ఆరోగ్యశ్రీ పథకం మరో ఆరు జిల్లాలకి విస్తరించడం ఆనం దంగా ఉంది. చికిత్స ఉన్నా డబ్బుల్లేక మరణించడం చాలా దీనం. ఔను, గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ రోగు లపై చిన్నచూపు ఉండేది. కారణం వారివల్ల పడకలు నిండుతాయ్ గానీ గల్లాపెట్టెలు నిండవు. వారి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నించి రావాలి. అందునా చంద్ర బాబుకి విపరీతమైన ‘ధనబద్ధకం’ చేసిన చేతులకి ఎప్పటికి డబ్బు వస్తుందో ఆస్పత్రులకి తెలియదు. అందుకని రోగుల్ని అరువు కేసులుగా భావించేవారు. ఇప్పుడు జగన్ వేలకోట్ల బకాయిలు తరుగులు లేకుండా చెల్లించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు దర్జాగా తలెత్తుకుని వైద్యంకోసం వెళ్లాలని ఆకాంక్షించారు.
అరువుని చిన్న బస్తీల్లో ‘గాత్రం’ పేరుతో వ్యవహ రిస్తారు. చాలా అవమానంగా అరువు బేరాన్ని చూస్తారు. నా చిన్నతనంలో సొంత అనుభవాలు.. కాదు అవమా నాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మా నాన్న పల్లెటూరి బడిపంతులు ఉద్యోగం చేస్తుండేవారు. ఆ వచ్చే వందలోపు జీతం ఆరునెలలకో, తొమ్మిది నెలలకో విడు దల అయ్యేది. ఈలోగా అరువు బతుకులు వెళ్లదీస్తూ ఉండేవాళ్లం. రోజూ పాలుపోసే మంగమ్మ ఎన్ని నీళ్లు కలిపినా అడగటానికి లేదు. ఎందుకంటే అరువు. బియ్యంలో రాళ్ల గురించి నోరు విప్పకూడదు. ఇక చిల్లరకొట్టు షావుకారు దయమీద, శాంక్షన్ మీద ఆధార పడి సరుకులు వచ్చేవి. అమ్మ ఇచ్చిన జాబితాలో వీశ ఉంటే అరవీశ, సవాశేరు ఉంటే సవా పావు చాలని పొట్లాలు కట్టేవాడు. ఒకసారి పట్టీలో కొబ్బరికాయ రాసి వుంటే, ‘ఎందుకయ్యా రూపాయి పావలా టెంకాయ’ అన్నాడు వ్యంగ్యంగా కొట్టు షావుకారు. ‘దేవుడికి’ అన్నాను. పెద్దగా నవ్వి, ‘మీ అరువు రావాలని మేం కొట్టుకోవాలి దేవుడికి కొబ్బరికాయలు. మీకెందుకు బాబూ!’ అని ఎద్దేవా చేశాడు.
నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ దరిద్రం సహ నాన్ని నేర్పుతుంది. అరువు కస్టమర్లు హేళనలు భరించా ల్సిందే! రేవులో నావ దగ్గర కూడా, డబ్బున్నవాళ్లు ముందు ఎక్కండి.. లేనోళ్లు కాస్త ఆగండి’ అని అరుస్తూ ఉంటాడు సరంగు. అరువు బేరాల్లో తూకంలో తేడా ఉంటుంది. కాటాని గమనిస్తున్నా కిమ్మనడానికి భయం. ఖాతాలో పుస్తకంలో కూడా అంతో ఇంతో హెచ్చుగానే అంకెలు పడేవి. ఇంటికెళ్లాక నాన్న కూడా చూసీ చూడ నట్టే ఉండేవారు. చిన్నతనంవల్ల అజ్ఞానం వల్ల నెత్తురు వేడెక్కేది. పెద్దయ్యాక వీళ్లందర్నీ గొడ్డలి, కొడవళ్లతో నరికెయ్యాలనుకునేవాణ్ణి. అవేం చెయ్యలేక పోయాగానీ జీవితంలో అరువుబేరాలు చెయ్యరాదని శపథం చేశా. ఉంటే తినడం లేదంటే లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరాలుగా కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగినా బకాయి వ్యవహారాల్లో ఉండే చిన్నచూపు గురించి ఆయనకు ఎట్లా తెలుసో, బడుగుల అసలైన నేతకి తెలిసి ఉండటం చాలా ముఖ్యం అనిపించింది. ఊరికే ప్రతిమాటకి ముందూ ఆత్మ గౌరవం నినాదాన్ని పలికితే చాలదు. ధనబద్ధకం వది లించుకుని చేతల్లో చూపించాలి బాబూ! జనం ఏదీ పట్టించుకోరనీ, మన సుదీర్ఘ సుత్తి ప్రసంగాలకు పడిపోతారనీ భ్రమలో ఉండకూడదు. నిజానికి ఆభ్రమే చంద్రబాబుని భూస్థాపితం చేసింది. చంద్రబాబు ఉత్తుత్తి మాటలు.. జరిగిన ఎన్నికలు కాదు, జరగబోయే మరో రెండు ఎన్నికల దాకా సరిపడే ప్రఖ్యాతిని మూటకట్టి ఇచ్చాయి. దేవుడి దయవల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేల తడిస్తే రైతుల మనసులు చల్లపడతాయి. ఇప్పుడు రైతులు క్యాపిటల్ ఎక్కడున్నా పట్టించుకోరు.
ఈ సంవత్సరం రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయ్. రైతుల కృషి ఫలిస్తుంది. సర్కార్ చేయూత పుష్కలంగా ఉంది, ఇంకా ఉంటుంది. కాసేపు అర్థం పర్థం లేని విమర్శల్ని ఆరోపణల్నీ పక్కనపెట్టి, ప్రజలకి మేలు కలిగే సూచనలు ఇవ్వండి. ఎన్ని మాటలైనా బుక్కెడు కొర్రలకు సరికావని సామెత. శ్రీశ్రీ మహాకవి ఏనాడో ‘‘ఏడవకండేడవకండి, నేనున్నా నేనున్నా పతితు లార! భ్రష్టులార! బా«ధాసర్పద్రష్టులార!’’ అని ఎలుగెత్తి పాడినపుడు అదో కలవరింత అనిపించింది. కానీ ఇప్పుడు ‘జగన్ నాథ రథ చక్రాలొస్తున్నాయ్, వస్తు న్నాయ్!’ అనే సింహగర్జన నిజం.. ముమ్మాటికీ నిజం అనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ విస్తరణతో అందరికీ కొత్త బతు కులు, కొత్త ఆశలు ప్రసాదించిన జననేతకు సర్వం శుభ మగుగాక! దీర్ఘాయుష్మాన్ భవ!
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment