
మలప్పురం: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నాటికీ మూఢాచారాలు కొనసాగుతున్నాయి. ఒక్కోసారి ఇవి వికటించి, మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. కేరళ(Kerala)లో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. ఆస్పత్రికి వెళ్లికుండా ఇంటిలోనే పురుడు పోసుకునేందుకు ప్రయత్నించిన 34 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లా(Malappuram district)లో ఈస్ట్ కోడూర్ ప్రాంతానికి చెందిన అస్మా(34)కు ఇంటిలోనే ప్రసవం చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమె తన ఐదవ సంతానానికి జన్మనిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అస్మా ఎర్నాకుళం జిల్లాలోని పెరుంబావూర్‌కు చెందినది. అయితే ఆమె భర్త సిరాజుద్దీన్‌తో కలిసి మలప్పురంలోని ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. ప్రసవ సమయంలో ఆమెకు వైద్య సహాయం అందకపోవడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నదని తెలుస్తోంది. అస్మా భర్త సిరాజుద్దీన్ మత సాంప్రదాయాలను పాటిస్తుంటాడు. ఈ నేపధ్యంలోనే మూఢాచారాలను ఆశ్రయించే ఆయన భార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటన తర్వాత సిరాజుద్దీన్ తన భార్య మృతదేహాన్ని పెరుంబావూర్‌కు తీసుకెళ్లి, అక్కడ సమాధి చేయడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పెరుంబావూర్ పోలీసులు(Perumbavoor Police) వెంటనే రంగంలోకి దిగి, ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తాలూకా ఆస్పత్రికి తరలించారు. కాగా అస్మాకు జన్మించిన నవజాత శిశువు (బాలుడు) ప్రస్తుతం పెరుంబావూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అస్మా మరణంచడానికి గల కారణాలను, ఆమెకు సరైన వైద్య సదుపాయాలు ఎందుకు అందలేదనే అంశంపై విచారిస్తున్నారు. ఈ దుర్ఘటన కేరళలో ఇంటి వద్ద జరిగే ప్రసవాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సరైన వైద్యవ్యవస్థ ఉన్నప్పటికీ, మలప్పురం జిల్లాలో ఇంటి వద్ద ప్రసవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గత ఐదేళ్లలో (2019-2024) కేరళలో 2,931 ఇంటి ప్రసవాలు నమోదయ్యాయని ఒక నివేదిక వెల్లడించింది. వీటిలో మలప్పురం జిల్లాలోనే 1,244 కేసులు ఉన్నాయి. 18 నవజాత శిశువుల మరణాలు కూడా జిల్లాలో సంభవించాయి.
ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా