
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో మైనారిటీల భద్రతపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక యోగినని.. మనుషులంతా సంతోషంగా ఉండాలన్నదే తన అభిమతమని.. అందుకే రాష్ట్రంలో అన్ని మతాల వాళ్లు సురక్షితంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఈ క్రమంలో కేవలం హిందూ మతానికే బీజేపీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శల ప్రస్తావనతో ఆయనకో ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ..
‘‘ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో హిందువుల దుకాణాలు తగలబడితే.. ఆ వెంటనే ముస్లింల దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యేవి. హిందువుల ఇళ్లకు నిప్పంటుకుంటే.. కాసేపటికే ముస్లింల ఇళ్లూ తగలబడిపోయేవి. అయితే ఇదంతా 2017కి ముందు నాటి పరిస్థితి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా మారిపోయింది. వంద మంది హిందువుల మధ్య ఒక ముస్లిం సురక్షితంగా ఉంటున్నారు. అదే వంద మంది ముస్లింల మధ్య ఒక హిందువుకు భద్రత ఉంటోందా?.. లేదు కదా. అందుకు బంగ్లాదేశ్‌నే ఉదాహరణగా తీసుకోండి. పాకిస్థాన్ మరో ఉదాహరణ. అఫ్గనిస్థాన్‌లో ఏం జరిగిందో తెలుసు కదా!. అవతలివాడు కొట్టక ముందే జాగ్రత్త పడడంలో తప్పేముంది?’’ అని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
హిందువులు బాగున్నారంటే.. ముస్లింలూ బాగున్నట్లే. నేనొక సాధారణ ఉత్తర ప్రదేశ్ పౌరుడిని. నేనొక యోగిని. నా దృష్టిలో అంతా సమానమే. ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అదే రాష్ట్ర అభివృద్ధికి కీలకం కూడా అని అన్నారాయన.
సనాతన ధర్మం ఈ భూమ్మీదే అతిపురాతన మతం అని, దానిని అనుసరించేవారు ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయబోరని అన్నారు. హిందూ పాలకులు దండెత్తి ఇతర దేశాలకు ఆక్రమించుకున్న దాఖలాలు కూడా చరిత్రలో లేవన్నారు. కానీ, బదులుగా మనకు దక్కుతోంది ఏంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీలాంటి ‘నమునా’ వల్లే బీజేపీ ఇవాళ దేశంలో బలంగా ఉండగలిగిందని యోగి అన్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో దేశమంతా తిరిగారు. విదేశాలకు వెళ్లి మాతృదేశాన్నే తిడతారు. అందుకే ఆయన ఉద్దేశాలేంటో ప్రజలు అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి ‘నమునా మనుషులే’ ఇప్పుడు బీజేపీకి కావాల్సింది. అప్పుడే దారులన్నీ సరిచేసుకుంటూ ముందుకు పోగలం. అయోధ్య, కుంభమేళా సహా దేశ ప్రతిష్టకు పేరు తెచ్చే ఏ సందర్భానైనా వివాదం చేయడమే కాంగ్రెస్‌కు తెలుసు అని అన్నారాయన.
చట్టాన్నిగౌరవిస్తున్నాం, లేకుంటేనా..
ప్రార్థనా స్థలాల వివాదాలపైనా సీఎం యోగి ఏఎన్‌ఐ ఇంటర్వ్యలో కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని.. కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని.. లేకుంటే ఈ పాటికే ఏం జరిగి ఉండేదో ఎవరికి తెలుసనని అన్నారాయన. భారతీయ వారసత్వానికి ఆలయాలే గుర్తింపుగా అభివర్ణించిన సీఎం యోగి.. అలాంటి వాటిని వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి చాటి చెప్పడమే తమ అభిమతమని అన్నారు. దేవుడు ఇచ్చిన కళ్లు.. ఆ కళ్లు ఉన్న ప్రతీ ఒక్కరూ ఇది చూడాల్సిందే. శంభల్‌లో ఏం జరిగింది.. అదే సత్యం అని యోగి పేర్కొన్నారు.
ఆలయాలను కూల్చి మసీదులు కట్టి అల్లా కూడా అంగీకరించడని ఇస్లాంలోనే ఉంది. అలాంటప్పుడు వాళ్లు ఆ పని ఎలా చేయగలిగారు?. ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలతో మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఒక్కొక్కటిగా బయట పెట్టి వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారాయన.