RTI
-
సోషల్ మీడియాకు సీఎం సిద్ధరామయ్య ఖర్చెంత?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో చర్చనీయాంశంగా మారుతుంటారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణం కేసు ఆయనను వెంటాడుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఆయన ప్రతీనెలా సోషల్ మీడియాకు ఎంత ఖర్చు చేస్తారనేది వెల్లడై వైరల్‌గా మారింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఆర్టీఐ కార్యకర్త మారలింగ గౌర్ మాలీ పాటిల్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోషల్ మీడియా ఖాతాలు నిర్వహించడానికి ఎంత ఖర్చచేస్తారనేదానికి సమాధానం కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ ఏజెన్సీ కర్ణాటక స్టేట్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ అండ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్ (ఎంసీఏ) సమాధానం తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 25 నుంచి మార్చి 2024 వరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్‌మీడియా కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్టీఐ అందించిన సమాచారం ప్రకారం సీఎంఓ ప్రతి నెలా దాదాపు రూ.53.9 లక్షలు ఖర్చు చేసింది. ఇందులో 18 శాతం జీఎస్టీ కూడా ఉంది. సిద్ధరామయ్య ఖాతాలను నిర్వహించే పాలసీ ఫ్రంట్ అనే కంపెనీకి ఈ చెల్లింపు జరిగింది. ఈ కంపెనీలో 25 మంది సభ్యులు ఉన్నారు. కాగా మాజీ ముఖ్యమంత్రులతో పోలిస్తే, సిద్ధరామయ్య సోషల్ మీడియాలో చాలా తక్కువ ఖర్చు చేస్తారని సీఎం కార్యాలయం తెలిపింది. -
ఎన్నికల బాండ్లు: ‘ఆర్టీఐ’ కింద రిప్లైకి ‘ఎస్బీఐ’ నో
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల అమ్మకాల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) తెలపాలని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఒక పిటిషన్ దాఖలైంది. ఎస్ఓపీ వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ నిరాకరించింది. హక్కుల కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల విక్రయాలు, ఎన్‌క్యాష్ కోసం బ్యాంకు బ్రాంచ్‌లకు జారి చేసిన ఎస్ఓపీ అనేది తమ సంస్థ అంతర్గత మార్గదర్శకాల కిందకు వస్తుందని ఎస్బీఐ పిటిషనర్‌కు సమాధానమిచ్చింది. వాణిజ్య, వ్యాపార రహస్యాలు వెల్లడించకుండా కమర్షియల్ కాన్ఫిడెన్స్ కింద ఆర్టీఐ చట్టంలో మినహాయింపులున్నాయని తెలిపింది. ఎస్బీఐ సమాధానంపై అంజలి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిందని, వీటికి సంబంధించిన అన్ని వివరాలు బహిర్గతం చేయాలని ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా ఎస్బీఐ ఎస్ఓపీ వివరాలు దాచడం సరికాదన్నారు. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న ప్రకటించిన విషయం తెలిసిందే. స్కీమ్‌ను ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందజేయాలని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. దీంతో ఎస్బీఐ ఈసీకి వివరాలు అందించిన వెంటనే ఈసీ వాటిని తన వెబ్సైట్లో బహిర్గతం చేసింది. ఇదీ చదవండి.. వదలని చిక్కులు.. మహువా మొయిత్రాపై మరో కేసు -
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
ఫ్యామిలీ డాక్టర్ విధానం భేష్
సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్ రీసెర్చ్ ట్రయాంగిల్ ఇనిస్టిట్యూట్(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు. రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్సీ, వీహెచ్సీల కంటే ఫ్యామిలీ డాక్టర్ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది. ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్ తదితరులున్నారు. -
ప్రజాస్వామ్యం బలోపేతంలో ఆర్టీఐది కీలక పాత్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రజాస్వామ్యం బలోపేతం కావడంలో సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకపాత్ర పోషిస్తోందని ఏపీ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విశాఖపట్నంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన 28 బోర్డు ఆఫ్ గవర్నర్లు, సమాచార కమిషన్ల నేషనల్ ఫెడరేషన్ 12వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. దేశ ప్రజల ప్రయోజనానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపునకు, గోప్యత మినహాయింపునకు దోహదపడుతోందని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లోని అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని తెలుసుకునే శక్తివంతమైన సాధనం ఆర్టీఐ అని పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా చేస్తూ అవసరమైన సమాచారాన్ని తెలుసుకునే హక్కును సులభంగా వినియోగించుకునేలా చేస్తోందన్నారు. ఆర్టీఐ పౌరుల ప్రాథమిక హక్కును గుర్తించడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుగ్గా పాల్గొనేలా చేసిందని వివరించారు. అవినీతిని అరికట్టడంలోను, సుపరిపాలన అందించడానికి, అవినీతి, అధికార దుర్వినియోగాలను బహిర్గతం చేయడానికి ఇది సహకరిస్తోందన్నారు. ఏదైనా తప్పు చేస్తే పరిహారం పొందే అధికారం ఇచ్చిందన్నారు. అలాగే బ్యూరోక్రాట్ల జాప్యాన్ని తగ్గించడం, సత్వర సేవలను మెరుగు పరచడం, ప్రభుత్వ అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అట్టడుగు వర్గాలపై ప్రత్యేక సాధికారత వంటి అంశాల్లో సానుకూల ప్రభావం చూపడానికి ఈ చట్టం దోహదం చేస్తోందన్నారు. ఇంకా వివక్ష, నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఒక యంత్రాంగాన్ని అందించిందని, ఇది సమాచార అంతరాన్ని తగ్గించడంలో సహాయ పడుతోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్రాల కమిషన్లు ఒకే విధమైన అధికారాలు, బాధ్యతలను, ఒకదానితో ఒకటి స్వతంత్రతను కలిగి ఉంటాయన్నారు. ఈ ఫెడరేషన్ కమిషన్లు, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల కమిషన్లను సభ్యులుగా చేర్చుకున్నందున కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్ల మధ్య పరస్పర సంప్రదింపులు సులభతరం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సందేశం పంపించిన సీఎం జగన్ విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమాచార కమిషన్ల వార్షిక సమావేశానికి తన సందేశాన్ని పంపించారు. ‘ప్రభుత్వం తరఫున మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. దేశం నలుమూలల నుంచీ మీరు విశాఖకు రావడం సంతోషానిస్తోంది. రెండు దశాబ్దాలుగా సమాచార హక్కు చట్టం ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టం పాత్ర, పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, జవాబుదారీతనాన్ని పెంచుతోంది’ అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా చదివి వినిపించారు. -
ప్రధాని మోదీ ఎన్ని సెలవులు తీసుకున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ మొత్తం ఎన్ని సెలవులు తీసుకున్నారంటూ పూణేకు చెందిన ఓ పౌర హక్కుల కార్యకర్త ఆర్టీఐకి దరఖాస్తు చేయగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం సమాధానమిచ్చింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయాన్ని ఎక్స్(ట్విట్టర్)లో పొందుపరుస్తూ మా ప్రధాని మా గర్వకారణం అని రాశారు. పూణేకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ పి సర్దా ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయానికి రెండు అంశాలపై ఆరా తీశారు. మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారని? రెండవది ప్రధాని ఇంతవరకు విధులకు హాజరైన మొత్తం రోజులు, వివిధ కార్యక్రమాలకు హాజరైన దినాలు ఎన్ని? ఈ వివరాలు తెలపమని కోరారు. ప్రధాని కార్యాలయంలో ఆర్టీఐ అర్జీల వ్యవహారాలను సమీక్షించే కార్యాలయ సెక్రెటరీ పర్వేశ్ కుమార్ ఈ రెండు ప్రశ్నలకు బదులిస్తూ.. మొదటిగా ప్రధాని ఇంతవరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని రెండవదిగా ఆయన ప్రతిరోజూ విధులకు హాజరవుతూనే ఉన్నారని ఈ తొమ్మిదేళ్లలో సుమారు 3000 కార్యక్రమాలకు హాజరయ్యారని.. అంటే కనీసం రోజుకొక కార్యక్రమంలోనైనా ఆయన పాల్గొంటూ వస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం తెలిపిన ఈ వివరాలను అస్సాం ముఖ్యమంత్రి తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. మరో కార్యక్రమంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఇదే విషయంపై స్పందిస్తూ ప్రధానితో కలిసి పనిచేయడాన్ని క్రికెట్ పరిభాషలో చెబుతూ.. కెప్టెన్ మోదీతో పని ఉదయాన్నే 6 గంటలకు మొదలై.. చాలా ఆలస్యంగా ముగుస్తుందని అన్నారు. ఆయన మనకు అవకాశమిస్తే మనము వికెట్ తీస్తామని ఆయన అంచనా వేస్తుంటారని అన్నారు. నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని.. ఆయన ప్రధాన మంత్రిగా ఉన్నారని గానీ ఆయన మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నానని గానీ నేను ఈ మాట చెప్పడంలేదన అన్నారు జయశంకర్. గతంలో కూడా 2016లో ప్రధాని సెలవుల గురించి మరొకరు ఇలాగే ఆర్టీఐ ద్వారా ఆరా తీశారు. అప్పుడు కూడా ప్రధాని కార్యాలయం ఇదే సమాధానాన్నిచ్చింది. #MyPmMyPride pic.twitter.com/EPpkMCnLke — Himanta Biswa Sarma (@himantabiswa) September 4, 2023 ఇది కూడా చదవండి: మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం -
గ్రామ సచివాలయాల్లో ‘సమాచారహక్కు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత తీసుకొస్తూ ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయాల స్థాయిలోను సమాచారహక్కు(ఆర్టీఐ) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచారహక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ ఆ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ జీవో నంబరు 437 జారీచేశారు. ప్రతి గ్రామ సచివాలయంలో సమాచారహక్కు సంబంధిత సహాయ అధికారి(అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–ఏపీఐవో), సమాచార హక్కు సంబంధిత అధికారి(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్–పీఐవో)లను నియమిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూర్యకుమారి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. గ్రామ సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఏపీఐవోగాను, పంచాయతీ కార్యదర్శి పీఐవోగాను కొనసాగుతారని కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయం స్థాయిలో పరిష్కారం కాని వినతులపై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ అథారిటీగా ఆ మండల ఎంపీడీవో పనిచేస్తారని తెలిపారు. -
ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే..
భోపాల్: కొవిడ్-19 మహమ్మారికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐలో కోరిన ఓ వ్యక్తికి వింతైన అనుభవం ఎదురైంది. సంబంధిత శాఖ నుంచి వచ్చిన సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉంది. దీంతో ఆయన తన ట్రక్కును వినియోగించాల్సి వచ్చింది. అయితే.. ఇంత మొత్తంలో సమాచారానికి ఆయన ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఆయనకు ఉచితంగా ఈ సమచారాన్ని అధికారులు అందించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా అనే వ్యక్తి రాష్ట్రంలో కొవిడ్ సంబంధించిన మెడికల్ టెండర్లు, బిల్ పేమెంట్ల గురించి సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరారు. ఇందుకు ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్(సీఎమ్హెచ్ఓ)కు తన అభ్యర్థనను సమర్పించారు. ఈ సమాచారాన్ని నిర్ణీత గడువు ఒక నెలలో సమర్పించలేకపోయారు అధికారులు. దీంతో ధర్మేంద్ర ఉన్నత అధికారులను సంప్రదించారు. ధర్మేంద్ర అభ్యర్థనను పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఆయనకు ఉచితంగానే ఆ సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ సమాచారం ఏకంగా 40 వేల పేజీలు ఉండటంతో ఆయన తన ట్రక్కును తీసుకుని వెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు తప్పా మిగిలిన భాగమంత పేపర్లతోనే నింపాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. పేపరు సమాచారానికి రూ.2 చెల్లించాల్సి ఉండగా.. ఉచితంగానే లభించిందని చెప్పారు. అటు.. ఖజానాకు రూ.80 వేల నష్టాన్ని కలిగించిన అధికాలపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు పంపండి.. ప్రియుని కోసం బాలిక బిగ్ స్కెచ్..! ఆ తర్వాత.. -
రూ.88,000 కోట్ల విలువైన రూ.500 నోట్ల మిస్సింగ్.. స్పందించిన ఆర్బీఐ!
రూ. 88,000 కోట్ల విలువైన రూ. 500 నోట్లు కనిపించడం లేదంటూ వెలుగులోకి వచ్చిన నివేదికల్ని ఆర్బీఐ కొట్టిపారేసింది. కరెన్సీ నోట్లపై వివరణ తప్పుగా ఉందని పేర్కొంది. పలు నివేదికల ప్రకారం.. నాసిక్ కరెన్సీ నోట్ ప్రెస్‌లో 375.450 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించినట్లు రైట్ టూ ఇన్ఫర్మేషన్ (ఆర్టీఐ) వెల్లడించింది. అయితే, ఆర్బీఐ మాత్రం ఏప్రిల్ 2015 నుంచి డిసెంబర్ 2016 మధ్య కాలంలో కేవలం 345.000 మిలియన్ల నోట్లు మాత్రమే తమ వద్దకు వచ్చినట్లు చెప్పింది. మరి మిగిలిన కరెన్సీ నోట్లు ఎక్కుడున్నాయి? అనే అంశం చర్చాంశనీయంగా మారింది. ఈ క్రమంలో నోట్ల విషయంలో నివేదికలు అస్పష్టంగా ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలిపింది. ప్రింట్ ప్రెస్‌లలో ముంద్రించిన నోట్లన్ని ఆర్బీఐ వద్దకు చేరాయని, అందుకు సంబంధించిన లెక్కలు పక్కాగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓ వర్గానికి చెందిన మీడియా సంస్థలు కరెన్సీ నోట్ల గురించి కథనాలు ప్రచురించాయి. ఆ కథనాలు తన దృష్టికి రావడంతో ఆర్బీఐ స్పందించింది. ఈ నివేదికలు సరైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw — ReserveBankOfIndia (@RBI) June 17, 2023 నోట్ల ఉత్పత్తి, నిల్వ, పంపిణీని పర్యవేక్షించే ప్రోటోకాల్‌లతో సహా, ప్రెస్‌లలో ముద్రించబడిన, సరఫరా చేయబడిన బ్యాంక్ నోట్ల పునరుద్ధరణ కోసం పటిష్టమైన వ్యవస్థలను కలిగి ఉన్నామని ఆర్బీఐ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై ఆర్బీఐ ఇస్తున్న సమాచారం సరైందేనని, ప్రజలు వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బ్యాంక్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ వెల్లడించింది. ఇదీ చదవండి : స్టార్టప్ కంపెనీ పంట పండింది.. అదానీ చేతికి ‘ట్రైన్‌మ్యాన్’! -
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్(Lpg Gas Cylinder) మన ఇంట్లో ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి 2,3 నెలలకు ప్రజల వాడకం బట్టి గ్యాస్ సిలిండర్‌ను తెప్పించుకుంటాం. అయితే సిలిండర్‌ను డోర్ డెలివరీ తీసుకున్న ప్రతి సారి రూ.30 లేదా అంత కంటే ఎక్కువ అదనంగా చెల్లించడం మూములుగా మారింది. ఇకపైన అలా డబ్బులు ఇవ్వడం ఆపేయండి. ఎందుకంటే! ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వినియోగదారులు తెలంగాణలోని డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లకు డెలివరీ ఛార్జీలు చెల్లించాలా వద్దా అనే సమాచారం కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ (RTI) ఈ మేరకు సమాధానం వచ్చింది. హెచ్‌పీసీఎల్ కంపెనీ డీలర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా.. ట్రేడింగ్ ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఉచితంగా వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొంది. డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ (Lpg Gas) డెలివరీ ఛార్జీలు ఏమైనా ఉంటే తెలుసుకోవాలని ఇటీవల హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకీస్ ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని కోరాడు. చదవండి: దేశంలోని ధనవంతులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసా? -
కొలీజియం తీర్మానాలు బయటపెట్టలేం: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం సమావేశం వివరాలు, తీర్మానాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. 2017 అక్టోబర్ 3న చేసిన తీర్మానం ప్రకారం.. కొలీజియం చర్చల, తీర్మానాల వివరాలను బయటపెట్టలేమని తెలిపింది. తుది నిర్ణయాన్ని మాత్రమే సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించింది. 2018 డిసెంబర్ 12న కొలీజియం భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది. కొలీజియం అనేది బహుళ సభ్యులతో కూడిన ఒక వ్యవస్థ అని, కొలీజియం చర్చించిన విషయాలను, చేసిన తీర్మానాలను ప్రజాబాహుళ్యంలోకి తీసుకురాలేమని, సమాచార హక్కు చట్టం కింద ఇవ్వలేమని స్పష్టం చేసింది. కొలీజియంలోని సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేస్తేనే తీర్మానాలు తుది నిర్ణయాలుగా మారుతాయని, అలాంటి వాటినే బయటపెట్టగలమని వివరించింది. తీర్మానాలే ఫైనల్ కాదు 2018 డిసెంబర్ 12 నాటి కొలీజియం సమావేశం అజెండా వివరాలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ అంజలి భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం భేటీలో సంప్రదింపుల కోసం చేసే తీర్మానాలు ఫైనల్ అని చెప్పలేమని తెలిపింది. తీర్మానాలపై సభ్యులంతా చర్చించుకొని సంతకాలు చేసే దాకా అవి అస్థిర నిర్ణయాలేనని పేర్కొంది. అందరూ సంతకాలు చేస్తేనే నిర్ణయాలు ఖరారవుతాయని వెల్లడించింది. అంటే కొలీజియం వ్యవస్థలోని సభ్యులందరి ఆమోదం ఉంటేనే తీర్మానాలు నిర్ణయాలవుతాయని వివరించింది. కొలీజియం విషయంలో మీడియాలో వచ్చే రిపోర్టులను విశ్వసించలేమని, ఇదే వ్యవస్థలో పనిచేసిన మాజీ సభ్యుడి ఇంటర్వ్యూను పట్టించుకోలేమని ధర్మాసనం ఉద్ఘాటించింది. కొలీజియం పనితీరు పట్ల మాజీ జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్లపై తాము మాట్లాడదలచుకోలేదని వ్యాఖ్యానించింది. 2018 డిసెంబర్ 12న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సమావేశమయ్యింది. పలువురిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను బదిలీ చేయాలన్న ప్రతిపాదనపై చర్చించి, తీర్మానాలు చేసింది. అయితే, ఈ తీర్మానాలు, నిర్ణయాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు. 2019 జనవరి 10న జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ సందర్భంగా కొలీజియం మరో నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజీవ్ ఖన్నాకు పదోన్నతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2018 డిసెంబర్ 12 నాటి భేటీలో కేవలం ప్రతిపాదనలపై చర్చించామని, వాటిని ఫైనలైజ్ చేయలేదని పేర్కొంది. అది మనకు పరాయి వ్యవస్థ: కిరణ్ రిజిజు కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు నడుమ వివాదం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ వ్యవస్థను ప్రభుత్వం తప్పుపడుతోంది. కొలీజియం అనేది మనకు పరాయి వ్యవస్థ అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవలే ఆక్షేపించారు. అయితే, కేంద్ర మంత్రి వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తిప్పి కొట్టింది. కొలీజియం పూర్తి పారదర్శకంగా పనిచేస్తోందని, అనవసర వ్యాఖ్యలతో దాన్ని పట్టాలు తప్పించవద్దని హితవు పలికింది. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
అమ్మా.. పోలీసులు తీసుకెళుతున్నారు!
న్యూఢిల్లీ: తృణమాల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి సాకేత్ గోఖలేని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు డెరెక్ ఓబ్రియన్ అన్నారు. ఇది రాజకీయ ప్రతీకార చర్య అని తృణమాల్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. సాకేత్ గోఖలే సోమవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి రాజస్తాన్‌లోని జైపూర్‌కి విమానంలో వెళ్లారని, అక్కడ ముందుగానే వేచి ఉన్న గుజరాత్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ఓబ్రెయిన్ ట్విట్టర్లో తెలిపారు. ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తన అమ్మకు ఫోన్ చేసి తనను పోలీసులు అహ్మదాబాద్ తీసుకువెళ్తున్నారని, మధ్యాహ్నానికి అక్కడకి చేరుకుంటానని చెప్పారు. ఆయనకు పోలీసులు ఫోన్ చేయడానికి కేవలం రెండు నిమిషాలే ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత అతని నుంచి ఫోన్, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గోఖలే మోర్బీ బ్రిడ్జ్ కూలిన ఘటన గురించి కొన్ని వార్తపత్రికల క్లిప్పింగ్‌ల తోపాటు మోర్బీ ప్రధాని పర్యటనకు రూ. 30 కోట్లు ఖర్చు అవుతుందని ఆర్టీఐ పేర్కొందని ట్వీట్ చేశారు. ఐతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ వార్తలను నకిలీవిగా పేర్కొనడం గమనార్హం. ఐతే ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం గోఖలే చేసిన ట్వీట్లను గుర్తించింది. గోఖలే చేసిన ట్విట్లను దృష్టిలో ఉంచుకునే ఇలా తప్పుడూ కేసులు బనాయించి అరెస్టులు చేస్తోందంటూ తృణమాల్ కాంగ్రెస్ నేత ఓబ్రెయిన్ ఆరోపణలు చేశారు. ఐతే ఆయన ఇక్కడ ఏ ట్వీట్ అనేది స్పష్టం చేయలేదు. ఇలాంటి చర్యలతో తృణమాల్కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల నోటిని మూయించలేరన్నారు. బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యను మరో స్థాయికి తీసుకువెళ్తోందంటూ విరుచుకుపడ్డారు. కాగా, జైపూర్ విమానాశ్రయ పోలీసు ఇన్ఛార్జ్ దిగ్పాల్ సింగ్ ఈ విషయమై మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఎవరు తెలియజేయ లేదని స్పష్టం చేశారు. (చదవండి: తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్!) -
రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ సమాధానం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల కరెన్సీ నోట్లకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. 2019-20, 2020-21, 2021-22లో ఒక్క రూ.2 వేల నోటు కూడా ముద్రించలేదట. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు బదులుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్ ఈ విషయాన్ని వెల్లడించింది. (Audi Q5Special Edition:స్పెషల్ ప్రైస్..లిమిటెడ్ పీరియడ్, త్వరపడండి!) 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ 2వేల రూపాయల నోట్లను ముద్రించగా, ఈ సంఖ్య 2017-18లో 111.507మిలియన్లు తగ్గిపోయిందనీ, అలాగే 2018-19 ఏడాదిలో ఇది 46.690 మిలియన్ నోట్లుగా ఉందని ఐఏఎన్ఎస్ దాఖలు చేసిన RTI క్వెరీ లో తెలిపింది. మరోవైపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారం దేశంలో స్వాధీనం చేసుకున్న 2 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2,272 నుండి 2,44,834కు గణనీయంగా పెరిగిందని పార్లమెంటులో ఇటీవల (ఆగస్టు 1న) సర్కార్ తెలిపింది.డేటా ప్రకారం, 2016లో దేశంలో పట్టుబడిన మొత్తం రూ.2,000 నకిలీ నోట్ల సంఖ్య 2,272 కాగా, 2017లో 74,898కి పెరిగి 2018లో 54,776కి తగ్గింది. 2019లో ఈ సంఖ్యలు 90,566గా ఉండగా, 2020గా ఈ సంఖ్య ఏకంగా 2,44,834గా ఉంది. (SuperMeteor 650: రాయల్‌ఎన్‌ఫీల్డ్ సూపర్ బైక్,సూపర్ ఫీచర్లతో) కాగా నవంబర్ 8, 2016న అప్పటికి చలామణీలో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2,000 నోటును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. -
ఏపీలో వేగంగా ఆర్టీఐ అప్పీళ్ల పరిష్కారం
సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సమాచార కమిషన్‌కు వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా స్పందిస్తున్నట్లు ‘భారతదేశ సమాచార కమిషన్ల పనితీరు 2021–22’ నివేదిక స్పష్టం చేసింది. కేరళలో ఒక ఫిర్యాదును పరిష్కరించడానికి 15 నెలలు, కర్ణాటకలో 14 నెలలు, తెలంగాణలో ఏడాది సమయం పడుతున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం 4 నెలల్లోనే పరిష్కరిస్తున్నట్లు వివరించింది. వివిధ రాష్ట్రాల్లో కమిషన్‌లో పోస్టులు భర్తీ చేయకపోవడం, కమిషనర్లు కేసుల పరిష్కారంలో లక్ష్యాలను నిర్దేశించుకోకపోవడం ఆలస్యానికి కారణంగా పేర్కొంది. కర్ణాటక సమాచార కమిషన్‌లో ఈ ఏడాది జూన్ 30 నాటికి అత్యధికంగా ఫిర్యాదులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, తమిళనాడులో సమాచార చట్టం కింద కోరిన సమాచారాన్ని అందించట్లేదని చెప్పింది. ఆర్టీఐకి వచ్చిన కేసుల్లో బ్యాక్లాగ్, నెలవారీ డిస్పోజల్ రేట్‌ను ఉపయోగించి ఢిల్లీకి చెందిన సిటిజన్స్ గ్రూప్, సతార్క్ నాగరిక్ సంగతన్ (ఎస్ఎన్ఎస్) బృందం ఈ ఏడాది జూలై 1న అప్పీళ్ల పరిష్కారాల సమయాన్ని లెక్కించింది. 2022 జూన్ 30 నాటికి దేశ వ్యాప్తంగా 26 సమాచార కమిషన్లలో 3,14,323 అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా.. ఇందులో కర్ణాటకలో 30,358, తెలంగాణలో 8,902, కేరళలో 6,360, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 2,814 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. జరిమానాల్లో కర్ణాటక టాప్ కర్ణాటకలో 2021 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 మధ్య అత్యధిక అప్పీళ్లు నమోదు, పరిష్కారం పొందాయి. ఇక్కడ 26,694 అప్పీళ్లు వస్తే.. 25,710 కేసులను పరిష్కరించారు. తెలంగాణలో 7,169 కేసులకు గానూ 9,267 (గత ఏడాది పెండింగ్ కలిపి) అప్పీళ్లను, ఏపీలో 6,044 కేసులు నమోదవగా, 8,055(పెండింగ్‌తో కలిపి) డిస్పోజ్ అయ్యాయి. నిర్దిష్ట సమయానికి సమాచారం ఇవ్వకపోవడం, కావాలని జాప్యం చేయడం వంటి కారణాలతో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా 1,265 కేసుల్లో రూ.1.04 కోట్లు జరిమానాలు విధించింది. కేరళ 51 కేసుల్లో రూ.2.75 లక్షలు, తెలంగాణ 52 కేసుల్లో రూ.2 లక్షలు, ఏపీ 9 కేసుల్లో రూ.55 వేలు జరిమానా విధించాయి. మధ్యప్రదేశ్‌లో రూ.47.50 లక్షలు, హరియాణా రూ.38.81 లక్షలు పెనాల్టీ విధించాయి. అయితే, సమాచారం ఇవ్వడంలో జాప్యానికి జరిమానాలు విధించడానికి అర్హత ఉన్నప్పటికీ, చాలా తక్కువ కేసుల్లో మాత్రమే పెనాల్టీ వేశారని పేర్కొనడం గమనార్హం. ఏపీలో కమిషన్‌కు జవసత్వాలు రాష్ట్రంలో ఆర్టీఐ చట్టం అమలు, సమాచార కమిషన్ నియామకంపై గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. విభజన అనంతరం 2014 నుంచి 2017 వరకు సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేయలేదు. ఆ తర్వాత మొక్కుబడిగా నలుగురు కమిషనర్లను నియమించి చేతులు దులిపేసుకుంది. ఇక్కడ కమిషన్ ఉన్నప్పటికీ సరైన మౌలిక వసతులు లేక 2019 వరకు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించలేక ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక సమాచార కమిషన్‌కు నూతన జవసత్వాలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న నలుగురు కమిషనర్లకు తోడు కొత్తగా మరో నలుగురిని నియమించి కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇటీవల ఇద్దరు కమిషనర్లు పదవీ విరమణ చేయగా.. ఆ పోస్టులను సైతం వెంటనే భర్తీ చేసింది. తద్వారా కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పించింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఆర్టీఐ డే! రాష్ట్రంలో పూర్తిస్థాయిలో సమాచార కమిషన్ ఉండటంతో ఆర్టీఐపై వచ్చే అప్పీళ్లను వేగంగా పరిష్కరిస్తున్నాం. ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించేలా ఆర్టీఐ వారోత్సవాలను నిర్వహించాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల మూడవ శుక్రవారాన్ని ఆర్టీఐ డేగా ప్రకటించింది. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ఫిర్యాదుల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యింది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను బలోపేతం చేయడం సంతోషంగా ఉంది. – ఆర్.శ్రీనివాసరావు, చీఫ్ కమిషనర్ (ఇన్చార్జి) -
ఒకే ఉత్తర్వుతో 545 ఆర్టీఐ దరఖాస్తులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి దాఖలు చేసిన 545 దరఖాస్తులకు సంబంధించి ఒకే ఉత్తర్వుతో వాటికి మోక్షం కల్పించింది. శ్రీనివాస్‌రెడ్డి అనే న్యాయవాది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్ కేటాయించారు..ఎంత ఖర్చు చేశా రో వివరాలు ఇవ్వాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన మొత్తం 545 దరఖాస్తులను ఆర్టీఐ చట్టం కింద దాఖలు చేశారు. సమాచారంకోసం ఒక వ్యక్తి పరి మిత సంఖ్యలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న నిబంధనేదీ లేకపోవడంతో న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి వాటిని దాఖలు చేశా రు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ బు ద్దా మురళి ఏడాది కాలంగా ఆ న్యాయవాది ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. వాటన్నిటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులను ఆర్టీఐ కార్యాలయానికి పిలిపించి ఆ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు. వివరాలు బడ్జెట్ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్ కమిషనర్ ఆదేశించారు. కాగా, ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం వల్ల అధికారుల సమయం వృథా అవడమేకాక, కమిషన్‌పై భారం పడుతుందని ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పురపాలక శాఖలో వివరాలు కావాలంటూ రెండు వందలకు పైగా దరఖాస్తులు సమర్పించారని చీఫ్ కమిషనర్ తెలిపారు. వాటికి కూడా ఒకే ఉత్తర్వు జారీ చేశామని చెప్పారు. -
నిలదీయడమే నేరమా!
పదిహేడేళ్లక్రితం అడుగుపెట్టినప్పుడు అందరిలో ఆశలు రేకెత్తించిన సమాచార హక్కు చట్టం ఆచరణలో క్షీణ చంద్రుణ్ణి తలపిస్తూ నానాటికీ తీసికట్టవుతున్న వైనం అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. గుజరాత్ సమాచార కమిషన్ సైతం ఆ బాణీలోనే ఒకదాని వెంబడి ఒకటిగా తీసుకుంటున్న నిర్ణయాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. పౌరులకుండే సమాచార హక్కునే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గత పద్దెనిమిది నెలల కాలంలో ఏకంగా పదిమంది దరఖాస్తుదారుల్ని జీవితంలో మరెప్పుడూ ప్రశ్నించొద్దంటూ ఈ కమిషన్ నిషేధించింది. వీరంతా ఒకటికి పది ప్రశ్నలు వేస్తూ అధికారులకు చిర్రెత్తిస్తున్నారట! వేధిస్తున్నారట!! దురుద్దేశంతో, ప్రతీకార ధోరణితో సమాచారం అడిగారని కొందరిని అయిదు సంవత్సరాల వరకూ కమిషన్ గడప తొక్కొద్దని హుకుం జారీ చేసింది. ఒక జంట తమ రెసిడెన్షియల్ సొసైటీ గురించి 13 ప్రశ్నలు వేసిందని రూ. 5,000 జరిమానా విధించారు. తమ విలువైన సమయాన్ని వృథాపరిచారని, ఉద్దేశపూర్వకంగా కీలకమైన సమాచారాన్ని దాచారని, దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ న్యాయస్థానాలు పిటిషనర్లపై అడపా దడపా చర్యలు తీసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయి. న్యాయమూర్తులకు చట్టాలు ఆ అధికారాన్నిచ్చాయి. కానీ సమాచార హక్కు కమిషన్ సైతం అదే తోవన పోతానంటే కుదురుతుందా? వాటిని ఏర్పాటు చేసిన ఉద్దేశమే దెబ్బతినదా? దేశ రక్షణ, చట్టసభల హక్కులకు భంగకరంగా ఉండేవి, మేధోపరమైన హక్కులు, నిఘా విభాగాల కార్యకలాపాలువంటివాటికి సమాచార హక్కు చట్టం నుంచి మొదట్లోనే మినహాయింపు ఇచ్చారు. అనంతరకాలంలో ఆ చట్టం పరిధిలోకి తాము రాబోమని చెప్పే ప్రభుత్వ విభాగాలు ఎక్కువే ఉండేవి. రాను రాను ఎంతోకొంత మార్పు వచ్చింది. ఐక్యరాజ్యసమితి 1949లో విడుదల చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటనలోనే సమాచార హక్కు చట్టం మూలాలున్నాయి. ప్రపంచపౌరులందరికీ మానవహక్కులుండాలని ఆ ప్రకటన కాంక్షించడంతోపాటు ఏ మాధ్యమం ద్వారానైనా సమాచారాన్ని కోరే, స్వీకరించే హక్కు దేశదేశాల ప్రజలకూ ఉంటుందని స్పష్టం చేసింది. సమాచార హక్కు కోసం అరుణారాయ్‌వంటి వారెందరో ఉద్యమించారు. ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. ఫలితంగా 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. పారదర్శక పాలన అందించటానికి ప్రయత్నిస్తున్న 70 దేశాల సరసన మన దేశం కూడా చేరింది. అంతక్రితం ప్రభుత్వాల పనితీరు గురించి ఎలాంటి ప్రశ్నలు వేసినా పాలకులు 1923 నాటి అధికార రహస్యాల చట్టం మాటున, మరికొన్ని ఇతర చట్టాల మాటున దాగేవారు. రహస్యం పాటించేవారు. ఇందువల్ల పాలకులు ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, అయినవారికి ఏకపక్షంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కావడం రివాజయ్యేది. సమాచార హక్కు చట్టం వచ్చాక దేశంలో అంతా సవ్యంగా ఉన్నదని, పారదర్శకత పెరిగిందని చెప్పలేం. కానీ అధికారవర్గానికి ఎంతో కొంత జవాబుదారీతనం వచ్చింది. అయిష్టంగానైనా, ఆలస్యంగానైనా పౌరులు అడిగిన సమాచారం బయటికొస్తోంది. చట్టం అంటే వచ్చిందిగానీ దాన్ని ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్న పౌరులకు అడుగడుగునా ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వారి ప్రాణాలకు సైతం ముప్పువాటిల్లుతోంది. నిలదీసినవారికి రాజకీయంగా అండదండలు లేవనుకుంటే వారి ఇళ్లకుపోయి బెదిరించటం, దుర్భాషలాడటం, దౌర్జన్యం చేయటంవంటి ఉదంతాలకు లెక్కేలేదు. తొలి దశాబ్దంలోనే దాదాపు 65మంది పౌరులు అవినీతి, ఆశ్రితపక్షపాతం, ప్రభుత్వ పథకాల అమలు వగైరా అంశాలపై ప్రశ్నించిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రశ్నించినవారికి అండగా చట్టం ఉంటే ఈ దుస్థితి ఉండేదికాదు. కానీ ఆర్టీఐ చట్టం వచ్చిన ఆరేళ్ల తర్వాత, ఎన్నో ఉద్యమాలు జరిగాక 2011లో విజిల్‌బ్లోయర్ చట్టం వచ్చింది. విషాదమేమంటే దాని అమలు కోసం జారీ చేయాల్సిన నోటిఫికేషన్‌కు ఇన్నేళ్లయినా అతీగతీ లేదు. ఇది చాలదన్నట్టు 2019లో సమాచార హక్కు చట్టాన్నే నీరుగార్చే సవరణలు చేశారు. మరోపక్క సమాచారాన్ని కోరుతూ ఏటా దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతుండగా సమాచార కమిషన్ కార్యాలయాలు తగిన సంఖ్యలో కమిషనర్లు లేక బావురుమంటున్నాయి. అందువల్ల దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవడం, తగిన ఆదేశాలివ్వటం వంటి అంశాల్లో అలవిమాలిన జాప్యం చోటుచేసుకుంటోంది. ప్రభుత్వ విభాగాల సంగతి చెప్పనవసరమే లేదు. అవినీతికి అలవాటుపడిన అధికారులు పౌరులు అడిగిన సమాచారం ఇవ్వకపోగా, ఆ అడిగినవారి గురించి అవతలి పక్షానికి ఉప్పందించి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలోనూ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, పౌరులు కోరిన సమాచారాన్ని అందించేందుకు తప్పనిసరిగా ఒక అధికారి ఉండాలన్న నియమం ఉంది. కానీ అస్తవ్యస్థ ఆచరణతో సమాచారం బయటకు రావడానికి ఏళ్లూ పూళ్లూ పడుతోంది. ఇన్నివైపులనుంచి ఆర్టీఐ చట్టానికి అందరూ తూట్లు పొడుస్తుంటే ఇప్పుడు స్వయానా సమాచార కమిషనే ఆ పనికి పూనుకోవడం ఆందోళనకరం. సమాచార కమిషనర్లకు ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ, పౌరులకు చట్టాలు కల్పిస్తున్న హక్కులపై గౌరవం ఉండాలి. ప్రభుత్వ విభాగాల్లో అవినీతిని పారదోలాలన్న దృఢ సంకల్పం ఉండాలి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం నేపథ్యం, దాని పూర్వాపరాలు క్షుణ్ణంగా తెలియాలి. ఈ లక్షణాలు కొరవడినవారిని అందలం ఎక్కిస్తే అది కోతికి దొరికిన కొబ్బరికాయ చందం అవుతుంది. -
బండి బదిలీ.. భలే బురిడీ
సాక్షి, హైదరాబాద్: వాహనాల యాజమాన్య బదిలీల్లో అక్రమాల దందా కొనసాగుతోంది. ఆలస్యంగా నమోదయ్యే వాహనాలపై పెనాల్టీలు విధించాల్సి ఉండగా కొందరు ఆర్టీఏ అధికారులు దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా వాహనాలు ఒకరి నుంచి ఒకరికి యాజమాన్య బదిలీ చేసేందుకు మోటారు వాహన నిబంధనల ప్రకారం 30 రోజుల గడువు విధిస్తారు. గడువులోపు కొనుగోలు చేసిన వాహనదారు తనకు విక్రయించిన వ్యక్తి నుంచి నిరభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకొని తన పేరిట వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. కానీ కొందరు వాహనదారులు ఎన్ఓసీ తీసుకున్న తర్వాత కొన్ని నెలల పాటు వాహనాలను తమ పేరిట నమోదు చేసుకోకుండానే తిరుగుతున్నారు. ఇలా వాహన యాజమాన్య బదిలీ కాకుండా తిరిగే వాహనాలపై ఎన్ఓసీలు జారీ చేసినప్పటి నుంచి నమోదయ్యే గడువు వరకు పెనాలిటీలు విధిస్తారు. ఇది ద్విచక్ర వాహనాలకు నెలకు రూ.300, కార్లకు రూ.500 చొప్పున ఉంటుంది. కొంతమంది వాహనదారులు ఎన్ఓసీలు తీసుకొన్న తర్వాత కూడా సకాలంలో వాహనాలను బదిలీ చేసుకోకపోవడంతో భారీ మొత్తంలో పెనాల్టీలు చెల్లించాల్సి వస్తోంది. ఇక్కడే కొందరు ఆర్టీఏ సిబ్బంది దళారులతో కలిసి చక్రం తిప్పుతున్నారు. వాహనదారులు చెల్లించాల్సిన పెనాల్టీలను నామమాత్రంగా విధించి మిగతా మొత్తాన్ని జేబులో వేసుకుంటున్నారు. ఎన్ఓసీ తీసుకున్న తర్వాత నెలల తరబడి నమోదు కాకుండా తిరిగే వాహనాలపై సగటున రూ.5000 నుంచి రూ.10,000 వరకూ పెనాల్టీలు నమోదవుతాయి. కానీ దాన్ని రూ.1000కు పరిమితం చేస్తున్నట్లు తెలిసింది. (చదవండి: ఆసియాలోనే తొలిసారిగా ‘థోరాసిక్ రోబోటిక్ సర్జరీ’) -
బ్యాంకుల్లో కుంభకోణాలు,ఏ బ్యాంకులో ఎన్నివేల కోట్ల మోసం జరిగిందంటే!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) మోసాల పరిమాణం 51 శాతం తగ్గిందని, రూ.40,295 కోట్లకు దిగి వచ్చిందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. 2020–21లో 12 పీఎస్‌బీలు రూ. 81,922 కోట్ల మేర మోసాలను రిపోర్ట్ చేసినట్లు తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌర్ చేసిన దరఖాస్తు విషయంలో ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది. మరోవైపు, పరిమాణం తగ్గినప్పటికీ, సంఖ్యాపరంగా మాత్రం మోసాల ఉదంతాలు ఆ స్థాయిలో తగ్గలేదని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో 9,933 ఉదంతాలు చోటు చేసుకోగా 2021–22లో ఈ సంఖ్య కేవలం 7,940కి మాత్రమే తగ్గింది. 2022 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యధికంగా రూ.9,528 కోట్ల మేర మోసాలకు సంబంధించి 431 ఉదంతాలు నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.6,932 కోట్లు (4,192 కేసులు), బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.3,989 కోట్లు (280 కేసులు), యూనియన్ బ్యాంక్‌లో రూ.3,939 కోట్ల (627 కేసులు) మేర మోసాలు నమోదయ్యాయి. బ్యాంకులు పంపే నివేదికలను బట్టి డేటాలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరగవచ్చని ఆర్బీఐ తెలిపింది. చదవండి👉బ్యాంకులంటే విజయ్ మాల్యాకు గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి! -
అనుమతి తీసుకోవాలని చట్టంలో లేదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసుకునే వారికి పీఐవోలు సమాచారం ఇచ్చే ముందు సంబంధిత విభాగం ఉన్నతాధికారి అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని హైకోర్టు స్పష్టం చేసింది. విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమాచార అధికారులు (పీఐవో) ఇతర అధికారుల సాయం కోరవచ్చని వెల్లడించింది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లో అనుమతి తీసు కోవాలని పేర్కొనడం సరికాదని అభిప్రాయ పడింది. సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు తమ శాఖల అధిపతులు, ముఖ్య కార్యదర్శులు, కార్య దర్శులు, ప్రత్యేక కార్యదర్శుల నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈనెల 13న జారీ చేసిన సర్క్యులర్ అమ లును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఆర్టీఐ చట్టంపై సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని చిత్రపు శ్రీధృతి పార్టీ ఇన్ పర్సన్‌గా, ఆర్టీఐ ఉద్యమకారుడు గంజి శ్రీనివాసరావులు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి... సమాచారం ఇచ్చే ముందు పీఐవోలు ముందస్తు అనుమతి పొందాలని చట్టంలో ఎక్కడా లేదని, ఈ తరహా నిబంధనలతో సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు నివే దించారు. పీఐవోలు కొన్ని సందర్భాల్లో అసంపూర్ణ సమాచారం ఇస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని, ఈ నేపథ్యంలో చట్టాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగానే సీఎస్ ఈ ఉత్తర్వు లిచ్చారని ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ నివేదించారు. పీఐవోలు కోరిన సమాచారం ఇవ్వడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయిస్తు న్నారని తెలిపారు. సమాచారం ఇచ్చే ముందు ఇతర అధికారుల సాయం కోరవచ్చని చట్టంలోని సెక్షన్ 5(4) స్పష్టం చేస్తోందని వివరించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. పీఐవోలు సాయం కోరడం వేరని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవడం వేరని, అనుమతి తీసుకోవాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. -
తండ్రితోనే కాపురం పెట్టిందని తెలిసి షాకైన కొడుకు
లక్నో: నాన్న చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. కనిపించడం లేదంటూ ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఒక కొడుకు. కాగా ఆర్టీఐ తన నాన్నకు సంబంధించిన సమాచారం దొరికిందని చెప్పగానే జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసుకు సంతోషంగా వెళ్లాడు. కానీ వారు ఇచ్చిన వివరాలు చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. కారణం ఆ యువకుడి నాన్న మరో యువతిని పెళ్లిచేసుకొని ఆమెతో కాపురం పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యువతి ఎవరో కాదు.. ఐదేళ్ల కిత్రం ఆ యువకుడి మాజీ భార్యే కావడం విశేషం. ఇప్పుడు తన మాజీ భార్యనే పిన్నిగా పిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 2016లో సదరు యువకుడు మైనర్‌గా ఉన్నప్పుడు ఒక మైనర్ అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ యువకుడు రోజు తాగి వచ్చి ఆమెను వేధించేవాడు. ఆరు నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. తర్వాత ఆ యువకుడు ఊరి పెద్దల మధ్య ఇక ఎప్పుడు గొడవపడనని చెప్పాడు. కానీ ఆ యువతి అందుకు ఒప్పుకోకుండా విడాకులు తీసుకుంది. కాగా ఆ యువకుడి తండ్రి సానిటేషన్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి. ఇంటి అవసరాలతో పాటు కొడుకుకు కూడా డబ్బులు తనే ఇస్తుండేవాడు. ఇటీవలే కొన్ని రోజుల నుంచి తన తండ్రి కనిపించడం లేదని.. ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయి సాంబల్ ప్రాంతంలో ఉంటున్నారని తెలుసుకొని ఆర్టీఐకి దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి జాడ తెలిసిందనగానే జిల్లా పంచాయతీ కార్యాలయానికి చేరుకొని వారు అందించిన వివరాలు చదువుకున్నాడు. తన మాజీ భార్యనే నాన్న మళ్లీ పెళ్లి చేసుకున్నాడని, అక్కడే ఆమెతో కాపురం పెట్టాడని తెలుసుకున్నాడు. వెంటనే బసౌలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో విషయం అర్థం చేసుకున్న పోలీసులు జూలై 3న ఇరు వర్గాలను పిలిచి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. అయితే యువకుడి తండ్రి భార్య మాత్రం ఇప్పుడు వరుసకు కొడుకు అయ్యే అతనితో కలిసి ఉండలేనని పేర్కొంది. తన రెండో భర్తతోనే సంతోషంగా ఉన్నానని.. అతన్ని మా దగ్గరకు పంపొద్దని పోలీసులకు చెప్పింది. పోలీసులు మరోసారి దీనిపై మాట్లాడదమని చెప్పి వారిని అక్కడినుంచి పంపించేశారు. -
టికెట్ లేకుండా 27 లక్షల మంది
న్యూఢిల్లీ: టికెట్ లేకుండా రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించడానికే అనుమతి లేకపోగా... 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 27 లక్షల మంది టికెట్లు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తూ అధికారులకు పట్టుబడ్డారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్‌కు సమాధానంగా రైల్వే శాఖ ఈ వివరాలు వెల్లడించింది. 2019–20తో పోలిస్తే ఇది 25 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం. పట్టుబడిన 27 లక్షల మంది నుంచి రూ. 143.82 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించింది. 2019–20 సంవత్సరంలో 1.10 కోట్ల మంది టికెట్లు కొనకుండా ప్రయాణిస్తూ పట్టుబడగా, వారి నుంచి రూ. 561.73 కోట్లు వసూలు చేశారు. ఎప్పటి నుంచో ఉన్నదే..: భారత రైల్వేలో టికెట్లు కొనకుండా ప్రయాణించే సమస్య ఎప్పటి నుంచో ఉందని, రైల్వేకు అది ఓ సవాలు అని రైల్వే శాఖ అధికార ప్రతినిధి డీజే నరైన్ పేర్కొన్నారు. ప్రయా ణికులకు దానిపై హెచ్చరికలు చేస్తున్నామని, జరిమానాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలి పారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2020–21 సంవత్సరంలో తక్కువ రైళ్లు తిరిగాయి, అయినప్ప టికీ భారీ స్థాయిలో టికెట్లు లేకుండా ప్రయాణించినవారు పట్టుబడ్డారు. గతేడాది ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు లాక్డౌన్ కారణంగా రైళ్లు తిరగలేదు. ఆ తర్వాత కూడా కొన్ని రైళ్లు మాత్రమే తిరిగాయి. టికెట్ విజయవంతంగా బుక్ అయిన వారినే రైల్వేస్టేషన్‌లోకి అనుమతించినా ఈ స్థాయిలో టికెట్ లేకుండా పట్టుబడటం గమనార్హం. -
‘ప్రధాని మాస్క్ విలువ వెల్లడించలేం’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ఎలాం టి మాస్కు ధరిస్తు న్నారు? దాని విలువ ఎంత? ఆయనకు వ్యాక్సిన్ వేశారా? అన్న సందేహాలతో హైదరాబాద్‌కి చెందిన రాబిన్ గతేడాది డిసెంబర్లో ఆర్టీఐ కింద ప్రధాన మంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పీఎంవో తాజాగా స్పందించింది. ప్రధాని ధరించే మాస్కు వివరాలు, వ్యాక్సినేషన్ వివరాలు వ్యక్తిగతమైనవి పేర్కొంది. ఆర్టీఐ యాక్ట్‌లోని సెక్షన్ 8(1) కింద మీరు అడిగిన వివరాలు వెల్లడించలేమని స్పష్టం చేసింది. ప్రధానికయ్యే ఈ ఖర్చును ప్రభుత్వం భరించదని సమాధానమిచ్చింది. -
స్పీడ్‌పోస్టు, కొరియర్లలో డ్రగ్స్
సాక్షి, హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ దందా జరుగుతోందని మరోసారి తేటతెల్లమైంది. ప లువురు విదేశీయులు ఇక్కడ మాదక ద్రవ్యా లు విక్రయిస్తున్నారని స్వయంగా ఎక్సైజ్‌శాఖ అంగీకరించింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) స మాచార హక్కు చట్టం ద్వారా వేసిన ప్రశ్నకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిస్తూ పలు విషయాలను వెల్లడించింది. హైదరాబాద్‌లో అనేక మార్గాల్లో డ్రగ్స్ విక్రయాలు జరుగు తుండగా.. ఈ వ్యవహారాలను మొత్తం విదేశీయులే నడిపిస్తున్నారని, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. నేరుగా ఇంటికే స్పీడ్ పోస్టు ద్వారా నిషేధిత మాదకద్రవ్యాలు చేరుతున్నాయని ఎక్సైజ్‌శాఖ బాంబు పేల్చింది. కొనుగోలుదారులు ఆర్డర్ చేసే డ్రగ్స్ గ్రా ముల్లో ఉండటంతో వాటిని గుర్తించడం కష్టమని, విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఉత్తరాన్ని తనిఖీ చేయడం సాధ్యం కాదని అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. గుట్టుగా సాగుతున్న ఈ దందాను మరింత విస్తరించేందుకు విద్యార్థులను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎక్సైజ్‌శాఖ అరెస్టు చేసిన డ్రగ్స్ విక్రయదారుల్లో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉండటం విస్తరించిన నెట్వర్క్ తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిని మాదకద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయా కాలేజీలు బహిష్కరించాయి. ఇంగ్లండ్, జర్మనీల నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ నేరుగా ఇంటికే చేరుతున్నాయన్న విషయం కూడా వెల్లడైంది. స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీలను భారత్‌కు దిగుమతి చేస్తున్నారని గుర్తించారు. అదే సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ఓ ఫార్మాలో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. దర్యాప్తు పైపైనే.. డ్రగ్స్ కేసుల విచారణలో ఎక్సై జ్ శాఖ లోతుగా వెళ్లడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నిందితుల్లో అధికశాతం పలుకు బడి కలిగిన రాజకీయ, సంప న్న కుటుంబాల వారు కావడం తో విచారణ ముందుకుసాగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 2017లోనూ ఇదే తరహాలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ కేసులో 60 మంది పేర్లు జాబితాలో పొందుపరిచిన అధికారులు, మరో 12 మంది సినీ ప్రముఖులనూ గుర్తించారు. తొలుత విచారణ నిష్పక్షపాతంగానే సాగినా.. చార్జిషీట్లలో ఎక్కడా సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కేసు పక్కదారి పట్టిందన్న విమర్శలకు బలం చేకూర్చింది. విద్యార్థులు బలి కాకుండా చూడాలి: పద్మనాభరెడ్డి, ఎఫ్‌జీజీ సెక్రటరీ హైదరాబాద్‌లో విస్తరిస్తోన్న డ్రగ్స్ కల్చర్‌పై ప్రభుత్వం స్పందించాలి. మాదకద్రవ్యాలకు విద్యార్థులు అలవాటుపడితే... అది మొత్తం దేశంపైనే చెడు ప్రభావం చూపుతుంది. ఇకనమోదైన కేసులను నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి. నిందితులెవరైనా శిక్ష పడేలా చూడాలి. -
తెలంగాణకు భారీగా పీపీఈ కిట్లు, మాస్కులు
సాక్షి, హైదరాబాద్ : కరోనా సాయం విషయంలో కేంద్రం తెలంగాణకు భారీగానే చేయూతనందించింది. ఈ విషయం కేంద్ర ఆరోగ్య శాఖ స్వయంగా వెల్లడించింది. తెలంగాణకు కరోనా విషయంలో వైద్య పరంగా ఎలాంటి సహాయం అందించారో అన్న విషయంపై కోదాడకు చెందిన జలగం సుధీర్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి స్పందించిన కేంద్రం.. కరోనా సాయంలో భాగంగా తెలంగాణకు 1,400 వెంటిలేటర్లు, 10.9 లక్షల పీపీఈ కిట్లు, 2.44 లక్షల ఎన్–95 మాస్కులు, 42.50 లక్షల హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు అందజేసినట్లు వివరించింది. హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ అనే సంస్థకు ఈ ప్రొక్యూర్మెంట్–డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు అప్పజెప్పినట్లు.. ఆ సంస్థ ద్వారా మాస్కులు, కిట్లు ఇతర సాయాలు తెలంగాణకు పంపినట్లు తెలిపింది.(కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి) కుటుంబసభ్యులకు కరోనా బాధితుల సమాచారం గాంధీ ఆస్పత్రి : గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యసేవలు, క్షేమ సమాచారాన్ని కుటుంబసభ్యులకు అందించాలని వైద్యమంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. వైద్య ఉన్నతాధికారులతో కలిసి సోమవారం సాయంత్రం ఆయన గాంధీ ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రి పాలనా యంత్రాంగం, పలు విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆస్పత్రిలో ఉన్న బాధితుల సమాచారం తెలియక కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారని దృష్టికి వచ్చిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రోజూ రెండుసార్లు బాధితుల సమాచారాన్ని కుటుంబసభ్యులకు ఫోన్‌ద్వారా వివరించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. -
రూ. 68,607 కోట్ల బాకీల రైటాఫ్
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది. ఆర్ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్.. ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరోవైపు, డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అందుకే, దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ 2019 సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది.