సందర్భం
మన దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను చర్చించి సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగం పార్లమెంట్‌కు దఖలు పర్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడం కోసమే ప్రతి యేటా భారత పార్లమెంట్ మూడు పర్యాయాలు సమావేశాలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు జవాబుదారీతనం వహించడం అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన మన దేశంలో దేశ ప్రజలకు బాధ్యత వహించడమేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.
ఇంత ఘనమైన రాజ్యాంగ బాధ్యత ఉన్నది కనుకనే భారత పార్లమెంట్‌ను దేశ ప్రజల భవిష్యత్తును రూపొందించే కార్య శాలగా పేర్కొంటారు. కానీ, గత రెండు దశాబ్దాల పైబడి భారత పార్లమెంట్ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో గతంలో కూడా అప్పుడప్పుడు సభ్యులు నిగ్రహం కోల్పోయి అరుపులు, కేకలు పెట్టడం వంటి అవాంఛనీయ ఘటనలు జరిగిన మాట వాస్తవమే అయినా, తాజాగా డిసెంబర్ 20తో ముగిసిన 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలలో అన్ని హద్దులు దాటి సభ్యులు బాహాబాహీకి దిగిన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. అధికార, విపక్ష సభ్యులు పరస్పరం తోపులాట లకు దిగిన హీనస్థితికి లోక్‌సభ వేదిక కావడం దిగజారిన రాజకీయ సంస్కృతికి అద్దం పడుతుంది.
తగ్గిపోయిన ప్రశ్నోత్తరాల సమయం
దశాబ్ద కాలంగా పార్లమెంట్ సమావేశాల పని గంటలు తగ్గి పోతున్నాయి. 16వ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం నిర్దేశిత వ్యవధిలో 77 శాతం, అదేవిధంగా రాజ్యసభలో 44 శాతం మాత్రమే నమోదైంది. కారణం– పార్లమెంట్ ఉభయ సభల్లో అవాంతరాలు ఏర్పడి సభలు తరచుగా వాయిదా పడటమే. పార్లమెంట్ బిజినెస్‌లో ఇతర అంశాల కోసం అదనపు గంటలు పనిచేసే వెసులుబాటు ఉంది గానీ, ప్రశ్నోత్తరాలు వాయిదా పడితే... ఆ సమయాన్ని పొడిగించరు.
వాటికి కేవలం రాతపూర్వక జవాబుల్ని మాత్రమే సభ్యులకు పంపుతారు. సామాన్యంగా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొత్తగా ఎన్నికయిన సభ్యులు ఎక్కువగా సద్వినియోగ పర్చుకొంటారు. సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రశ్నలు వేసి వాటికి జవాబులు ఆశిస్తారు. ప్రశ్నోత్తరాల సమయం రద్ద యితే... సభ్యులు తమ విలువైన అవకాశాన్ని కోల్పోవడమేగాక, వారు ఆశించి ఎదురు చూస్తున్న అంశాలపై సమాధానం పొంద లేకపోతారు.
పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా సాగకపోవడానికి ప్రతి సారీ ఒక్కో విధమైన కారణాలు దోహదం చేస్తున్నాయి. ఈసారి శీతాకాల సమావేశాలలో పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీతో సహా మరికొన్ని విపక్ష పార్టీలు గట్టిగా పట్టుబట్టి ఉభయ సభల కార్యకలాపాల్ని అడ్డుకున్నాయి. ఈ సమావేశాలలోనే రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్‌పై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ఇచ్చిన నోటీసును డిప్యూటీ చైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం నెలకొని పలుమార్లు రాజ్యసభ వాయిదా పడింది.
ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌ను ఆయన అవమానించారంటూ విపక్ష సభ్యులు గందరగోళాన్ని పరాకాష్టకు తీసుకువెళ్లడంతో... అదికాస్తా అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాటలు, ముష్టిఘాతాలకు దారితీసింది. సభల్ని సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత గలిగిన అధికార ఎన్డీఏ సైతం పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిందంటూ ఆరోపణలు చేయడంతో ఉభయ సభల్లో విపక్ష పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. కారణాలు ఏవైనా, ఈ శీతాకాల సమావేశాలలో లోక్‌సభ నిర్ణీత వ్యవధిలో 54.5 శాతం, అదేవిధంగా రాజ్యసభ 40 శాతం మాత్రమే పనిచేశాయి. శీతాకాల సమావేశాలు అతి తక్కువ వ్యవధిలో పని చేయడం ఇదే ప్రథమం అని రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఆమోదం పొందిన బిల్లు ఒక్కటే!
నిజానికి, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు విలువైన పెద్ద ఎజెండానే సిద్ధం చేశారు. మొత్తం 16 బిల్లుల్ని ప్రవేశపెట్టి
అందులో మెజారిటీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలని అధికార కూటమి భావించింది. కానీ, విమానయాన రంగానికి సంబంధించిన ‘భారతీయ వాయుయాన్ విధేయక్, 2024’ బిల్లు ఒక్కటే ఉభయ సభల ఆమోదం పొందగలిగింది. ఆర్థిక రంగానికి సంబంధించి మొదటి విడత సప్లిమెంటరీ గ్రాంట్స్ కూడా ఆమోదం పొందవలసి ఉన్నాయి.
అయితే కొన్ని బిల్లులు లోక్‌సభలో, మరి కొన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి దానిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. దేశ ప్రయోజనాల రీత్యా అన్ని పక్షాలు ఏకాభిప్రాయానికి రావా ల్సిన కీలక అంశాలపై కూడా అధికార, విపక్షాలు ఏకతాటిపైకి రాలేని అవమానకర దు:స్థితి నెలకొంది.
చట్టసభలు క్రియాశీలంగా లేకపోవడం అంటే దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టే. ‘చర్చల ద్వారా పాలన సాగించడమే ప్రజా స్వామ్యం’ అని పలువురు రాజనీతిజ్ఞులు చెప్పిన మాట మన దేశంలో క్రమేపి నవ్వులాటగా మారుతోంది. పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి పురుడుపోసిన ఇంగ్లాండ్ పార్లమెంట్ భారత్‌తో సహా అనేక దేశాలకు ఆదర్శప్రాయం. వెస్ట్‌మినిస్టర్ తరహా పాలనను అనుసరిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప... నిజానికి మన పార్ల మెంటరీ పద్ధతులు, విధానాలు ఇంగ్లాండ్‌కు భిన్నంగా ఉన్నాయి.
ఇంగ్లాండ్ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల చర్చలకు ప్రత్యేకంగా 20 రోజులు కేటాయించే అవకాశాన్ని వారి రాజ్యాంగం కల్పించింది. ప్రధాన ప్రతిపక్షానికి 17 రోజులు, ఇతర విపక్ష పార్టీలకు 3 రోజులు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా, 40 మంది సభ్యుల మద్దతు కూడగడితే వారు కోరిన అంశాన్ని అనివార్యంగా సభ చర్చకు స్వీకరించాల్సిందే. మన పార్లమెంట్‌లో అటువంటి నిబంధనగానీ, ఆనవాయితీగానీ లేవు.
నిజానికి మన రాజ్యాంగ కర్తలు భవిష్యత్తులో చట్టసభలలో విపరీత పరిణా మాలు చోటుచేసుకొంటాయని ఆనాడు ఊహించలేదు. విపక్షాలు నిరసన తెలపడం, వాకౌట్ చేయడం వారి హక్కుగా, ప్రజాస్వామ్యంలో ఓ భాగంగానే భావించారు గానీ... రోజుల తరబడి చట్టసభలు వాయిదా పడతాయనీ, బిల్లులు చర్చకు నోచుకోకుండా గిలెటిన్ అవుతాయనిగానీ వారు అంచనా వేయలేకపోయారు.
కారణాలు ఏవైనా పార్లమెంట్ ఔన్నత్యం, ప్రతిష్ఠ నానాటికి తగ్గడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాప్రతినిధులు సభల నుంచి వాకౌట్ చేసి క్యాంటీన్లలో, లాబీల్లో కాలక్షేపం చేయడం సహించరానిది. చర్చకు నోచుకోకుండా బిల్లులు చట్టాలైతే అవి ప్రజలకు గుదిబండలుగా మారతాయి. అందువల్ల పార్లమెంట్ క్రియాశీలకంగా మారాలి. చట్టసభలు క్రియాశీలంగా పని చేయ డానికి, సభ్యుల చురుకైన భాగస్వామ్యానికి అవసరమైన సంస్కరణలు తక్షణం చేపట్టాలి.
అందుకు అన్ని పార్టీల సలహాలు, సూచనలు స్వీకరించాలి. లా కమిషన్‌కు కూడా బాధ్యత అప్పగించాలి. ఆ విధంగా పాతాళానికి పడిపోయిన పార్లమెంట్ ప్రతిష్ఠను పున రుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. చట్ట సభలు అలంకార ప్రాయంగా మారిపోవడాన్ని ప్రజలు ఇకపై ఎంత మాత్రం సహించరని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఏపీ శాసనమండలి సభ్యులు,కేంద్ర మాజీ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment