
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినోత్సవంగా 2014 నుంచి జరుపుకొంటున్నాం. ప్రధానిగా ఉన్నప్పుడు మన పురాణ, ఇతిహాసాలు చెప్పిన రాజధర్మాన్ని పాటించి సుపరిపాలన చేశారాయన. అందుకే ఆయన పాలనకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించి, కొనసాగిస్తోంది. రామాయణంలో రాముడు భరతుడికి సుపరిపాలన గురించి చెబుతూ రాజ ధర్మాన్ని వివరిస్తాడు.
మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు సుపరిపాలన గురించి వివరించాడు. భీష్ముడి ఉద్దేశంలో సుపరిపాలన ఆకాంక్షించే ప్రభువులు నైతిక విలువలను విస్మరించరాదు. ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో సుపరిపాలనకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించాడు. ‘ప్రజల సంతోషమే రాజు సంతోషం. ప్రజల సంక్షేమంలోనే ప్రభువు సంక్షేమం ఉంది. రాజు సంక్షేమ కోసం కాకుండా ప్రజల సంతానం కోసం మాత్రమే పరిపాలన గావించాలి.’
సుపరిపాలనలో... పరిపాలనను వికేంద్రీ కరించాలి. కానీ మన దేశంలో ప్రభుత్వ పాలన కేంద్రీకృతమైనట్లు విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అధి కారాలు కల్పించాలి. స్థానిక ప్రభుత్వాలను 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కొంత బలోపేతం చేసినప్పటికీ అవి అనేక రాష్ట్రాలలో నిధులు లేని విధులు నిర్వహిస్తున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
స్థానిక సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయాలి. సత్వర న్యాయం లభించాలి. అనేక కారణాల వల్ల ప్రజలకు న్యాయస్థానాల్లో సత్వర న్యాయం లభించడం లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. తగిన సమయంలో లభించని న్యాయం అన్యాయంతో సమానం. అన్ని న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల కొరత కారణంగా, లక్షల్లో కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. కేసుల సత్వర నివారణకు అవసరమైన సంస్కరణను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టాలి.
సుపరిపాలన అంటే అవినీతి రహిత పాలన. దురదృష్టవశాత్తు ప్రభుత్వ పాలనలో అవినీతి పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అవినీతి నిరోధక శాఖలైన సీబీఐ, ఏసీబీ, విజిలెన్స్ కమి షన్లను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా పని చేయనివ్వాలి. అనేక సందర్భాల్లో సుప్రీం కోర్టు సీబీఐని పంజరంలో చిలకలా అభివర్ణించడం గమనార్హం. అవినీతికి పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధించాలి.
ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పరిపాలనలో పారదర్శకత ఉండాలి. ఇందుకోసం 2005లో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం హర్షించదగ్గ పరిణామం. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార హక్కు చట్టాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్‌లోనూ, రాష్ట్రాల సమాచార కమిషన్‌లోనూ ఏర్పడిన ఖాళీలను భర్తీచేయడం లేదు. ఇటువంటి చర్యలు సుపరిపాలనకు వ్యతిరేకం. సుపరిపాలనలో ప్రజలకు నిర్ణయాలలో తగిన పాత్ర ఉండాలి. ప్రజలు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ, చట్ట బద్ధమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వ నిర్ణయాలలో భాగస్వాములు కావాలి.
పార్టీ ఫిరాయింపు చట్టాన్ని సదుద్దేశంతో రూపొందించిప్పటికీ అందులో ఉన్న కొన్ని లోపాల వల్ల ఆ చట్టం ఆశయాలు నెర వేరలేదు. ఈ చట్టాన్ని పకడ్బందిగా అమలుచేయడం కోసం అవసరమైన చర్యలు గైకొనాలి. ఇవన్నీ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యం అవుతుంది.
– డా‘‘ పి. మోహన్ రావు
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ చైర్మన్ ‘ 99495 95509
(రేపు వాజ్‌పేయి శత జయంతి ముగింపు: సుపరిపాలనా దినోత్సవం)