
1959 అక్టోబర్ 21వ తేదీన భారత–చైనా సరిహద్దులోని ఆక్సాయిచిన్ ప్రాంతంలో పదిమంది కేంద్ర పోలీసు రిజర్వు దళానికి చెందిన జవానులు విధినిర్వహణలో వీర మరణం పొందారు. దేశానికి స్వాతంత్య్రం లభించిన అనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటన అది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న ’పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని’ పాటిస్తున్నాం.
ఈనాడు అనేక కారణాల వల్ల శాంతి భద్రతలకు భంగం కలుగుతోంది. సమ్మెలు, ఆందోళనలు, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం, మత సంఘర్షణలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయి. ప్రభుత్వం తరఫున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. బలవంతుల నుండి బలహీనులకు పోలీసులు రక్షణ కల్పించాలి. ప్రజల ధన మాన ప్రాణాలను పరిరక్షించాలి.
భారతదేశం వంటి ప్రజాస్వామ్య దేశంలో శాంతి భద్రతలకు అవసరమైన చర్యలు గైకొనేట ప్పుడు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా వ్యవహరించాలి. మిగతా ప్రభుత్వ శాఖలకూ పోలీసు శాఖకూ మధ్య పనితీరులో చాలా భేదం ఉంది.
పోలీసులు అవసరమైతే అవిశ్రాంతంగా శాంతి భద్రతల కోసం 24 గంటలూ పనిచేయాలి. పండుగలు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కానీ, పోలీసులు చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులతో గడపలేని పరిస్థితి! సమయానికి ఆహారం, నిద్ర లేని కారణంగా వారి ఆరోగ్యంపై దాని దుష్ప్రభావం పడుతుంది.
1861 కంటే ముందు మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం లేదు. సైనికులే శాంతి భద్రతలను పరిరక్షించేవారు. సిపాయిల తిరుగు బాటు అనంతరం 1861 పోలీసు యాక్టు ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విభాగాన్ని ఆంగ్లేయ పాలకులు ఏర్పాటు చేశారు. 1902లో ఈ చట్టానికి కొన్ని సవరణలు చేశారు.
ఆంగ్లేయ పాలకులు స్వతంత్ర సము పార్జన కోసం పోరాడుతున్న భారతీయులను అణచి వేయడం కోసం, భారతీయుల హక్కులను హరించడం కోసం పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ జాబి తాలో చేర్చడం వలన పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంది.
పోలీసుల పనితీరుపై ఈ నాటికీ ప్రజలకు సదభి ప్రాయం లేదు. పోలీసులకు కూడా తాము ప్రజల కోసం నిరంతరం కష్టపడినా ప్రజల నుండి రావలసిన సహకారం, ఆదరణ లభించడం లేదన్న అభిప్రాయముంది. పోలీసు ప్రజాసంబంధాలు బాగుపడాలంటే ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చినప్పుడు సరియైన సమయంలో సరియైన రీతిలో స్పందించాలి.
కొన్ని సందర్భాలలో ఫిర్యాదు దారులు చేసిన ఫిర్యాదుల పరిష్కారం పోలీసుల పరిధిలో ఉండక పోవచ్చు. అటువంటప్పుడు వారు ఏం చేయాలో ఎవరిని సంప్రదించాలో వివరించాలి. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించాలి.
ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా 2006 సెప్టెంబర్ 22న సుప్రీం కోర్టు పోలీసుల పనితీరుకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలను సూచించింది. అందులో ముఖ్యమైనవి: 1) కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రస్థాయి భద్రతా మండలిని ఏర్పాటు చేయాలి.
భద్రతా మండలి శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలను సమీక్షించి అవసరమైన చర్యలు గైకొనాలి. 2) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీసు వ్యవస్థాపక బోర్డును ఏర్పాటు చేయాలి. 3) ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర/జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదుల అథారిటీని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర స్థాయి ఫిర్యాదుల అథారిటీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్, ఆ పై స్థాయి అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలి. 4) డీజీపీ నియామకం కోసం ముగ్గురు సీని యర్ ఐపీఎస్ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఒక జాబి తాను రూపొందించాలి.
అందులో నుండి ఒకరిని వారి యోగ్యత ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. ఈ రకంగా నియమించబడ్డ వారు వారి పదవీ విరమణతో సంబంధం లేకుండా రెండు సంవత్సరాలు ఆ పద విలో కొనసాగాలి. 5) పోలీసు వ్యవస్థలో కార్యాచరణ విధులు నిర్వహించే ఐజీపీ, డీఐజీ, ఎస్పీల పదవీ కాలం కనీసం రెండు సంవత్సరాలు ఉండాలి. 6) పోలీసు శాఖలో శాంతి భద్రతల విధులను, విచారణ (ఇన్వెస్టిగేషన్) విధులను వేరు చేయాలి. పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేయాలంటే ఈ మార్గదర్శకాలను అమలుచేయాలి.
– డా. పి. మోహన్‌రావు
విశ్రాంత ప్రొఫెసర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ హైదరాబాద్
(రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం)
Comments
Please login to add a commentAdd a comment