ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా రాజ సదారాం?
శాసనసభ కార్యదర్శిగా త్వరలో ముగియనున్న పదవీకాలం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ కార్యదర్శి రాజ సదారాం పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆయనను సమాచార హక్కు (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వ స్థాయిలో సూత్రప్రాయ నిర్ణయం జరిగినట్లు సమాచారం. రాజ సదారాం పదవీ కాలాన్ని ప్రభుత్వం నాలుగు పర్యాయాలు పొడిగించింది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు సార్లు పదవీ కాలాన్ని పొడిగించాయి. దీంతో మొత్తంగా ఆయన నాలుగేళ్లు అదనంగా కొనసాగారు.
ఈ నేపథ్యంలో ఆయనను మరో ఏడాది కొనసాగించడం కంటే మరో పోస్టుకు ఎంపిక చేయాలన్న నిర్ణయం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సదారాం పదవీకాలం పొడిగింపుపై కొందరు ఉద్యోగులు మండలి చైర్మన్‌ను కలిసి ఈ అంశంపై చర్చించారు. కార్యదర్శికి, సిబ్బందిలో కొందరికి పొసగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదీగాక పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి రెగ్యులర్ పోస్టుల్లో నియమించుకోవద్దన్న ప్రభుత్వ ఉత్తర్వులను కాదని కొందరికి పోస్టింగులు ఇవ్వడంపై రెగ్యులర్ ఉద్యోగులు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. ఈ కారణంగానే వారు చైర్మన్‌ను కలసి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే నాలుగు పర్యాయాలు పదవీ కాలాన్ని పొడిగించి నందున, ఇక చాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.