
రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు
1.22 లక్షల మంది మృత్యువాత.. గాయపడ్డవారు 2.58 లక్షలు
ఆర్టీఐ సమాచారంతో వెలుగులోకి వివరాలు
సాక్షి ముంబై: రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 1.22 లక్షల మంది మృత్యువాత పడగా 2.58 లక్షల మంది తీవ్రంగా గాయపడినట్లు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు అటు ప్రాంతీయ రవాణా కార్యాలయాల (ఆర్టీఓ) అధికారులు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లపై క్రమశిక్షణ పేరట ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
కానీ ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్ల దుస్ధితిని ఎవరూ పట్టించుకోవడం లేదని, తప్పంతా తమమీదే మోపడం అన్యాయ మని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా వెళుతున్న వాహనం ముందు ఆకస్మాత్తుగా గుంతలు ప్రత్యక్షం కావడం, రిపేరు వచ్చి రోడ్డుపై లేదా పక్కన నిలిపి ఉంచిన వాహనాల వల్ల అత్యవసరంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతున్నారు. దీని వల్ల వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.
పోలీసులదాకా వచ్చేవి కొన్నే...
కాగా పెద్ద ప్రమాదాలకు సంబంధించిన కేసులే పోలీసు స్టేషన్లలో నమోదవుతున్నాయి. వాటి వల్లే ప్రమాదాల సంఖ్య తెలుసుకునే అవకాశముంటుంది. చిన్నచిన్న ప్రమాదాల విషయంలో బాధితుడు, కారకుల మద్య సయోధ్య కుదిరి కేసు పోలీసులదాకా వెళ్లని సందర్భాలు లక్షల్లో ఉంటాయి. ఇలా 2016 నుంచి 2024 డిసెంబరు వరకు గడచిన తొమ్మిదేళ్లలో 3,03,531 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,22,270 మంది మృతి చెందగా 2,58,723 మంది గాయపడినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను బట్టి తెలిసింది.
ముంబైదే మొదటిస్థానం...
రోడ్డు ప్రమాదాల్లో దేశ ఆరి్ధక రాజధాని ముంబై నగరం మొదటి స్ధానంలో ఉండగా మృతుల సంఖ్యకు సంబంధించి పుణే జిల్లా అగ్రస్ధానంలో ఉంది. ముంబైలో 23,519 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 3,802 మృత్యువాత పడ్డారు. ఇక అతి తక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగిన జిల్లాగా సోలాపూర్ నిలిచింది. ఈ జిల్లాలో 1,925 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 694 మంది మరణించారు. అలాగే సింధుదుర్గ్ జిల్లాలో 1,982 ప్రమాదాలు జరగ్గా 652 మంది బలయ్యారు.
ఎన్ని చర్యలు చేపట్టినా...
స్టేట్, నేషనల్ హై వే లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీఓ అధికారుల అనేక విధాలుగా ప్రయతి్నస్తున్నారు. ప్రమాదకర మలుపులవద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఏదైనా పల్లె, గ్రామం మొదట్లో స్పీడ్‌బ్రేకర్ల ఏర్పాటుతోపాటు . జాతీయ, రాష్ట్ర రహదారులతోపై వేగ నియంత్రణ కోసం అక్కడక్కడా స్పీడ్‌గన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానా విధిస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినాసరే రోడ్డు ప్రమాదాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment