ఈ సంవత్సరం ఏం చేశారు? | What did you do this year | Sakshi
Sakshi News home page

ఈ సంవత్సరం ఏం చేశారు?

Published Wed, Dec 27 2023 12:29 AM | Last Updated on Wed, Dec 27 2023 12:29 AM

What did you do this year - Sakshi

2023కు వీడ్కోలు
ఇవన్నీ ప్రశ్నలే.పునరావలోకనం చేసుకోవాలి.కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహంతో మొదలెట్టాలి.జీవితం ఒక్కటే. సాధించాల్సినవి లక్ష.స్త్రీగా జన్మించినందుకు రోజులు ఎలా గడిచిపోయాయో అనుకోకూడదు.ఎంత బాగా గడిచాయో అనుకోవాలి.అందుకు తరచి చూసుకుని స్వీయ అంచనా వేసుకోవడమే మార్గం.‘ఏం చేస్తున్నావమ్మా?’ అని పిల్లలు అడిగి ‘అన్నం పెట్టు’ అంటారు. ‘ఏం చేస్తున్నావోయ్‌’ అని భర్త అడిగి,  ‘నా వైట్‌షర్ట్‌ ఎక్కడా?’ అని ప్రశ్నిస్తాడు.

అత్తగారు, మామగారు ‘ఏం చేస్తున్నావమ్మా’ అని కేకేసి ఇంకేదో చెప్తారు. వీళ్లంతా ఏ పనీ చెప్పకపోయినా ఇంట్లో గృహిణిగా ఉన్నందుకు తప్పక చేయాల్సిన పనులు ఉంటాయి.ఈ పనుల్లోనే జీవితం గడిచిపోవాలా? ఈ పనుల మధ్యలో స్త్రీలు తమకంటూ ఒక జీవితాన్ని నిర్మించుకోలేరా? 2023 మరో రెండు మూడు రోజుల్లో వీడ్కోలు తీసుకుంటుంది. కొత్త సంవత్సరం వస్తుంది. గృహిణిగా/ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునే గృహిణిగా ఈ సంవత్సరమంతా ఎలా గడిచిందో బేరీజు వేసుకున్నారా? 

ఎన్ని పుస్తకాలు చదివారు? 
స్త్రీకి మెదడు ఉంటుంది... దానికి వ్యాయామం ముఖ్యం అన్నాడు రచయిత చలం. ఆ వ్యాయామం పుస్తకాలు చదివితే వస్తుంది. సాహిత్యానుభవం వల్ల మస్తిష్కం విశాలం అవుతుంది. జీవన అవగాహన పెరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడమూ తెలుస్తుంది. స్త్రీలు పుస్తకం చదివితే ఇంటికి వెలుగు. ప్రతిఏటా ఎన్నో మంచి పుస్తకాలు వస్తాయి. పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. అమేజాన్‌ నుంచి తెప్పించుకోవచ్చు. ఆడియో యాప్స్‌ కూడా ఉన్నాయి. పుస్తకాలు చదవకుండానే 2023ను మీరు వృథా చేసి ఉంటే మీరు మీ బౌద్ధిక వ్యాయామాన్ని వృథా చేసినట్టు. లేదా కొన్ని పుస్తకాలైనా చదివి ఉంటే వాటిని లిస్ట్‌ చేసి మీ స్నేహితులకు పంపి ఇన్‌స్పయిర్‌ చేయండి. ఈ సంవత్సరం మరిన్ని చదవాలని లక్ష్యం పెట్టుకోండి.

మంచి సినిమాలు చూశారా?
సినిమాలంటే కాలక్షేపపు సినిమాలు కాదు. హాలీవుడ్‌లో, హిందీలో, భారతీయ భాషల్లో అర్థవంతమైన సినిమాలు వస్తున్నాయి. స్త్రీ దృష్టికోణం నుంచి ఎన్నో కథలు చెప్తున్నారు. ఓటిటిలలో కూడా చాలా సినిమాలు వస్తున్నాయి. వీటిలో కొన్నయినా మీరు ఎంచుకుని చూశారా? పోనీ... పాత క్లాసిక్స్‌... మీరు ఎప్పటినుంచో చూడాలనుకున్నవి... ఎవరూ మధ్యలో డిస్ట్రబ్‌ చేయని విధంగా చూశారా? సంతోషించారా?

ఎంతమంది మిత్రులను పొందారు?
ఇవాళ మనిషికి పెద్ద ఓదార్పు స్నేహమే. వైవాహిక జీవితంలో పడ్డాక పాత స్నేహాలు కొనసాగితే అదృష్టమే. స్కూల్, కాలేజీ నాటి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే ఆ స్నేహాన్ని ఈ సంవత్సరం ఎంతమేరకు నిలబెట్టుకున్నారు. లేదా ఇంటి ఇరుగు పోరుగున, పని చేసే చోట ఎన్ని మంచి స్నేహాలు చేయగలిగారు. ఇవాళ రేపు మనుషుల పట్ల నెగెటివిటి పెరిగింది. కాని లోపాలు ఎంచటం తక్కువ... స్నేహాన్ని కొనసాగించడం తక్కువ కొనసాగించారా? బాగా చికాకుగా, డల్‌గా ఉన్నప్పుడు మీరు కాల్‌ చేసి మాట్లాడే స్నేహితుల సంఖ్య ఈ సంవత్సరం పెరిగిందా? తగ్గిందా?

ఎన్ని అనుబంధాలను కాపాడుకోగలిగారు?
బంధువులను దూరం చేసుకోవడం, బంధువులకు దూరం కావడం ఈ కాలపు గడుసుదనంగా మారింది. బంధువులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనే పోకడ ఇప్పుడు సర్వసామాన్యం అయ్యింది. కాని బంధుత్వాలు లేకనే జీవనం సాగగలదా? ఎన్ని లోపాలు ఉన్నా మంచికీ చెడ్డకీ ఆధారపడాల్సింది బంధువులే కదా? ఈ బాంధవ్యాలను, అనుబంధాలను డ్యామేజీ చేశారా? లేదా బలపరుచుకున్నారా? ఏదైనా నష్టం జరిగి ఉంటే 2024లో ఆ నష్టాన్ని నివారించే ప్రయత్నం ఎందుకు జరగకూడదు?

ఎన్ని కొత్తప్రాంతాలు తిరిగారు?
సంవత్సరమంతా ఇంటి నాలుగ్గోడలు, ఆఫీసుప్రాంగణంలోనే గడిచిపోయిందా? ఏ కొత్తప్రాంతాన్ని చూడలేదా? కొత్తనేలను తాకి కొత్తగాలిని పీలిస్తేనే సంతోషం. సంవత్సరంలో కనీసం 2 కొత్తప్రాంతాలు చూడగలగాలి. 2023లో చూడకపోతే 2024లో కదలండి

కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం:
కుటుంబం జీవన సర్వస్వం. ఒకే కుటుంబమే అయినా కుటుంబ సభ్యుల మధ్య స్పర్థలు, అభ్యంతరాలు, నిర్లక్ష్యం, నిర్బాధ్యత వస్తాయి ఒక్కోసారి. కడుపున పుట్టిన వాళ్ల మధ్య ప్రేమను కల్పించారా? తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మధ్య అడ్డుగోడలు లేకుండా ఉన్నారా? మీ మనసులో ఉన్నదంతా వారికి చెప్పగలరా? వారి మనసులో ఉన్నది చెప్పే వీలు ఇచ్చారా? 2024లో ఈ ప్రశ్నలకు జవాబు వెతకండి.

ఎంత పోదుపు చేశారు?
పిల్లల కోసమే ప్రతి పైసా ఖర్చు పెట్టడం ఇన్నాళ్లు చేశారా? 2023లో కూడా అదే చేశారా? తల్లిగా మీ ఆర్థిక భద్రత ఎంత? మీ పేరున స్థిరచరాస్తులు, రొక్కం ఏ మేరకు ఉంది. మీ కోసం మీరుఎంత పోదుపు చేసుకున్నారు? ఒకరిపై ఆధారపడలేని స్థితిలో ఉండాలనుకోవడం లేదా? కొత్త సంవత్సరం వస్తున్నది మీ స్వయంసమృద్ధికే.

ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ పెట్టారు?
ఆరోగ్యం సంగతి తర్వాత చూసుకుందాం అని ఇంకా ఎన్నేళ్లు అనుకుంటారు. ఈ సంవత్సరం హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు చేయించుకోండి. మంచి ఆహారానికి బడ్జెట్‌ కేటాయించుకోండి. జిమ్‌లో చేరండి. వాకింగ్‌ చేయండి. యోగా క్లాసులకెళ్లండి. మీ ఆరోగ్యం కోసం మీరు కొంత ఖర్చు పెట్టుకోవడాన్ని హక్కుగా పొందండి. 2024లో కచ్చితంగా మీరు సంపూర్ణ ఆరోగ్యం కోసం నడుం బిగించండి.కాలం వచ్చేది మన కోసం. మనం ఇతరుల కోసం ఎంత జీవించినా మన కోసం కూడా జీవించాలి. కొత్త సంవత్సరంలో మీ కోసం కూడా మీరు జీవించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement