Information Commission
-
సుపరిపాలన సాకారం కావాలంటే...
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినోత్సవంగా 2014 నుంచి జరుపుకొంటున్నాం. ప్రధానిగా ఉన్నప్పుడు మన పురాణ, ఇతిహాసాలు చెప్పిన రాజధర్మాన్ని పాటించి సుపరిపాలన చేశారాయన. అందుకే ఆయన పాలనకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించి, కొనసాగిస్తోంది. రామాయణంలో రాముడు భరతుడికి సుపరిపాలన గురించి చెబుతూ రాజ ధర్మాన్ని వివరిస్తాడు. మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు సుపరిపాలన గురించి వివరించాడు. భీష్ముడి ఉద్దేశంలో సుపరిపాలన ఆకాంక్షించే ప్రభువులు నైతిక విలువలను విస్మరించరాదు. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సుపరిపాలనకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. ‘ప్రజల సంతోషమే రాజు సంతోషం. ప్రజల సంక్షేమంలోనే ప్రభువు సంక్షేమం ఉంది. రాజు సంక్షేమ కోసం కాకుండా ప్రజల సంతానం కోసం మాత్రమే పరిపాలన గావించాలి.’ సుపరిపాలనలో... పరిపాలనను వికేంద్రీ కరించాలి. కానీ మన దేశంలో ప్రభుత్వ పాలన కేంద్రీకృతమైనట్లు విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధి కారాలు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాలను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కొంత బలోపేతం చేసినప్పటికీ అవి అనేక రాష్ట్రాలలో నిధులు లేని విధులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. సత్వర న్యాయం లభించాలి. అనేక కారణాల వల్ల ప్రజలకు న్యాయస్థానాల్లో సత్వర న్యాయం లభించడం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. తగిన సమయంలో లభించని న్యాయం అన్యాయంతో సమానం. అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా, లక్షల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసుల సత్వర నివారణకు అవసరమైన సంస్కరణను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.సుపరిపాలన అంటే అవినీతి రహిత పాలన. దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాలనలో అవినీతి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవినీతి నిరోధక శాఖలైన సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమి షన్లను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పని చేయనివ్వాలి. అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు సీబీఐని పంజరంలో చిలకలా అభివర్ణించడం గమనార్హం. అవినీతికి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. ఇందుకోసం 2005లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం హర్షించదగ్గ పరిణామం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్లోనూ, రాష్ట్రాల సమాచార కమిషన్లోనూ ఏర్పడిన ఖాళీలను భర్తీచేయడం లేదు. ఇటువంటి చర్యలు సుపరిపాలనకు వ్యతిరేకం. సుపరిపాలనలో ప్రజలకు నిర్ణయాలలో తగిన పాత్ర ఉండాలి. ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, చట్ట బద్ధమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వాములు కావాలి. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సదుద్దేశంతో రూపొందించిప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ చట్టం ఆశయాలు నెర వేరలేదు. ఈ చట్టాన్ని పకడ్బందిగా అమలుచేయడం కోసం అవసరమైన చర్యలు గైకొనాలి. ఇవన్నీ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యం అవుతుంది.– డా‘‘ పి. మోహన్ రావుప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ చైర్మన్ ‘ 99495 95509(రేపు వాజ్‌పేయి శత జయంతి ముగింపు: సుపరిపాలనా దినోత్సవం) -
RTI Act: సామాన్యుడి వజ్రాయుధం
ఎన్నో ఏళ్ళ ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం భారత్‌లో అమలులోకి వచ్చింది. ప్రభుత్వాలు ప్రజలకు మరింత జవాబుదారీగా ఉండటానికీ, పౌరులకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచడానికీ ఈ చట్టం రూపొందింది. తెలంగాణ సమాచార కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2017 సెప్టెంబర్ 9న వేరయింది. ఈ సమయంలో బదిలీ అయిన పిటీషన్లు 6,825 కలుపుకొని... తెలంగాణ రాష్ట్రంలో దాఖలైన మొత్తం దరఖాస్తులు 38,000. అందులో ఇప్పటివరకూ 32,000 పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 6,000 మాత్రమే. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పుడు కూడా కొంతకాలం టెలిఫోన్ ద్వారా కేసులు విచారించి, పరిష్కరించిన చరిత్ర మన కమిషన్‌ది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక బోర్డు ఏర్పాటై ఉంటుంది. దాని మీద ప్రజా సమాచార అధికారి ఫోన్ నంబర్ ఉంటుంది. తమకు కావలసిన సమాచారం కోసం ఆ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి 10 రూపాయలు చెల్లించి లేక తెల్ల రేషన్ కార్డు ఉంటే ఒక జిరాక్స్ పెట్టి సెక్షన్ 6(1) కింద దరఖాస్తు చేసుకుంటే చాలు. గ్రామపంచాయతీ కార్యాలయంలో అయితే ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మండల స్థాయిలో రూ. 5, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలలో రూ. 10 రుసుం చెల్లించాలి. (క్లిక్ చేయండి: జడ్జి ప్రశ్నలకు జవాబులున్నాయా?) మీరు దరఖాస్తు చేసుకున్న నాటినుంచి సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో అందులో కోరిన సమాచారం ఇవ్వాలి. 8, 9 సెక్షన్ల కింద మినహాయింపు పొందిన సమాచారం తప్ప... మిగతా సమా చారాన్ని ఇవ్వాలి. సమాచారాన్ని నిరాకరిస్తే మొదటి అప్పిలేట్ అధికారికి సెక్షన్ 19 (1) కింద దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ కూడా సమాచారం నిరాకరిస్తే సెక్షన్ 19 (3), సెక్షన్ 18(1) కింద సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మొత్తం మీద సమాచార హక్కు చట్టాన్ని సామాన్యుడి చేతిలో వజ్రాయుధంగా చెప్పవచ్చు. – డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్, తెలంగాణ సమాచార కమిషనర్ (అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు) -
ఏపీలో కొలువుదీరనున్న సమాచార హక్కు కమిషన్
-
ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ సదారాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (ఆర్టీఐ) ప్రధాన కమిషనర్‌గా ఎస్.రాజ సదారాం, కమిషనర్‌గా సీనియర్ జర్నలిస్టుబుద్ధా మురళి నియమి తులయ్యారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ వారి పేర్లను ప్రతిపా దించగా.. శుక్రవారం గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. సమాచార హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకానికి ఏర్పాటైన కమిటీ.. శుక్రవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సమావేశమైంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రతిపక్షనేత జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, అధర్‌సిన్హా, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28 దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. తొలి దశలో రాజ సదారాం, బుద్ధా మురళిల నియామకానికి అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదన లను వెంటనే గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీచేసింది. వీరు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. అసెంబ్లీ నుంచి ఆర్టీఐకి.. ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులైన రాజ సదారాం సుదీర్ఘ కాలం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా కార్యదర్శిగానే కొనసాగారు. వాస్తవానికి ఆయన నాలుగేళ్ల కిందే రిటైర్ కావాల్సి ఉన్నా.. తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం, అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాయి. తాజాగా ఆగస్టు 31న రాజ సదారాం పదవీ విరమణ చేశారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్టీఐ చీఫ్ కమిషనర్‌గా నామినేట్ చేసింది. సీనియర్ జర్నలిస్టుకు చోటు సమాచార కమిషనర్‌గా నియమితులైన బుద్ధా మురళి సీనియర్ జర్నలిస్టు. యాదాద్రి జిల్లా తుర్కపల్లికి చెందిన ఆయన.. 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రభూమి దినపత్రికలో చీఫ్ రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రభూమిలో జనాంతికం పేరుతో రాజకీయ వ్యంగ్య కాలమ్ నిర్వహించడంతో పాటు, రాజకీయ, సామాజిక మార్పులు, రాజకీయ పరిణామా లపై వ్యాసాలు రాశారు. జనాంతికం, ఓటమే గురువు పుస్తకాలు, కథలు రాశారు. తొలిసారిగా ప్రగతిభవన్‌లోకి జానారెడ్డి ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తొలిసారిగా శుక్రవారం ప్రగతి భవన్లో అడుగుపెట్టారు. సమాచార కమిషన్ సభ్యుల నియామక కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన ప్రగతిభవన్‌కు వెళ్లారు. అక్కడికి రాగానే మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ తదితరులు జానారెడ్డికి స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. -
ఆరు వారాల్లో నియమించండి
సమాచార కమిషనర్ల నియామకంపై ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్లు, ఇతర కమిషనర్లను నియమించే ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంగళవారం ఆదేశించింది. ఆ తరువాత రాతపూర్వకంగా తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కమిషనర్లను నియమించేలా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి ఎం.పద్మనాభయ్య వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. మీకు అదనపు గడువు ఎందుకు? ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ... ప్రధాన కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లను ఆరు వారాల్లో నియమిస్తామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... మీరెప్పటిలోపు నియామకాలు పూర్తి చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ను ప్రశ్నించింది. తమకు మరింత గడువు కావాలని రమేశ్ కోరగా... తెలంగాణ ప్రభుత్వం ఆరు వారాల్లో నియామకాలు పూర్తి చేస్తామంటుంటే మీకు అదనపు గడువు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక సమాచార కమిషన్ ఉండాలని, దీని ప్రకారం తాము ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసుకుంటామని రమేశ్ తెలిపారు. సమాచార కమిషన్ ఏర్పాటునకు అవసరమైన మౌలిక సదుపా యాలను కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లే తాము అదనపు సమయం కోరుతున్నామని రమేశ్ తెలిపారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆరు వారాల్లో ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లను నియమించాల్సిందేనని స్పష్టం చేసింది. -
సమాచార కమిషనర్ల నియామకాలేవీ?
- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు - నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వండి - హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషన్‌కు ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ల నియామకంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ నియామకాలు చేపట్టేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరు తూ స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పిల్ దాఖలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 27న ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఆర్టీఐ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రధాన సమాచార కమిషనర్, పది మంది కమిషనర్లను నియమించాలని పిటిషనర్ పేర్కొన్నారు. 2 రాష్ట్రాలకు సమాచార కమిషన్ ఉమ్మడిగానే ఉందని, 2017 ఏప్రిల్ వరకు ప్రధాన కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారని, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు నలుగురు కమిషనర్ల నియామకా న్ని రద్దు చేసిందని, అదే సమయంలో మిగిలిన ఇద్దరు కూడా పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు లేరని వివరించారు. 2017 ఏప్రిల్ 1 నాటికి కమిషన్‌లో 11,325 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెలా సగటున 900 అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం లేకపోవడం వల్ల సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరకుండా పోతోందన్నారు. కమిషనర్ల నియామకం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. -
రేపు రండి
డీఈఓకు సమాచార కమిషన్ నోటీసులు అడిగిన సమాచారం ఇవ్వరెందుకు? జిల్లాలోని స్కూళ్లపై వివరాలు ఇచ్చేందుకు నిరాకరణ కమిషన్ ఆదేశించినా ఇదే పరిస్థితి వరంగల్ :అలసత్వానికి చిరునామాగా మారిన జిల్లా విద్యాశాఖపై సమాచార కమిషన్ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితులపై అడిగిన సమాచారాన్ని గడువులోపు ఇవ్వకపోవడంపై జిల్లా విద్యాధికారికి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుదారు అడిగిన సమాచారం ఇవ్వడంలో జాప్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం ఇచ్చే విషయంలో జరిగిన ప్రక్రియ వివరాలు తీసుకుని ఫిబ్రవరి 11న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులు ఎక్కువగా ఉన్నాయని.. వసతులు ఎలా ఉన్నాయో తెలపాలని గీసుగొండ మండలం మనుగొండకు చెందిన జె.మురళి డీఈఓకు సమాచార హక్కు చట్టం కింద గతేడాది డిసెంబరు 23న దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు అడిగిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాశాఖ తిరస్కరించింది. దీంతో ఫిర్యాదుదారు రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. సమాచార హక్కు కమిషన్ ఆదేశాల మేరకు.. జిల్లా విద్యా శాఖ అధికారులు సమాచారం ఇచ్చేందుకు అంగీకరించారు. తర్వాత అరకొర సమాచారం ఇచ్చారు. దీనిపై అసంతృప్తి చెందిన ఫిర్యాదుదారు సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సమాచార కమిషన్ డీఈవో చంద్రమోహన్ ఈ నెల 11న తమ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇదీ కథ.. జిల్లాలో దాదాపు 1,434 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై అప్పటి జిల్లా యంత్రాంగం మొదట పట్టించుకోలేదు. విమర్శలు ఎక్కువ కావడంతో స్పందించింది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలోని వసతులు, వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను సేకరించేందుకు తనిఖీల ప్రక్రియ చేపట్టింది. పది స్కూళ్లను పరిశీలించిన విద్యాశాఖ ఆరు స్కూళ్లకు కోట్ల రూపాయలలో జరిమానా విధించింది. దీనికి నిరసనగా ప్రైవేటు స్కూళ్ల యూజమాన్యాలు ధర్నా చేశారు. చివరికి అధికార పార్టీలోని ప్రజాప్రతినిధుల జోక్యంతో ఈ విషయం సద్దుమణిగింది. విద్యా శాఖ తీసుకునే చర్యల విషయంలో వెనక్కి తగ్గింది. అప్పటి నుంచి జరిమానా వసూలు అంశాన్ని కనీసం పట్టించుకోలేదు. దీనిపై పలువురు మళ్లీ విద్యా శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం రాష్ట్ర సమాచార కమిషన్ వరకు చేరింది. -
రాళ్లబండి కవితాప్రసాద్‌కు 25వేలు జరిమానా
హైదరాబాద్ : రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్‌కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది. తెలుగు మహాసభల ఖర్చుకు సంబంధించి ఇంతవరకూ ఆయన వివరాలు సమర్పించలేదని సమాచారం. అంతే కాకుండా ఆడిట్ విషయంలో అడిగిన సమాచారం సకాలంలో అందించకపోవటంతో పాటు, తప్పుడు సమాచారాం ఇచ్చారంటూ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని సమాచార హక్కు కమిషన్.... ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా, ఎటువంటి విచారణకైనా తాను సిద్దమేనని రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ తెలుగు మహాసభలు, రవీంద్ర భారతి హాలు కేటాయింపునకు సంబంధించి అడిగిన వివరాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు.