
జీవితాలను మార్చేది పుస్తకమే
వేయేళ్ల కిందటే అందరికీ తెలుసుకునే హక్కు ఉందని చెప్పిన సంస్కర్త ఈ సువిశాల భారతదేశమంతా నడిచి హిందూ మతాన్ని సంస్కరించి ఉద్ధరించిన జగద్గురువు రామానుజుడు.
అవినీతి మీద పోరాటానికి నడుం కట్టిన పౌర సైనికుడే, కాని ఒక దశలో ప్రాణాలు తీసుకునేంత నిరాశకు లోనై నాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్ దుకా ణంలో వేలాడుతున్న పుస్తకం అట్టమీది బొమ్మ ఆయనను అటు మళ్లించింది. చదివితే బతికి పోరాడాలనే ఉత్తేజం దొరికింది. నిరాశను జయించిన ఆ సైనికుడు అన్నా హజారే. అట్టమీది బొమ్మగా ప్రేరణనిచ్చింది స్వామీ వివేకానంద.
స్వార్థం, ఆశ లేకుండా సలహా ఇచ్చి, చదివితే చాలు మార్గం చూపేది పుస్తకం. చట్టంతో సంబంధం లేకుండా విద్యావంతుడిని చేసేదీ, హక్కులతో నిమిత్తం లేకుండా సమాచారం ఇచ్చేదీ పుస్తకం. పుస్తకాలు కేవ లం గ్రంథాలయాలకూ, రీడింగ్ రూమ్‌లకూ పరిమితం కారాదు. ఎంతకూ రాని రైళ్ల కోసం బస్సుల కోసం ఎదురుచూసే స్టేషన్లలో పత్రికలు మ్యాగజైన్లే కాదు, మంచి పుస్తకాలు కూడా ఉండాలి. జనం కొని చదవాలి. గొప్ప రచనలను ప్రత్యేకంగా పెద్ద అక్షరాలలో, తక్కువ పేజీలలో సంక్షిప్త పరిచయాలతో ప్రయాణపు పుస్తకాల రూపంలో అందుబాటులోకి తేవాలి.
పాతతరం కథా నాయకుడు చిత్తూరు వి.నాగయ్య నటించిన త్యాగయ్య, వేమన, పోతన సినిమాలు చూసి ఒక బాలుడు చలించి ముమ్మిడివరం బాలయోగిగా చరిత్రలో నిలిచి పోయాడు. చిన్నప్పుడు ఒక వక్తృత్వ పోటీలో మొదటి స్థానంలో నిలిచినందుకు ‘సిద్ధపురుషులు’ అనే చిన్న పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అందులోని పది పన్నెం డు కథలతో ఒక జీవిత చిత్రం రామానుజుడిది. ముక్తిని సాధించే మూల మంత్రం నేర్చుకోవడం కోసం ఎంతో దూరాన ఉన్న ఒక గురువుగారి ఆశ్రమానికి ఓపికతో, పట్టువదలకుండా 18 సార్లు ప్రయాణం చేస్తాడాయన.
ప్రతిసారీ ఏదో ఒక సాకుతో మంత్రం నేర్పడాన్ని వాయిదా వేస్తుంటాడా గురువుగారు. చివరకు ఈయన పట్టుదలకు మెచ్చి అష్ఠాక్షరీ మంత్రం ఉపదేశిస్తూ, ‘ఇది రహస్యం ఎవరికీ చెప్పకు, చెబితే నరకానికి పోతావు!’ అని హెచ్చరిస్తాడు. రహస్యంగా ఉంచుతానని ప్రమా ణం కూడా చేయిస్తాడు. కాని వెంటనే రామానుజుడు అక్కడే గుడి దగ్గర గుమికూడిన వందలాది మంది జనా న్ని పిలిచి గుడిగోపురం ఎక్కి గొంతెత్తి అరుస్తూ అష్ఠా క్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తరతమ కులమత బేధం లేకుండా అందరికీ చెప్పిన రామానుజుడు గురువు ముందు నిలబడ్డాడు. ‘వాగ్దానభంగ పాపానికి నరకా నికి పోతావా?’ అన్నాడు కోపంగా. ‘నేనొక్కడిని ఏమైతే నేం? ఇంతమందికి ముక్తి మార్గం దొరికి బాగుప డితే..!’ అన్నాడు.
ఆత్మ ఉద్ధరణ గొప్పదే. కాని జనులం దరినీ ఉద్ధరించే మార్గం అందరికీ చెప్పడం అంతకన్న గొప్పదనే గొప్ప ఆలోచన గురించి తెలిసి గురువు ఆశ్చ ర్యపోతాడు. రామానుజుడు తన గురువుకే గురువై నాడు. జగద్గురువైనాడు. వేయేళ్ల కిందటే అందరికీ తెలుసుకునే హక్కు ఉందని చెప్పిన సంస్కర్త ఈ సువి శాల భారతదేశమంతా నడిచి హిందూ మతాన్ని సం స్కరించి ఉద్ధరించిన జగద్గురువు రామానుజుడు (ఏప్రిల్ 24న రామానుజుని 998వ జయంతి). ఇది నన్ను కదిలించిన కథ. ఇప్పుడు సమాచారం ఇప్పించే బాధ్యత వైపు నడిపిన కథ. నా యోచనలకు, రచన లకు స్ఫూర్తినిచ్చిన పుస్తకంలోనిది.
నాకు పది పదకొండేళ్ల వయసులో మా నాన్న ఎం ఎస్ ఆచార్య (‘జనధర్మ’ సంపాదకుడు) ఇంటికి గ్యాలీ ప్రూఫులు తెచ్చేవారు. అరడజను తడి న్యూస్‌ప్రింట్ కాగితాల మీద అచ్చు వేసిన గ్యాలీ ప్రూఫ్‌లు తేవడం, అమ్మ ఇచ్చిన చాయ్ తాగే లోగా అవి ఆరడం, ఆ తర వాత వాటిని దిద్దడం నా చిన్న తనంలో నేను పదే పదే చూసిన సంఘటనలు.
నాన్నకు తెలియకుండా ఆ ప్రూఫులు చూసిన నాకు తెలుగు అక్షరాలు అంత అం దంగా, వరసగా, పొందికగా కుదరడం ఆశ్చర్యం కలి గించేది. ఆ అక్షరాలు నన్ను లెటర్ ప్రెస్ లోకి, రచనలోకి నడిపించాయి. మనకు వాడుకలో ఉన్న తెలుగు అక్ష రాలు యాభైనాలుగే అయినా ‘జనధర్మ’ ప్రెస్‌లో 360 గళ్లలో అచ్చు అక్షరాలను నేర్చుకున్నాను. ఆ అక్షరాల కూర్పు నాకు కొత్త చదువు నేర్పింది. రచయితగా పెంచింది.
హైదరాబాద్‌లోని లా స్కూల్‌లో నేర శిక్షా శాసనాల క్లాస్ తీసుకునే వాడిని. అందులో ఒక పాఠం ఆత్మ హత్యా ప్రయత్న నేరం గురించి. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం అన్న బీవీ పట్టాభిరాంగారి నిర్వచనం ఉదాహరణలతో వివరించే వాడిని. తన ప్రేమను ఓ అమ్మాయి అంగీకరించలేదనే తాత్కాలిక సమస్యకు హుస్సేన్‌సాగర్‌లో పడి చావడం అనే శాశ్వత పరిష్కా రం సరైనదా? ఆమె మనసు మారి ఐ లవ్యూ చెప్పడా నికి వస్తే అందుకోవడానికి ఈ ప్రేమికుడు బతికి ఉం డడం సరైనదా అని కదా ఆలోచించాలి.
కొన్ని నెలల తరువాత ఒక సంఘటన జరిగింది. నా విద్యార్థిని ఒకరు ఏవో సమస్యలవల్ల కొన్ని నిద్రమాత్రలు మిం గింది. మత్త్తు కమ్మే ముందు ఆమె నాకు ఫోన్ చేయ గలిగింది. చేతిలో ఉన్న ఇంకొన్ని మాత్రలు ముందు పారేయమని చెప్పాను. పారేసింది. అడ్రసు తెలుసు కుని వెళ్లాను. ప్రాణం దక్కింది. సంక్షోభ సమయంలో ఆమెకు నేనూ, నా పాఠం గుర్తుకు రావడం ఆశ్చర్యక రం. ఆ పాఠంలో అర్థమైన జ్ఞానం ఆమెను బతికిం చింది. అవిద్యే మరణం, విద్యే ప్రాణం. మనను ఏ అక్ష రం కదిలిస్తుందో, ఏ వాక్యం రగిలిస్తుందో, ఏ గ్రంథం ప్రేరేపిస్తుందో.. కనుక చదువు అందరికీ చెందాల్సిందే.
(ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు కేంద్ర సాహిత్య అకాడమీలో ఇచ్చిన ప్రసంగం ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com