ఖైదీకి బాకీ అడిగే దమ్ము ఇచ్చిన ఆర్టీఐ
సాధారణ కారాగార శిక్షకు గురైన ఖైదీలచేత చేయించిన పనికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎగ్గొడితే జైలు అధికారులను నిగ్గదీసి తనకు న్యాయం చేయమని కోరే హక్కు, న్యాయం పొందే అవకాశం సమాచార హక్కు చట్టంలో ఉన్నాయి. ఖైదీలకు హక్కులు, సౌకర్యాల గురించి అడగడానికి ఆస్కారమే లేదు, ఆర్టీఐ లేకపోతే. జైలుకు వెళ్లడం అంటే శిక్ష అనుభవించ డానికే. అక్కడ సౌకర్యాలేమిటి, హక్కులేమిటి, ఎన్ని అవస్థలు న్నా శిక్షలో భాగమే అనడం అనా గరికత. కారాగారవాసం అంటే నరకంలో జీవనం కాదు. ఉరిశిక్ష కు గురైన వాడు కూడా ఉరికొయ్యకు వేలాడే క్షణం వరకు ఆరోగ్యంగా ఉండాలి. అప్పటిదాకా అతను జీవించే హక్కు ను రక్షించాలి. చంపకుండా, చావకుండా చూసుకోవాలి.
నేరారోపణలు విచారణలో ఉండగా జైల్లో ఉండే వా రు (అండర్ ట్రయల్ విచారణ ఖైదీ) నేర విచారణ పూర్తి శిక్ష అనుభవించే (నేరస్తులు) వారు స్వయంగా అంగీకరిస్తే తప్ప వీరి నుంచి పని చేయించకూడదు. సాధారణ కారా గార శిక్షకు గురైన వారి నుంచి కూడా బలవంతంగా పని చేయించడానికి వీల్లేదు. కఠిన కారాగార శిక్షకు గురైన వారి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పని చేయించే అధి కారం ఉంటుంది. అయినా అలా చేయించిన పనికి నిర్ధా రిత వేతనాలు చెల్ల్లించాల్సిన బాధ్యత కూడా జైలు అధికా రులపైన ఉండి తీరుతుంది.
చేసిన పనికి సంబంధించి లెక్కలు తప్పుగా నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోయినా, అసలు ఏమీ ఇవ్వక పోయినా జైలు అధికారులను అడిగే ధైర్యం ఎవరికి ఉంది? ఎక్కడ అడగాలి? ఆర్టీఐ అడిగే అవకాశం కల్పించింది. జైల్లో ఉన్నవారంతా నేరస్తులా కాదా అనే తత్వవిచారం పక్కన బెట్టి, వారి బతుకులు ఏవిధంగా ఉన్నాయో తెలు సుకోవాలంటే ఇప్పుడు చట్టపరంగా లభించిన మార్గం సహ చట్టం కింద అడిగే అవకాశమే.
ఓం ప్రకాశ్ గాంధీ చెల్లని చెక్కు ఇచ్చి జైల్లో చిక్కు కున్నాడు. అతనికి సాధారణ కారాగార శిక్ష విధించారు. తనకు కంప్యూటర్ జ్ఞానం ఉండడం వల్ల అధికారులకు పనిలో సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. అతనికి కొం త డబ్బు ఇచ్చారు. కాని పూర్తి వేతనం ఇవ్వలేదని, పని చేసిన కాలానికి సరిపోయేట్టు లెక్క కట్టి పూర్తి వేతనం ఇవ్వ లేదని అతని అనుమానం. జైలు నుంచి విడుదలైన తరు వాత సహ చట్టం కింద తను పని చేసిన తాలూకు హాజరు పట్టికల నిజ ప్రతులు అధికారికంగా ఇవ్వాలని కోరాడు. ఇవ్వక తప్పలేదు. జైలు అధికారులు ఆ కాగితాలు ఇచ్చి సహ చట్టం కింద బాధ్యత నెరవేర్చారు.
హాజరీ పట్టికలను బట్టి లెక్కిస్తే ఆయనకు రావలసిన వేతనం ఇంకా బాకీ ఉందని ఆయన వాదం. తనకు పూర్తి గా వేతనం ఇచ్చారా అన్న ప్రశ్నకు సరైన సమాచారం లేక పోవడం వల్ల కేసు రెండో అప్పీలు కమిషన్ ముందుకు వచ్చింది. మెడికల్ ఆఫీసర్ ఇన్‌చార్జ్ దగ్గర దవాఖానలో చేరని రోగుల విభాగంలో వివరాలను కంప్యూటర్‌లో చేర్చే పని చేసినట్టు ఆయన ఆర్టీఐ కింద దక్కిన ధ్రువపత్రాన్ని చూపించాడు. ఈ డబ్బు తనకు రాలేదని వాదించాడు. మొత్తం బాకీ చెల్ల్లించామని అధికారుల వాదం. ఆ పత్రం సంగతేమని అడిగితే వైద్యాధికారికి అటువంటి ధ్రువప త్రం ఇచ్చే అధికారం లేదని, కనుక వేతనం ఇచ్చే అవకాశం లేదని జైలు అధికారులు అన్నారు. తనకు 75 రోజుల పా టు పని చేసిన నాటి వేతనాలు చెల్లించలేదని మాజీ ఖైదీ వాదం.
సంబంధిత అధికారులను, రిజిస్టర్లతో సహా రమ్మ ని కమిషనర్ హోదాలో పిలిపించవలసివచ్చింది. వారు వచ్చారు. ఇరుపక్షాల వారు కలసి రికార్డులు పరిశీలించి, ఎంత కాలం పని చేస్తే ఎంత వేతనం ఇచ్చారో బాకీ ఉందో లేదో తేల్చమని కోరడం జరిగింది. దాదాపు రెండు గం టల పాటు కష్టపడి కొంత బకాయి తేల్చారు.
నిజానికి మొదటి అప్పీలు అధికారి అయిన సీనియర్ జైలు అధికారి ఖైదీకి బాకీ పడిన వేతనాలను లెక్కించి అత నికి చెల్ల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల అమ లు జరగలేదని అప్పీలును కమిషన్ ముందు దాఖలు చేయవలసివచ్చింది. అదే విభాగంలో పనిచేసే ఒక ఉన్న తాధికారి మొదటి అప్పీలు విన్నప్పుడు కేవలం అడిగిన సమాచారం గురించే కాకుండా, అతను సమాచారం అడ గవలసి రావడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో కూడా విచారించే అవకాశం, అధికారం కూడా కలిగి ఉంటాడు.
అతని సమస్య తీర్చడానికి ప్రయత్నం చేయడం కూడా సాధ్యమే. మొదటి అప్పీలులో సమాచారంతో పాటు సమ స్యకు సమాధానం కూడా దొరికే అవకాశం ఉంది. ఆ ఉన్న తాధికారి సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తే పాటించకపోవ డం న్యాయం కాదు. మొదటి అప్పీలులో తనకు న్యాయం దొరికిన తరు వాత రెండో అప్పీలుకు రావలసిన అవసరం లేదు. ఆ ఆదే శం పాటించకపోతే అందుకు పౌర సమాచార అధికారికి శిక్ష వేయాలని ఫిర్యాదు చేయాల్సిందే. ఫిర్యాదు చేస్తే సమా చారం సమాధానం కోరే అవకాశం లేదు.
ఇవన్నీ అక్షరక్ష రాన్ని విడగొట్టి పడగొట్టే అన్వయ అన్యాయవాదాలు. ఏ సమాచార అభ్యర్థన కూడా సరదాగా వేయరు. ఆర్టీఐ వెను క సమస్య ఉండి తీరుతుంది. ఆ సమస్యకు సమాధానం చెప్పడం పాలనా పరమైన బాధ్యత. అదేపాలన. ఖైదీ ఓం ప్రకాశ్‌కు ఇవ్వవలసిన బకాయి వేతనాలు (రూ.4,108) ఎప్పుడు చెల్లిస్తారో తెలపాలని ఆదేశించడమే తీర్పు. (ఓం ప్రకాశ్ గాంధీ వర్సెస్ పీఐఓ తీహార్ జైలు, ఇఐఇ/అ/అ/ 20 15/ 000964లో 13 ఆగస్టు 2015 నా తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్)