
ఆమె వయసు 60... ఊరు కేరళ. టైలరింగ్‌తో పొట్ట పోసుకునే సగటు స్త్రీ. కాని ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు ఎలాగైనా చేరాలని పట్టుదల. ట్రైనింగ్ లేదు... బృందాలతో కలవడం లేదు. కేవలం యూట్యూబ్‌ను గురువుగా పెట్టుకుంది. అడుగులో అడుగు వేస్తూ వయసును లెక్కచేయక గమ్యం చేరుకుంది.చిన్న మనుషులూ పెద్ద కలలు కనొచ్చు. వసంతి చెరువీట్టిల్ స్ఫూర్తి గాథ.‘అది ఆనందమో దుఃఖమో తెలియదు. త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి, కేరళ సంప్రదాయ చీరలో నేను నిలుచుంటే రివ్వుమనే చల్లగాలిలో అందరూ చప్పట్లు కొడుతుంటే కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి‘ అంటుంది వసంతి చెరువీట్టిల్.
సమున్నతంగా శ్వేత కిరీటాలతో నిలుచుని ఉండే హిమాలయాలను పలకరించడానికి కేరళలోని కన్నూరు నుంచి ఈమె బయలుదేరినప్పుడు తోడు ఎవరూ లేరు తనకు తాను తప్ప. భర్త చనిపోయాక ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసి వారి జీవితానికి దారి చూపించాక ఈ ప్రపంచాన్ని చూడాలని చిన్న ఆశ కలిగింది వసంతికి. చేసే పని టైలరింగ్. ఆదాయం కొద్దిగా.
కాని అందులోనే దాచి ఎంత వీలైతే అంత తిరిగి చూడాలనుకుంది. తన చుట్టూ ఉన్నది తనలాంటి వారే కాబట్టి ‘అమ్మో అంత ఖర్చా? మేము నీతో రాము’ అన్నారు. ‘వెళితే నువ్వొక్కదానివే వెళ్లు’ అన్నారు. ‘వెళ్లలేనా?’ అనుకుంది వసంతి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు బ్రేక్ వేస్తారు. కాని వసంతి ఇద్దరు కొడుకులూ వెళ్లిరామ్మా అన్నారు. అలా ఆమె మొదట థాయ్‌ల్యాండ్ తిరిగి వచ్చింది ఒక్కత్తే. ఆ తర్వాత హిమాలయాలు కనీసం బేస్ క్యాంప్ అయినా చూడాలనుకుంది.
యూట్యూబే ట్రెయినర్‌గా...
ఎవరెస్ట్ అధిరోహించడంలో రెండు దశలు. ఒకటి బేస్ క్యాంప్‌కు చేరుకోవడం. రెండు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం. ఎవరెస్ట్ శిఖరం పై చేరడం చాలా కష్టం కాబట్టి కనీసం బేస్ క్యాంప్ అయినా చేరాలనుకుంటారు. అయితే సముద్ర మట్టానికి 5364 మీటర్ల ఎత్తున ఉన్న బేస్‌క్యాంప్ వరకూ వెళ్లడం కూడా సామాన్యమైన విషయం కాదు. 7 నుంచి 9 రోజులు పడుతుంది. ఇందుకు ప్రత్యేక శిక్షణ తీసుకోవాలి. వ్యాయామం చేయాలి.
బ్రీతింగ్ ఎక్సర్‌సైజులు ట్రెకింగ్ బూట్లతో నడవగలగడం ఇవన్నీ సాధన చేయాలి. ఆర్థిక వనరులు తక్కువగా ఉన్న వసంతి కేవలం యూట్యూబ్‌లో చూసి ఇవన్నీ నేర్చుకుంది. రోజూ వ్యాయామం చేసింది. నాలుగు గంటల పాటు వాకింగ్ చేసింది. ట్రెకింగ్ షూస్ వేసుకుని నడిచింది. హిమాలయాల్లో కమ్యూనికేషన్ ఇబ్బంది రాకుండా కాస్తో కూస్తో హిందీ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత అందరికీ చెప్తే విస్తుపోయారు. చివరకు అభినందనలు తెలిపి సాగనంపారు.
ప్రతికూలతలు
నేపాల్‌లోని లుల్కా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి దశల వారీగా బేస్‌క్యాంప్ వెళ్లాలనుకుంది వసంతి. అయితే వాతావరణం సరిగా లేకపోవడం వల్ల ఆమె ఎక్కాల్సిన లుల్కా విమానం ఎగరలేదు. దాంతో చిక్కుబడిపోయింది. అప్పుడు ఒక జర్మన్ జంట లుల్కా నుంచి కాకుండా సుర్కె నుంచి వెళదామని సాయం చేశారు.
ఫిబ్రవరి 15న సుర్కె నుంచి ఆమె ట్రెకింగ్ మొదలైంది. ఏమాత్రం అనువుగా లేని కాలిబాట దారుల్లో ఆమె ప్రతి ఐదు నిమిషాలకు దీర్ఘశ్వాస తీసుకుంటూ రోజుకు 7 గంటలు నడిచి విశ్రాంతి తీసుకుంటూ మొత్తం 9 రోజులు నడిచి చివరకు బేస్ క్యాంప్‌కు చేరుకోగలిగింది.
నా సంప్రదాయం నా గౌరవం
వసంతి తనతో పాటు కేరళ సంప్రదాయ చీర తెచ్చుకుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దగ్గర చేరాక దానిని కట్టుకుని ఫొటో దిగింది. తన సంప్రదాయ ఘనత చాటింది. వసంతిని ఇప్పుడు కేరళ మాత్రమే కాదు నెరవేరని ఆకాంక్షలు గల స్త్రీలందరూ అబ్బురంగా చూస్తున్నారు.
(చదవండి: ఏడు పదుల వయసులో ఫిట్‌గా మోదీ..! ఆరోగ్య రహస్యం ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment