ఆరు వారాల్లో నియమించండి
సమాచార కమిషనర్ల నియామకంపై ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉభయ రాష్ట్రాల్లో సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్లు, ఇతర కమిషనర్లను నియమించే ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంగళవారం ఆదేశించింది. ఆ తరువాత రాతపూర్వకంగా తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కమిషనర్లను నియమించేలా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రధాన కార్యదర్శి ఎం.పద్మనాభయ్య వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
మీకు అదనపు గడువు ఎందుకు?
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ... ప్రధాన కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లను ఆరు వారాల్లో నియమిస్తామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ... మీరెప్పటిలోపు నియామకాలు పూర్తి చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్‌ను ప్రశ్నించింది. తమకు మరింత గడువు కావాలని రమేశ్ కోరగా... తెలంగాణ ప్రభుత్వం ఆరు వారాల్లో నియామకాలు పూర్తి చేస్తామంటుంటే మీకు అదనపు గడువు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 15(1) ప్రకారం ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక సమాచార కమిషన్ ఉండాలని, దీని ప్రకారం తాము ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసుకుంటామని రమేశ్ తెలిపారు. సమాచార కమిషన్ ఏర్పాటునకు అవసరమైన మౌలిక సదుపా యాలను కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అందువల్లే తాము అదనపు సమయం కోరుతున్నామని రమేశ్ తెలిపారు. ఈ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆరు వారాల్లో ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లను నియమించాల్సిందేనని స్పష్టం చేసింది.