
అభిప్రాయం
అమరావతి దేవతల రాజధాని అంటారు. ఆ పేరుతో నిర్మించా లనుకుంటున్న రాజధాని నగరం మాత్రం శాపగ్రస్థ, వివాదాస్థ ప్రదేశంగా మారింది. విభజన చట్టం అమలు హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి కేవలం రూ. 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది.
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజ్టెక్ట్ అని, దానిపై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టక్కరలేదని చంద్రబాబు పదేపదే చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసింది. మరో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేయడానికి తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ. 31 వేల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటోంది.
కేంద్రంలోని మోదీ సర్కార్ తమ మద్దతుతోనే మన గలుగుతోంది అంటూ, ఈ 31 వేల కోట్ల రూపాయల రుణంతో రాష్ట్రానికి సంబంధం లేదని కేంద్ర ప్రభు త్వమే ఆ భారాన్ని మోస్తుందని చంద్రబాబు అండ్ కో ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలను ఉద్యమం రూపంలో ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాజాగా మార్చి 10వ తేదీన తమ అధికారిక ఎక్స్ ఎక్కౌంట్లో ‘రాజధాని అమరావతికి అప్పులు అంటూ, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కేంద్రం చెక్ పెట్టింది.
వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజధాని కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే రుణాలు ఏపీ అప్పుల పరిధిలోకి రావని స్పష్టం చేసింది’ అని పేర్కొంది. అబద్ధాలు చెప్పడంలో రాటు దేలిన ఆ పార్టీ ఈ రుణాల బాధ్యత తమది కాదు, కేంద్రానిదే అని చెప్పే ప్రయత్నం చేసింది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రుణాలపై వివరణ ఇస్తూ ‘మల్టీ లేటరల్ లోన్ అసిస్టెన్స్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులను ఆ ప్రభుత్వమే చెల్లించాలని చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మార్చి 10వ తేదీన మాట్లాడుతూ,‘అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్, మెజార్టీ నిధులను సీఆర్‌డీఏనే సమకూర్చుకునే విధంగా ప్రాజె క్టును డిజైన్ చేశాం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాత్కాలికంగా సపోర్ట్ ఇస్తున్నాం అంతే. అది కూడా బయటి సంస్థల ద్వారా రుణాల రూపంలో నిధులను సమకూర్చి ఇస్తున్నాం. అమరావతి భూములు అమ్మేసి ఈ అప్పు లన్నీ కట్టేసే విధంగా డిజైన్ చేస్తున్నాం’ అంటూ వివరణ ఇచ్చారు. కేంద్రం అమరావతికి ఏ రూపంలోనూ నిధులు సమకూర్చడం లేదని, దానిపై కేంద్రానికి ప్రత్యేక శ్రద్ధ కూడా లేదనడానికి ఇదే నిదర్శనం.
అమరావతి నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ చిత్త శుద్ధిపైనా సామాన్యులకే కాదు... అమరావతి ప్రాంత రైతులకు కూడా సందేహాలున్నాయి. అందుకే వారు భూ సమీకరణకు సీఆర్‌డీఏకి సహకరించడం లేదు. 38,581 ఎకరాల్లో రాజధానిని నిర్మించేందుకు 2015 జనవరిలో సీఆర్‌డీఏ ప్రారభించిన భూ సమీకరణ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనిలో 33 వేల ఎకరాల భూమి సమీకరించాం అంటున్న సీఆర్‌డీఏ రైతులకు బదులుగా 65 వేల కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వాలి.
అయితే ఇప్పటి వరకూ 45 వేల ప్లాట్లను మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడంతో పాటు ఇతర కారణాల దృష్ట్యా ఇప్పటికి 20 వేల ప్లాట్లను రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ భూ సమీకరణ పూర్తి కానంత వరకూ రాజధాని విస్తీర్ణం నిర్ణయించడం సాధ్యం కాదు. సీర్‌డీఏ మరో ఐదు వేల ఎకరాలు రైతుల నుంచి సమీకరించడానికి ఎప్పటి నుంచో విఫలయత్నం చేస్తోంది.
అయితే వారు తమ భూములను ఇవ్వడానికి ఏ మాత్రం అంగీకరించడం లేదు. 29 గ్రామాలతో కూడిన ప్రదేశంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దానిలో భాగస్వామ్యం కావడానికి రెండు గ్రామాల ప్రజలు ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. అమరావతి భూము లపై ప్రస్తుతం వందలాది కోర్టు కేసులున్నాయి. ఇన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం మాత్రం 47 సంçస్థలకు భూములు కేటాయించింది. ఇప్పటికే రూ. 9 వేల కోట్లు అమరావతి నిర్మాణాలపై ఖర్చు చేసి మరో రూ. 48 వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది.
అమరావతిలో భూ సమీకరణ ఒక విఫల ప్రయోగం. భూ సమీకరణ పేరుతో అమాయక రైతులు ఎలా నష్టపోయారో బెంగళూరుకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ప్రొఫెసర్ కరోల్ ఉపాధ్యాయ తన ‘అసెంబ్లింగ్ అమరావతి: స్పెక్యు లేటివ్ ఎక్యుమిలేషన్ ఇన్ ఏ న్యూ ఇడియన్ సిటీ’ అధ్యయన గ్రంథంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్ సంస్థ ‘అమరావతి’ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతిని అంతర్జాతీయ వేదికల్లో ప్రస్తావించింది. ‘హైటెక్ సిటీ’ పేరుతో హైదరాబాద్‌లో చంద్ర బాబు నాయుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఎలా పాల్పడ్డారో ప్యారిస్ యూనివర్సిటీకి చెందిన ‘దలేల్ బెన్‌బబాలి’ కళ్ళకు కట్టినట్లు వివరించారు. అదే ప్రయోగాన్ని చంద్ర బాబు నాయుడు అమరావతిలో కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అమరావతిలో దళితులకు అన్యాయం, బలహీన వర్గాల జీవనోపాధికి భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి.
శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి అమరావతి అనువైన ప్రదేశం కాదని అభిప్రాయపడిది. ఆ తరుణంలో అమరావతిలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నాయుడికి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారంటూ అప్పట్లో ‘ఈనాడు’ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ ప్రదేశానికి అమరావతి అని నామకరణం చేసిన వ్యక్తి చెరుకూరి రామోజీరావు. దీనిని అమలు చేస్తోంది చంద్రబాబు నాయుడు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పు లతో నిర్మిస్తున్న అమరావతి అందరి రాజధానిగా ఉంటుందా? కొందరి రాజధానిగా ఉంటుందా? అన్న అనుమానాలు సామాన్యులకు రావడం సహజమే.
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్
మొబైల్: 89859 41411
Comments
Please login to add a commentAdd a comment