నియామక కమిటీ సమావేశంలో కేసీఆర్, జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టుబుద్ధా మురళి నియమి తులయ్యారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపా దించగా.. శుక్రవారం గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. సమాచార హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకానికి ఏర్పాటైన కమిటీ.. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమైంది.
కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రతిపక్షనేత జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, అధర్‌సిన్హా, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. తొలి దశలో రాజ సదారాం, బుద్ధా మురళిల నియామకానికి అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదన లను వెంటనే గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీచేసింది. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.
అసెంబ్లీ నుంచి ఆర్‌టీఐకి..
ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కార్యదర్శిగానే కొనసాగారు. వాస్తవానికి ఆయన నాలుగేళ్ల కిందే రిటైర్ కావాల్సి ఉన్నా.. తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాయి. తాజాగా ఆగస్టు 31న రాజ సదారాం పదవీ విరమణ చేశారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా నామినేట్ చేసింది.
సీనియర్ జర్నలిస్టుకు చోటు
సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రభూమిలో జనాంతికం పేరుతో రాజకీయ వ్యంగ్య కాలమ్ నిర్వహించడంతో పాటు, రాజకీయ, సామాజిక మార్పులు, రాజకీయ పరిణామా లపై వ్యాసాలు రాశారు. జనాంతికం, ఓటమే గురువు పుస్తకాలు, కథలు రాశారు.
తొలిసారిగా ప్రగతిభవన్‌లోకి జానారెడ్డి
ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తొలిసారిగా శుక్రవారం ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారు. సమాచార కమిషన్ సభ్యుల నియామక కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడికి రాగానే మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ తదితరులు జానారెడ్డికి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు.