అమరావతికి వరద రాలేదని పదే పదే ప్రకటించిన సీఎం చంద్రబాబు
మునిగిందని చెబితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం
అయినా తుళ్లూరు మండలంలో 11 గ్రామాల ప్రజలకు వరద సాయం
1,039 మందికి రూ.80.88 లక్షలు వరద పరిహారం
సచివాలయం ఉన్న వెలగపూడి ప్రజలకూ పరిహారం
కేపిటల్ ఏరియాగా నిర్ణయించిన రాయపూడి వాసులకూ నగదు సాయం
లంక గ్రామాలను పక్కనబెట్టి వీరికి చెల్లింపు
పరిహారం అందుకున్న వారిలో 7 ఏళ్ల పిల్లలు సైతం!
సాక్షి, అమరావతి: ‘ప్రపంచంలో అద్భుతమైన రాజధాని అమరావతి వరదల్లో మునగలేదు. ఒక్క ఇల్లూ దెబ్బతినలేదు. గిట్టనివారు దు్రష్పచారం చేస్తున్నారు. రాజధాని మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ఓ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన బహిరంగ ప్రకటన.
కానీ, ఇదే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏకంగా 1,039 మందికి రూ. 80.88 లక్షల పరిహారం అందించింది. మరి ఇదేమిటి? రాజధాని మునగలేదన్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ ప్రాంతంలోని వారికి సాయం చేయడమంటే మునిగిందనేది సుస్పష్టం. దాచుకున్నా దాగని పచ్చి నిజం.
రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు రెండు రోజులకు పైగా నీట మునిగాయని, ప్రజలు దుస్తులు, గృహోపకరణాలు కోల్పోయారని చెబుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం అందించింది. వరద పరిహారం అందుకున్న గ్రామాల్లో ప్రస్తుతం శాసన సభ, సచివాలయం ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన రాయపూడి కూడా ఉన్నాయి.
తుళ్లూరు మండలంలో వరద నష్టాన్ని బట్టి ఒకొక్కరి ఖాతాలో రూ.5 వేల నుంచి రూ.19 వేల వరకు జమచేశారు. దాంతోపాటు బియ్యం, నిత్యావసరాలను కూడా అందించారు.
వెలగపూడి, రాయపూడిల్లో తీవ్ర వరద నష్టం
ఆగస్టు నెల చివరి వారం, సెపె్టంబర్‌లో కురిసిన వరుస వర్షాలు రాష్టంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయడంతో వరద అంతా విజయవాడ నగరంపై పడింది. దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పది రోజులకు పైగా ఇళ్లు నీటిలోనే ఉండిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాలు కూడా మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన రాయపూడి గ్రామాలు సైతం ఉన్నాయి. అమరావతిలో కీలకమైన ప్రాంతాలైన వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, 219 మంది నిరాశ్రయులయ్యారని అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటితోపాటు మందడం, పెదపరిమి, తుళ్లూరు, మల్కాపురం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, ఉద్దరాయనిపాలెం తదితర 11 గ్రామాలూ ఉన్నాయని చెప్పారు.
ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లు రెండు రోజులకు మించి నీటిలోనే మునిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజల జీవనోపాధి సైతం కోల్పోయారని నివేదికలో వివరించారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధానికి అసలు వరదే రాలేదని చెప్పారు.
లంక ప్రజలకు అందని వరద సాయం
తుళ్లూరు మండలంలో బుడమేరు, కృష్ణానదిని ఆనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దండరాయునిపాలెం లంక, రాయపూడి పెదలంక, హరిశ్చంద్రాపురం, బోరుపాలెంలోని కొన్ని నివాసాలు, లింగాయపాలెం, తాళ్లాయపాలెంలోనూ లంక గ్రామాలు ఉన్నాయి. వరద ఎక్కువగా రావడంతో ఈ లంకల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ పరిహారం మాత్రం చాలా తక్కువ మందికి ఇచ్చారు.
అమరావతికి మధ్యలో ఉన్న వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటాయపాలెం పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం రూ.10 వేలు, అంతకంటే తక్కువని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం లంక గ్రామాలను పక్కనపెట్టి, రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రజల ఖాతాల్లో వరద నష్ట పరిహారం సొమ్ము జమ చేసింది.
దుస్తులు, ఇంట్లో సామగ్రి పాడైపోయినందుకు రూ.5 వేలు, 10 రోజులు ఉపాధి కోల్పోయినందుకు రోజుకు రూ.300 చొప్పున ఇంట్లో ఇద్దరికి కలిపి రూ.6 వేలు, ఇల్లు నీటిలో మునిగిపోయినందుకు నష్ట తీవ్రతను బట్టి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. విడ్డూరం ఏంటంటే పరిహారం పొందిన వారిలో ఏడేళ్ల పిల్లలు, దశాబ్దం క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయినవారు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment