డాన్లు–గాడ్‌ఫాదర్ల లంకె ఛేదించాలి! | Sakshi Guest Column On Uttar Pradesh Mafia | Sakshi
Sakshi News home page

డాన్లు–గాడ్‌ఫాదర్ల లంకె ఛేదించాలి!

Published Sat, Apr 29 2023 2:56 AM | Last Updated on Sat, Apr 29 2023 2:56 AM

Sakshi Guest Column On Uttar Pradesh Mafia

ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ నేతల పోషణలో, ప్రభుత్వ సంస్థల సంబంధంలో ఉంటూ మాఫియా ఇంతకాలం పెరుగుతూ వచ్చింది. పోలీసు శాఖ, బ్యూరోక్రసీ దశాబ్దాలుగా మాఫియాతో పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన డాన్లను సృష్టిస్తూ వచ్చింది. చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య గల ఈ సంబంధాన్ని ఛేదించనట్లయితే... చట్టసభల్లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి తగు చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే... పరిస్థితి మరింత ఘోరంగా దిగజారిపోతుంది.

పోలీసు శాఖలో కొనసాగిన నా 35 సంవత్స రాల సర్వీసులో, సరైనవిధంగా కానీ, తప్పు పద్ధతిలో కానీ ఒక మాఫియా డాన్‌ను చంపిన ఘటన సాధారణ ప్రజానీకంలో ఇంత ఆసక్తిని రేకెత్తించి, ఇంత వివాదాన్ని సృష్టించిన ఉదంతం నాకయితే గుర్తు లేదు. నిజానికి, సీన్‌ నుంచి కీలక పాత్ర ధారులను పక్కనబెట్టి, జరుగుతున్న సందడిని మాత్రమే ఎవరైనా గమనించినట్లయితే, ఆ శోధన ఒక పాపులర్‌ నేత హత్యకు గురయ్యా డన్న ముగింపునకు వచ్చి ఉండేది. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల తీవ్రత కంటే ఉత్తరప్రదేశ్‌లోని యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని పట్టాలు తప్పించేందుకు ప్రతిపక్షం ప్రదర్శిస్తున్న కృతనిశ్చయాన్ని అది ఎక్కువగా ప్రతిఫలించి ఉండేది.

నిర్దిష్ట వివరాల్లోకి వస్తే, 1993 నాటికే... ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో సంబంధాలను కలిగి, వారి రక్షణలో ఉంటున్న మాఫియా సంస్థల కార్యకలాపాల గురించిన సమాచారాన్ని పొందడానికి నాటి ప్రభుత్వం ఎన్‌.ఎన్‌. వోహ్రా కమిటీని నియమించింది. దీనిపై పని ప్రారంభించిన కమిటీ, ‘ప్రభుత్వ యంత్రాంగానికి ప్రాసంగికత లేకుండా చేసి, మాఫియా నెట్‌వర్క్‌ వాస్తవానికి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది’ అని తేల్చిచెప్పింది. ఈ కమిటీ అంతిమంగా కొన్ని సిఫార్సులను చేసింది.

కానీ వాటిపై తదుపరి కార్యాచరణ లేకుండాపోయింది. పార్లమెంటులో దీనిపై తీవ్ర చర్చోపచర్చలు జరిగాయి. అయినా ఫలితం లేదు. క్రమంగా పోలీసు శాఖ, బ్యూరోక్రసీ ఈ పరస్పర ప్రయోజనకరమైన సహజీవనంలో భాగమైపోయాయి. ఈ అక్రమ సంబంధం దేశంలోని పలు ప్రాంతాల్లో కాలానుగుణంగా పేరుమోసిన మాఫియా డాన్లను సృష్టిస్తూ వచ్చింది. యూపీలో ముఖ్తార్‌ అన్సారీ, అతీఖ్‌ అహ్మద్, శ్రీ ప్రకాశ్‌ శుక్లా వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.

ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి
ఈ సంబంధాన్ని ఎలా ఛేదించవచ్చు? మొదటగా, మాఫియాను రాజకీయ నాయకులు పోషిస్తూ, కాపాడటాన్ని తప్పకుండా నిలిపివేయాలి. రెండు, దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మూలించాలి. మూడు, మాఫియా డాన్లను చట్టానికి జవాబుదారీగా చేయాలి. నాలుగు, ఈ అవినీతి సంబంధంలో భాగంగా ఉన్న పోలీసు అధి కారులు, బ్యూరోక్రాట్ల రెక్కలు కత్తిరించాలి. ఈరోజు ఉత్తరప్రదేశ్‌లో మాఫియాకు అత్యున్నత స్థాయిలో ఎలాంటి రాజకీయ రక్షణా
లేకుండా పోయింది.

దాని ఆర్థిక సామ్రాజ్యాన్ని గణనీయంగా తగ్గించి వేశారు. యూపీ పోలీసుల ప్రకారం– అతీఖ్‌ అహ్మద్, అతడి కుటుంబ సంపదలో రూ.1,169.20 కోట్లను జప్తు చేయడం, స్వాధీనపర్చు కోవడం లేదా నాశనం చేయడం జరిగింది. దీనికి తోడుగా, 12 మంది ముఠా నేతలు, వారి 29 మంది అనుయాయులకు శిక్ష పడేలా చేశారు. ముఖ్తార్‌ అన్సారీకి పదేళ్ల జైలుశిక్ష పడగా, అతీఖ్‌ అహ్మద్‌కు యావజ్జీవం పడింది. ఎట్టకేలకు న్యాయచక్రాలు కదలడం ప్రారంభించాయి.

అయితే ఈ మార్గం సజావుగా లేదు. ఏప్రిల్‌ 15న అతీఖ్‌ అహ్మద్, అతడి సోదరుడు అశ్రఫ్‌ను తప్పనిసరి వైద్య పరీక్షలకు తీసుకువెళ్తుండగా ముగ్గురు గుర్తు తెలియని యువ నేరస్థులు వారిని కాల్చిచంపారు. నిందితులకు రక్షణగా ఉంటున్న భద్రతా సిబ్బంది చేష్టలుడిగి చూస్తుండిపోయారు. వారి స్పందన పేలవంగా ఉండిపోయింది. జరిగింది దురదృష్టకరమైనది. దాన్ని అధిగమించి ఉండవచ్చు. కానీ, ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు ఆ నేరంలో భాగస్వాములయ్యారని ఆరోపించడం న్యాయం కాకపోవచ్చు.

న్యాయ విచారణ జరగాలి
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించింది. బాందా, హమీర్‌పుర్, కాస్‌గంజ్‌ నుంచి వచ్చిన ఈ ముగ్గురు యువకులు ఎలా ఒక్కటయ్యారు? వారిని ఈ పనిలోకి ఎవరు దింపారు? వారి ఉద్దేశం ఏమిటి? వారికి ఎవరు డబ్బులిచ్చారు? వారికి టర్కీ పిస్టల్స్‌ ఎవరు అందించారు? హత్యాఘటనలో వారు చేసిన నినాదాలను ఎవరైనా వారికి నేర్పించారా వంటి సంబంధిత విషయాలన్నీ న్యాయ విచారణ, పోలీసు దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోవాలన్న కోరికతోనే ఈ హత్యలకు పూనుకున్నామని ఈ ముగ్గురు హంతకులు ఇచ్చిన వివరణ నమ్మేలా లేదు.

అతీఖ్‌ కుమారుడు అసద్‌ అహ్మద్, అతడి అనుచరుడు గులామ్‌ హుస్సేన్‌లను ఏప్రిల్‌ 13న యూపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌కౌంటర్‌ అని చెబుతున్న దానిలో చంపేశారు. 2005లో జరిగిన రాజు పాల్, మరో ఇద్దరు పోలీసుల హత్యలో కీలక సాక్షి అయిన ఉమేష్‌ పాల్‌ హత్యతో వీరికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. తాజా ఘటనపై తప్పకుండా న్యాయ విచారణ జరిపించాల్సి ఉంది.

ఈలోగా నిందాత్మక క్రీడ మొదలైపోయింది. న్యాయవిచారణ వెల్లడించాల్సింది ఇప్పటికే తెలిసి ఉన్న వాస్తవాలను కాదు. ఒక ‘టాంగావాలా’ వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టేలా, అధికారులు సైతం మోకాళ్లపై వంగేంత అధికార కేంద్రంగా అతగాడిని మార్చేసిన రాజకీయ నేతలు, పార్టీలు ఏవి అనే విషయాన్ని న్యాయవిచారణ బయటపెట్టాల్సి ఉంది.

పాశ్చాత్య మీడియా సైతం ఈ హత్యలకు విశేష ప్రాముఖ్య తనిచ్చింది. కానీ ఈ సందర్భంగా వాటి కపటత్వం బయటపడుతోంది. ఒక మాజీ ఎంపీ హత్యకు గురయ్యాడని ‘బీబీసీ’ నివేదించడమే కాదు, అతడిని మాఫియా డాన్‌గా కాకుండా రాబిన్‌ హుడ్‌గా అభివర్ణించింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అయితే, భారత్‌ చట్టవ్యతిరేక హింసవైపు దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కానీ అమెరికాలోనే ప్రతి సంవత్సరం సగటున వెయ్యి మంది పౌరులు (2022లో 1,096 మంది, 2021లో 1,048 మంది) పోలీసుల కాల్పుల్లో హత్యకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయింది.

ఇది సమష్టి బాధ్యత
మరోవైపున జరిగిన తప్పులన్నింటి భారాన్ని పోలీసులు మోయవలసి వస్తోంది. బహుశా అందుకు వారు అర్హులే కావచ్చు. రాజకీయ వర్గానికి కూడా కొంత జవాబుదారీతనం ఉండకూడదా? మాఫియాను పెంచి పోషించింది వారే మరి. ఈ విషయంలో న్యాయ వ్యవస్థకు కూడా జవాబుదారీతనం లేదా? మునుపటి అలహాబాద్‌ జిల్లాలో నేర న్యాయ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న సమయంలోనే అతీఖ్‌ అహ్మద్‌ పెరిగాడు. అతీఖ్, అతడి అనుయాయులపై ఉన్న 54 కేసులు ఇప్పటికీ విచారణ దశలోనే ఎందుకు ఉంటున్నాయి? అందులో 1979 నాటి పాత హత్య కేసు కూడా ఉందని గుర్తించాలి. 

దేశంలో నేర న్యాయవ్యవస్థ వాస్తవానికి కుప్పగూలిపోతోందని జస్టిస్‌ వీఎస్‌ మలిమథ్‌ 2003 లోనే హెచ్చరించారు. మరి దిద్దుబాటు చర్యలు చేపట్టారా? పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడం గురించి ఎవరైనా పట్టించుకున్న పాపాన పోయారా? చేదు వాస్తవం ఏమిటంటే– నేరస్థులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారుల మధ్య సంబంధాన్ని మనం ఛేదించనట్లయితే... శాసనసభలు, పార్లమెంట్‌లోకి నేరస్థుల ప్రవేశాన్ని నిరోధించడానికి మనం తగిన చర్యలు చేపట్టనట్లయితే, నేర న్యాయవ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనట్లయితే, బాహ్య ఒత్తిళ్ల నుంచి పోలీసులను బయటపడవేయనట్లయితే పరిస్థితి మరింత ఘోరంగా దిగజారి పోతుంది!

ప్రకాశ్‌ సింగ్‌ 
వ్యాసకర్త మాజీ పోలీసు అధికారి;పోలీసు సంస్కరణల కోసం పనిచేస్తున్నారు.
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement