
ఫిర్యాదులు వినేదెవరు?
విశ్లేషణ
న్యాయవ్యవస్థలోనూ పాలకుల బంట్లు ఉంటే పౌరుడికి న్యాయం జరగదు. రూల్ ఆఫ్ లా అంటే తప్పు చేసిన పాలకులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే సత్తాతోపాటు అలాంటి వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉంచే వ్యవస్థ అని అర్థం.
జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్నన్ ఉదంతం న్యాయమూర్తుల నియామక విధానాలను సంస్కరించి జాగ్రత్తగా అమలు చేయాలని విశదం చేస్తున్నది. చరిత్రలో మొదటిసారి ఒక హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జైలుశిక్ష వేయవలసి రావడం, పోలీసులు బయలుదేరడం, ఆయన దొరకకపోవడం దురదృష్టకరం. నియామకాల సందర్భంలో పారదర్శకత, పకడ్బందీ విచారణ అవసరమనిపిస్తుంది. జాతీయ న్యాయమూర్తుల నియామక సంస్థను నెలకొల్పేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధం కాదని కొట్టివేసింది. న్యాయమూర్తులుగా నియమితులు కావడానికి ఏం చేయాలి? ఎవరు సిఫార్సు చేయాలి అనే విషయంలో సమ గ్రమైన విధాన ప్రక్రియను నిర్ధారించవలసి ఉంది.
న్యాయమంత్రిత్వ శాఖ జవాబుదారీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని సుభాష్ చంద్ర అగ్రవాల్ ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నారు. రాజ్యాంగ న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తుల నియామకాలు, క్రమశిక్షణ, జవాబుదారీతనం పారదర్శకత అంశాలకు సంబంధించి మౌలికమైన అంశాలను ఆ ఆర్టీఐ దరఖాస్తులు లేవనెత్తాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ పైన వచ్చిన కొన్ని ఆరోపణలు, విచారణ, కొందరు న్యాయవేత్తలు రాసిన లేఖలపైన ఏ చర్యలు తీసుకున్నారని అడిగారు. అసలు జడ్జీలపైన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్నింటిపై విచారణ జరిపారు? వాటి పర్యవసానాలేమిటి అని కూడా ఆయన అడిగారు. ఫిర్యాదుల ప్రతులు ఇవ్వాలని కూడా కోరారు.
తమకు అందిన లేఖలు, ఫిర్యాదులను సుప్రీంకోర్టుకు పంపామని, ఆ ప్రతులు తమవద్ద లేవని, కేవలం ఆ లేఖలను పంపుతున్నామని రాసిన ఉత్తరాలు మాత్రమే ఉన్నాయని న్యాయశాఖ ప్రతినిధులు వివరించారు. జడ్జీలను నియమించే అధికారం కానీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కానీ తమకు లేవన్నారు. ఇదే విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కార్యాలయం కూడా తమకు జడ్జీలను నియమించే లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేదంటూ తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఒక లేఖ ఇచ్చారని సుభాష్ చూపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ కాకుండా, సుప్రీంకోర్టు కూడా కాకుండా మరి న్యాయమూర్తులను నియమించే అధికారం, వారిపై ఫిర్యాదులు వినే అధికారం ఎవరికి ఉందని సుభాష్ కమిషన్ ముందు అడిగారు.
ఒక జడ్జి ఎవరైనా తప్పుచేశారని తెలిస్తే ఫిర్యాదు ఎవరికి చేయాలి? అనే మౌలిక ప్రశ్న ఇది. రాజ్యాంగ విధానం ప్రకారం పదవిలో ఉన్న జడ్జిని హఠాత్తుగా తీసేయడానికి వీల్లేదు. సులువుగా తొలగించడానికి వీల్లేకుండా ఉండటంలోనే న్యాయవ్యవస్థ స్వతంత్రత ఉంది. పాలకులు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న కోపంతో జడ్జీలను తొలగించడం మొదలు పెడితే ఇక న్యాయం జరిగే అవకాశమే ఉండదు. ప్రజల హక్కులకు ఎప్పటికీ ప్రభుత్వ శక్తులనుంచే ప్రమాదం ఉంటుంది. అధికారంలోకి రావాలని, ఆ అధికారాన్ని కాపాడుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎదురు తిరిగిన వారిని, తమను విమర్శించిన వారిని, తమ తప్పులను బయటపెట్టే వారిని వేధించడానికి తమ అధికారాన్ని నిర్లజ్జగా వాడుకుంటూనే ఉంటారు.
అప్పుడు మామూలు పౌరుడికి ఒకే దిక్కు న్యాయవ్యవస్థ. అక్కడ కూడా పాలకుల బంట్లు ఉంటే పౌరుడికి న్యాయం జరగదు. న్యాయం కోసం రూల్ ఆఫ్ లా అంటే సమపాలన కోసం తప్పు చేసిన పాలకులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగల సత్తా, ధైర్యం ఉండటంతోపాటు అటువంటి వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉండగలిగే వ్యవస్థ చాలా ముఖ్యం. అందుకే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతో తొలగింపు తీర్మానం ఆమోదించి రాష్ట్రపతి కూడా అభిశంసనను అంగీకరిస్తే గాని జడ్జి తొలగింపు సాధ్యం కాదు. కాని ఆ ప్రక్రియ ఎక్కడ ఏ విధంగా మొదలవుతుంది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎన్ని రోజులలో చర్యలు ముగుస్తాయో చెప్పకపోయినా ఎప్పుడు మొదలవుతాయో చెప్పగలరా?
సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించకముందే నీట్ పరీక్షకు సంబంధించిన ఒక తీర్పు మీడియాకు లీక్ అయిన విషయంపై విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తి సదాశివం పేర్కొన్నారు. ఆ విషయమై ఏ చర్యలు తీసుకున్నారని కూడా సుభాష్ అడిగారు. న్యాయమూర్తులపైన వచ్చిన ఫిర్యాదుల ప్రతులన్నీ అఢగడం భావ్యం కాదు. కేసు ఓడిపోయిన ప్రతి కక్షిదారుడు, అతని వకీళ్లు న్యాయమూర్తిపైన నిరాధారమైన అభాండాలు వేసే అవకాశం ఉంది, ఆ ఫిర్యాదుల ప్రతులు ఆర్టీఐ కింద ఇస్తే అది మీడియాలో సంచలన కథనాలకు దారితీస్తుందని న్యాయ శాఖ అధికారి ఆందోళన సమంజసమే. అయితే ఫిర్యాదులెన్ని వచ్చాయి, వాటిలో ప్రాథమిక విచారణలో రాలిపోయినవి పోగా మిగిలినవెన్ని అని అడిగితే చెప్పవచ్చు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా మాజీ చీఫ్ జస్టిస్ వైకె సభర్వాల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్న జాతీయ మానవహక్కుల కమిషన్ పదవి ఇవ్వడం భావ్యం కాదని హోంమంత్రిత్వ శాఖ 15.3.2010న పేర్కొన్నది. ఫిర్యాదులను స్వీకరించి విచారించే వ్యవస్థ ఉండాల్సిందే. జిల్లా స్థాయి వరకు పరిశోధనలు, విచారణలో విపరీత ఆలస్యాల ఫిర్యాదును స్వీకరించి పరిష్కరించడానికి న్యాయమిత్ర అని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త పథకంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలపై ఫిర్యాదుల గురించి లేదు. (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయమంత్రిత్వ శాఖ, CIC/VS/A-/2014/000989–SA కేసులో 3.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్
కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com