బడాయి బాబూ.. సాక్ష్యాలివిగో..
ప్రభుత్వమే హైకోర్టుకు ఈ విషయం చెప్పింది.. హైకోర్టుకు రెండు రోజులు సెలవు ప్రకటించాలని కోరింది
సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయిన అధికారులు.. మునిగిన చంద్రబాబు కరకట్ట బంగ్లా, ఇతర భవనాలు
రాజధానిలో పలు గ్రామాలను ముంచిన వరద నీరు..
కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం
ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడి పహారా
అమరావతిలో రాజధాని వద్దని నాడే చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ
ఐఐటీ నిపుణులూ ఇదే చెప్పడంతో వారినీ పక్కన పెట్టిన ప్రభుత్వం!
విజయవాడను వరద ముంచెత్తడం కంటే రాజధాని అమరావతి వరదలో చిక్కుకుందన్నదే సీఎం చంద్రబాబును ఎక్కువ కలవరపెడుతోంది. తన రియల్ ఎస్టేట్ మాఫియా సామ్రాజ్యంగా ఎంపిక చేసుకున్న అమరావతి ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితం కాదన్న అసలు వాస్తవం బట్టబయలు కావడంతో ఆయనకు కంటి మీద కునుకు లేదు. అబ్బే అమరావతికి వరదే రాలేదంటూ చంద్రబాబు అండ్ కో తిమ్మిని బమ్మిని చేసేందుకు నానా తంటాలు పడుతోంది.
వరదే లేదన్నట్టుగా భ్రమింపజేయాలన్న టీడీపీ కూటమి పెద్దల యత్నాలు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫొటోలు అటూ ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. ఎక్కడో ఉన్న బుడమేరుకు వరదొస్తేనే ఇటు అమరావతి మునిగిపోతుంటే... ఇక పక్కనే ఉన్న కృష్ణా నదికి వరద పోటెత్తితే అమరావతి గతేమిటన్నది యావత్ రాష్ట్రాన్ని తీవ్ర ఆందోళనకుగురి చేస్తోంది. – సాక్షి, అమరావతి
చంద్రబాబు బుకాయింపు ఇదీ..
అమరావతిని వరద ముంచెత్తడంతో ఆ అక్కసునంతా చంద్రబాబు మీడియాపై చూపిస్తున్నాటరు. మీడియా ప్రతినిధులపై ఆయన మంగళవారం చిందులు తొక్కారు. అసలు అమరావతికి వరద ఎక్కడ వచ్చిందని దబాయించేశారు. ‘రాజధాని నిర్మాణానికి అమరావతి అత్యంత సురక్షితమైన ప్రదేశం. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు అమరావతి పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరే రాలేదు. నీటి చుక్కే లేదు’.. ఇలా సాగింది చంద్రబాబు కవరింగ్ డ్రామా.
చంద్రబాబు ఎంతగా బుకాయిస్తున్నా రాజధాని అమరావతిని వరద ముంచెత్తిందన్నది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఆ విషయాన్ని అంగీకరిస్తూ హైకోర్టుకు లేఖ కూడా రాసింది. మరోవైపు మూడు రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుముంటున్నారు. అమరావతిలో పొంచి ఉన్న వరద ముప్పును వెల్లడిస్తున్న ఉదంతాలు ఇలా ఉన్నాయి..
29 గ్రామాలకు నష్టం
భారీ వర్షాలకు రాజధానిలో 31.15 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోని ఉండవల్లి అవుట్‌పాల్ స్లూయిజ్‌ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఉద్దండరాయునిపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రాపురం, రాయపూడి లంక, మత్స్యకార కాలనీ తదితర గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది.
ఆ గ్రామాల పరిధిలో 2 వేల మందికిపైగా ప్రజలు ఉన్నా ప్రభుత్వం కేవలం 50 మందినే పునరావాస కేంద్రాలకు తరలించింది. ఏ క్షణంలోనైనా కృష్ణా కరకట్ట తెగవచ్చని అధికార యంత్రాంగం గుర్తించినా ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. దాంతో ఆ గ్రామాల ప్రజలు కరకట్ట వెంబడి పహారా కాశారు. కానీ అమరావతి గ్రామాలకు వరద ముప్పే లేదంటూ చంద్రబాబు దబాయిస్తుండటం విడ్డూరమే.
ఐఐటీ నిపుణుల కమిటీదీ ఇదే అభిప్రాయం?
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు మద్రాస్ ఐఐటీ నిపుణులను రప్పించింది. వారు అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యేల నివాస భవనాలు మొదలైనవాటిని పరిశీలించారు. ఏకంగా కృష్ణా నదిలో బోట్లలో ప్రయాణిస్తూ మరీ చంద్రబాబు కరకట్ట బంగ్లా, తదితర భవనాలను కూడా çపరిశీలించింది. కృష్ణా నది కరకట్ట మీద చంద్రబాబు బంగ్లాతోపాటు పలు నిర్మాణాలు అక్రమంగా నిర్మించిన విషయాన్ని ఆ బృందం గుర్తించింది.
ఆ అక్రమ నిర్మాణాల వల్ల నది కరకట్ట దెబ్బతింటోందని కూడా కమిటీ సభ్యులు గుర్తించినట్టు సమాచారం. ఇక అమరావతిలో నేల స్వభావం భారీ భవనాల నిర్మాణానికి సరిపోదని ఆ నిపుణులు ఆంతరంగిక చర్చల్లో అభిప్రాయపడ్డారు. అమరావతిలో నిర్మాణాలపై నివేదిక సమర్పిస్తామని చెప్పారు. ఆ తరువాత ఈ విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కమిటీని పక్కనపెట్టేసినట్టు సమాచారం.
సచివాలయం హుటాహుటిన ఖాళీ
అమరావతిని వరద ముంచెత్తుతుండటంతో వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలోని అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తారు. ముప్పును గుర్తించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సచివాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు. దాంతో అధికారులు, ఉద్యోగులు హుటాహుటిన సచివాలయాన్ని వీడి విజయవాడ, గుంటూరుకు తరలివచ్చేశారు.
మూడు రోజులుగా రాష్ట్ర సచివాలయంలో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అంటే.. సచివాలయానికి తాత్కాలికంగా తాళాలు వేశారు. ఎమ్మెల్యే క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు, పలు ప్రభుత్వ భవనాల వద్ద ఇంకా వరద నీరు నిలిచే ఉంది. అయినా అమరావతికి వరదే లేదని దబాయించడం చంద్రబాబుకే చెల్లింది.
స్తంభించిన హైకోర్టు కార్యకలాపాలు
రాజధానికి వరద ముంచెత్తుతుండటంతో హైకోర్టులో రెండు రోజులుగా కార్యకలాపాలు స్తంభించాయి. సోమవారం కేసుల విచారణ ప్రారంభమైన కాసేపటికే కరకట్ట వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రిజిస్ట్రార్లు న్యాయమూర్తులకు నివేదించారు. దాంతో కేసుల విచారణను వాయిదా వేసి న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు వరదముప్పు ముంచుకొస్తున్నందున హైకోర్టు కార్యకలాపాలు రెండు రోజులు నిలిపివేయాలని ప్రభుత్వమే అధికారికంగా హైకోర్టుకు సూచించింది. ఈమేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.
కరకట్ట బంగ్లా ఖాళీ
స్వయంగా చంద్రబాబు నివాసముంటున్న అక్రమ నిర్మాణం కరకట్ట బంగ్లాలోకి వరద నీరు ముంచెత్తిన వాస్తవాన్ని కూడా కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి దూరం నుంచి కూడా ఆ బంగ్లాను ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయకుండా కాపలా కాస్తున్నారు. కరకట్ట బంగ్లాలోకి వరద నీరు రాకుండా వేల సంఖ్యలో ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేస్తున్నారు. ఆ పక్కనే ఉన్న మంతెన ఆశ్రమంలోకి భారీగా వరద నీరు వచ్చింది. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్ట దిగువన ఉన్న 34 భవనాలూ నీట మునిగాయి. అయినా అమరావతికి వరద ముప్పు లేదనడం చంద్రబాబు వితండవాదానికి నిదర్శనం.
రాజధానిగా ఈ ప్రాంతం పనికిరాదని విస్పష్టంగా చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ
అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని శివరామకృష్ణన్ కమిటీ ఆనాడే తేల్చి చెప్పిన విషయం ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. దేశంలోనే అత్యుత్తమ నిపుణులతో కూడిన ఆ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అధ్యయనం చేసింది.
ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు ఉండటం, లోతట్టు ప్రాంతం, నేల స్వభావం దృష్ట్యా అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించవద్దని స్పష్టంగా చెప్పింది. ఇక్కడి నేలలో భారీ భవనాల నిర్మాణం ప్రమాదకరమని కూడా వెల్లడించింది. ఏటా వరద ముప్పు ఉంటుందని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయవద్దని నివేదించింది. అయినా చంద్రబాబు తన రియల్ ఎస్టేట్ మాఫియా కోసం అమరావతిని ఏకపక్షంగా రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment