
విశ్లేషణ
ఒక కార్టూన్ ప్రకటించడం రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛలో భాగం అవునా కాదా నిర్ధారించుకోవడానికి ఒక పత్రిక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన దుఃస్థితికి చేరింది మన సమాజం. ఇవాళ దేశంలో కార్టూన్ అనే అతి సాధారణ సృజ నాత్మక ప్రక్రియ మనోభావాల మందు పాతరగా మారిపోయింది. ఒక కార్టూన్ వల్ల భారత సార్వభౌమత్వానికీ, సమగ్రతకూ, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకూ ముప్పు వాటిల్లుతున్నదనీ మద్రాసు హైకోర్టు ముందర కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది.
ఇంతకూ ఏమిటా కార్టూన్? అమెరికా ప్రభుత్వం తన దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, లేదా చట్టవిరుద్ధంగా ఉంటు న్నారని 300కు పైగా భారతీయ పౌరులను పట్టుకుని, ఫిబ్రవరిలో మూడు విడతలుగా వెనక్కి పంపించింది. ఆ దేశపు చట్టాల ప్రకారం అది సాధారణమే కావచ్చు. వారు తమ దేశంలో ప్రవేశించిన నేరం చేసినందుకు దేశం నుంచి వెళ్లగొట్టడం అనే శిక్ష వేశారు, సరిపోయింది.
ఒకే నేరానికి రెండు, మూడు శిక్షలు వేయడం సహజ న్యాయానికి వ్యతిరేకం. కానీ వారికి రెండో శిక్షగా చేతులకూ కాళ్లకూ సంకెళ్లు వేశారు. మూడో శిక్షగా వారిని జంతువుల్లా, సరుకుల్లా చూసి యుద్ధవిమానాల్లో రవాణా చేశారు. ఇది తప్పనిసరిగా భారత ప్రజ లకు జరిగిన అవమానం, నేరాన్ని మించి శిక్ష విధించడం.
భారత ప్రభుత్వంలో అత్యున్నతాధికారం నెరపుతున్న వ్యక్తిగా ప్రధాన మంత్రి తన సాటి పౌరులకు జరిగిన ఈ అవమానం గురించి, విపరీత శిక్షల గురించి ఆ శిక్షలు విధించిన దేశాధ్యక్షుడితో సమావేశంలో కనీసం మాట మాత్రం ప్రస్తావించకపోవడం, నిరసన తెలపకపోవడం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అలా అవతలివైపు వ్యంగ్య ఆలోచనకు చిత్రరూపమైన కార్టూన్‌ను సుప్రసిద్ధ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’కు చెందిన వికటన్ ప్లస్ వెబ్‌సైట్ ఫిబ్రవరి 10 సంచిక ముఖచిత్రంగా ప్రచురించింది.
అందులో అమెరికా అధ్య క్షుడి ముందు భారత ప్రధాని చేతులకూ కాళ్లకూ సంకెళ్లతో కూచుని ఉన్నట్టు చిత్రించారు. దాని మీద తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు, వెంటనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆనంద వికటన్ వెబ్‌సైట్‌ను మూసివేసింది.
తర్వాత ‘ఆనంద వికటన్’ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు ఇప్పటికైతే, మధ్యంతర ఉత్తర్వులలో వెబ్‌సైట్‌ను మూసివేయగూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుదితీర్పు వచ్చే దాక కార్టూన్‌ను ఉపసంహరించాలని ఆనంద వికటన్‌కు సూచించింది.
ఇట్టే పడే దృష్టి!
ఏదైనా పత్రిక చూస్తున్నప్పుడు పాఠకుల దృష్టి సహజంగా కార్టూన్ మీదికి పోతుంది. మిగిలిన వార్తలన్నీ నిండా అలుక్కుపోయి ఉండగా, కార్టూన్ స్థలం సింగిల్ కాలం అయినా, రెండు కాలాలో మూడు కాలాలో అయినా, ఆ రేఖలూ, రేఖల మధ్య ఖాళీలూ,బాగా తెలిసిన ముఖాలే కాస్త వక్రంగా మారి ఉండటమూ, ఒకటో రెండో హాస్య, వ్యంగ్య, వెటకార పూరితమైన వాక్యాల వ్యాఖ్యలూ తప్పనిసరిగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కార్టూన్ ప్రక్రియ ఎంతో ఆదరణ చూరగొన్నదీ, గౌరవనీయమైనదీ మాత్రమే కాక కనీసం రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది.
పందొమ్మిదో శతాబ్దపు మధ్య భాగంలో ‘పంచ్’ పత్రికలో రాజకీయ కార్టూన్లు ప్రారంభమయ్యాయంటారు. రాజకీయ నాయకులే నిర్ణేతలుగా, ప్రముఖులుగా, అందరికీ తెలిసినవారుగా ఉన్న సమాజంలో వారే కార్టూన్‌కు ప్రధాన వస్తువు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే రాజకీయ ఘటనల ప్రభావం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది గనుక, ఆ ఘటనల అవతలి కోణం మీద ప్రజలకు ఆసక్తి ఉంటుంది గనుక సహజంగానే వాటి మీద వ్యంగ్యపు, వెటకారపు వ్యాఖ్యానం బహుళ జనాదరణ పొందుతుంది.
ఒక ప్రక్రియగా కార్టూన్ ఎంత విశాలమైనదీ, లోతైనదీ, ఆకర్షణీ యమైనదీ, ఆమోదయోగ్యమైనదీ అంటే ఆ కార్టూన్‌లో వెటకారానికి గురైన రాజకీయ నాయకులకు కూడా అది నవ్వు పుట్టిస్తుంది. అది తమను నొప్పించిందనో, వెటకరించిందనో, తమ మీద వ్యంగ్య వ్యాఖ్య చేసిందనో నొచ్చుకునే సందర్భంలో అయినా ఆ బాధిత వ్యక్తులు కూడా నవ్వుకునే గొప్ప కళ కార్టూన్. అసలు తనమీద వచ్చిన పరిహాసాన్ని ఆమోదించడం, తన పనిమీద వ్యంగ్య వ్యాఖ్యకు అవకాశం ఇవ్వడం ఆ వ్యక్తి విశాల హృదయానికి, సౌమనస్యానికి సంకేతాలు.
వ్యంగ్యాన్ని స్వీకరించలేక...
అందువల్లనే కార్టూన్ల, హాస్య, వ్యంగ్య రచనల వారపత్రికగా వెలువడుతుండిన ‘శంకర్స్ వీక్లీ’ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆదరించాడు. అసలు శంకర్స్ వీక్లీ పుట్టుక కథే చిత్రమైనది. అప్పటికి ‘హిందుస్థాన్ టైమ్స్’లో కార్టూనిస్టుగా ఉండిన శంకర్ పిళ్లై అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి మీద విపరీతంగా కార్టూన్లు వేస్తుండగా అవి ఆపమని సంపాదకుడు దేవదాస్ గాంధీ ఆదేశించాడు. దానితో విభేదించి బైటికి వచ్చిన శంకర్ తన సొంత పత్రికగా 1948లో ‘శంకర్స్ వీక్లీ’ పెట్టాడు. ‘‘మౌలికంగా వ్యవస్థా (ప్రభుత్వ) వ్యతిరేక పత్రిక’’ అని శంకర్ చెప్పుకున్నప్పటికీ, పత్రికను ప్రధానమంత్రి నెహ్రూనే ఆవిష్కరించాడు.
ఆ పత్రికలో తన మీద, తన మంత్రివర్గం మీద, తన ప్రభుత్వపు చర్యల మీద శంకర్, ఇతర కార్టూనిస్టులు వేసిన కార్టూన్ల లోని హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ నెహ్రూ అభినందించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు నిరాటంకంగా నడిచిన ‘శంకర్స్ వీక్లీ’ ఎమర్జెన్సీ విధించాక ఆరు వారాలకు ఆగిపోయింది. ఎమర్జెన్సీకీ పత్రిక ఆగిపోవడానికీ సంబంధం లేదని శంకర్ అన్నాడు. ఆ పత్రిక చూడటం తనకు చాలా అలవాటనీ, అది చూడకపోతే కొరతగా ఉంటుందనీ ఇందిరా గాంధీ కూడా అంది. కానీ మొత్తానికి పత్రిక ఆగిపోయింది.
తర్వాతి కాలంలో శంకర్స్ వీక్లీలా పూర్తిగా కార్టూన్లకూ,హాస్య, వ్యంగ్య రచనలకూ అంకితమైన పత్రికే లేకుండా పోయింది. బహుశా మన సమాజంలో హాస్య చతురత, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ ఆమోదించే విశాల హృదయాలు కుంచించుకుపోవడం మొదలయిందేమో!
‘శంకర్స్ వీక్లీ’లోనే ప్రారంభమైన ఆర్.కె. లక్ష్మణ్, ఒ.వి. విజయన్, ఇ.పి.ఉన్ని, రాజిందర్ పూరీ, కుట్టి, బాల్ థాకరే, యేసుదాసన్ వంటి ఎందరో రాజకీయ కార్టూనిస్టులు నాలుగు దశాబ్దాలు భారత రాజకీయ కార్టూన్ రంగాన్ని వెలిగించారు. తెలుగులో కూడా ఎందరో రాజకీయ కార్టూనిస్టులు ఎందరెందరో నాయకుల మాటలనూ, హావభావాలనూ, పనులనూ తరతరాలు నవ్వుకునేంత హాస్య, వ్యంగ్య దృష్టితో చిత్రించారు.
ఆ మహోజ్వల చరిత్ర గల కార్టూన్ కళకు ఇప్పుడు కాని కాలం దాపురించినట్టే ఉంది. పూర్తిగా కార్టూన్లకు, హాస్య, వ్యంగ్య రచనలకు అంకితమైన పత్రికలు లేవు. పత్రికల్లో ప్రతిరోజూ కార్టూన్ కనబడటం లేదు. సింగిల్ కాలం పాకెట్ కార్టూన్ మొక్కుబడి వ్యవహార మైపోయింది. కార్టూన్ స్ట్రిప్‌లు ఖాళీ నింపే ఆరో వేలు అయి పోయాయి. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ కార్టూన్ ఏ రాజకీయ నాయకుడి మనసు నొప్పిస్తుందో, ఏ నాయకుడి భక్తుల మనోభావాలను, ఏ మత, కుల, ప్రాంత, భాషా సమూహపు మనోభావాలను గాయపరుస్తుందో, ఆచితూచి అడుగువేయవలసిన మందుపాతరల క్షేత్రంగా మారిపోయింది.
ఎన్. వేణుగోపాల్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment