రామనామ క్షేత్రం | Sri Ramana Article On Chandrababu Naidu Over Amaravathi | Sakshi

రామనామ క్షేత్రం

Jan 4 2020 1:16 AM | Updated on Jan 4 2020 1:16 AM

Sri Ramana Article On Chandrababu Naidu Over Amaravathi - Sakshi

నాకు ఈ మధ్య అన్నీ అవే కలలు. పిచ్చి కలలు, పీడ కలలు, లాభసాటి కలలు. అమరావతికి ఏ శుభ ముహూర్తంలో, ఎవరి సంకల్పంతో, ఏ సువర్ణ హస్తాలతో పునాది పడిందో కానీ ఏండ్లు పూండ్లు అవుతున్నా గుంటపూలు పూయడం తప్ప పైకి లేచింది లేదు. కొందరి సంకల్పాలు ధగధగలాడుతూ పైకి లేచి ఆకాశాన్నంటుతాయ్‌. మర్రి విత్తనంలా ఆలోచన ఎంత చిన్నది?! జరిగింది జరిగినట్టు చెబుతా వినండి. 

కరపత్రాలు రథంలా చేసిన కారులో చదువుతూ పంచుతున్నారు. ‘రమ్యమైనది... రమ్యమైనది రామనామం! రామ నామం శిలారూప ప్రతిష్ట! కోటి రామనామ క్షేత్రంగా అపర అయో ధ్యగా అవతరించనుంది! ఇతర నామాలు నమ్మి మోసపోవద్దు. మా రామనామ క్షేత్రాన్ని కృష్ణా తీరాన సందర్శించండి. పది నామాలు బుక్‌ చేసిన వారికి ఒక ఫ్రీ నామం ఇవ్వబడును. ఈ ఆఫర్‌ సంక్రాంతి పండుగ వరకే. ఈ ప్రచారంతో క్షేత్రజ్ఞులు, మేధావులు అప్పటికప్పుడు మేల్కొని తలుపులు తీసుకు వెళ్లిపోయారు. రామనామ శిలని సొంతం చేసుకుని, వారికి కేటాయించిన సీట్లో పెట్టుకున్నారు. ప్రతిష్ట సమయంలో మీరు గోదా నం ఇవ్వాలనుకుంటే సిద్ధపడండి. కేవలం వెయ్యి రూపాయలు. గోవుని, దాతని ముందుగా రిజర్వ్‌ చేసుకోవచ్చు. 

కృష్ణా ఒడ్డున ఒక అనువైన ఘాట్‌లో నామాలు చెక్కే పని మొదలైంది. కొండ తిరిగి, దుర్గమ్మ గుడి తిరిగి రామ్‌ నామమ్‌ ఉత్తరాది శ్లాంగ్‌లో కర్ణపుటాలను సోకుతుంది. రైల్వేస్టేషన్‌లో, బస్టాండ్‌లో, సినిమా హాల్‌ దగ్గర ఎక్కడ చూసినా రామనామ మహాగుడి గురించే చెప్పుకుంటున్నారు. చెక్కిన రామనామాలను, కృష్ణా్ణపై తేలాడే పంట్లమీద లేత ఆకులు విచ్చిన పూలు పరచి వాటిపై శయనింప చేస్తున్నారు. పొరుగూరి భక్తజనం రామనామ క్షేత్రానికి వెల్లువెత్తుతు న్నారు. పూలు, పండ్ల కొట్లు ఆ తీరాన వెలిసాయి. దైవభక్తితో కూడిన సందడి బాగా ముదిరింది. మహిళలు పూనకాల్లో పడిపోయి హేరామ్‌ అంటూ మూర్చిల్లుతున్నారు. కృష్ణా తీరం రామనామ క్షేత్ర ప్రచారానికి ఇతోధికంగా తోడ్పడింది. నదీ గర్భం నుంచి వెళ్లి ఎక్కడనుంచో తాబేళ్లు రామనామ శిలలు తెచ్చి శిల్పులకు అందిస్తున్నాయని ఓ మాట పొక్కింది. ఆంజనేయస్వామి హస్తం ఉందన్నారు కొందరు భక్తాగ్రేసరులు. చక్కెరపొంగలి, పులి హోర లాంటి అన్న ప్రసాదాలు వచ్చినవారికి అందిస్తున్నారు. మేం శిలల్ని జలావాసం చేయిస్తున్నాం. రెండు పుష్కరాలు దాటిందని అక్కడి వారంటే కాబోలని అంతా దణ్ణాలు పెట్టుకుంటూ లెంపలు వేసుకున్నారు. 

ఈ క్షేత్ర సంకల్పం వేళ అయోధ్య ఆలయం ముడిపడింది. రానున్న ఆ మందిరంలో మనదీ ఒక శిల అనుకుంటే రండి. తరలిరండి అని క్షేత్రం పిలుపు ఇచ్చింది. ఒక్క రాయి వెయ్యి. వాళ్లే సరఫరా చేసి పూజాధికాలు నివేదికలు చేసి సందర్భం వచ్చినప్పుడు ఆలయానికి చేరుస్తారు. శిలానామం వెయ్యి, గోదానం మరో వెయ్యి, రామాలయ శిల ఇంకో వెయ్యి, ప్రతిష్ట గోత్ర నామాల శిలా ఫలకం రెండున్నరవేలు, తర్వాత నిత్యం జరిగే ధూపదీప నైవేద్యాలకు వెరసీ సంవత్సరానికిగానూ మూడు వేలు. ఇంతింతై చాంతాడల్లే అంతా మొత్తానికి ఓ నామానికి పదివేలు దాటింది. ఆ క్షేత్రం అయిదెకరాల బంజరు భూమి. అందులో ఏమీ పండవ్, వూసర క్షేత్రమని నోరు పారేసుకునేవారు. అదే మరి. నవ్విన నాపచేను పండుతుందంటే అక్కడ జాగ్రత్తగా ఆచితూచి అమరిస్తే అయిదెకరాల్లో ముప్ఫైవేల నామాలు కూచున్నాయి. ఒక్కో నామం ఏటా హీనపక్షం పది నించి ఆపైన సంపాదిస్తుంది. నేను లెక్కలు వెయ్యబోతే ఆ క్షేత్ర యజమాని నన్ను వారించి, ‘అంకెలొద్దండీ... ఆ రాముడికే అంతగా ఓ వెయ్యికోట్లు మిగిల్తే మన వాళ్లందరి కోసం మంచి ఆసుపత్రి కడతా’నంటూ రామనామంతో పెద్దగా ఆవలించాడు. నాకు మెలకువ వచ్చింది. మనకి కావాల్సింది మంచి ఐడియా! అనుకుంటూ లేచాను.

వ్యాసకర్త : శ్రీరమణప్రముఖ కథకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement