థం చేసుకోకుండా మన వాడుక పదాలతో గందరగోళం సృష్టిస్తూ ఉంటాం. న్యాయ పరిభాషలో ఈ పద్ధతి సమస్యలు తెస్తుంది. ‘ఇండియా దటీజ్ భారత్’ అని మన రాజ్యాంగం తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికల్ 1 సంఘం (యూనియన్) పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సంఘమై ఉంటుంది. (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధుల వివరణ తొలి షెడ్యూలులో ఉంది. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే... (ఏ) ఆయా రాష్ట్రాల పరిధి, (బీ) తొలి షెడ్యూల్లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సీ) భవిష్యత్తులో స్వాధీనం చేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవీ. (క్లిక్: రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు) తొలి షెడ్యూల్లో ఏ, బీ, సీ, డీ అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను, వాటి పరిధులను పేర్కొన్నారు. (ఏ) భాగంలో బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్లూ, (బీ)లో స్వతంత్ర రాజ్యాలు, (íసీ)లో కేంద్ర పాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు; అండమాన్ నికోబార్ దీవులు (డీ)లో చేర్చారు. ఏడో రాజ్యాంగ సవరణ (1956) ద్వారా పార్ట్ (ఏ) (బీ)ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించారు. ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటినీ కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కార ణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు ఆ తర్వాత వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కానీ జమ్ము–కశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. (క్లిక్: రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసివుంటే...) ‘భారత్’ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్ అనీ, ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్య్ర పోరాటంలో మంత్ర వాక్యం ‘భారత్ మాతాకీ జై’. అందులోంచి భారత్ అన్న పేరును స్వీకరించారు. ప్రతి భారతీయుడికీ ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ అంటూ ఈ పిటిషన్‌ను కొట్టి వేశారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదన్నారు. (క్లిక్: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
రాజ్యాంగ పీఠిక.. వాద వివాదాలు
రాజ్యాంగం తొలి ప్రతిని 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ మొదటినుంచీ రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. ఆయన మాత్రమే కాదు, కె. సంతానం (మద్రాస్), ఆర్ ఆర్ దివాకర్ (బాంబే), మౌలానా హస్రత్ మోహానీ (యునైటెడ్ ప్రావిన్సెస్) కూడా రాజ్యాంగ రచనను పదే పదే విమర్శించేవారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ... చట్ట వ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టి ట్యూషన్ కమిటీ)గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా... ఆ నిర్ణయాలను సమీక్షించారనీ, కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారనీ దివాకర్ విమర్శిం చారు. తర్వాతి రోజుల్లో రాజ్యంగ ‘పీఠిక’గా మారిన ‘రాజ్యాంగ లక్ష్య తీర్మానం’ (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) పైనా మోహానీ విమర్శలు కురిపించారు. ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్) రాసిం దెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు, ప్రసంగాల వివరాలు ఉన్నాయి కానీ... రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు; చేసిన మార్పులు, చేర్పులు; తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబం ధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుది రూపంపై చర్చకు ముందు జరిగిన వివరాలూ లేవు. యూపీఎస్సీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేవారంతా పీఠిక ఎవరు రాశారు అనగానే జవ హర్లాల్ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణ మేమంటే.... నెహ్రూ ప్రతిపాదించిన ‘లక్ష్య తీర్మాన’మే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. రాజ్యాంగ రచనాసభలో చర్చించిన వివరాలు లేకపోవడం మోహానీ వంటివారు కొందరు విమర్శించడానికి కారణమైంది. ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుమిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిన ఘనత రాజ్యాంగ సభ సలహాదారుడైన బిఎన్ రావ్‌కు దక్కుతుందనేవారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతి రూప కల్పనలో రావ్ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా ఆయనే రాశారనడానికి వీలు లేదు. ప్రతి సభ్యుడి ప్రతిస్పంద నను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యా లను రచనా సంఘం... ముఖ్యంగా అంబేడ్కర్ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్న వారికి వివాదం కావచ్చు కూడా! రాజ్యాంగ రచన ఉపసంఘం సమావేశాల కాలంలో చాలా సందర్భాలలో అందరు సభ్యులూ హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశా లన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబే డ్కర్కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికీ మధ్య సారూప్యత ఉన్నా.. కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. ‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాల రచయిత వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్ రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత చేసిన ప్రసంగం, నెహ్రూ లోక్‌సభలో 6 డిసెంబర్, 1956 (అంబేడ్కర్ నిర్యాణ దినం) నాడు ఇచ్చిన ఉపన్యాసం... రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్ అనే విషయాన్ని ధృవీ కరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్ ఒకరు అంటారు. కానీ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ, కష్టపడ్డవారు గానీ మరొకరు లేరు’’ అని నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తనకొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివ రంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్ సింగ్ రాథోర్ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్ ప్రియాం బుల్’’ అని పేరు పెట్టారు. ‘రాజ్యాంగ రహస్య చరిత్ర’ అని కూడా ఉపశీర్షిక తగిలించారు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా వర్సిటీ -
‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం
1215లో మెగ్నా కార్టా అనే హక్కుల ప్రకటన ఉద్యమం ప్రారంభం అయినప్పుడు మొట్టమొదట అడిగిన హక్కు ‘అడిగే హక్కు’. దాన్ని ‘రైట్ టు పిటిషన్’ అంటారు. అడిగే హక్కు ప్రాణ హక్కు కన్నా గొప్పదా అంటే సమాధానం... అవును. అడిగే హక్కు ఒక్కటి ఇస్తే అందులో ప్రాణ హక్కు అడుగుతాం, అభివృద్ధి హక్కు అడుగుతాం. ఇంకేం కావాలన్నా అడగవచ్చు. ఆ అడిగే హక్కు ఇప్పుడు భావప్రకటనా స్వాతంత్య్రం.‘‘నాకు తెలుసుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, అంతరాత్మ చెప్పినట్టు వాదించే స్వేచ్ఛ ఇవ్వు. అదే అన్నిటికన్నా గొప్ప స్వేచ్ఛ’’ అంటాడు మిల్టన్. అభిప్రాయాలు, ఆలోచనలు అందరికీ ఉంటాయి. కనుక చెప్పే హక్కు సహజమైన హక్కే. చెప్పిందే చెప్పినా ఫరవాలేదు, చెబుతూ పోవడమే కర్తవ్యం. చెప్పకుండా నోరుమూసుకుని కూర్చుంటే అన్ని అన్యాయాలను ఆమోదించినట్టే! మౌనం అర్ధాంగీకారం అంటారు. కాదు. మౌనం సంపూర్ణాంగీకారం... ఉక్రెయిన్‌పై రష్యా దౌర్జన్య యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించినపుడు ఎన్నడూ లేని సమైక్యత పాటించిన మనమూ, మన ఇరుగు పొరుగూ... పాకిస్తాన్, చైనా; మరో 32 దేశాలు తటస్థంగా ఉన్నాయి. దాని అర్థం రష్యా మానవ హనన సమరాన్ని సంపూర్ణంగా సమర్థించినట్టే. ఇది దురదృష్టకరం. కనీసం ఇకనైనా యుద్ధాన్ని ఆపాలని అడిగి... ధర్మం, న్యాయం పాటిస్తే బాగుండేది. మానవత్వపు విలువల వలువలను దుశ్శాసనులు ఊడదీస్తుంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కృపాచార్యులు మౌనం పాటించడాన్ని తటస్థవైఖరి అంటారా ఎవరైనా? తటస్థ వైఖరి వల్ల ఎవరికి లాభమో వారిని సమర్థించినట్టే. మౌనం కూడా ఒక వ్యాఖ్యానమే, భావవ్యక్తీకరణే. ఐక్యరాజ్యసమితి 1948 మానవ హక్కుల ప్రకటన ఆర్టికల్ 19లో భావవ్యక్తీకరణ సహజ హక్కును గుర్తించింది. ప్రతి వ్యక్తీ అభిప్రాయాలను ఏర్పరచుకునే హక్కూ, వ్యక్తం చేసే హక్కూ కలిగి ఉంటాడు. ఉండాలి. మనిషికి ప్రతివాడి గురించీ తీర్పులు ఇవ్వడం అలవాటు. సోషల్ మీడియాలో బాధ్యతారహితమైన తీర్పులు ఇస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. వీటి వల్ల ఈ స్వేచ్ఛకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. అంబేడ్కర్ తన ఆలోచనా స్వేచ్ఛనూ, అనుభవాల నుంచి నేర్చుకున్న అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛనూ విరివిగా వాడుకున్నారు. లాహోర్ తీర్మానం (1940)లో ముస్లింలీగ్ పాకిస్తాన్ వేర్పాటును డిమాండ్ చేసిన తరువాత అంబేడ్కర్ 400 పేజీలలో ‘థాట్స్ ఆన్ పాకిస్తాన్’ అనే పుస్తకం రాశారు. అందులో పాకిస్తాన్ అనే బీజం పుట్టుక, వికాసం గురించి విశ్లేషించారు. హిందువులు పాకిస్తాన్‌ను ముస్లింలకు ఇవ్వాలని వాదించారు. పంజాబ్, బెంగాల్ ప్రదేశాలను హిందూ ముస్లిం నివాసాలను బట్టి పునర్విభజించాలని సూచించారు. ఒక దశాబ్దం పాటు ఈ ఆలోచనలు అనేక చర్చలకు దారితీశాయి. ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ల మధ్య చర్చలకు అంబేడ్కర్ ఆలోచనలు ప్రాతిపదిక అయినాయి. చివరకు భారతదేశ విభజన తప్పలేదు. అభిప్రాయ ప్రకటన హక్కులో ఎవ్వరి జోక్యం లేకుండా అభిప్రాయాలను కలిగి ఉండడం, ప్రాదేశిక హద్దులకు అతీతంగా ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్నీ, అభిప్రాయాలనూ అడిగి, స్వీకరించి, బోధించే స్వాతంత్య్రం ఈ హక్కులో ఉంటాయని ఆర్టికల్ 19 వివరిస్తుంది. సహజ హక్కు అంటే ప్రజలందరికీ ఉండాలి. కానీ మన రాజ్యాంగం పౌరులకు మాత్రమే ఈ హక్కు పరిమితం చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం తను పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే ఆ భారతీయుడు కోల్పోయే తొలి ప్రధానమైన హక్కు ఇదే. (చదవండి: అకడమిక్ బ్యాంకు క్రెడిట్.. విద్యార్థికి మేలే గానీ...) ఐక్యరాజ్యసమితి మానవహక్కుల ప్రకటన... వ్యక్తులందరికీ ఈ స్వేచ్ఛ ఉండాలనీ, అనేక మాధ్యమాలు ఉండవచ్చుననీ, ఈ స్వేచ్ఛకు దేశాల సరిహద్దులు ఉండవనీ, ఇందులో సమాచార హక్కు, ఇతరుల నుంచి సమాచారం పొంది ఇతరులకు పంచే హక్కు కూడా ఉంటాయనీ; ఇతరుల అభిప్రాయాలు కోరి, విని, స్వీకరించి, ఇతరులతో పంచుకునే హక్కు కూడా ఉంటుందనీ వివరించింది. అభిప్రాయ స్వేచ్ఛకు చాలా విస్తృతి ఉన్నది. మన రాజ్యాంగంలో ఈ హక్కుపై చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి కేవలం పౌరులకే ఇవ్వడం. ఇందులో సమాచార హక్కు కూడా ఇమిడి ఉందని సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాలలో చెప్పింది. 2005 దాకా దాన్ని పట్టించుకోలేదు. విభిన్న స్థాయుల్లో శాస్త్రీయ పరిశోధన చేసేందుకు, ప్రచురించేందుకు తగిన స్వేచ్ఛ ఉండాలి. దాన్ని శాస్త్రీయ స్వేచ్ఛ అంటారు. 1766లో పత్రికా స్వేచ్ఛ చట్టాన్ని స్వీడన్ అమలు చేసింది. ఇదే సమాచార హక్కును కూడా 1766లోనే ఇచ్చింది. 1947 ఆగస్టు 15న మనదేశం స్వతంత్రం సంపాదించింది. కానీ చాలాకాలం డొమినియన్‌గా ఉండింది. భారతీయ జన గణ మన తంత్రం అప్పటికి ఆవిర్భవించలేదు. స్వతంత్రం గణతంత్రంతోనే సంపూర్ణమవుతుంది. గణతంత్రం లేకపోతే సొంత తంత్రమేదీ ఉండదు. స్వతంత్రం కూడా ఉండదు. చెదురు మదురుగా ఉన్న జనం సాధికారిక పాలకులుగా నాయకత్వం స్వీకరించడానికి కొన్ని వ్యవస్థలు ఉండాలి. విధానాలు ఏర్పడాలి. ప్రక్రియ ఉండాలి. పద్ధతులు ఏర్పడాలి. అప్పుడు జనతంత్రం గణతంత్రంగా పరిణమిస్తుంది. నిర్ణీత గణతంత్ర విధానాల సమగ్ర నిర్మాణం ద్వారా మాత్రమే మనం స్వతంత్రం కాపాడుకోగలం. - మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
‘గెజిట్’తో నదులు, ప్రాజెక్టుల స్వాధీనం చెల్లదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులు, వాటిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి, రాజ్యాంగానికి విరుద్ధమని ప్రముఖ న్యాయనిపుణుడు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్టు కేంద్రం చెపుతోందని, అయితే నదులు, వాటిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించాలని ఈ చట్టం లో ఎక్కడా లేదన్నారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసి, వాటి అధికార పరిధిని నిర్ణయించే అవకాశమే కేంద్రానికి ఉందన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌పై తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం శనివారం ఇక్కడ నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బోర్డుల అధికార పరిమితిని నిర్వచించే సాకుతో గెజిట్ ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని విమర్శించారు. దీనివల్లరూ.70 వేల కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను రూ.30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అర్ధంతరంగా నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టులు ఆగిపోతే రాష్ట్రం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు. కేంద్రం తక్షణమే ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయసమ్మతంగా ఉండాలి: తెలంగాణ భౌ గోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నదీ జలాల్లో న్యాయమైన కేటాయింపులను జరపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలతో నీళ్లను తీసుకోవాలంటే అధిక సమయం, వ్యయం అవుతుందని, అదే ఏపీలో కేవలం ప్రాజెక్టుల గేట్లను ఎత్తడం ద్వారా నీళ్లు వస్తాయని అన్నారు. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఇంకా కొనసాగుతోందని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రం తెచ్చిన గెజిట్ నోటిఫికేషన్ వల్ల హైదరాబాద్ సహా మొత్తం రాష్ట్రం తాగునీటి కోసం కటకటలాడాల్సి వస్తుందని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి సంధానకర్తలుగా వ్యవహరించారు. -
బాబా రాజ్యాంగ సాహెబ్
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రీ, కీలక మైన నిర్మాత కూడా. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూ షన్! రచయిత కన్నా... తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కను మరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ. 1947, ఆగస్టు 29న అంటే మనకు స్వాతంత్య్రం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరి పాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగ సభ సలహాదారు అయిన బీఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగ సభ ముందు చర్చకు సమర్పించాలని... ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశిం చారు. ‘‘రాజ్యాంగ నిర్మాణం చేసిన ఘనత నాకు ఇచ్చారు, కానీ నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బీఎన్ రావ్‌కు చెందుతుంది. రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అని అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చెప్పారు. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు. అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోశన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించి అధ్య యనం చేసిన వ్యక్తి. కనుక రాజ్యాంగ రచనా ఉప సంఘంలో ఉండాలని రాజ్యాంగ సభ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఈ సంఘంలో ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్. గోపాల స్వామి అయ్యంగార్, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డీపీ ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టీటీ కృష్ణమాచార్య చేరారు). ఉప సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలి సమా వేశంలో అంబేడ్కర్‌ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తల మునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావులకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పు డున్న ‘భారత ప్రభుత్వ చట్టం 1935’ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన బెనెగల్ నర్సింగరావ్ రూపొం దించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్ని ర్మించడంలో కీలకమైన కృషి చేశారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందు బాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరి కొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడిందని టీటీ కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాధ్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరిం చాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీకి నేతగా పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జేబీ కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నో ఉప సంఘాలు పనిని పంచు కున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7,635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2,473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదంపైనా, వాక్యం పైనా వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమో దించారు. బీఎన్ రావ్ 243 ఆర్టికల్స్, 13 షెడ్యూళ్లతో రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్య క్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
సిగ్గు పడాల్సిన భారత జాతీయ నేరం వధూహత్య
‘వరకట్నమరణ’ నేరాన్ని మెకాలే కనిపెట్టలేదు. భారతదేశ భర్తలు, అత్తమామలు, ఆడపడచుల అనేక ఘోరనేరాల వల్ల భారత సమాజమే స్వతంత్రదేశంలో దీన్ని కొత్త నేరంగా నిర్వచించింది. సాక్ష్యాలు లేని నాలుగు గోడల మధ్య కుటుంబ సభ్యులే, అంటే పాత నేరగాళ్లు కాదు, సాగించే దారుణమైన హత్యలకు సరైన శిక్షలు విధించడానికి కావలసిన నియమాలు, విధానాలు పార్లమెంటు రూపొందించింది. మనం గొప్పగా చెప్పుకునే అద్భుతమైన వారసత్వ సంస్కృతి, మనమంతా పిలుచుకునే గొప్ప నాగరికత, అంతరిస్తున్న ప్రేమలు, విజృంభిస్తున్న ద్వేషాలు, ధనాశ, క్రౌర్యం నుంచి పుట్టిన కుటుంబ నేరం ఈ ఘోరం. సిగ్గుపడవలసిన సరికొత్త భారత జాతీయనేరం. (చదవండి: తప్పు చేసినా శిక్షకు అతీతులా?) జార్ఖండ్ రాష్ట్రంలో ఒక భర్త రామ్‌సహాయ్ మహతో, అత్త పార్వతీదేవి, మామ నేమా మహతో కలిసి కోడలు ఫుల్వాదేవిని వరకట్నం తేలేదని చంపిన సంఘటన ఇది. రాజ్‌దూత్ మోటార్ సైకిల్, 20 వేలరూపాయల వరకట్నం కోసం వధువును హింసించారు. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తామని బెదిరించారు. తండ్రి అంత డబ్బు తేలేడని కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. 1997లో పెళ్లి అయిన కొద్ది నెలలకే ఆమె జీవితం ముగించారు. ఆమెను నదీ తీరానికి తీసుకువచ్చి నదిలోకి తోసి చంపేశారు. కూతురు కనిపించడం లేదని తండ్రి బోధి మహతో ఫిర్యాదు చేశారు. (చదవండి: ‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!) 1997లో వధువును చంపేశారు. కేసు రిజిస్టర్ అయింది. 20వ తేదీ సెప్టెంబర్ 1999 గిరిడిత్ అడిషనల్ సెషన్‌జడ్జి నేరం రుజువైందని పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. మరో నేరంలో మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలు కావాలని తీర్పులో పేర్కొన్నారు. అంటే కేవలం పదేళ్లే శిక్ష అని అర్థం. 2007లో అంటే ఏడేళ్ల తరువాత హైకోర్టు శిక్షలను నిర్ధారించింది. 14 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు శిక్షలను సమర్థించింది. ఈలోగా నేమా మహతో (మామ) 2009 సుప్రీం కోర్టులో అప్పీలు కోసం ఎస్ఎల్పీ వేశాడు. కానీ అంతలో మరణించాడు. కనుక ఆయనపై కేసులేవీ ఉండవు. అత్తమీద ఆరోపణలు స్పష్టంగా లేకపోవడం, రుజువులు సరైనన్ని లేకపోవడం వల్ల ఆమెను విడుదల చేశారు. 21 సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు తీర్పుతో ఈ సుదీర్ఘ అన్యాయాలస్యం తరువాత న్యాయం జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కొహ్లి ఈ అప్పీలు విచారించారు. కొన్ని దేశాల్లో అయితే ఒక శిక్ష తరవాత మరొక శిక్ష అమలవుతుంది. అంటే ఇదే అమెరికాలో అయితే కోడలిని చంపిన ఈ హంతకులకు 13 ఏళ్ల జైలు శిక్ష పడేది. నేర విచారణ దశలో తమ ఇంట్లోంచి వధువు ఏ విధంగా మాయమైపోయిందో చెప్పలేకపోయారు అత్త మామలు, భర్త. ఆమె తనతో నివసించడం లేదని వారు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు భావించింది. తమతో కాకుండా తన బావతో ఆమె నివసించేదని చెప్పడానికి వారు విఫల ప్రయత్నం చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిందనీ తరువాత దొరకలేదనే మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. వెతకడానికి ఏం ప్రయత్నాలు చేశారో చెప్పలేకపోయారు. నిజంగా ఆమె ఇంటినుంచి మాయమైపోతే ఆమె తల్లిదండ్రులకు చెప్పకపోవడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం చూస్తే వారి ప్రవర్తనపై అనుమానాలు ధృవపడుతున్నాయి. వరకట్న హత్యలకు ప్రత్యక్ష సాక్షులు ఉండరు. నేరగాళ్లే సాక్షులు. వారి ప్రవర్తన, పరిస్థితులు, ముందు వెనుక వారి వ్యవహారాలు, అంతకుముందు జరిగిన సంగతులు వారి నేరాన్ని పట్టి ఇస్తాయి. మామూలు హత్యలకు ఈ హత్య లకు ఇదీ తేడా. హత్య జరిగిందని చెప్పే సాక్షులు ఉండని పరిస్థితులలో, వీరే హత్య చేసి ఉంటారు అని భావించడానికి తగిన పరిసర సాక్ష్యాలు కోర్టు ముందుంచడం ఒక సవాల్. దీనికిగానూ ప్రాసిక్యూషన్ వారు నీతిమంతంగా, న్యాయంగా, చాలాశ్రద్ధతో కృషి చేయవలసి వస్తున్నది. సెక్షన్ 304 బి ఇండియన్ పీనల్ కోడ్ కింద, నిందితులే నేరం చేసి ఉంటారని భావించడానికి కొన్ని సూత్రాలను ఈ తాజా తీర్పు వివరిస్తున్నది. 1. సాధారణ పరిస్థితుల్లో కాకుండా మరోరకంగా మరణం సంభవించి ఉండటం, కాలిన గాయాలో మరోరకం శారీరక గాయాలో అయి ఉండాలి. 2. పెళ్లయిన ఏడేళ్లలోగా అసాధారణ మరణం జరిగి ఉండాలి. 3. మరణానికి ముందు అప్పుడప్పుడే ఆమె హింసకు గురై ఉండాలి. 4. ఆ హింస, క్రౌర్యం వరకట్నం కోసమో లేక దానికి సంబంధించినదై ఉండాలి. ఇందులో వధువు తండ్రి ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. నిందితుడు తన కూతురికి హాని చేస్తానని బెదిరించినట్టు సాక్ష్యం చెప్పాడు. తండ్రి, తమ్ముడు, బావ చేసిన ప్రయత్నాల వల్ల ఆమె శరీర భాగాలు లభించాయి గానీ పోలీసులేమీ చేయలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తు అంత పకడ్బందీగా లేదు. కానీ 304బి కింద పరిస్థితుల సాక్ష్యం నిందితుల నేరాన్ని రుజువు చేస్తోంది. ఫుల్వాదేవి పెళ్లయిన కొద్ది నెలలకే కట్నం కోసం హింసకు గురికావడం, కొద్దిరోజులకే అత్తవారింటి నుంచి మాయం కావడం (ఆరోపణ స్థాయిలో కూడా నమ్మలేని మాట), తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం, వధువు సోదరుడు వచ్చినపుడు ఇంటిల్లిపాదీ లేకపోవడం, ఇంటికి తాళం వేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయక పోవడం, ఆమె అస్తిపంజరం నదీ తీరంలో దొరకడం, భర్త, అత్త మామల మాటలు పొంతనలేకుండా ఉండటం వంటి వన్నీ నేరాన్ని పట్టి ఇస్తున్నాయి. ఇది హత్య. సాక్ష్యాలు దొరికితే హత్య అని నిరూపించి సెక్షన్ 302 కింద శిక్షించే వీలుంది. సెక్షన్ 304బి హత్యల వర్గంలోనే ఒక కొత్తరకం నేరం. దీన్ని చట్టం హత్య అనకుండా వరకట్న మరణం అని పేరుపెట్టినంత మాత్రాన ఇది హత్య కాకుండా పోదు. వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నది కుటుంబపెద్దల క్రూర స్వార్థ మనస్తత్వం. (చదవండి: వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
రామాయణంలో శేషేంద్రకు దొరికిన ఆణిముత్యాలు
వాల్మీకి పదబంధాలను వ్యాసుడు యథాతథంగా వాడుకున్నాడు. రామాయణానికి భారతం ప్రతి బింబం. ఈ మాట నమ్మడం సాధ్యమా? నేటి భాషలో అయితే వ్యాసుడు వాల్మీకి కాపీరైట్ ఉల్లంఘించాడనాలి. ఈ మాట నేను ఇప్పుడు అనడం లేదు. సాక్షాత్తూ గుంటూరు శేషేంద్ర శర్మ విశేష రచన ‘షోడశి’ (రామాయణ రహస్యములు)లో 1967లో అంటే 54 ఏళ్ల కిందటే ఈ రహస్యాన్ని వెల్లడిం చారు. ఆ విషయాన్ని విశ్వనాథ బయటపెట్టారు. నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ సాహితీ అనుబంధంలో 1963–67 మధ్య ధారావాహికగా షోడశి వ్యాసాలు ప్రచురితమైనాయి. విశ్వనాథ ‘షోడశి’కి రాసిన ముందుమాటలో చెప్పిన మాటలు: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్యమేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి’’. ‘‘శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వాని యంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను. వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మొదటివాడు వ్యాసుడు’’. శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవిసమ్రాట్ : ‘‘శ్రీ శర్మగారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేననుకొనలేదు. అప్పుడ ప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయించినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యావిషయమునింత లోతుగా తెలిసిన వారనుకొనలేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండవలసిన విషయము’’. షోడశి వ్యాసాలలో శ్రీసుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చిందనే అధ్యాయంలో వెల్ల డించిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రవచన కర్తలు సాధారణంగా ప్రస్తావించని అంశాలు సాహిత్యపరంగా పరిశోధించి మన ముందుంచారు శేషేంద్ర. సుందరకాండ సుందర నామం ధరించడానికి చాలా కారణాలున్నాయి. అవి: హనుమంతుడు సుందరుడగుట వలన, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట అని. సుందరాయ నమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి కాదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘‘చంద్రబింబ సమాకారం వాంఛి తార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండే ఉత్తమే’’ అన్నారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం. రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురాణము సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీ భక్తుడైన హనుమ అని అర్థమే గానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుంద రకాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మపలాశ లోచనం ద్రకే‡్ష్యతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్యదర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరితపిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘తెలుగుసీమలో సుందరయ్య, సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్, సుందర్ సింగ్ సుందర్ బాయ్ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేద’ని శేషేంద్ర వివరించారు. హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజనేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కానీ తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? సుందరుడు అని శేషేంద్ర, విశ్వనాథ వెల్లడించారు. ఇది వాల్మీకి చెప్పలేదు. ఆ మహర్షి పరమ గూఢమైన రచన చేసినాడు. సుందరుని కథా సమగ్రమయిన సుందరకాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు కృష్ణ అనీ శూర్పణఖ అసలు పేరు బాల అని ప్రస్తావించారు. కవి సమ్రాట్ విశ్వనాథ ‘‘రామాయణమునందు తక్కిన కాండలకు తత్తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి సుందరకాండమన్న పేరు విడిగానేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. విశ్వనాథ ప్రశంస ఇంకా సాగింది. ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయత్రీ మంత్రములోని పాదముల సంఖ్యయు నక్షరముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధమైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహస్ఫోరకముగా నున్నది: వారి శ్రధ్ధను నిరూపించుచున్నది. ఇది పారాయణము చేయనెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్పరాదు.’’ ....‘అన్నిటికంటే ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే.. ఈ నిరూపణ మాత్రమాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు. వాల్మీకి వేదముననుసరించి శ్రీరామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇదినిరూపించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అని విశ్వనాథ పేర్కొన్నారు. షోడశి హిందీ ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించడం కూడా విశేషమే. సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్ర శర్మది లోతైన పరిశోధన. త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్ర శర్మచూచిన తీరు, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధానాన్ని పరిశీలిస్తే రామాయణంలో షోడశి కొత్త కోణాలను ఆవిష్కరించిందని అర్థమవుతుంది. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథం ఇది. వాల్మీకి ఏ విధంగా రామాయణాన్ని సృష్టించారనే విశ్లేషణ గొప్పది. కథా సందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి దేశకాల పరిస్థితులు, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్నీ తెలిస్తే కానీ వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శేషేంద్ర శర్మగారు అన్నారంటే ఆయన రామాయణ మహార్ణవంలో లోతులను ఎంతగా పరిశోధించారో తెలుస్తుంది. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ (నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి) -
ఆ మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం
అది ఆదివారం. రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి గారు వస్తున్నారని తెలిసింది. ఆయన కారుకు అడ్డం పడి నిరసన తెలియజెప్పాలనుకున్నారు. కానీ ఒక నల్ల కారు వెనుకనుంచి రైతుల మీదుగా దూసుకువచ్చింది. నలుగురి ప్రాణాలు పోయాయి. రైతులే దాడి చేశారనే ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించారు. కారుపైన కూర్చుని నడపడం వారికి ఒప్పు. కారు కింద పడడం వీరికి తప్పు. మంత్రి గారి కుమారుడి కారో, తండ్రి గారి కాన్వాయ్ కారో తెలియదు. ఆ కారు శరీరాలను నుజ్జు చేస్తూపోయిన సంగతి మాత్రం తెలుసు. మరణాలు నిజం; కారణాలు, కారకులు, బతికున్న నేరగాళ్లు బయటపడరు. నిర్జీవ శవాలు మాత్రం దాక్కోలేవు, మరణించిన మానవత్వానికి క్షీణించిన సమపాలనకు సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. కానీ వారి సాక్ష్యం ఎవరూ వినరు. శవపరీక్షలు చేసిన డాక్టర్ల నిజాయితీ బతికి ఉంటే, నిజాయితీ ఉన్న డాక్టర్లు బతికి ఉంటే, న్యాయం బతికే అవకాశం. చివరకు మిగిలేవి ప్రాణం లేని నివేదికలు, బూడిద. సుప్రీంకోర్టు స్వయంగా ఎవరినైనా అరెస్టు చేస్తున్నారా ఇప్పడికైనా అని అడిగింది. నిజానికి ఆ ప్రశ్న మొత్తం భారతీయ జనులది. జనం తలలు శరీరాలు చిదిమేస్తూ ఏలినవారి అధికారిక వాహనాలు మరణ మృదంగం మోగించడం కన్నా ఘోరం ఏమంటే దాని తరవాత నిర్వహించవలసిన బాధ్యతలు వదిలేయడం. వీడియో ప్రసారాలు నిషేధించారు. రాజకీయ వికృత కల్లోలాలు. ఇంటర్నెట్ సేవల రద్దు, ప్రతిపక్ష నాయకుల రాకపోకలపై నిషేధం. నగర ప్రవేశంపై అనేకానేక నిర్బంధాలు. తప్పుడు కథనాలు, కావాలని çసృష్టించిన అనుమానాలు. నేరాలు దాచే ప్రయత్నాలు చేయడం, మీడియా నోరు నొక్కడం, తలలు చిదిమేయడమే కాదు తలపును కూడా చిదిమేసే ప్రయత్నాలు జరగడం. దేశ భద్రత కోసమే ఆ కఠిన నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. పోతే పోయింది ఇంటర్నెట్. చట్టాలను ఆమోదించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని నిరసనకారులకు ఇంకా ఎందుకు తెలియడం లేదో ప్రభువులకు అర్థం కాదు, మృత్యుశకటానికి అహంకారమే ఇంధనం కదా. అన్నిటికన్నా భయంకరమైనది నిస్సిగ్గు. బాహాటంగా తమ వీపు తామే తట్టి మెచ్చుకోవడం, వెంటనే విచారణకు ఆదేశించినందుకు ముఖ్యమంత్రి చురుకైన కార్యశీలతను ప్రశంసిస్తూ అభినందించడం, అందుకోసం లజ్జను త్యాగం చేసే మహాసంస్థలు, అతిరథులు, మహారథులు ఎందరో. కొందరు నోరు విప్పరు. కొందరు నోరువిప్పితే అన్నీ అబద్ధాలే. నలుగురు రైతులతో సహా ఎనిమిది మందిని నలిపేసిన ఈ క్రూర, అధికార, అహంకార దుర్మార్గాన్ని సంయుక్త కిసాన్ మోర్చా ఖండిస్తున్నది. సుప్రీంకోర్టు స్వయంగా విచారణకు స్వీకరించి ఏం జరిగిందో, ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పండి అని అడిగింది. ఈ పని చేయవలసింది డీజీపీ, హోంమంత్రి, ముఖ్యమంత్రి. వారంతా ప్రతిపక్షాలను ఎలా కట్టడి చేయాలా అని తమ రాజకీయ అనుభవాన్ని వాడుతూ ఆలోచిస్తుండటం వల్ల వారికి తీరిక లేదని గమనించి సుప్రీంకోర్టు దయతో ఆ బాధ్యతను స్వీకరించింది. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుదే కదా మరి. బ్రిటిష్ క్వీన్స్ కౌన్సిల్‌గా అత్యంత ప్రఖ్యాతుడైన హరీశ్ సాల్వేగారు ఉత్తర ప్రదేశ్ అధికార యంత్రాంగం తరఫున వాదిస్తున్నారు (ఫీజెంత అని అడక్కండి). తదుపరి చర్యలేవీ బాగా లేవని న్యాయమూర్తులు పెదవి విరుస్తున్నారు. ‘‘ప్రశ్నించడానికి రమ్మన్నాం. రాకపోతే మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్ మిశ్రాకు చట్టం కాఠిన్యం ఏమిటో చూపిస్తాం’’ అని హరీశ్ సాల్వే హామీ ఇచ్చారు. మంత్రికొడుకు ఇంటి ముందు జాగ్రత్తగా నోటీసు అంటించి వచ్చారు. అవును. అరెస్టు చేసే ముందు అన్ని హక్కులూ అరెస్టు కాబోయే వారికి కల్పించాలి. ఎన్ని నిందలొస్తే మాత్రం ఆయన బీజేపీ నాయకుడే అవుతాడు గానీ నిందితుడని అనగలమా? మన రాజ్యాంగం వారికిచ్చిన చాలా హక్కులు వాడుకోవలసిందే. అధికార పక్షం కాని వారికి కూడా ఆ హక్కులు ఇస్తే బాగుండేదనే ఒక సూచన. ఎట్టకేలకు ఆయనను అరెస్టయితే చేశారు! దేశ హోంశాఖ సహాయ మంత్రిని డిస్మిస్ చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఇంకా ఆయనను మంత్రి పదవిలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. డిమాండ్ చేయగానే డిస్మిస్ చేస్తే అసలు మంత్రి వర్గాలేవీ ఉండవు. మంత్రులు లేకపోతే, అందులోనూ హోంశాఖ సహాయ మంత్రి లేకపోతే దేశ వ్యవహారాలన్నీ ఎవరు నడిపిస్తారు? బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఈ అధికార అహంకార కారు వీడియోను జనం ముందుకు తెచ్చారు. కావాలని రైతుల వెనుకనుంచి దూసుకొచ్చి ఓ నల్ల ఎస్యూవీ కారు వారి శరీరాల మీదుగా వేగంగా నడిచిపోతున్నట్టు స్పష్టంగా ఉంది. రైతులే మంత్రి కారు మీద దాడి చేశారన్నది ప్రచారం. ‘ఈ వీడియో స్పష్టంగా ఉంది. నిరసనదారుల నోళ్లను హత్యల ద్వారా మూయలేరు. రోడ్డుమీద చిందిన అమాయక రైతుల నెత్తురుకు ఎవరు బాద్యత వహిస్తారు. ఈ క్రూర దురహంకార చర్యలను ఆపలేరనే సందేశం చేరకముందే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలగజేయా’లని వరుణ్ గాంధీ ట్వీట్ వ్యాఖ్య చేశారు. మంత్రిగారిని మంత్రివర్గం నుంచి తొలగించలేదు; కానీ వరుణ్, మేనకాగాంధీలను బీజేపీ కార్యవర్గం నుంచి అక్టోబర్ 7న తొలగించేశారు. ఇక అంతర్ ‘గత’ ప్రజాస్వామ్యం గురించి చెప్పేదేముంది! మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త డీన్, స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
కోర్టుధిక్కార నేరాలు ఇంకా అవసరమా?
భారత సంవిధానం ఆర్టికల్ 19(1)(ఎ)లో పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నా కోర్టు ధిక్కారం చేస్తే శిక్ష విధించే అధికారం కోర్టులకు ఉందంటున్నది. న్యాయ స్థానాల తీర్పులను సమం జసంగా విమర్శించవచ్చునని, వారికి వ్యక్తిగత దురుద్దేశాలను ఆపాదించకుండా అభిప్రాయ వ్యక్తీ కరణ చేయవచ్చునని కోర్టు ధిక్కార చట్టం వివరిం చింది. రంజన్ గొగోయ్ లైంగిక వేధింపుల కేసును వేగంగా ముగించి బాధితురాలిని బయటకు గెంటి ప్రధాన న్యాయమూర్తిని నిర్దోషిగా ప్రకటించి నప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులతో సహా చాలా మంది మౌనంగా ఉండడం కూడా భావవ్యక్తీకరణ హక్కు వినియోగమే. ఎవరిష్టం వచ్చినట్టు వారు మాట్లాడకూడదు. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వారు నోరుమూసుకుని ఉండొచ్చు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సివిల్ పర మైన తప్పిదం. న్యాయమూర్తి వ్యతిరేక తీర్పు చెప్పి నందుకు కోపించి, కోర్టులోనే చెప్పు విసరడం, తిట్టడం, అరవడం పైపైకి వెళ్లడం కోర్టు ధిక్కార నేరాలు. కోర్టుకిచ్చిన ప్రమాణ పత్రాలలో చేసిన వాగ్దానాలు అమలు చేయకపోయినా కోర్టు ధిక్కా రమే. వీటితో పాటు నిందాత్మక విమర్శలు అనే నేరం మరొకటి ఉంది. మామూలు కేసుల విచారణ నింపాదిగా దశాబ్దాల పాటు సా..ఆ..ఆ..గుతుంది. కానీ రాజ్యాంగ అధికారాలను వినియోగించి పెద్ద న్యాయస్థానాలు కోర్టు ధిక్కారం కేసులు స్వీకరిస్తే, శరవేగంగా జరుగుతాయి. దీన్ని సమ్మరీ హియ రింగ్ అంటారు. కోర్టు ధిక్కారం కేసులో పెద్దగా రుజువు చేయవలసిన అంశాలేమీ ఉండవు. నింది తుడు చేసిన వ్యాఖ్యానాలు ప్రింట్లోనో, వీడియో లోనో, సోషల్ మీడియాలోనో భద్రంగా ఉంటాయి. అబద్ధాలు చెప్పి రేప్‌లు హత్యలు చేయలేదని చెప్పు కోవచ్చేమో కాని ‘కోర్టు ధిక్కారమా నాకు తెలి యదు, నేను చేయలేదు’ అని తప్పించుకోలేరు. ప్రశాంత్ భూషణ్‌తోపాటు కోర్టుధిక్కారం కేసులో ట్విట్టర్ కంపెనీవారు కూడా నిందితులు. క్షమాపణతో వారు బయటపడ్డారు. అయితే రెండు ట్వీట్లను వారు మళ్లీ ప్రచారంలో పెట్టకూడదు. ట్వీట్ కవులు, వాట్సాప్ విద్వాంసులకు ఇచ్చిన తీవ్ర మైన హెచ్చరిక సుప్రీంకోర్టు తాజా తీర్పు. సుప్ర సిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ రెండు ట్వీట్లు ఆయనను దాదాపు జైలుకు పంపేవే. రూపాయి జరిమానాతో ఆయనకు జైలు తప్పిపోయింది. సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జీల న్యాయస్థానం ప్రశాంత్ భూషణ్ నేరం చేశారని అందుకు ఆయన శిక్ష అనుభవించాల్సిందేనన్నది. ఒకవేళ ఆ రూపాయి చెల్లించకపోతే మూడు నెలలు సాధారణ జైలు జీవితం గడపాలని నిర్దేశించింది, బయటికి వచ్చిన తరువాత మూడు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేయకూడదని నిషేధిం చింది. వీటికన్నా రూపాయి చెల్లించడం నయమని తెలిసి తమ ఉత్తర్వును వెంటనే పాటిస్తారని సుప్రీంకోర్టు చాలా కరెక్టుగా అంచనా వేసింది. కోర్టు ధిక్కారం చేసిన నేరగాళ్లందరినీ అంతే దయతో చూస్తుందని గ్యారంటీ లేదు. కొందరు ప్రముఖు లకు ఎక్కువ సమానత సమర్థనీయం అంటారు. ప్రశాంత్ భూషణ్ అన్నటువంటి మాటలే ఇదివరకు కేరళ ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ మాట్లాడారు. సుప్రీంకోర్టు యాభైరూపాయల జరిమానాతో ముగించింది. మన తెలుగు నేత శివశంకర్ కేంద్రంలో న్యాయశాఖ మంత్రి ఓ అడుగు ముందుకు వేసి ‘‘ఫెరా ఉల్లంఘించే వారికి, వధువు లను తగలబెట్టేవారికి, జమీందార్లకి మన సుప్రీం కోర్టు స్వర్గం వంటిది’’ అన్నారు. కానీ అది ఒక అభిప్రాయం, విమర్శ అనీ, కోర్టు ధిక్కారం ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు వదిలేసింది. శివశంకర్ అన్నారుకదా అని మనమెందుకు రాయకూడదని ఫేస్బుక్, ట్విట్టర్లలో టకాటకా కామెంట్లు కొడితే చకచకా కటకటాలకు పోవలసి వస్తుంది. రాజ ద్రోహ, కోర్టు ధిక్కార నేరం వంటి ఈ భయానక శాసనాలు బ్రిటిష్ పాలకులకు అవసరమయ్యాయి. బ్రిటన్‌తో సహా అనేక దేశాలు ఈ నేరాలను తీసేసి నాగరికు లయ్యారు. మనమే ఇంకా రాజభక్తితో ఈ నేరాలను బతికించి స్వేచ్ఛాజీవులుగా మరణిసు ్తన్నాం. పౌరసమాజం– ఈ అన్యాయ, బానిస, భయానక, అప్రజా స్వామిక నేర శాసనాలను సంవిధానపు పునాదుల నుంచి నిర్మూ లించేందుకు ఉద్యమాలు నిర్మించాల్సిందే. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
వడ్డీపై వడ్డీతో చిన్నవ్యాపారి నడ్డి విరుస్తారా?
ఫేస్బుక్ నిండా దేశభక్తులే ఉంటారు. పత్రికా ప్రకటనలు, ప్రసంగాలు చేసేప్పుడు ప్రభువులంతా రాముళ్లే. ఇన్ని కోట్ల మంచివాళ్లుంటే ఇన్ని ఘోరనేరాలు ఎందుకో? మంచి ప్రభువులుంటే సంక్షేమం ఎందుకు అందడం లేదో? మనం దేశ భక్తులమేనా మన రాజులు మంచి రాజులేనా? కరోనా కాలంలో అప్పులు వాయిదా వేశాం అని గంభీరంగా రాజసింహాలు సింహనాదాలు చేశాయి. టీవీలు కొన్ని డజన్ల గంటలు చర్చలు జరి పాయి. పత్రికలు ఎకరాలకొద్దీ వ్యాసాలు రాశాయి. కోవిడ్ కాలంలో రామరాజ్యం అని ఆనందభాష్పాలు రాల్చారు. చిన్నవ్యాపారుల అప్పులపై వడ్డీపై వడ్డీ వేసి వారి నడ్డి విరుస్తారా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ప్రభువులు కరోనాలో అప్పులపై వడ్డీ వసూలు వాయిదా వేశామన్నారు కదా. మొదట మూడునెలలు వాయిదా వేశారు. అంటే మార్చి 2020 వరకు వడ్డీ పైన మారటోరియం. తరువాత మరో మూడు నెలలు మొత్తం ఆర్నెల్ల పాటు మారటోరియం అన్నారు కదా. తరువాత సంగతేమిటి? ఆ వడ్డీ ఉంటుందా ఉండదా? ఈ బకాయిలను బ్యాంకులవారు తరువాత చార్జీల్లో బాదుతారా, బాదరా? వడ్డీ వదిలేస్తారా? ఈ ప్రశ్న నాది కాదు. ప్రతిపక్షాలది కాదు. లోక్‌సభ ఎంపీల సవాల్ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. సామాన్యుడి ప్రశ్నే కానీ ఎవడు వింటాడు? సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఈ ప్రశ్న లేవనెత్తారు. భారతీయ రిజర్వ్ బాంక్, ఎట్టి పరిస్థితిలో వడ్డీ రద్దు కాదు– అని చెప్పింది. దీని అర్థం ఏమిటి, తరువాత వసూలు చేస్తారని. దీనిపైన కేంద్ర ప్రభుత్వం విధానం ఏమిటి? ఈ ప్రకటనలు చేసేముందు, పెద్ద సంస్కరణ చేసినట్టు ఆర్భాటం చేసే ముందు ఈ వడ్డీపై ఆర్నెల్ల మారటోరియం అంటే ఏమిటో వివరించాల్సిన బాధ్యత లేదా? సామాన్యుడి ప్రశ్నలకు జవాబు చెప్పరు. ఆర్టీఐ కింద అడిగినా చెప్పరు. కోవిడ్ కాలంలో కోర్టులు పూర్తిస్థాయిలో పనిచేయడం సాధ్యం కాదు. వీడియో సమావేశాల ద్వారా కేసులు వినాలంటే అన్నీ వినలేము. కేవలం అత్యంత కీలకమైన సంవిధాన, విధాన సమస్య ఉంటేనే కేసును వినడానికి ఎంచుకుంటారు. మామూలుగా మారటోరియం ప్రకటించినపుడు ఆ స్కీంలోనే పొందుపరచవలసిన సామాన్యమైన సమాచారం కోసం పిల్ వేయాలి. ఆగ్రా నివాసి గజేంద్ర శర్మ పిల్ వేశారు. లాక్డౌన్లో బతకడమే కష్టంగా ఉంది. మారటోరియం కాలంలో కూడా వడ్డీ పడుతుందనీ, అప్పుతీసుకున్నవారు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయని, లాక్డౌన్ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నపుడు అప్పుతీసుకున్నవాడు చెల్లింపులు చేయడం సాధ్యం కాదని, అపుడు బతికే హక్కు భంగపడుతుం దని, అందుకని తాను కోర్టుకు వచ్చానని ఆయన కోర్టుకు నివేదించారు. సుప్రీంకోర్టు 2020 జూన్ 13న పిల్ విచారించింది, తరువాత జూన్, జూలైలలో కూడా విచారణ సాగించింది. ఆర్బీఐ జవాబు ఏమంటే.. ‘‘ఇప్పుడు వడ్డీ రద్దు కాలేదు. వసూలు చేయవలసిందే. కోవిడ్ కాలంలో ఇది వసూళ్ల ఒత్తిడి తగ్గించడానికి వాయిదా వేయడం మాత్రమే. వడ్డీ మాఫీ చేయడం లేదు, చేస్తే బ్యాంకింగ్ రంగం స్థిరత్వం దెబ్బతింటుంది. ఈ వడ్డీవాయిదా అంటే సామాన్యమైనది కాదు రెండు లక్షల కోట్ల రూపాయల సొమ్ము. అంటే ఇది మన జీడీపీలో ఒక్కశాతం. రుణం తీసుకున్నవాళ్లు రకరకాలుగా ఉంటారు కనుక ఈ డబ్బు ఎలా వసూలు చేయాలో ఆయా అప్పులిచ్చిన బ్యాంకులకు వదిలేస్తున్నాము’’ అని ఆర్బీఐ కోర్టుకు విన్నవించింది. మారటోరియంపై మీ విధానమేమిటో తెలపండి అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. జూన్ 4న మొదటి విచారణలో ఈ చర్చ జరిగింది. కేంద్రం విధానమేమిటో చెప్పడం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్ సుభాష్ రెడ్డి, ఎం ఆర్ షాలతో కూడిన బెంచ్ విచారణను రెండు సార్లు వాయిదావేసింది. తన విధానమేమిటో చెప్పకుండా ప్రభుత్వం వాయిదాలు అడిగింది. మేము ఆర్బీఐ, ఇతర బ్యాంకులతో మాట్లాడుతున్నాం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఆగస్టు 26 నాడు కూడా విధానం చెప్పలేకపోయింది. మారటోరియం కూడా 31 ఆగస్టున ముగుస్తుంది. అప్పు తీసుకున్నవాళ్లకు ఇంకా తెలియదు వడ్డీ కట్టాలా లేదా, వాయిదా పడితే వడ్డీమీద వడ్డీ వేస్తారా వేయరా అని. బ్యాంకుల వ్యాపారం విషయంపైనే దృష్టి కాని సామాన్యుల బతుకుల గురించి కరోనాలో వారి గతి గురించి పట్టించుకోరా? విధానం చెప్పకుండా ఎన్నాళ్లు దాటవేస్తారు. మీరు లాక్డౌన్ పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. రిజర్వ్ బ్యాంక్ వెనక దాక్కుం టారా, మీ వ్యాపారమే ముఖ్యం కాదు, ప్రజలకు ఊరట కలిగించడం ప్రధానం అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది తీర్పుకాదు. ఒక ప్రశ్న. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
మీరు బౌన్సర్ల వైపా లేక రోగుల వైపా?
గతవారం సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన ‘కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు’ అనే నా వ్యాసం కొందరు డాక్టర్లకు కోపం తెప్పించింది. వాట్సాప్‌లో తిట్లను నాకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అసభ్య, అసత్యప్రచారం చేయిస్తున్నారు. సాక్షిలో నా కాలమ్ ఆపేయిస్తామని బెదిరించేవారు కొందరైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయమని ఆదేశాలిచ్చేవారు ఇంకొందరు. కానీ ఎవరూ నా వ్యాసం కాపీ పెట్టడం లేదు, దాంట్లో ఫలానా మాట తప్పు అని చెప్పలేకపోతున్నారు. వ్యాసం చదివిన తరువాత ‘నిజమే డాక్టర్లపై ఒక్క నింద కూడా లేద’ని తెలుసుకుని చెప్పిన డాక్టర్లు చాలామంది ఉన్నారు. అన్ని ప్రయివేటు హాస్పిటళ్లూ చెడ్డవి కాకపోవచ్చు. కానీ అవినీతి వ్యాపారం చేసే కొన్ని చెడ్డ కార్పొరేట్ల క్రూరత్వం కనబ డటం లేదా? వారిక్రౌర్యానికి బలైన బాధిత రోగులు వందలాది మంది సాక్షిలో నా వ్యాసం ముమ్మాటికి నిజం అన్నారు. దుర్మార్గాన్ని నిలదీసే బదులు నిలదీసిన సాక్షిని, రచయితను నిందించే ముందు డాక్టర్లు, వారి సంఘం ఆలోచించుకోవాలి– మీరు రోగుల వైపా.. బౌన్సర్ల వైపా? డాక్టర్లను నిజాం కాలపు జీతగాళ్లుగా మారుస్తున్నారు కొన్ని కార్పొరేట్ వైద్య పెత్తందార్లు. వ్యాపారుల చేతుల్లో బలయ్యేవారు కొందరు, బానిసలయ్యేవారు కొందరు. అప్పులు చేసి చదువుకున్న డాక్టర్లు, వడ్డీకట్టడానికి జీతాలకోసం వారిచేతుల్లో పావులైపోతున్నారు. ఒకవైపు వృత్తిధర్మానికి కట్టుబడి కొందరు డాక్టర్లు ప్రాణాలు పోస్తుంటే బౌన్సర్లతో విపరీత బిల్లులతో రోగులను దోచుకునే కార్పొరేట్ హాస్పిటల్స్‌కు అండగా నిలబడేవారు మరికొందరు. ఈ విషయాలు వైద్యసంఘాలకు తెలియవా? తమ అనారోగ్యాన్ని లెక్కచేయకుండా వందలాది కరోనా రోగులకు చికిత్స చేసి తమ కుటుంబాల్ని ప్రాణాపాయంలో పడేసే డాక్టర్లూ ఉన్నారు, ప్రభుత్వ ఆస్పత్రులలో హక్కుల ఉల్లం ఘనలు, మరొకవైపు ప్రయివేటు వైద్యదుకాణాల్లో రోగులపై బౌన్సర్లు. వైద్యవ్యాపారంలో వస్తున్న దారుణ ధోరణులను ఎత్తిచూపడం అందరి బాధ్యత. రోగులు ఈ వ్యాపారుల చేతుల్లో నానాకష్టాలూ పడుతుంటే.. వైద్యవృత్తిలో ఉన్నవారు, వారిసంఘాలు ఈ దుర్మార్గపు వైద్య వ్యాపారాన్ని ఖండించకుండా భరించడం న్యాయమా? రోగుల బంధువులు గొడవలకు దిగకుండా ఆపడానికే కండలు పెంచిన యువకులను బౌన్సర్ల పేరుతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు నియమించుకున్నామని, చెప్పుకుంటున్న వార్తలను చదవలేదా? రోగిని హాస్పిటల్లో చేర్చేప్పుడు తప్ప ఇంకెప్పుడూ రోగుల గతి, ప్రగతి తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నదనీ, బిల్లులు కట్టడానికి తప్ప వాటి విషయంలో వివరాలు అడగడానికి డైరెక్టర్ల దగ్గరికి వెళ్లనివ్వడం లేదని, పూర్తి డబ్బు చెల్లించేదాకా శవాలు కూడా ఇవ్వకుండా బౌన్సర్లు అడ్డుకుంటున్నారనే సంఘటనలు ఈ వైద్యనేతల కంటికి కనబడలేదా? రోగులను భయపెట్టే బౌన్సర్ సమస్య గురించి రాస్తే డాక్టర్లకు, సంఘంనేతకు కోపం రావడమేమిటి? దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి. బౌన్సర్ల నియామకాన్ని, రోగులపై వారి నియంత్రణను సమర్థిస్తున్నారా? చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుందని రాస్తే వైద్యవ్యాపారులు తేలుకుట్టిన దొంగల్లా మాట్లాడడం లేదు. కానీ పురమాయించి నామీద తిట్లు, వాట్సాప్‌ల ప్రచారాలు సాగిస్తున్నారు. పంపుతున్నారు. ఎంఆర్పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకుంటామని వైద్యశాఖ మంత్రి హెచ్చరించారు. దీనికి వైద్యులు బాధ్యులని అనలేదే. హాస్పిటల్స్ నడుపుతూ లాభనష్టాలు భరించే కార్పొరేట్ హాస్పిటల్ యజమానులను ఈ ప్రశ్నలు అడగాలా వద్దా? డాక్టర్లు, ఉద్యోగులు కనుక రోగుల తరఫున అడగలేరు. కానీ కరోనాతో, ఇతర రోగాలతో, తప్పుడు చికిత్సలకు నిర్లక్ష్యాలకు బలైనవారితో, రోగుల శవాలతో వ్యాపారం చేస్తున్నవారు బౌన్సర్లను పెట్టుకుని వారి భద్రతలో అన్యాయాలు చేస్తుంటే డాక్టర్ల సంఘాలు ఏం చేస్తున్నాయి? అని ఇంకా అడగలేదు. ఇప్పుడడుగుతున్నాను. ఈ సంఘాలను ఎవరూ నిలదీయవద్దా? నాకు చికిత్స చేయబోమంటూ అసభ్య పదజాలంతో దూషిస్తారా? బౌన్సర్లతో డాక్టర్లకు, సంఘాలకు సంబంధం ఉందని భావించడం లేదు, వారి నెందుకు ఖండించలేదన్నది మొదటి ప్రశ్న. వారినెందుకు సమర్థిస్తున్నారనేది రెండో ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యవ్యాపారంలో వస్తున్న అమానవీయ ధోరణులను కూడా అరికట్టడానికి కౌన్సిల్ చర్యలు తీసుకోవాలి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, స్వచ్ఛంద సంఘం. డాక్టర్లకు, ఐఎంఏ నాయకులకు, కార్పొరేట్ వైద్య వ్యాపారులపై అదుపు ఉండకపోయినా కనీసం దారుణాలను ఆపాలి. ఖండించాలి. వైద్యవ్యాపార దుర్మార్గాలను ప్రశ్నించలేని వైద్యసంఘాలను నిలదీయాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఎమ్మెల్యేల హైజాక్ నేరం కాదా?
విశ్లేషణ నిత్యనూతన ప్రభుత్వాల స్థాపనకోసం ఎమ్మెల్యేలకు మంత్రిపదవి, కార్పొరేట్ అధ్యక్షత, లేదా నగదు లంచాలు ఇవ్వడం నేరం కాదనే రాజనీతి సంస్కరణ, నూతన శాసనాలు ప్రస్తుతం ఎంతైనా అవసరం. ఇప్పుడున్న బ్రిటిష్ కాలపు చట్టాల ప్రకారం లంచం తీసుకోవడం, ఇవ్వడం కూడా నేరమే. లంచం డబ్బెక్కువై ఇస్తున్నామా? పని కావడం కోసం ఇస్తున్నాం. అది నేరమా అనే లాజిక్ మిస్ కాకూడదు. ముందే ఏసీబీ వారికి తెలియజేసి రసాయనం పూసిన నోట్లను ఇవ్వడం, నీరు తగలగానే చేయి ఎరుపు కావడం, లంచగొండి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడం మనకు వార్తలు. ఇది లీగల్ ట్రాప్. లంచం ఇచ్చిన పౌరుడూ ఇప్పించిన పోలీసులూ, సాయపడిన వారు నేరస్తులు కారు. చట్టం అమలుకు సాయపడిన వారిని మనం సన్మానించాలి. వేరే పార్టీనుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు క్యాబినెట్ లేదా కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశ చూపడం కూడా లంచమేననీ చట్టవ్యతిరేకంగా సంతృప్తిపరచడమే లంచ మనీ అవినీతి నిరోధక చట్టం అంటుంది. రాజ్యాంగ ప్రభుత్వాలను పడగొట్టే ఈ ప్రలోభాలు లంచాలు కావని, వీటిగురించి పట్టించుకోరాదనే అభిప్రాయంలో జనం అంతా ఉన్నారు. ఆ పార్టీ చేయలేదా, మేం చేస్తే తప్పా అని దబాయిస్తారు. ఇవి నేరాలే అని చట్టం ఉన్నంత మాత్రాన దర్యాప్తు జరపాలా? రోజువారీ పనులలో అధికారులు లంచాలు తీసుకోగూడదు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకోసం కొందరు రాజీనామా చేయడానికి, పార్టీ మారడానికి లంచాలు ఇస్తే తప్పేమిటి అనేవాదాలు వినిపిస్తున్నాయి. నిరుడు కర్ణాటకలో ఇటీవల రాజస్తాన్‌లో ఎమ్మెల్యేలను వేలం పాటలో, సంతలో ఎక్కువ ధర చెల్లించినట్టు, ధర పలికి బేరసారాలు సాగినట్టు ట్యాప్ చేసిన ఆడియో టేప్‌లు విడుదల చేశారు. మందను తోలుకొచ్చిన నాయకుడికి 30 నుంచి 35 కోట్లు, మందలో వచ్చిన మహానుభావుడికి దాదాపు 25 కోట్లు ఇవ్వడానికి బేరసారాల సంభాషణల వివరాలు ప్రచురించారు. బీజేపీకి చెందిన పెద్ద నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. సంపన్నులైన రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, పారిశ్రామిక వేత్తలు డబ్బు లావాదేవీల్లో ఉన్నట్టు ఆ సంభాషణలు వివరిస్తున్నాయి. దర్యాప్తు చేస్తేతప్ప నేరాలు బయటపడవు. కర్ణాటకలో జనతాదళ్ కాంగ్రెస్ సర్కార్‌ను విజయవంతంగా కూల్చారు. కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ కేసులో తమ నాయకుల పేర్లు ఇరికించారని పెద్ద రాజకీయ నేతలకు వాదించే అధికారం పూర్తిగా ఉంది. ఆ టేప్‌లు కావాలని సృష్టించి ఉంటే అది దొంగ సాక్ష్యాలు తయారు చేసిన నేరమవుతుంది. దాన్నయినా దర్యాప్తు చేయాలి. ఎందుకు చేయరు? దానివల్ల ఎవరికి లాభం? లాభం పొందిన వారే నేరం దాచడానికి దర్యాప్తు ఆపడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానించే పని జనం చేయడం లేదు. దొరికితేనే దొంగలు. దొంగతనం మానకండి. దొరక్కుండా చూసుకోవడం అంటే దర్యాప్తు ఆపడమే. ఇదివరకు ప్రభుత్వాలు పడిపోయినపుడు బయటపడిన నేరాలు దర్యాప్తు జరపలేదు కనుక అదే అనుసరించతగిన ఆదర్శ కార్యక్రమంగా మారి తాపీగా ఇంకో ప్రభుత్వాన్ని పడగొట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల ఆఫర్లు, మంత్రి పదవుల ప్రలోభాలు. ఇతర పదవుల ఆశల ఆడియో టేప్‌లు మళ్లీ విడుదలయినాయి. సంభాషణలు వివరంగా ప్రచురితమయినా మరుగున పడిపోతాయి. ఈ విషయాలు కోర్టులకు తెలియజేస్తారా? కోర్టులముందుకు తీసుకువెళ్లరా? అక్కడే మేధావులైన న్యాయవాదుల పాత్ర మెరుస్తూ ఉంటుంది. రాజ్యాంగంలోని సవాలక్ష అంశాలు మాట్లాడతారే గానీ ఎమ్మెల్యేలను డబ్బుతో, పదవుల్తో కొంటున్నారన్న అంశాన్ని దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేయరు. స్పీకర్ హౌస్‌లో ఫలానా పని చేయవచ్చా, గవర్నర్ రాజ్‌భవన్ లాన్స్‌లో ఏం చేయాలి, శాసనసభా పక్షం సమావేశం శాసనసభా భవనంలో జరగాలా లేక ఆ పార్టీ కార్యాలయంలోనా. అనే నిశితమైన అంశాలపైన అటార్నీ జనరల్ న్యాయనిపుణులు మాట్లాడుతూ ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు సంవిధాన సంరక్షణకు పాటుపడుతూ ఉంటాయి. లంచగొండితనం నేరాన్ని మాత్రం దర్యాప్తు చేయాలనే ఆదేశాలు అక్కడినించి కూడా రానివ్వరు. అయిదు నక్షత్రాల హోటల్లో కొన్ని వారాలు బసచేయడమంటే కొన్ని లక్షల రూపాయలు రోజుకు ఖర్చుచేయడమే. చార్టర్డ్ విమానాలంటే కోట్ల ఖర్చు. ఎమ్మెల్యేలు హోట ళ్లలో స్వచ్ఛంద బందీలుగా ఉండడం ప్రజాస్వామ్యంలో సాధారణం. పార్లమెంట్లో మీడియాలో కూడా ఈ లంచాలు చర్చకు రావు. లంచం తీసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాయం చేసి, లంచం ఇచ్చిన పార్టీలో చేరి, మంత్రి అయితే నేరం కాదంటే ఏ గొడవా ఉండదు. ఎన్నికలప్పుడు ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. తరువాత నోట్లతో కూలుతాయి. లంచాలకు టేపు సాక్ష్యాలు ఎవరూ చూడరు. అనుమానాలే కాని రుజువు కావు. కానీ ప్రాథమికంగా లంచాలు ఇచ్చే ప్రయత్నం జరిగినట్టు టేప్‌లు సాక్ష్యం చెబుతున్నపుడు, ఆ నేరాన్ని ఎందుకు దర్యాప్తు చేయడం లేదు? ప్రయత్నం స్థాయిలో నిరోధించకుండా నేరం చేయడం పూర్తయిన తరువాతనైనా దర్యాప్తుకోసం చేయకుండా రాజ్యాలేలడమే రూల్ ఆఫ్ లా అవుతుందా? అనే ప్రశ్నలు పదేపదే రాకుండా ఉండాలంటే రాజకీయ లంచాలు నేరాలు కాబోవని కొత్త న్యాయశాస్త్రాన్ని కనిపెడితే ఓ పనైపోతుంది. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ట్రిగ్గర్ నొక్కిన వేళ్లను ఆదేశించిన మెదళ్లేవి?
ఇవ్వాళ నిన్న రెండు పతాక శీర్షికలు పక్కపక్కనే మన ప్రజాస్వామ్య స్వతంత్ర న్యాయ రక్షకభట బాధ్యతల గురించి నమ్మకాలు, అనుమానాలు పెంచేవి. జూలై 22: పైలట్‌కు హైకోర్టులో ఊరట. దాని పక్కవార్త, ఎమ్మెల్యేను హత్య చేసిన 11 మంది పోలీసుల నేరం రుజువు. జూలై 23: హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టుకు స్పీకర్.. విచారణ ఈరోజు. పక్కవార్త: 11 మంది పోలీసులకు హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్ష. విచిత్రమేమంటే ఈ రెండూ రాజస్తాన్ రాజకుతంత్రాలే. ఒకవైపు ఊరించే రాజకీయ యుద్ధభేరీలు, ఒకవైపు మెదళ్ల కుదుళ్లను కుదిపిలేపే పోలీసు హత్యలు. ఆవైపు ఒక్కరోజులో ఆకస్మిక అద్భుత న్యాయం. ఈ వైపు మూడున్నర తరాల కాలం పాటు (35ఏళ్లు) నేరం రుజువుకాక రాజ్యమేలిన పోలీసు ఎన్కౌంటర్ న్యాయం. ఏ దేశంలో నైనా ఇంత గొప్ప వైవిధ్యం ఉంటుందా? రాజ్యాంగ పాలనకు నిలువెత్తు అద్దాలివి. రాజస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి విఠలాచార్య (పూర్వ అపూర్వ జానపద చిత్ర దర్శకుడు) లెవల్ కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ఎడతెగని కత్తి యుద్ధాల్ని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటారు. కొనుక్కున్న ఎమ్మెల్యేలు సరిపోవడం లేదు. తూకానికి ఇంకా బరువు కావాలంటే గెహ్లోత్ వర్గం సరుకు అయిదుతారల పూటకూళ్ల మందిరంలో రక్షకభటుల రక్షణలో నిలువ చేయబడ్డారు. సచిన్ పైలట్ వారి సరుకు మరొక నక్షత్ర భోజనవసతిశాలలో భద్రంగా భద్రతా దళాల మధ్య సేదతీరుతున్నారు. ఆ విధంగా పోలీసులు మన ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంటే రాజ్యాంగ న్యాయం చేయడానికి కళ్లకు గంతలు కట్టుకుని చేత కత్తి బట్టుకుని మరోచేత్తో తరాజు పట్టుకుని పామును తొక్కుతూ (ఎక్కడ పడతారో తెలియదు) న్యాయదేవతను రమ్మని వకీళ్లు ఆవాహనచేస్తున్నారు. అటు గెహ్లాట్ ఇటు పైలట్. ఇరువురూ బరువులే. బలమైన పార్టీలు వారి వెంట ఉన్నాయి. స్పీకర్ ఏదో ఒక నిర్ణయంతీసుకునే దాకా మనకళ్లగంతలు విప్పవద్దురా నాయనా అని సుప్రీంకోర్టు పదేపదే చెప్పింది. అయినా కత్తి తిప్పుతున్నది రాజస్తాన్ హైకోర్టు. ‘‘స్పీకర్ గారూ నేను ఇంకో రెండు రోజుల తరువాత మీ సంగతి చెబుతాను అందాకా ఏమీచేయకండి ప్లీజ్’’ అని బతిమాలింది. పాతగుర్రాల తబేలా నుంచి గుర్రాలు పారిపోకుండా ఉండాలని కట్లు, ఆ కట్లు తెంపి తరలించుకుపోవడానికి ప్రయత్నాలు. మహాఘనత వహించిన రాజస్తాన్ ఎమ్మె ల్యేలను వారి శిబిరాలనుండి కిడ్నాప్ చేయడానికి చట్టాలు, రాజ్యాంగం, రక్షకభటులు, (సైన్యాన్ని ఒక్కటి వాడడం లేదేమో) అనే రకరకాల పద్మవ్యూహాలను అల్లుతున్న సమయంలో ఒక్కరోజు గడువు ఇచ్చినా బేరసారాల వ్యాపారానికి కొత్త ఊపు వస్తుందని అందరికీ తెలుసు. కానీ చేతిలో కత్తి, కళ్లకు గంతలు. కాలికింద పాము. పీత కష్టాలు పీతవి. సుప్రీంకోర్టు వారు కూడా తమ విలువైన సమయాన్ని వాడి రాజస్తాన్‌లో రాజ్యం గాన్ని రక్షించడానికి జూలై 23న ప్రయత్నిస్తామన్నారు. చివరికి గురువారం రాజస్తాన్ హైకోర్టు విచారణపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తిరిగీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. నాలుగైదు రోజులనుంచి కరోనాకన్నా గొప్ప కలకలం సృష్టిస్తున్న వార్త ఏదైనా ఉంటే అది సచిన్ పైలట్ ఆత్మనిర్భర యజ్ఞమే. నిజం చెప్పిన బుల్లెట్లు : మరొకవైపు గొంతుచించుకుని అరిచే మీడియా కథనాలు అల్లే కథ 1985 పోలీసు హత్యాకాండ. రాజామాన్‌సింగ్ ఆనాటి భరత్పూర్ రాజు. భరత్పూర్ రాజ్యపతాకాన్ని కాంగ్రెస్ నాయకులు అవమానిస్తుంటే రాజామాన్‌సింగ్ ఆవేశ పడి ఫిబ్రవరి 20, 1985న రాజస్తాన్ ముఖ్యమంత్రి శివచరణ్ మాథుర్ ఎన్నికల సభావేదిక వైపు తన మిలిటరీ వాహనంతో శరవేగంగా దూసుకువచ్చి అక్కడ ఆగిన హెలికాఫ్టర్‌ను ఢీకొన్నాడట. హత్యాప్రయత్నమని కేసుపెట్టారు. మరునాడు ఫిబ్రవరి 21న పోలీసుస్టేషన్లో లొంగి పోవడానికి ఠాకూర్ హరిసింగ్, ఠాకూర్ సుమర్ సింగ్‌తో కలిసి వెళ్తున్నారు. పకడ్బందీగా అల్లిన కుట్ర ప్రకారం డిఎస్పీ కాన్ సింగ్ భాటి అతని అనుచర పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురినీ చంపేశారు. ఆనాడది ఎన్ కౌంటర్. తమపై కాల్పులు జరుపుతూ ఉంటే ఎదురు కాల్పులు జరిపామని పాతకట్టుకథే. మాన్సింగ్ వీపులో వెనుకనుంచి దిగబడిన బుల్లెట్లు నిజం చెప్పాయి. కోర్టు నిజం వినిపించుకున్నది. మరునాడు ముఖ్యమంత్రి రాజీ నామా చేయడం 1985నాటి విలువ. 35 ఏళ్లకైనా ఎన్ కౌంటర్ హత్య రుజువుకావడానికి కారణం హత్యకేసు పెట్టడమే. ఇప్పుడు కేసు పెడుతున్నారా? ఇందులోకూడా హైకోర్టు సుప్రీంకోర్టుల్లో తుది న్యాయం ఎన్నేళ్లకు, ఎవరికి దక్కుతుందో తెలియదు. అయినా ట్రిగ్గర్ నొక్కిన పోలీసు వేళ్లను ఆదేశించిన మెదళ్లు కోర్టులకు దొరుకుతాయా? నక్కలు, తమ జిత్తుల రాజకుట్రలకు వకీళ్లను, కోర్టులను, పోలీసులను వాడుకుంటారనే పాఠం అర్థమవుతున్నదా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఒకే నేషన్ ఒకే రేషన్, ఒకే జీవన్ ఒకే వైరస్
కరోనా వచ్చినా ఎవరైనా బతికి ఉన్నారంటే అది సర్కారు వారి కరుణ కాదు. రోగ నిరోధక శక్తి వారిలో ఉందని, అది పెరిగి రోగకారకశక్తులను తరిమికొట్టిందని అర్థం. కరోనా సోకి ఎవరైనా చనిపోయారంటే దానికి కారణం వారికి రోగ నిరోధక శక్తి కన్నా బలమైన రోగం ఉందని అర్థం. కరోనా చంపిందా లేక తగిన ఆరోగ్యం లేక మరణించారా అని పాలకులు ఆలోచించడం లేదు. మందులమ్ముకునే వ్యాపారుల ఆలోచనలకు, ప్రభుత్వాలకు మధ్య కొంతైనా తేడా ఉంటే బాగుండేది. కరోనా సోకకపోయినా, రోగ నిరోధక శక్తి తగ్గకపోయినా చనిపోయేవారు కూడా ఉన్నారు, వారే భయపడి చచ్చేవారు. వరంగల్లులో ఒక డాక్టర్ ఉండేవారు. చాలా మంచి డాక్టర్. కాని తను చికిత్స చేయలేడనుకుంటే ‘‘ఇదిగో నీకు పెద్ద రోగం వచ్చింది. పెద్దాస్పత్రికి పో. లేకపోతే చచ్చిపోతవు. నేను కుదిర్చే జబ్బుకన్నా నీ జబ్బు పెద్దది. పో’’ అని మహాత్మాగాంధీ స్మారక హాస్పిటల్‌కు తరిమేవాడు. మనం ఇప్పుడు హైదరాబాద్‌లో అందరినీ గాంధీ హాస్పటల్‌కు తరుముతున్నాం. మందుల కోసం, చికిత్సలకోసం ఎదురు చూస్తున్నాం. ఇది వాడితే పది నిమిషాల్లో కరోనా మాయం అనే వీడియోలు విరివిగా చూస్తున్నారు. ఇది వాడకపోతే చస్తావు అంటే అవి కొనుక్కుంటున్నాం. ఏ ఇంట్లో చూసినా కుప్పలు తెప్పలుగా మందులు. ఆయుర్వేదం, యునానీ, హోమియో, అలోపతి. అంతా అంతే. కానీ రోగం రాకుండా ఏంచేయాలి? కరోనా తగిలితే దాన్ని తిప్పికొట్టే నిరోధక శక్తి ఏ విధంగా పెంచాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. ఔషధ వ్యాపారులకు ఎట్లాగూ ఉండదు. ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రికి ఇటువంటి ఆలోచన వస్తే బాగుండేది. రోగ నిర్ధారక పరీక్షలు చేయాలని రిట్ వేస్తే హైకోర్టు రిట్ ఇస్తే గిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోకపోతే ప్రభుత్వం పరీక్షలు చేస్తుంది లేకపోతే లేదు. కరోనా వైరస్ మహమ్మారిగా వ్యాపించడం మన లద్దాఖ్ సరిహద్దులో చైనా దురాక్రమణ అంతటి భయానక విషయం. మనకు చైనా దాడిలో 20 మంది మరణించడం అర్థమయిందో లేదో గాని కరోనా యుద్ధంలో మన సైనికులు మరణిస్తున్న సంగతి, చాలామంది మరణించడానికి సిద్ధంగా ఉన్న సంగతి గుర్తు రావడం లేదు. వేల కోట్ల రూపాయలు పోసి ఆయుధాలు, యుద్ధ విమానాలు, తదితర సామగ్రి కొంటున్నాం గాని, కరోనా తదితర వ్యాధినిరోధక పోషక బలాన్ని పెంచుకోవడానికి, జనాన్ని రక్షించడానికి ఎవరైనా ఆలోచిస్తున్నారో లేదో కనిపించడం లేదు. పోషకాల స్థాయి పెంచడం, జీవన ప్రమాణాలు పెంచడం, ప్రజారోగ్యాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత, ఆ విషయాన్ని రాజ్యం గుర్తించి తీరాలని ఆర్టికల్ 47లో రాజ్యాంగం మార్గదర్శకాన్ని రాసింది. తెలంగాణ హైకోర్టు కూడా చెప్పింది. వెంటనే ఇవి కేవలం సూచనలే.. పాటించే పని లేదని వాదించడానికి లాయర్లు తయారుగా ఉంటారు. డబ్బులిచ్చిన వాళ్లకోసం లా ను ఏవిధంగానైనా ఎటైనా వంచగల ప్రతిభను మన ఆంగ్లేయుల నుంచి వారసత్వంగా ఒంటబట్టించుకున్నాం. ఇది మన డీఎన్ఏలో జీర్ణించుకుపోయిన అసలు వైరస్. హక్కుల్లో రాయడం సాధ్యం కానివి ఇక్కడ మార్గదర్శకాల్లో రాస్తున్నాం నాయనా, ‘అమలు చేయడానికి వీల్లేదు. కోర్టులు అడగొద్దు అనే చెత్త వాదనలు చేయకండి. బుద్ధి జ్ఞానం ఉన్న ప్రభుత్వాలు కనుక ఉంటే వారు ఈ డ్యూటీ పాటించాలని’ రాజ్యాంగం పార్ట్ 4 ఘంటాపథంగా చెబుతున్నది. మనం వింటే కదా. మన ప్రధాని మోదీకి మనదేశంలో చాలామందికి ఆకలి ఉందని, పేదరికం ఉందని, తిండి లేదని, అర్థమైనట్టుంది. నవంబర్ దాకా మన నేషన్‌లో రేషన్ ఉచితంగా ఇస్తానని మరో ప్రాస ప్రామిస్ చేశారు. శుభం. అసలు తిండే లేని వాడికి పోషక పదార్థాలు ఎక్కడినుంచి వస్తాయి అనేది ఒక పాయింట్. తిండి సరే.. పోషక పదార్థాల సంగతేమిటి? ఇది రెండో పాయింట్. ఉచితంగా కాకపోయినా కొనదగిన ధరలకు పోషక పదార్థాలు సామాన్యుడికి అందుబాటులో తేవాలంటే కాస్త ప్లానింగ్ ఉండాలి. రేషన్ ఫ్రీగా ఇవ్వడానికి డబ్బు కేటాయిస్తే చాలు. విడుదల చేయవలసి వచ్చేనాటికి లెక్కలు చూసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్‌ను ప్రింట్ చేసిమ్మంటే ఇస్తుంది. ఒక చిన్న పాప చాక్లెట్లడిగింది. రోజూ చాక్లెట్‌కు డబ్బెక్కడినుంచి వస్తుందో అని వాళ్లమ్మ మందలించింది. ‘ఎక్కడినుంచి అంటే ఎటిఎం నుంచి. నువ్వు ఎన్ని సార్లు తేలేదు. నెంబర్లు నొక్కితే నోట్లు రావా’ అని తెలివైన పాప జవాబు. మనకు రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం వంటిదే కదా? కాగితాలే కదా ప్రింట్ చేస్తే సరిపోదా? ఈ మాత్రం చాలా మంది ఆర్థిక మంత్రులకు తెలియదేమో. కోట్లాది వలస కార్మికులకు రేషన్ కార్డు లేదని మళ్లీ ప్రధానికి ఎవరూ గుర్తు చేయలేదు. రేషన్ కార్డుంటే ఒక నేషన్ ఒక రేషన్ ఇస్తారు. మరి ఒక రేషన్ కార్డు కూడా లేనివాడు సొంత నేషన్‌లో ఉన్నట్టా లేనట్టా? రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ఈ నేషన్‌లో రేషన్ కార్డు లేని వాడికే బతికే హక్కు లేనట్టా? వాడిది కూడా ఒకే నేషన్ ఒకే రేషన్ ఒకే జీవన్ కదా? ఆధార్ కార్డు, రేషన్ కార్డూ, స్మార్ట్ ఫోన్లో సేతు యాప్ లేని వాడికి చావడమే బాధ్యతా? ఔషధాలమ్ముకుందామా లేక రోగాన్ని ఎదుర్కొనే పోషకాహార బలం మన జన సైనికులకు ఇచ్చి చైనాను, వైరస్‌ను బార్డర్లోనే నిలువరిద్దామా? మన జాతిని బలోపేతం చేసే రాజనీతి మనకు రానే రాదా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఈమెయిల్: madabhushi.sridhar@gmail.com -
తెలంగాణకు అన్యాయంపై ఎలుగెత్తిన వాణి
ఆయన పేరు బారు పాండురంగ విఠల్. ప్రముఖ విద్యావేత్త, ప్రొఫెసర్ రామనర్సు పుత్రుడు. ప్రముఖ రచయిత సివిల్ సర్వెంట్ సంజయ్ బారు తండ్రి. తన 93 ఏట తుది శ్వాస విడిచేదాకా దేశం జాతి ప్రజ అని ఆలోచించిన బారు పాండురంగ విఠల్ ఈ దేశ ఆర్థిక రంగం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రం మరిచిపోలేని మహనీయుడు. దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక కార్యదర్శి (1972–82). ఒక ముఖ్యమయిన రాజ్యాంగ సంస్థగా ఆర్థిక సంఘం గుర్తింపు పొంది పనిచేసే రోజుల్లో ఆయన పదో ఆర్థిక సంఘం సభ్యుడు (1992–94). తను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా, పదవ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఉన్నపుడు సభ్యుడిగా విశేష సేవలందించిన విఠల్‌ను ది మెమోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కాసుబ్రహ్మానందరెడ్డి అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం పూర్వాపరాలు, లోపాలు లాభాలు, తెలంగాణకు జరిగిన అన్యాయాలు అన్నీ కంఠతా తెలిసిన వ్యక్తి, వివేకవంతమైన పరిష్కారాలు చూపగల మేధావి. ‘ది ఇంపార్టెన్స్ ఆఫ్ బిపిఆర్ విఠల్’ అని ఆయన శిష్యులు ప్రచురించిన 550 పేజీల ఉద్గ్రం«థం ఆయన వ్యక్తిత్వానికి సమగ్రమైన దర్పణం. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వై వేణుగోపాల్ రెడ్డి ఆర్థిక వేత్త విఠల్‌ను గురువుగా గౌరవించేవారు. ఆర్థికరంగం, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం, భౌతికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం, రాజకీయశాస్త్రం వంటి అనేక రంగాలలో సమగ్రమైన అవగాహన, ఆలోచనలు ఉన్న మేధావి విఠల్ అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ఐఏఎస్ అధికారి దువ్వూరి సుబ్బారావు ప్రశంసించారు. ఒక గురువు, శ్రేయోభిలాషి, తనను అభిమానించే ఒక ఉత్తముడిని కోల్పోయానని బాధపడ్డారు. సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అనే సంస్థకు రూపకల్పన చేసి, నెలకొల్పి, నిలబెట్టిన దార్శనికుడు విఠల్. బోధన పరిశోధన కలిసి సాగాలనే ఉద్దేశ్యంతో విఠల్ ఈ సంస్థను తీర్చిదిద్దారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆయనకు నివాళులర్పించారు. గాంధీ ప్రభావంతో విద్యార్థిగా తన కళాశాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, తరువాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర వీరుడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడే అయినా తెలంగాణలో స్థిరపడి, హైదరాబాద్‌లో ఉర్దూ మీడియం బడిలో చదువుకున్నాడు. నిజాం కాలేజి విద్యార్థి. 1949లో సివిల్ సర్వీసులో చేరి 1950లో ఐఏఎస్ అధికారి అయినారు. బారు పాండురంగ విఠల్ తండ్రి ప్రొఫెసర్ రామనర్సు వరంగల్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆ తరువాత రామనర్సు ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆకాలంలో రావాడ సత్యనారాయణ వైస్ చాన్సలర్‌గా ఉన్నారు. వీరు ఇరువురు తెలంగాణ అస్తిత్వ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఆంధ్ర మేధావులు. వారి చిత్తశుద్ధి, జనసంక్షేమపరమైన ఆలోచనలు సాటిలేనివి. తెలంగాణను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రూపొందించడం సరైన ప్రయోగం కాదని, అందువల్ల తెలం గాణ చాలా నష్టపోతుందని ఆనాటి రోజుల్లోనే వ్యతిరేకించిన ఆర్థిక శాస్త్రవేత్త విఠల్. వందల కోట్ల రూపాయల మిగులు ధనం ఉండిన సంపన్నరాష్ట్రం తెలంగాణ. అప్పట్లో పన్నుల ఆదాయం కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుతో ఈ విలీనం సరైన చర్య కాదని ఆయన వివరించేవారు. అంతే కాదు 1969లో తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పుడు తెలంగాణకు ఏవిధమైన అన్యాయాలు ఎదురైనాయో రుజువులతో సహా అంకెలన్నీ జనం ముందుంచిన చిత్తశుద్ధి కలిగిన అధికారి. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం అయిదు సూత్రాల పథకాన్ని రూపకల్పన చేసింది బీపీఆర్ విఠల్ గారే. అయితే పెద్దమనుషుల ఒప్పందం లాగే దీన్ని కూడా పాలకులు చెత్తబట్టలో వేశారు. ఆ తరువాత ఆయనే ఆరుసూత్రాల పథకం కూడా కల్పించారు. దానికి కూడా గండి కొట్టారు. 1984లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినపుడు కూడా తెలంగాణకు న్యాయం చేయడానికి ఎన్టీ రామారావును ఒప్పించి 610 జీవో తెచ్చిన ఉత్తముడు, చేతులెత్తి మొక్కాల్సిన వ్యక్తి విఠల్ అని ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి ప్రశంసించారు. అయితే చంద్రబాబునాయుడు పాలనలో తెలంగాణ వ్యతిరేక రాజకీయాలకు ఆ 610 జీవో కూడా బలైపోయింది. 1994లో తెలంగాణ ఉద్యమం మళ్లీ మొదలైంది. అప్పుడు తెలంగాణ మిగులు నిథులు ఎన్నో ఉండేవి. అవేమయ్యాయి? అని సవాలు చేస్తూ ఒక పుస్తకం రాశారు విఠల్. ఆంధ్ర మూలాలు ఉన్నప్పటికీ తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక అధికారిగా అనేక ప్రయత్నాలు చేసి అవన్నీ విఫలం అయినప్పుడు తెలంగాణా వేర్పాటు ఉద్యమం సరైనదని భావించి ఉద్యమానికి మద్దతు నిచ్చిన ఉన్నతమైన వ్యక్తి బీపీఆర్ విఠల్. గుడ్డిగా ఫైళ్ల మీద సంతకాలు చేస్తూ రాజకీయనాయకుల రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు తల ఊపడం కాకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయాలన్న తపన ఉన్న కొందరు సివిల్ సర్వీసు అధికారుల్లో బీపీఆర్ విఠల్ ముఖ్యులు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కాలీకాలని వాత, చాలీచాలని న్యాయం
వాక్ స్వాతంత్య్రం విలువ చాలా మందికి అర్థం కాదు. అందరూ ఏదో లాభంకోసమే విమర్శిస్తున్నారనుకునే సోమరుల మెజారిటీ నానాటికీ పెరుగుతున్నది. దారుణంగా ఒక అమాయకురాలిని తమ పోలీసుస్టేషన్లో రేప్ చేసిన పోలీసుల నేరం రుజువు కాలేదని 1980లలో సుప్రీంకోర్టు మధురా కేస్ అని పిలువబడే కేసులో విచిత్రమైన తీర్పు చెప్పింది. ప్రేమిస్తానని చెప్పి ఒక బాలికను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపి, ఆ బాలిక మీద పోలీసులు అత్యాచారం చేసిన కేసు అది. వారికి కింది కోర్టులో శిక్ష పడింది. కాని ఆ శిక్ష తప్పు అని సుప్రీంకోర్టు వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అత్యాచారం చేస్తుంటే ఎందుకు అరవలేదు? మౌనంగా ఉందంటే ఆమె కూడా అంగీకరించినట్టే కదా అని వ్యాఖ్యానిస్తూ ఇచ్చిన ఆ తీర్పు ఎంత అన్యాయమైందో ప్రొఫెసర్ ఉపేంద్ర బక్షీ తన మిత్రులతో కలిసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దుర్మార్గపు రేప్ చట్టాల పట్ల దారుణమైన అన్వయం చేసే తీర్పుల పట్ల ప్రజల్లో నిరసన పెల్లుబికింది. చివరకు ఆ ఉద్యమం రేప్ చట్టాన్ని చాలావరకు మార్చేసింది. ప్రొఫెసర్ మనకేం పోయిందనుకున్నా, కోర్టు ధిక్కారం అవుతుందని భయపడినా, మరే కారణంతోనో భజన చేసినా ఈ మార్పులు జరిగేవి కావు. న్యాయానికి విరుద్ధమైన అన్వయం చేయడానికి సిగ్గుపడే పరిస్థితి ఆ విమర్శ వల్ల వచ్చింది. వాక్ స్వాతంత్య్రాన్ని నిర్భయంగా వాడుకుంటేనే ఉన్నతాధికారంలో ఉన్నవారు అప్పుడప్పుడైనా సిగ్గుపడవలసి వస్తుంది. మనం కరోనాతో భయపడిపోతున్నాం. కుటుంబ సంబంధాలు, స్నేహాలను కరోనా నిర్దయగా తెంచి వేస్తున్నది. ఒకరికొకరం దూరమవుతున్నాం. కరోనా పేదలకు నరకం, వలసకూలీలకు మరణం, నియంతలకు స్వర్ణయుగం. మరి ధర్మం, న్యాయం సంగతేమిటి? ధర్మం అంటే సంవిధాన పాలనా ధర్మం. న్యాయం అంటే నిష్పక్షపాత, నిర్భయ, నిర్ద్వంద్వ, స్వతంత్ర న్యాయ నిర్ణయం. దానికి నిజాయితీ ప్రాణం వంటిది. సుప్రీంకోర్టు ఇటీవల ఒక మంచి న్యాయమైన తీర్పు ఇచ్చింది. లాక్డౌన్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మైళ్లదూరాలు నడుస్తూ భరతమాత హైవేలకు నెత్తుటి పాదాలు అద్దిన వలస కార్మికులకు వెంటనే ఉచిత రవాణా, ఉచిత భోజన, ఉచిత ఆవాస సౌకర్యాలు కలిగించాలని సముచిత నిర్ణయం తీసుకుంది. చాలా ఆలస్యమైనప్పటికీ అవసరమైన నిర్ణయం. అంతకుముందు అనేక సందర్భాలలో పిల్లను నిరాకరిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు, ప్రభుత్వం పక్షాన ప్రమాణం చేసి మరీ చెప్పే అవాస్తవాలను నమ్మి ఆదేశాలు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం మానవీయంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని, కరోనా వైరస్ వంటి క్లిష్టసమయంలో మానవత్వాన్ని మించిన న్యాయం లేదని, చాలా హైకోర్టులు ఎంతో హుందాగా వలస కార్మికుల పట్ల దయచూపాలని అనుభవం ఉన్న న్యాయవాదులు ఆవేదన చెందారు. చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకుని, వాక్యాలు నిర్మించి సుదృఢమైన విమర్శ రంగరించి లేఖ రాశారు. వారికి జోహార్లు. న్యాయవాదులకు పదవులుంటాయి, పదవీకాలాలు ఉంటాయి, విరమణలు ఉంటాయి. ఒత్తిడులు భయాలు కూడా ఉంటాయి. ఈ మధ్య భయాలు పెరిగాయి. న్యాయవాదులు స్వతంత్ర వృత్తిగల వారు. స్వతంత్ర ప్రవృత్తి గలవారు కూడా అయితే చాలా బాగుంటుంది. కాని వారికి కూడా చాలా కష్టాలుంటాయి మరి. అయినా ఎవరికీ భయపడకుండా వారు రాసిన లేఖ కదిలించింది. అంతకు ముందు అరడజను హైకోర్టు న్యాయస్థానాలు రాష్ట్రాలను మందలించాయి. వలస కూలీల గురించి పట్టించుకొమ్మని ఆదేశించాయి. కాని ప్రభుత్వాలు ఏం చేశాయో తెలుసా. హైకోర్టులను తప్పబట్టాయి. ఏమనుకుంటున్నారు మీరు సమాంతర ప్రభుత్వం నడుపుతారా అని కోపించాయి. దానికి సుప్రీంకోర్టు జవాబిస్తూ హైకోర్టులు సక్రమంగా, రాజ్యాంగ ధర్మబద్ధంగానే వ్యవహరించాయని మద్దతు పలకడం శుభ పరిణామం. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అన్యాయం ఒకటి మనం తప్పనిసరిగా గుర్తించాలి. సెక్షన్ 51 డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద సంక్షోభ కాలంలో ప్రభుత్వ ఆదేశాలు (ఇక్కడ లాక్డౌన్ ఆంక్షలు) ఉల్లంఘించినందుకు ఏడాదిపాటు జైలుకు పంపే అధికారం ఉంది. ఆ సెక్షన్ కింద వలస కార్మికులమీద ప్రాసిక్యూషన్ మోపాయి. తిండి లేదు, పని లేదు, ఉన్నచోటి నుంచి తరిమేస్తున్నారు, రైళ్లు, బస్సులు లేవు. నడిచిపోదామంటే కేసులు, రాష్ట్రం దాటితే పక్క రాష్ట్రం వారు రానివ్వరు. కేసులు పెట్టే వారు, కొట్టే వారు, గుంజీలు తీయించేవారు, మోకాళ్లమీద కూచోబెట్టేవారు, జైల్లోకి నెట్టేవారు. ఇది ప్రజాస్వామ్యమా? వీరు పాలకులా? ఇవన్నీ మానేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా ఆలస్యం తరువాత కాలీకాలని వాత, చాలీచాలని న్యాయం అనే విమర్శలకూ అవకాశం ఉన్నా రెండు మంచి ఆదేశాలిచ్చింది అగ్రన్యాయస్థానం. ధర్మం కోసం కంకణం కట్టుకున్న జాతీయ దేశోద్ధారకులనుకునే పాలకులు వలసకూలీలపై ప్రాసిక్యూషన్ మోపినపుడు వారి నిజస్వరూపం తెలుసుకోకపోతే అంతకన్నా గుడ్డితనం మరొకటి ఉండదు. అటువంటి పౌరులకు వెన్నెముక ఉందో లేదో ఎక్స్‌రే తీయాలి. ఎవ్వరినీ ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ ‘‘మహాఘనత వహించిన డీజీపీలూ మీ పోలీసులకు చెప్పండి. జనం పట్ల అమానుషంగా ప్రవర్తించకండి’’ అని చెప్పింది. పాలకులూ, పోలీసులూ వింటున్నారా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఏడిపించే కొత్త ఏడు చేపల కథ
లాక్డౌన్ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ ప్రాణాలర్పిస్తున్న కార్మికులు వారు. ఇక్కడ రాజ కీయం కాదు, రాజ్యాంగాన్ని చూడాలి. పార్టీని కాదు, పాలకుల్ని అడగాలి. చట్టాల్ని కాదు, చట్టుబండలైన మానవత్వాన్ని అడగాలి. ప్రాణాంతకమైన నేరంచేస్తే, రుజువుచేసి ప్రాణం తీయడమే శిక్ష అని భావించినప్పుడు తప్ప మరే రకం గానూ ప్రాణం తీయవద్దని ఆర్టికల్ 21 జనం ప్రాణాలకు భరోసా ఇచ్చింది. అడుగడుగునా అరికాళ్ల రక్తపు మడుగులతో తడిసిపోతూ రాజ్యాంగమా ఉన్నావా అని అడుగుతున్నది. ఇది మన నాగరికత వేసిన కొత్త ముందడుగు అనుకొని మురిసిపోదామా లేక నిలదీసి అడుగుదామా? వలస కార్మికులను ఏడిపించే కొత్త ఏడు చేపల కథ. మొదటి చేప: అందరికన్నా ముందు, కరోనాకు విరుగుడు వ్యూహం లాక్ డౌన్ అని ప్రకటించిన వలస కూలీల జీవ రాశి ఉందనే విషయం గుర్తులేదు, అదే ఎండని మొదటి చేప. పత్రికలు టీవీలు గాడాంధకార కాంతి చిత్రాలు చూపిస్తున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్ పురుషోత్తములు నిట్టూరుస్తున్నారు. పిల్లను చెత్తబుట్టలో వేస్తు న్నారు. కొత్తవి పడుతున్నాయి. రెండో చేప: జనవరి 30న కరోనా తొలి బలితీసుకున్నది. ఓవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తున్నా మార్చి 13న మనం ఇదేమంత ఎమర్జెన్సీ కాదన్నాం. ప్రధాని పిలుపు మేరకు మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటించాం. వలసకూలీలకు బతుకు భయమేసింది. నాలుగు గంటల నోటీసుతో భారత జాతీయ జనతా అష్టదిగ్బంధనం మార్చి 24న ప్రకటించారు. కోట్లాది వలస కూలీలు భవిష్యత్తు ఆలోచనకు నాలుగ్గంటలు, ప్రమాదమేమీ లేదనే హామీకి, దేశవ్యాప్తలాక్ డౌన్ కు మధ్య కేవలం రోజులు. మూడో చేప: వలస కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. తిండి, డబ్బు లేదు. యాజమాన్యాలు పూర్తి జీతం ఇవ్వాలని ప్రభుత్వం ఆజ్ఞాపించింది. అప్పటికే పని చోటుకు చాలాదూరమైపోయారు. రెండింతలు రేషన్ ఇస్తామన్నారు మార్చి 26న. వారిలో చాలా మందికి రేషన్ కార్డే లేదు. ప్రజాపంపిణీలో లేని 8 కోట్ల పేదలకు తిండి పదార్థాలు ఇస్తామని లాక్ డౌన్ 50వ రోజున ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎక్కడున్నారో తెలియని 8 కోట్లమందికి తిండిగింజలు ఇవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. నాలుగో చేప: శ్రామిక రైళ్లన్నీ వలస కూలీలకే. అందమైన పేరు. కాళ్లరిగేట్టు నెత్తురోడేట్టు తిరుగుతున్న కూలీలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఏప్రిల్ 29 న ప్రకటించింది ప్రభుత్వం. కూలీలు బయలుదేరిన రాష్ట్రం, చేరవలసిన రాష్ట్రం సమష్టిగా కోరితేనే రైళ్లిస్తామన్నారు. ఎవరు సమన్వయం చేస్తారు? కొన్ని రాష్ట్రాల వారికి కూలీలను బయటకు పంపే ఉద్దేశం లేదు. రాజకీయంగా నువ్వంటే నువ్వని తిట్టుకోవడానికి కొత్త సాకు దొరికింది. 58 రోజుల తరువాత వారి ప్రయాణాల సమన్వయానికి ‘జాతీయ వలసకూలీ సమాచార వ్యవస్థ’ను కేంద్రం ప్రకటించింది. అయిదో చేప: వలసకూలీలు హాయిగా సొంతూరికి రైల్లో పోవచ్చు. కాని కరోనాలేదని తేలిన తరువాతే. ఎవరిస్తారీ సర్టిఫికెట్? ఎంతిస్తే ఇస్తారు? ఆన్లైన్ ఫారం నింపాలట.ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాత దానికేమైందో తెలియదు. ఎక్కడికి వెళ్లాలి? ఇదంతా లాభం లేదని మళ్లీ నడక ప్రారంభించారు. ఆరోచేప: మోదీ ప్రభుత్వం 85 శాతం రైల్వే చార్జీలు భరిస్తాం అని చెప్పింది. ఎంత ఉదారత? రైల్వే పూర్తి చార్జీలు గోళ్లూడగొట్టి మరీ వసూలు చేసింది. ఎంత ఆర్థిక క్రమశిక్షణ? 2011 జనాభా లెక్కల ప్రకారం వలస కూలీలు 5 కోట్ల 60 లక్షలు. అసలు సంఖ్య ఆరున్నరకోట్లు. వీరంతా వెనక్కి రావడానికి రూ. 4,200 కోట్లు కావాలట. ఎవరిస్తారు– ఏ లాభమూ లేకుండా? ఏడో చేప: రైల్వే శాఖ 15 లక్షల మంది వలస కూలీలను తరలించామని సగర్వంగా చెప్పుకున్నది. మిగతా ఆరుకోట్ల 35 లక్షల సంగతేమిటి? వారే రోడ్ల మీద నడుస్తున్నది. పిల్లలను భుజాల మీద మోసుకుని, ముసలాయనను చక్రాల సూట్‌కేస్‌మీద, గర్భవతైన భార్యను చక్రాల చెక్కమీద, ఎందుకు వందల మైళ్లు లాక్కుపోతున్నారు? ఈ మధ్యలో కేంద్రప్రభువులు రాష్ట్రాలకు మళ్లీ ఉత్తర్వులు–‘రోడ్ల మీద కూలీలను నడవనీయకండి’ అని. ఉత్తరప్రదేశ్ కూలీలు రాష్ట్రం హద్దులు దాటడానికి వీల్లేదని ఉత్తర్వులు వేసింది. ఒక జిల్లాలో స్థానికులు కూడా వారికి సాయం చేయరాదని ఆదేశించింది. వలస కూలీలు ఓటర్లు కారా? లేక వారికి హక్కులు లేవా? వాళ్లను ఎవరు నడవమన్నారు? వాళ్లు అలా నడిచి వెళితే మేమేం చేయగలం అని అంటారా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. మనం మనుషులమేనా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ (madabhushi.sridhar@gmail.com)