Raja Sadharam
-
ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ సదారాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టుబుద్ధా మురళి నియమి తులయ్యారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపా దించగా.. శుక్రవారం గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. సమాచార హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకానికి ఏర్పాటైన కమిటీ.. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రతిపక్షనేత జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, అధర్‌సిన్హా, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. తొలి దశలో రాజ సదారాం, బుద్ధా మురళిల నియామకానికి అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదన లను వెంటనే గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీచేసింది. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అసెంబ్లీ నుంచి ఆర్టీఐకి.. ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కార్యదర్శిగానే కొనసాగారు. వాస్తవానికి ఆయన నాలుగేళ్ల కిందే రిటైర్ కావాల్సి ఉన్నా.. తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాయి. తాజాగా ఆగస్టు 31న రాజ సదారాం పదవీ విరమణ చేశారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా నామినేట్ చేసింది. సీనియర్ జర్నలిస్టుకు చోటు సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రభూమిలో జనాంతికం పేరుతో రాజకీయ వ్యంగ్య కాలమ్ నిర్వహించడంతో పాటు, రాజకీయ, సామాజిక మార్పులు, రాజకీయ పరిణామా లపై వ్యాసాలు రాశారు. జనాంతికం, ఓటమే గురువు పుస్తకాలు, కథలు రాశారు. తొలిసారిగా ప్రగతిభవన్‌లోకి జానారెడ్డి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తొలిసారిగా శుక్రవారం ప్రగతి భవన్లో అడుగుపెట్టారు. సమాచార కమిషన్ సభ్యుల నియామక కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడికి రాగానే మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ తదితరులు జానారెడ్డికి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. -
రాజ సదారాం సేవలు చిరస్మరణీయం
- పదవీ విరమణ వీడ్కోలు సభలో స్పీకర్ మధుసూదనాచారి - ఆయన సేవలను వినియోగించుకుంటాం: హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: శాసనసభకు రాజ సదారాం చేసిన సుదీర్ఘ సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. శాసనసభ కార్యదర్శిగా సదారాం పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. శాసనసభ చక్కగా నడవడానికి సదారామే కారణమని కొనియాడారు. తామిద్దరం వరంగల్ వాళ్లమేనని, జయశంకర్ శిష్యులమని, ఇద్దరమూ కేసీఎం కళాశాల విద్యార్థులమని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ బిల్లు సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సదారాం సేవలను భవిష్యత్తులో తమ ప్రభుత్వం వినియోగించుకుం టుందని పేర్కొన్నారు. మండలిని సజావుగా నడిపేందుకు సదారాం అనుభవం తనకు ఎంతగానో ఉపయోగపడిందని మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి విలువైన సూచనలు చేసేవారని మంత్రి ఈటల పేర్కొన్నారు. శాసనసభకు విలువైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తినే కొత్త కార్యదర్శి కొనసాగించాలని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. రాష్ట్ర శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవడంలో ఆయన పాత్ర మరువలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శాసనసభను బాగా నడపడంలో ఎంతో కృషి చేశారని హోంమంత్రి నాయిని కొనియాడారు. పదవీ విరమణ చేస్తున్నం దుకు ఒకింత బాధ, సంతోషం కలుగుతోందని సదారాం పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజ సదారాం?
శాసనసభ కార్యదర్శిగా త్వరలో ముగియనున్న పదవీకాలం సాక్షి, హైదరాబాద్: శాసనసభ కార్యదర్శి రాజ సదారాం పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆయనను సమాచార హక్కు (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వ స్థాయిలో సూత్రప్రాయ నిర్ణయం జరిగినట్లు సమాచారం. రాజ సదారాం పదవీ కాలాన్ని ప్రభుత్వం నాలుగు పర్యాయాలు పొడిగించింది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సార్లు పదవీ కాలాన్ని పొడిగించాయి. దీంతో మొత్తంగా ఆయన నాలుగేళ్లు అదనంగా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయనను మరో ఏడాది కొనసాగించడం కంటే మరో పోస్టుకు ఎంపిక చేయాలన్న నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సదారాం పదవీకాలం పొడిగింపుపై కొందరు ఉద్యోగులు మండలి చైర్మన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు. కార్యదర్శికి, సిబ్బందిలో కొందరికి పొసగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదీగాక పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి రెగ్యులర్ పోస్టుల్లో నియమించుకోవద్దన్న ప్రభుత్వ ఉత్తర్వులను కాదని కొందరికి పోస్టింగులు ఇవ్వడంపై రెగ్యులర్ ఉద్యోగులు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ కారణంగానే వారు చైర్మన్‌ను కలసి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే నాలుగు పర్యాయాలు పదవీ కాలాన్ని పొడిగించి నందున, ఇక చాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.