akshara tuneeram
-
జయాభి జై భవ! జయోస్తు!
గత స్మృతులు గుర్తు చేసుకుం టున్నకొద్దీ రంగుల కలలుగా కని పించి ఆనందపరుస్తాయి. చిన్న ప్పుడు, కొంచెం ముందునించే దసరా రిహార్సల్స్ మొదలయ్యేవి. ఒక పద్యం తప్పక అయ్యవార్లు పిల్లలకు నేర్పించేవాళ్లు. ‘ధరా సింహాసనమై, నభంబు గొడుగై, తద్దేవతల్ భృత్యులై...’ అనే పద్యం చాలా ప్రసిద్ధి. పిల్లలం దరికీ నోటికి పట్టించేవారు. దసరా అంటే శరన్నవ రాత్రోత్సవాలలో పిల్లల విద్యా ప్రదర్శన, దాంతోపాటు గురు దక్షిణ స్వీకారం జరిగేది. ఈ పద్యం ఏ మహాను భావుడు రచించాడో చాలా గొప్పది. దేవుణ్ణి పొగిడి, పొగిడి ఆఖరికి ‘వర్ధిల్లు నారాయణా’ అంటూ దీవెనలు పెడతాడు. ధరా సింహాసనమై, భూమి ఆసన్నమై, ఆకాశం గొడుగై, దేవతలు సేవకులై, వేదాలు స్తోత్ర పాఠకులై, శ్రీగంగ కుమార్తె కాగా ‘నీ ఘనరాజసంబు వర్ధిల్లు నారా యణా’ అంటూ పూర్తి అవుతుంది. అనాదిగా వస్తున్న దసరా పద్యాలలో ఇదొకటి. తర్వాత పిల్లలు జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు అంటూ బడి పిల్లలు జై కొడుతూ అయ్యవారి వెంట బయలు దేరతారు. ఏటా జరిగే ఈ ఉత్సవం కోసం ప్రతి గడపా వేయికళ్లతో ఎదురుచూసేది. ఆడ, మగ పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, మగ పిల్లలు విల్లమ్ములు, ఆడ పిల్లలు ఆడే కోతి బొమ్మలు పట్టుకుని పాటలతో, వీధుల వెంట సందడి చేసేవారు. ఆ చిన్న విల్లమ్ములు చిత్రంగా ఉండేవి. దాంతో గులాములు కొట్టడానికి వీలుండేది. ఆడ పిల్లలు కొత్త పరికిణీలు వేసుకుని కోతిని ఆడిస్తూ ఆట పట్టించేవారు. పిల్లలు ఇంటింటికీ తిరిగేవారు. జయాభి జై భవ! దిగ్వి జై భవ! బాలల దీవెనలు బ్రహ్మదీవెనలు! పావలా అయితేను పట్టేది లేదు! అర్ధరూపాౖయెతే అసలే మాకొద్దు! అయ్యవాండ్రకు చాలు ఐదు వరహాలు! పిల్ల వాండ్రకు చాలు పప్పుబెల్లాలు! అంటూ యాగీ చేసేవారు. వీధి బడిలో ఏడాది పొడుగునా చదువు చెప్పిన వారికి ఐదు వరహాలు గురుదక్షిణ. వరహా అంటే నాలుగు రూపా యలు. ఆ రోజుల్లో అయ్యవార్లు ఎంతటి అల్ప సంతో షులు! ఇది విజయదశమి నాటి సంరంభం. ముందు రోజు ఆయుధపూజ. అదీ మరీ పెద్ద ఉత్సవం. రైతుల దగ్గర్నించి, పల్లెల్లో పట్టణాల్లో ఉండే సమస్త చేతివృత్తుల వారు తాము నిత్యం వాడే పరిక రాలను ఆయుధాలుగా భావించి వాటికి సభక్తికంగా పూజలు చేస్తారు. దీనికి రకరకాల ఐతిహ్యాలు చెబుతారు. పాలపిట్టని చూస్తే శుభమని తెలంగాణ ప్రాంతీయులు నమ్ముతారు. వెండి బంగారం అంటూ జమ్మి ఆకులు ఇచ్చి పెద్దల దీవెనలు తీసుకుంటారు. తెలంగాణలో జానపదుల బతుకమ్మ పండుగ దసరాతో కలిసే వస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రిళ్లలో రోజుకో అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. ఇట్లా పదిరోజులు సాగే పెను పండుగ మరొకటి లేదు. దేశమంతా కనకదుర్గ, మహంకాళి అమ్మవారి ఉత్సవాలు రకరకాల పేర్లతో వైభవంగా జరుగు తాయి. మన దేశం అన్ని విషయాలలో మిగిలిన ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నా పండుగలూ పర్వాలనూ పంచాంగం చెప్పిన ప్రకారం జరుపుకుంటోంది. ఇదొక విశ్వాసం, ఇదొక నమ్మకం. ఎన్నో తరాలుగా, ఆర్ష సంప్ర దాయం అనుసరించి వస్తున్న పండుగలు పచ్చాలు భక్తిప్రపత్తులతో చేసుకోవడంలో తప్పులేదు. నిన్న మన సంప్రదాయాన్నీ, ఆచారాన్నీ గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బెజవాడ దుర్గమ్మకి సభక్తికంగా రాష్ట్ర ప్రజలపక్షాన పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ప్రజలు ఆనందించారు. మన దేశంలో పెద్ద నదులన్నింటికీ పుష్కరాలు జరుగుతాయి. గంగానది సాక్షాత్తూ శివుడి తలమీంచి జనావళి కోసం దిగి వచ్చిందని మనం నమ్ముతాం. భగీరథుడి కృషికి దివి నుంచి భూమికి గంగ దిగి వచ్చింది. గంగ పుష్కరాలని కుంభమేళాగా వ్యవహరిస్తారు. సాధు సంతులు, సంసారులు, సామాన్యులు కుంభమేళా గంగ స్నానాలు ఆచరిస్తారు. ఈ ఉత్సవానికి హాజరైన నాటి మన ప్రధాని నెహ్రూని, మీరు ఇలాంటి వాటిని నమ్ముతారా అని ఓ పత్రికా ప్రతినిధి అను మానంగా అడిగాడు. అందుకు జవహర్లాల్ ఏ మాత్రం తొట్రుపడకుండా– ‘కోట్లాది మంది విశ్వాసాల్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఉంటే నమ్మకం. గౌరవం అంటే నమ్మకం’ అని జవాబు ఇచ్చారు. ఎక్కువమంది విశ్వసించే వాటిని గౌరవించడం కూడా ఒక సంస్కారం. మంచికి, చెడుకి మధ్య జరిగిన పోరు దసరా. అందుకే విజయదశమి అయింది. ఇహ నించి జాతికి అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. తెలుగు వారందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినోభవన్తు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రంగస్థలంపై 80 వసంతాలు
పౌరాణిక రంగస్థలంపై 80 వసంతాల ఉప్పాల రత్తయ్య మేష్టారు! మేష్టారే కాదు, ఆ రోజుల్లో ఉప్పాల వేంకట రత్తయ్యగారు ‘స్టారు’ కూడా! మా చుట్టు పక్కల ఎక్కడ పౌరాణిక నాటకం ఆడుతున్నా, మైకుల్లో చెబుతూ కర పత్రాలు పంచేవారు. అవి పోగు చేయడం చిన్నతనపు సరదాలలో ముఖ్యమైంది. ఆ కరపత్రాలలో మా మేష్టారి ఫొటో దాని పక్కన ఆయన హావభావాల గురించి నటనాను భవం గురించి రెండు వాక్యాల్లో అచ్చువేసేవారు. చివర్లో షరా మామూలే. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు అని ఉండేది. ఆ కరపత్రాలు చదువు కోవడా నికి భలే తమాషాగా ఉండేవి. బెజవాడ రేడియో ద్వారా కూడా ఆయన సుప్రసిద్ధులు. మా తెనాలి ప్రాంతం నేల, నీరు, గాలి తెలుగు పౌరాణిక నాటక పద్యాలను కలవరిస్తుండేవి. మరీ ముఖ్యంగా పాండవో ద్యోగ విజయాలు మొదలు బ్రహ్మంగారి నాటకం ద్వారా టికెట్ డ్రామాలు ఫ్రీ డ్రామాలు సదా నడుస్తూనే ఉండేవి. ప్యారిస్ ఆఫ్ ఆంధ్రాగా పేరుపొందిన తెనాలి టౌను పౌరాణిక డ్రామా వ్యాప కానికి ‘మక్కా’గా ఉండేది. కిరీటాలు, పూసల కోట్లు ధరించి లైటింగుల మధ్య నిలబడాలంటే తెనాలి చేరాల్సిందేనని వాడుక ఉండేది. ఎక్కడో ‘రాముడు వలస’ నించి వలసవచ్చి పిశుపాటి నరసింహమూర్తి కృష్ణ వేషధారిగా ఎనలేని ఖ్యాతి గడించారు. వేమూరు గగ్గయ్య, రామయ్యగార్లు నాటక రంగాన్ని, తెలుగు సినిమా రంగాన్ని సుసంపన్నం చేశారు. ఆ రోజుల్లో తెనాలిలో కొన్ని వీధుల్లో నడుస్తుంటే ఖంగున డబుల్ రీడ్ హార్మోణీ పెట్టెలు వినిపించేవి. ఎందరో మహా నుభావుల సరసన దశాబ్దాల తర బడి కమ్మని గాత్రంతో శ్రోతల్ని అలరించిన అదృష్టవంతులు ఉప్పాల రత్తయ్య మేష్టారు. శనగవరపు, ఓగిరాల, ఆరేళ్ల రామయ్య లాంటి తర్ఫీద్ ఒజ్జలుండేవారు. పంచ నాథం లాంటి ఆల్‌రౌండర్లు తెనాలిలోనే దొరికేవారు. డ్రెస్ కంపెనీలు, తెనాలి ప్రెస్సుల్లో ప్రసిద్ధ రంగస్థల నటుల ఫొటో బ్లాకులు రెడీగా దొరికేవి. రావికంపాడు మొసలి పాడు గ్రామాలు కవల పిల్లల్లా జంట నగరాల్లో కలిసి ఉంటాయి. గుమ్మడి గారు పుట్టి పెరిగిన ఊరు. రత్తయ్య మేష్టారంటే గుమ్మడి గారికి ఎనలేని గౌరవం. మద్రాసులో వారిని ఎప్పుడు కలిసినా మొట్ట మొదటగా మేష్టారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. రత్తయ్య గారిది ఫెళఫెళలాడే గాత్రం, స్పష్టమైన వాచకం, భావం తెలిసి పద్యం పలికించే విధానం ఉప్పాల రత్తయ్యగారి స్వార్జితం. వేదిక మీద సహనటుల శృతుల్ని మతుల్ని వారి స్థాయిలను కలుపుకుంటూ, కాడిని లాగుతూ నటరాజు రథాన్ని ముందుకు నడిపించడం మేష్టారికి పుట్టుకతో వచ్చిన విద్య. ఆయన చాలామంచి సంస్కారి. ఎన్నో దశాబ్దాల స్టేజి అను భవం, పెద్దల సాంగత్యంతో నిగ్గుతేలిన సమయస్ఫూర్తి మేష్టారి నట జీవితానికి వన్నె కూర్చాయి. ఒకనాటి సురభి నాటకాల పంథాలో క్రమశిక్షణ ఆయన అలవరచుకున్నారు. సురభిలో ఎవరు ఏ వేషాన్నైనా ధరించి లీలగా, అవలీలగా పోషించి నాటకాన్ని రక్తి కట్టించేవారు. మా మేష్టారు పలు సందర్భాలలో పలు పాత్రలు పోషించడం నేను చూశాను. ఒక్కొక్క పాత్ర హావభావ ఉచ్ఛారణలు ఒక్కోలా ఉంటాయి. నడకలు, నవ్వులు ఎవరివి వారివే. వాటిని గుర్తెరిగి ప్రేక్షక శ్రోతల్ని రంజింప జేయాలి. అలాంటి స్వస్వరూప జ్ఞానం పుష్కలంగా కలిగిన విద్వన్మణి రత్తయ్యగారు. పైగా మేష్టారు నాడు కలిసి నడిచిన నటీనటులు అగ్రగణ్యులు, అసామాన్యులు! అన్నీ నక్షత్రాలే! అదొక పాలపుంత వారంతా ఆదరాభిమానాలతో గౌరవంగా రత్తయ్యగారిని అక్కున చేర్చుకున్నారు. అందరూ మన ట్రూప్ వాడే అని మనసా భావించే వారు. పౌరాణిక నాటక రంగంపట్ల మేష్టారికి గల అవ్యాజమైన ప్రేమాభిమానాలను వారి సమకాలి కులంతా గ్రహించి, గుండెలకు హత్తుకున్నారు. నాడు నాటకరంగం గొప్ప ఆదాయ వనరైతే కాదు. కీర్తి ప్రతిష్టలా అంటే అదీ కాదు. తిన్న చోట తినకుండా తిరిగిన చోట తిరగక సరైన వసతులు లేక సకాలంగా గ్రీన్రూమ్కి చేరు కుంటూ జీవితం గడపాలి. చెప్పిన పదీ పాతిక ఇస్తారో లేదో తెలి యదు. ఉంగరాలు తాకట్టుపెట్టుకుని గూటికి చేరిన సందర్భాలు ప్రతివారికీ ఉండేవి. అయినా అదొక పిచ్చి. మేష్టారు మంచి క్రమశిక్షణతో, అలవాట్లతో ఈ ప్రపంచంలో ఉంటూ ఉత్సాహ ఆరోగ్యాల్ని కాపాడుకున్నారు. నిత్య విద్యార్థిగా కావాల్సినంత ప్రతిభని, అనుభవాన్ని గడించుకున్నారు. మా గ్రామంలో (వరహాపురం) ఉప్పాల రత్తయ్య మేష్టారు కొంతకాలం పని చేశారు. మా వూళ్లో పౌరాణిక నాటక పునర్ జాగృతికి ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఆయన మేలు ఎన్నటికీ మావూరు మర్చిపోదు. వ్యక్తిగతంగా ఎక్కడ ఆనందపడ్డారో అదే ఆనందం తనకు తెలిసిన ప్రతిభా వంతులకు పంచివ్వాలని సరదా పడేవారు. చేతనైన మేర చేసేవారు. సంస్కారశీలి. ‘చీకట్లను తిట్టుకుంటూ కూర్చోవద్దు. చిరు దీపాన్నైనా వెలిగించు’ అని చెప్పిన ప్రవక్త మాటల్ని తన జీవితంలో అక్ష రాలా అమలుపరిచిన ధన్యజీవి రత్తయ్య మేష్టారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఎవరికైనా అరుదు. పద్య నాటకానికి కళాకాంతి జనం వన్స్మోర్లు. మా మేష్టారి వేయిపున్నముల ఈ బంగారు చరిత్రకి మా తెనాలి నేల చప్పట్లతో ‘వన్స్‌మోర్’ కొడుతోంది. నిత్యగారాల పంటగా శృతి సుఖంగా వర్ధిల్లండి! వారిని మేమూరు శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడుగాక! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జగన్నాథ రథ చక్రాల్!
ఆరోగ్యశ్రీ పథకం మరో ఆరు జిల్లాలకి విస్తరించడం ఆనం దంగా ఉంది. చికిత్స ఉన్నా డబ్బుల్లేక మరణించడం చాలా దీనం. ఔను, గత ప్రభుత్వం హయాంలో ఆరోగ్యశ్రీ రోగు లపై చిన్నచూపు ఉండేది. కారణం వారివల్ల పడకలు నిండుతాయ్ గానీ గల్లాపెట్టెలు నిండవు. వారి బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నించి రావాలి. అందునా చంద్ర బాబుకి విపరీతమైన ‘ధనబద్ధకం’ చేసిన చేతులకి ఎప్పటికి డబ్బు వస్తుందో ఆస్పత్రులకి తెలియదు. అందుకని రోగుల్ని అరువు కేసులుగా భావించేవారు. ఇప్పుడు జగన్ వేలకోట్ల బకాయిలు తరుగులు లేకుండా చెల్లించారు. ఆరోగ్యశ్రీ పేషెంట్లు దర్జాగా తలెత్తుకుని వైద్యంకోసం వెళ్లాలని ఆకాంక్షించారు. అరువుని చిన్న బస్తీల్లో ‘గాత్రం’ పేరుతో వ్యవహ రిస్తారు. చాలా అవమానంగా అరువు బేరాన్ని చూస్తారు. నా చిన్నతనంలో సొంత అనుభవాలు.. కాదు అవమా నాలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మా నాన్న పల్లెటూరి బడిపంతులు ఉద్యోగం చేస్తుండేవారు. ఆ వచ్చే వందలోపు జీతం ఆరునెలలకో, తొమ్మిది నెలలకో విడు దల అయ్యేది. ఈలోగా అరువు బతుకులు వెళ్లదీస్తూ ఉండేవాళ్లం. రోజూ పాలుపోసే మంగమ్మ ఎన్ని నీళ్లు కలిపినా అడగటానికి లేదు. ఎందుకంటే అరువు. బియ్యంలో రాళ్ల గురించి నోరు విప్పకూడదు. ఇక చిల్లరకొట్టు షావుకారు దయమీద, శాంక్షన్ మీద ఆధార పడి సరుకులు వచ్చేవి. అమ్మ ఇచ్చిన జాబితాలో వీశ ఉంటే అరవీశ, సవాశేరు ఉంటే సవా పావు చాలని పొట్లాలు కట్టేవాడు. ఒకసారి పట్టీలో కొబ్బరికాయ రాసి వుంటే, ‘ఎందుకయ్యా రూపాయి పావలా టెంకాయ’ అన్నాడు వ్యంగ్యంగా కొట్టు షావుకారు. ‘దేవుడికి’ అన్నాను. పెద్దగా నవ్వి, ‘మీ అరువు రావాలని మేం కొట్టుకోవాలి దేవుడికి కొబ్బరికాయలు. మీకెందుకు బాబూ!’ అని ఎద్దేవా చేశాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ దరిద్రం సహ నాన్ని నేర్పుతుంది. అరువు కస్టమర్లు హేళనలు భరించా ల్సిందే! రేవులో నావ దగ్గర కూడా, డబ్బున్నవాళ్లు ముందు ఎక్కండి.. లేనోళ్లు కాస్త ఆగండి’ అని అరుస్తూ ఉంటాడు సరంగు. అరువు బేరాల్లో తూకంలో తేడా ఉంటుంది. కాటాని గమనిస్తున్నా కిమ్మనడానికి భయం. ఖాతాలో పుస్తకంలో కూడా అంతో ఇంతో హెచ్చుగానే అంకెలు పడేవి. ఇంటికెళ్లాక నాన్న కూడా చూసీ చూడ నట్టే ఉండేవారు. చిన్నతనంవల్ల అజ్ఞానం వల్ల నెత్తురు వేడెక్కేది. పెద్దయ్యాక వీళ్లందర్నీ గొడ్డలి, కొడవళ్లతో నరికెయ్యాలనుకునేవాణ్ణి. అవేం చెయ్యలేక పోయాగానీ జీవితంలో అరువుబేరాలు చెయ్యరాదని శపథం చేశా. ఉంటే తినడం లేదంటే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరాలుగా కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగినా బకాయి వ్యవహారాల్లో ఉండే చిన్నచూపు గురించి ఆయనకు ఎట్లా తెలుసో, బడుగుల అసలైన నేతకి తెలిసి ఉండటం చాలా ముఖ్యం అనిపించింది. ఊరికే ప్రతిమాటకి ముందూ ఆత్మ గౌరవం నినాదాన్ని పలికితే చాలదు. ధనబద్ధకం వది లించుకుని చేతల్లో చూపించాలి బాబూ! జనం ఏదీ పట్టించుకోరనీ, మన సుదీర్ఘ సుత్తి ప్రసంగాలకు పడిపోతారనీ భ్రమలో ఉండకూడదు. నిజానికి ఆభ్రమే చంద్రబాబుని భూస్థాపితం చేసింది. చంద్రబాబు ఉత్తుత్తి మాటలు.. జరిగిన ఎన్నికలు కాదు, జరగబోయే మరో రెండు ఎన్నికల దాకా సరిపడే ప్రఖ్యాతిని మూటకట్టి ఇచ్చాయి. దేవుడి దయవల్ల సకాలంలో వర్షాలు పడుతున్నాయి. నేల తడిస్తే రైతుల మనసులు చల్లపడతాయి. ఇప్పుడు రైతులు క్యాపిటల్ ఎక్కడున్నా పట్టించుకోరు. ఈ సంవత్సరం రుతుపవనాలు అనుకూలంగా ఉంటాయ్. రైతుల కృషి ఫలిస్తుంది. సర్కార్ చేయూత పుష్కలంగా ఉంది, ఇంకా ఉంటుంది. కాసేపు అర్థం పర్థం లేని విమర్శల్ని ఆరోపణల్నీ పక్కనపెట్టి, ప్రజలకి మేలు కలిగే సూచనలు ఇవ్వండి. ఎన్ని మాటలైనా బుక్కెడు కొర్రలకు సరికావని సామెత. శ్రీశ్రీ మహాకవి ఏనాడో ‘‘ఏడవకండేడవకండి, నేనున్నా నేనున్నా పతితు లార! భ్రష్టులార! బా«ధాసర్పద్రష్టులార!’’ అని ఎలుగెత్తి పాడినపుడు అదో కలవరింత అనిపించింది. కానీ ఇప్పుడు ‘జగన్ నాథ రథ చక్రాలొస్తున్నాయ్, వస్తు న్నాయ్!’ అనే సింహగర్జన నిజం.. ముమ్మాటికీ నిజం అనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ విస్తరణతో అందరికీ కొత్త బతు కులు, కొత్త ఆశలు ప్రసాదించిన జననేతకు సర్వం శుభ మగుగాక! దీర్ఘాయుష్మాన్ భవ! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పరిశుభ్రతే పరమధర్మం
ఒక ఉలికిపాటు. ఒక విపత్తు. ఎప్పుడూ లేదు. ఒకప్పుడు ఇలాంటి ఎదు రుచూడని వైపరీత్యాలు జరిగి ఉండచ్చు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో సమాచారాన్ని విశ్వమంతా చేరవేయగల సాంకేతిక పరిజ్ఞానం మనిషి వేళ్ల కొసమీద ఉంది. కొద్ది గంటల్లో నేలమీద ఏ మూల నుంచి ఏ మూలకైనా చేరగల సౌకర్య సామర్థ్యాలను మనిషి సాధించాడు. అదే ఇప్పుడు ఈ పెనుముప్పుకి దోహదమైంది. కరోనా అంటువ్యాధి విమానాలెక్కి సముద్రాలు దాటి ఖండాంతరాలను వచ్చి చేరింది. నూతన సంవత్సరం 2020 ఈ విపత్తులో ప్రారంభం కావడం మొత్తం మానవాళిని అల్ల కల్లోలం చేస్తోంది. ఇంతవరకు కరోనా నైజం ఎవరికీ అంతుబట్టలేదు. శాస్త్రవేత్తలు అవిశ్రాం తంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి తెలిసిందే మంటే వ్యక్తిగత మరియు సమష్టి పరిశుభ్రత మాత్రమే దీనికి విరుగుడుగా నిర్ధారించారు. వయ సుమళ్లినవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. మాటిమా టికీ చేతులు శుభ్రం చేసుకోవాలని హెచ్చరి స్తున్నారు. పరిశుభ్రతలోనే పరమేశ్వరుడున్నాడని అనా దిగా మనం విశ్వసిస్తున్నాం. పాటిస్తున్నాం. రోజూ కనీసం మూడుసార్లు నదీ స్నానం, దైవ ధ్యానం, అగ్నిహోత్ర ఆరాధన లాంటి నియమాలను మన ఋషులు శాస్త్రోక్తంగా ఆచరించి మరీ ఉద్బోధిం చారు. రోజులు మారాయి. ఎవరికీ తీరిక ఓపికలు లేవు. రోజూ ఒక స్నానానికి కూడా వ్యవధి లేదు. ప్రపంచీకరణ తర్వాత అవకాశమున్న అన్ని వెసులు బాట్లని మనం దినచర్యలోకి అలవాటుగా తెచ్చు కుని, అదే నాగరికత అనుకుంటున్నాం. ఒక నాటి ముతక ఖద్దరు వస్త్రాలు, వాటిని రోజూ ఉతికి ఆరేసి ధరించడం అనాగరికం అయింది. ఇప్పుడు మనం ధరించే చాలా రకాల దుస్తులు ఉతికే పనిలేదు. ఒంటిమీదే పుట్టి ఒంటిమీదే చిరి గిపోతాయ్. ఇంటికి ఎలాంటి పరాయి మనిషి వచ్చినా, అతిథి వచ్చినా కాళ్లకి నీళ్లివ్వడం మన ఆచారం. అదిప్పుడు అనాచారం. మరీ పసిపిల్ల లున్న ఇళ్లలోకి ఈ శుభ్రత పాటించకుండా ఎవరూ గడపలోకి అడుగుపెట్టేవారు కాదు. మళ్లీ ఇన్నాళ్లకి ఆచారాలు గుర్తుకొస్తున్నాయ్. స్వచ్ఛభారత్ ఒక శుభారంభం. కానీ మన ప్రజల ఉదాసీనత, తరాలుగా ఉన్న అశ్రద్ధ, అవ గాహనా రాహిత్యంతో ఆ ఉద్యమం చేరాల్సిన స్థాయికి చేరలేదు. మన రైలు బోగీలు, మన ప్రయాణికుల బస్సులు, ఆయా స్టేషన్లు ఇన్నాళ్లూ శాని టైజేషన్ని చూడలేదు. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అవన్నీ నడుస్తున్నాయి. మనకి చెత్త చెదారం ఇంకా చిమ్మేసినవన్నీ తీసి గోడవతల వెయ్యడం మనకో అలవాటు. మనకి సూర్యుడు రక్షాకరుడు. రోజులో పది నించి పన్నెండు గంటలు రకరకాల కిరణాలను భూమికి పంపుతూ అనేకానేక సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తున్నాడు. సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడుగా పూజ లందుకుంటున్నాడు. సూర్యభగవానుడు నిజానికి మన జెండా మీద ఉండాలి. మనకి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అలవాటే. కరోనాకి అవగాహనే ప్రస్తుతానికి మందు. ప్రపంచ దేశా లన్నీ ముందు జాగ్రత్తకీ, తర్వాత వైద్యానికి మందుల పరిశోధనతో తలమునకలవుతు న్నాయ్. త్వరలోనే పరిష్కారం వస్తుందన్నది నిస్సంశయం. ప్రధాని మోదీ జాతికి సందేశమిస్తూ, రేపు వచ్చే ఆదివారం ఐచ్ఛికంగా దేశమంతా కర్ఫ్యూ పాటించాలని చెప్పారు. పన్నెండు గంటలు నిరో ధిస్తే వైరస్ చనిపోతుందని కూడా చెప్పారు. ఈ చిన్న అభ్యర్థనని అందరం పాటిద్దాం. నిర్మా నుష్యమైన చారిత్రక ప్రదేశాల్లో అరుదైన ఫొటోలు తీద్దామని, సెల్ఫీలు దిగుదామని కూడా బయ టకు రావద్దు. ఇలాంటి ప్రయత్నాలని ఎవరూ హర్షించరు. అది గర్వకారణం కూడా కాదు. దేశభకి,్త సమాజ భక్తి ఉంటే అంతా తలా పది మందికి చెప్పి, నచ్చజెప్పి కరోనా వ్యాప్తిని అరి కట్టేందుకు యథాశక్తి దోహదపడండి. సర్వే జనా సుఖినోభవంతు. వ్యాసకర్త : శ్రీరమణ ప్రముఖ కథకుడు -
క్యాపిటల్ పాంకోళ్ల కథ
అసలు అప్పుడే మనకి నోరుంటే పొట్టి శ్రీరాములు స్వరాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకోగానే నెల్లూరే మన క్యాపిటల్ అని ఎలుగెత్తి చాటేవారు. శ్రీరంగనాయకస్వామి అండగా నిలబ డేవాడు. పెన్నమ్మ జలసంపదలిచ్చి చల్లగా చూసేది. సన్న బియ్యంతో సహా సమస్త నాజూకులతో ముఖ్య పట్టణం విరాజిల్లేది. ప్రపంచ దేశాల స్థాయిలో నెల్లూరులో ఏ కాన్ఫరెన్స్ పెట్టినా ఆహ్వానితులు ఆవురావురుమని విచ్చేసే వారు. ఆ కూరలు, ఆ పిండి వంటలు, ఆ దోసెలు, ఆ అరిటాకు లేలేత పరిమళాలు క్యాపిటల్ పేరు చెప్పగానే పదండి ముందుకు అంటూ నడిపించేవి. కాయగూరలేనా, కందమూలా లేనా పుణ్య పురుషులకు రుచి భోగాలున్న జలచరాలు, భూచ రాలు, ఖేచరాలు కోరినదే తడవుగా విస్తళ్లను అలంకరిస్తాయి. ఇంకా చిత్రాతిచిత్రమైన చిత్రన్నాలు, భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు, చోష్యాలు, మధుర మధురతర పానీయాలు విస్తరిని కిటకిటలాడిస్తాయి. ఇది నెల్లూరు తిండిముచ్చట. ఇక రాజకీ యాలంటారా, అచట చిగురు కొమ్మైన చేవ. నెల్లూరు బారసాల కూడా లేకుండానే జారిపోయింది. అకళంక దేశభక్తుడు ‘వంగ వోలు’ క్యాపిటల్ చెయ్యాలిరా అని రంకెపెడితే ఏమి జరిగేదో?! ఆంధ్రకేసరి గర్జించ లేదు. మూడో మాట లేకుండా తెలుగువారు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని తిరిగి వెనక్కి చూడలేదు. మళ్లీ ఇన్నాల్టికి విస్తళ్లముందు నుంచి కొంగులు దులుపు కుని లేచిపోవలసి వచ్చింది. వడ్డించిన విస్తళ్లు కాదు కదా కూచో డానికి అనువైన చోటైనా దొరకలేదు. ఆరేళ్ల నుంచి కథ నడు స్తోందిగానీ కంచికి చేరడం లేదు. భూములిచ్చిన రైతులు, వారి కష్టనష్టాలు, మీడియా, రాజకీయ, అరాచకీయ ప్రముఖులు అంతా కలిసి సమస్యని కమ్మేశారు. కుమ్మేశారు. చినికి చినికి గాలివాన అయింది. పనులు ముందుకు కదలడం లేదు. మాక్కావలసింది అదేనని తృప్తిగా నిట్టూరిస్తోంది వీళ్లకి సరిపోని అపోజిషన్. ఇట్లాంటి పెద్ద సమస్యలుగా ప్రజ్వరి ల్లేటప్పుడు, సామాన్యుణ్ణి అడిగి చూడాలి. అదే చేశాను. అతని మారుపేరు ‘అడ్డ బుర్ర’. వట్టిపోయిన గోమాతతో నూనెగా నుగ తిప్పుతూ ఊర్లో బతికేస్తున్నాడు. ఒక ప్పుడు బాగా బతికి చెడ్డవాడు. గానుగ కొయ్య తొట్టె మీద కూచుని, ఓ మూల నుంచి వచ్చే రేడియో సర్వస్వం వింటూ, దొరికిన పేపర్లని అక్షరం వదలకుండా నాకేసేవాడు. ‘ఇదిగో నువ్ గోవుతో గానుగ తిప్పుతున్నావని మోదీకి ఫొటోతో సహా ఫిర్యాదు చేస్తా’నని బెదిరిస్తే– అడ్డబుర్ర విలాసంగా నవ్వి ‘మరి నా గానుగ ఎట్టా తిరగాల? ఎవరైనా వాళ్ళోళ్లకి పురమాయించ మను. లేదంటే పనిచేసే ఆవులకు రిటైర్మెంట్ ప్రకటించి నెలవారీ పింఛనైనా మంజూరు చెయ్యమను. పాపం! అవెట్టా బతకాల’ అని జాలిపడేవాడు. ఇవ్వాళ హాయిగా బతకాలంటే లోకజ్ఞానం కాదు మీడియా జ్ఞానం ముఖ్యం అనేవాడు గానుగ కిర్రు చప్పుళ్ల మధ్య. ‘నువ్వు కాణి ఖర్చులేకుండా అన్ని పేపర్లు చదివేస్తావు గదా, మరి ఆ ఫలానా పత్రికనే ఎక్కువమంది చదువుతారెందుకు?’ అని అడిగితే, అదంతే అంటాడు అడ్డ బుర్ర. ‘కల్లు తాగేసినంత జోరుగా పాలు లాగీలేదు గందా’ సామెత చెప్పి ముక్తాయించేవాడు. పేపర్లో నిజాలు, అబద్ధాలు, వార్తలు అని మూడు విధాలవి కలిసిపోయి ఉంటాయి. విడ గొట్టుకున్నవాడు విజ్ఞాని అని సూత్రీకరించేవాడు. క్యాపిటల్ దుమారంమీద చర్చ వచ్చింది అడ్డ బుర్రతో. మధ్యలో కిర్రు చప్పుడుకి చిరాకుపడ్డాడు. అదేదో మన అవస్తో, వ్యవస్తో అది కూడా నా గానుగ లాంటిదే. అదిలించినా అంతే కదిలించకపోయినా అంతే. ముసలి జీవం మూడుకాళ్లమీద ఎట్టా నడుసుద్దో అంతే. మళ్లీ విషయంలోకి వచ్చాడు. ‘అసల ప్పుడు అట్టా జరిగి ఉంటే అప్పుడసలు క్యాపిటల్ సమస్య వచ్చేదే కాదు’ అంటూ ఓ ఏకవాక్య స్టేట్మెంట్ వదిలాడు. అసలప్పుడేం జరి గింది? అందరం ప్రశ్నార్థకంగా నిలబడి ఉత్కంఠభరితంగా అరిచాం. అభయహస్తంతో అందర్నీ ఊరటపరి చాడు. అప్పట్లో ఆయన పార్టీపెట్టి జై కేత నం ఎగరేసే సరికి, అప్పటికే విశాఖలో స్థిర పడ్డ పీఠాలు పాంకోళ్లు చేతపట్టుకు కది లాయి. రా.. కదిలిరా, తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది అంటూ నినా దాలు చేసుకుంటూ పచ్చజెండా భుజాన వేసుకుని బలగమంతా భాగ్యనగరానికి కదిలింది. ఇక ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా, ఇంక మనకి తిరుగు లేదురా అంటూ ఇక్కడ తెలుగుజాతి ఎవరికి తోచిన మహా నిర్మాణాలు వాళ్లు ప్రారంభించారు. కొంతకాలానికి చిన్న నేతలు వయసు కొచ్చారు. వాళ్లకి తీవ్రమైన పదవుల కొరత వచ్చింది. దాంతో కొండలు కదిలాయ్. ఈ పాంకోళ్లు నాడు కదలకుండా విశాఖ లోనే ఉండి ఉంటే– అయిదువేల ఎకరాల్లో లేదంటే హీనపక్షం పదివేల ఎకరాల్లో చిత్ర నగరం వెలిసేది. ఇక్కడ లేని సముద్రం కూడా జతపడి ఉచిత సేవలు అందిస్తూ ఉండేది. విశాల సామ్రాజ్యం పాంకోళ్ల కిందకు వచ్చేది. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్పనేలో పూర్వ గాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు కావల్సిన కళ్లద్దాలు తగిలించుకుని, విశాఖ ఎంత గొప్ప నేలో పూర్వగాథల్ని వివరిస్తూ సొంత మీడియాలు జాగారం చేసేవి. అప్పుడు భూ మార్గం నుంచి, ఆకాశమార్గం నుంచి మాత్రమే కాక జలమార్గం ద్వారా కూడా ఆ ఎంపైర్కి జనం వచ్చేవారు. కానీ కథ అడ్డంగా తిరిగింది అని ముగిం చాడు అడ్డబుర్ర. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రోజుకి 33 రూపాయలు
చంద్రబాబుకి ఎప్పుడూ వార్తల్లో ఉండాలి. లేకపోతే మనసు మనసులో ఉండదు. అప్పటికీ సొంత మీడియా ఉంది కాబట్టి ఏవో వార్తలు పెద్దక్షరాలతో వండి వారుస్తూ ఉంటారు. వాటన్నింటినీ నిజమేనన్న భ్రమలో పొద్దున్నే ఒకటికి రెండుసార్లు చదువుకుని సంతృప్తిపడుతూ ఉంటారు. ఇప్పుడు పొద్దుపోక కమలేతర కూటమిని కట్టకట్టే పనిలో కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు తిరుగుతున్నారు. ఇదేదో ఆయనలో మొలిచిన గొప్ప ఆలోచనలా చెబుతున్నారు. ఇదంతా ఇదివరకటి ముఠాయే కదా. పునరేకీకృతం అవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంచెం కండబలం ఉన్న పార్టీ చుట్టూ గుమిగూడితే దాన్ని ‘పోలరైజేషన్’ అంటారు. అది కెమిస్ట్రీ. ఇదివరకు కలిసివున్నవారు రకరకాల కారణాలవల్ల విడిపోయి, దూరమై మళ్లీ దగ్గరగా జరగడాన్ని పునరేకీకరణ అంటారు. వీటికి సారూప్యతలు ఉండక్కర్లేదు. అదేదో ఆటలో అంతా కలిసి బంతిని కైవసం చేసుకున్నట్టు, ఈ కూటముల పరమార్థం కుర్చీని లాక్కోవడమే. కూటములు కట్టేవేళ కనిపించేది సైద్ధాంతిక ఏకాభిప్రాయం, ఐకమత్యం కాదు. ప్రత్యామ్నాయం లేక, వేరే దిక్కులేక అందరూ కలిసిపోతారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీ, స్టాలిన్, మమత అంతా సుహృద్భావ వాతావరణంలో మాటలు సాగిస్తారు. తమరధికులంటే, తమరు వందనీయులని పరస్పరం పొగుడుకుంటారు. ప్రస్తుతం పాలిస్తున్న వారిని గద్దెదింపడమే లక్ష్యంగా కూటమి ఆలోచిస్తుంది. అడుగులు వేస్తుంది. అదొక్కటే ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, చంద్రబాబు రాష్ట్రాలు తిరుగుతూ, కూటమి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారంటే చాలామందికి సందేహంగా ఉంది. తెలంగాణ సీట్లమీద కసరత్తు చెయ్యచ్చని సామాన్య ప్రజ అనుకోవడం సహజం. తెలంగాణలో చంద్రబాబు నోరెత్తి ఏం మాట్లాడాలి, ఏం చెప్పి టీడీపీకి ఓట్లు అడగాలన్నది పెద్ద ప్రశ్న. అగ్రనేత కేసీఆర్‌తో సహా చాలామంది పసుప్పచ్చ మూలాలున్నవారే. బాబు రాజకీయ మూలాలు కూడా అందరికీ విదితమే. మోదీ పాలన మీద నిప్పులు చెరుగుతూ కాలక్షేపం చేస్తున్న చంద్రబాబుకి అదొక అస్త్రంలాగా కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమం కొన్నాళ్లు పక్కనపెట్టి దేశాన్ని బాగుచేసే పనిని బాబు తలకెత్తుకున్నారు. మోదీకంటే రాజకీయాల్లో సీనియారిటీ ఉందని పదే పదే చెబుతున్నారు. ఆ మాటకొస్తే దేశంలో ఇంకా సీనియర్లు అనేకులున్నారు. ఈ సందర్భంలో ఆలిండియా స్థాయి రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకుంటే జన సామాన్యం నివ్వెరపోతుందని అంచనా.‘మనకున్న పది పన్నెండు రాష్ట్రాల్ని చూసుకుంటే చాలు బాబూ’ అని జనం గగ్గోలు పెడుతున్నారు. చదువుకున్న యువతలో కొందరికి తొమ్మిదివందల తొంభై తొమ్మిది భృతి ఏర్పాటు చేశారు. అంటే రోజుకి ముప్ఫైమూడు రూపాయలు. దేనికి సరిపోతుందో ఎరుక పరచాలని యువకులు అడుగుతున్నారు. రైతుల సమస్యలేమీ తీరలేదు. వాళ్లకి కావల్సింది బ్యాంకు రుణాలు కావు. ప్రకృతిని వారికి కావల్సినట్టు సంబాళించడం. అది ప్రభుత్వాల చేతుల్లో ఎలాగూ ఉండదు. కనీసం నాణ్యమైన విత్తనాలన్నా వారికి ఇప్పించండి. ఇప్పుడు రైతుకూలీలు దొరకడం కష్టంగా ఉంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొందరికే అందుబాటులో ఉన్నాయ్. వాటిని మండల స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ ద్వారా రైతుకి సరైన కిరాయికి పనిచేయిస్తే మేలు. అంతకంటే ముఖ్యంగా పండించిన వాటికి గిట్టుబాటు ధర కల్పించడం. ఈ పంటల తరుణం వచ్చిందంటే రైతులు ఆనందించడం కంటే, నిరుత్సాహపడటమే ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉత్తుత్తి కబుర్లన్నీ పక్కనపెట్టి, చంద్రబాబు అసలు సమస్యలమీద దృష్టి పెట్టాలి. అది ఆయన తక్షణ కర్తవ్యం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బారోట్రామా
అక్షర తూణీరం మునుపు ఏ విపరీతం జరిగినా, ఇందులో విదేశీ హస్తం ఉందని, ఒక వర్గం ఆరోపించింది. చాలాసార్లు ఆ హస్తం విదేశీ గూఢచార సంస్థది అయి ఉండేది. ఉప్పెనలొచ్చినా, పంటల మీద తెగుళ్లొచ్చినా, గాలి వాన కురిసినా విదేశీ హస్తం మీదకే తోసేసేవారు. చాలా రోజుల తర్వాత తిరిగి ఇన్నాళ్లకు చంద్రబాబు, ఎక్కడ ఏం తేడా జరిగినా మోదీ ఖాతాలో జమ వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు వైఫల్యాలన్నిటికీ ఒకే ఒక కారణం మోదీ. ఏడాది క్రితం దాకా ప్రధాన మంత్రి ఏ మాత్రం వంకలేని పెద్దమనిషి. ఈ మధ్య కాలంలో ఇద్దరికీ పూర్తిగా చెడింది. అక్కడ్నించి మోదీ అంత రాష్ట్ర ద్రోహి ఇంకోడు లేకుండా పోయాడు. కిందటివారం నించి నరేంద్ర మోదీ బ్రిటిష్ పాలకులని మించిన దేశద్రోహిగా మారాడు. ఆయన ఆ స్థాయిలో చేసిన జలియన్ వాలాబాగ్ ఉదంతాలేమిటో తెలియదు. సాధారణ ప్రజ అనుకునేదేమిటంటే– చంద్రబాబు మానిఫెస్టోలని మోదీ ఎందుకు తలకెత్తుకుంటాడని?! ఎవడి జెండాలు, ఎజెండాలు వాడికి ఉంటాయి కదా? రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామని స్థానిక పార్టీలు ఇంటింటా తిరిగి, చెవుల్లో మైకులు పెట్టి చెబుతారు. తీరా పవర్లోకి వచ్చాక ఆ మాట పీకలమీదికి తెస్తుంది. బ్యాంకులు సహకరించడం లేదని పవర్లోకొచ్చిన పార్టీ నస మొదలుపెడుతుంది. అది ఎవరి సొమ్ము బాబూ చేతికి ఎముక లేకుండా ధారపొయ్యడానికి? నగరాల్లో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ పన్ను చెల్లించేవారు ఈ మాఫీ అన్నప్పుడల్లా పరిపరి విధాల తిట్టుకుంటారు. రైతులకి న్యాయం చెయ్యా ల్సిందే. వారిని ఉద్ధరించాల్సిందే. దానికి అనేక మార్గాలున్నాయండీ అంటూ ఒక బంగారు ఫ్రేమ్ కళ్లద్దాలాయన ఎయిర్‌పోర్ట్‌లో క్లాసు తీసుకున్నాడు. ‘ఒకప్పుడు అందరం రైతులమే కాదంటే రైతు కూలీ లమే. ఇప్పుడు చెల్లాచెదరై ఇట్లా టౌన్లకొచ్చాం. అవి పెరిగి పెరిగి సిటీలైనాయ్. అయితే మనదా తప్పు? ఇప్పుడూ పెట్రోలు మండిపోతోంది. డీజిల్ కాలి పోతా ఉంది. రైతులు ఎడ్లతో చాకిరీ చేయించడం ఎప్పుడో మర్చిపోయారు. ట్రాక్టర్లే అన్నింటికీ. లీడ ర్స్‌కి రైతులమీద అభిమానం ఉంటే, ఎకరాకి ఓ వంద లీటర్లు డీజిల్ సగానికో పావలాకో సప్లయ్ చెయ్యాల. కావాలంటే ఎగస్ట్రా క్లాస్ కార్లకి కొట్టే చమురు మీద ఇంకో పదో పరకో వడ్డించు కోమనండి’ అంటూ గోల్డ్ ఫ్రేం నవ్వుని శ్రోతల మీదికి తిప్పాడు. ఆయన ఊహించినంత ప్రతిస్పం దన కన్పించలేదు. పైగా శ్రోతల ధ్యాసంతా ఎయిర్ పోర్ట్ మైకులమీద ఉంది. ఇంతలో నిన్న ఢిల్లీ–జైపూర్ విమానీకులు ముంబై నించి వస్తున్నారు. నలుగురైదుగురు మన ప్రాంతంవాళ్లు. అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతాధికారులు. తరచుగా పేపర్లో, టీవీల్లో వాళ్ల ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. అక్కడివారు ఇట్టే గుర్తించారు. పలకరించి, చచ్చి బతికినందుకు అభినందించారు. అక్కడ చేరిన వారంతా ఎవరి అనుభవాలు వాళ్లు కక్కుతున్నారు. ‘ఏవండీ, బ్లీడ్ స్విచ్ని మర్చిపోవడంవల్ల, బారోట్రామా సంక్ర మించి ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తస్రావం అయిందటగా.. ఏమిటి మీ పరిస్థితి’ అంటూ వారి ముఖాల్లోకి పరీక్షగా చూస్తూ అడిగారు. ఆ ముగ్గురూ చాలా తేలిగ్గా తీసుకుని చప్పరించేశారు. ఆ జెట్ విమానంలో మాతో కలిపి 171 మంది ఉన్నారు. మేం తప్ప అంతా వొణికిపోయిన వారే. గాల్లోకి వెళ్లాక విమానంలో ప్రెషర్ లేకపోతే ఏమవుతుంది? అదే అయింది. అంటూ వాళ్లు ఒకర్నొకరు చూసుకు న్నారు. శ్రోతలకేమీ అర్థం కాలేదు. ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, ‘మీరు చాలా అదృష్టవంతులు’ అన్నారంతా అభినందన పూర్వకంగా. వాళ్లు అదేం కాదన్నట్టు చూశారు. ‘మేం నాలుగేళ్లకి పైగా ఏపీ స్టేట్ సర్వీస్‌లో ఉన్నాం. అందుకని ఎఫెక్ట్ కాలేదు’ వాళ్ల మాటలెవరికీ అర్థం కాలేదు. ముగ్గుర్లో ఒకా యన అందుకుని ‘గడిచిన యాభై నెలలుగా మా సీఎంగారు వివిధ అంశాల మీద, టెక్నాలజీలపైన, మోదీ రాక్షసత్వంమీద, చారిత్రక అవసరాల మీద చేసిన భారీ నుంచి అతి భారీ ప్రసంగాలని వినడా నికి మా శరీరాలు అలవాటు పడ్డాయి. ఈ బోడి బోయింగ్ ప్రెషర్ మమ్మల్నేమీ చేయలేకపోయింది. నవరంధ్రాలు ఆ విధంగా పనిచేసే స్థితిలో స్థిరంగా ఉన్నాయి. డాక్టర్లు మమ్మల్ని పరీక్షించి, మీకు ‘బారోట్రామా ఇమ్యూనిటీ’ వందశాతం వచ్చేసింద న్నారు. ఈ సీఎం థెరపీని విమానయాన శాఖ ప్రవే శపెడుతుందేమో..’నంటూ బయటకు నడిచారు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
సృష్టిలో తీయనిది...
‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి...’ అంటూ అమృత వాక్కులతో పల్ల వించారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఈ స్నేహో త్సవ వేళ ఈ సుకవిని, స్నేహానికి ప్రతీకగా నిలచిన బాపూరమణలని తలచు కోవాలి. ఇష్టాలు వేరు, పరిచయాలు వేరు, దగ్గరి తనాలు వేరు, స్నేహాలు వేరు. కృష్ణుడు, కుచేలుడు ఒక గురువు వద్ద శిష్యులు. ఇద్దరూ సన్నిహితులు. ఆ చనువుకొద్దీ మిత్రునివద్దకెళ్లి అర్థిస్తాడు. ఆ ఇష్టంకొద్దీ మిత్రుడు సంపదలిచ్చాడు. ఇదొక సందర్భం. కర్ణ దుర్యోధన సాన్నిహిత్యం మరో విధం. రాజరాజు తనపట్ల చూపిన ఔదార్యానికి కర్ణుడు జీవితమంతా శిరసువంచాడు. ఇష్టుడై సుయోధనుణ్ణి సరిదిద్ది కాపా డలేకపోయాడు కర్ణుడు. బంధుత్వాలు, వాటి ధర్మాల గురించి మన ప్రాచీన రుషులు అనేకచోట్ల ప్రస్తావిం చారు గానీ స్నేహధర్మాల ప్రస్తావనలు వినిపించవ్. యువరాణులకు చెలికత్తెలుంటారు. వాళ్లు చాలా హద్దుల్లో నడుచుకుంటూ యువరాణి కనుసన్నల్లో మెలగాలి. శిష్యుల్ని చతురోపాయాలతో శిష్యుల్ని సన్మార్గాన నడిపించిన గురువులున్నారు. రాజుకు అండదండగా నిలిచిన మహామంత్రులున్నారు. ఇవి స్నేహాలనిపించుకోవు. స్నేహమంటే... ఇక దానికి హద్దులుండవ్. ఈ సృష్టిలో అలాంటి దినుసు అదొక్కటే ఉంది. తెలుగునాట అందమైన ద్వంద్వ సమాసంగా సత్కీర్తి పొందారు బాపూరమణ. ‘రెండు కళ్లు – ఒక చూపు’ అన్నారు ఆచార్య సినారె. తెలుగు సరస్వతికి వాళ్లిద్దరు వాగర్థాలన్నారు. మేం బొమ్మా బొరుసులం అనుకున్నారు వాళ్లిద్దరూ. అరవై ఏళ్ల పైబడి ఈ బొమ్మ బొరుసులు నానా సందడి చేశారు. ఒకరు కథలు రాస్తే, ఇంకొకరు బొమ్మలు వేశారు. ఒకరు జోకులు, ఇంకోరు కొంటె బొమ్మలు.. ఒకరు దేవుడి బొమ్మలు గీస్తే మరొకరు దేవుడి కథలు– ఇలా వంతులేసుకుని మరీ తెలుగు నేలన కావల్సినన్ని పంటలు పండించారు. రకరకాల వంటలు వండి వడ్డించారు. వంటా వార్పూ అయ్యాక, బాపు రమణ లేత పచ్చని అరిటాకులై తెలుగువారి ముందు ఒదిగి పోయారు. ఎప్పుడో అరవై ఏళ్లుగా ఆ ప్రాణ మిత్రుల స్నేహం గురించి వారి కథలతోబాటు కథలు కథ లుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వారిద్దరూ బాల్యమిత్రులు. ఇద్దరూ ప్రతిభా సంపన్నులే. ఎవరి వృత్తి విద్యలు వారివే. అయినా అవేవీ స్నేహానికి అడ్డు రాలేదు. ఇద్దరూ ఒక శుభోదయాన సినీ నిర్మా తలుగా మారారు. ఆనక అద్భు తాలు సృష్టించారు. విడిగా ఎవరి అభిరుచులు వారికుండేవి. కర్ణా టక సంగీతం రమణకిష్టం. బడే గులాం, మెహదీ హాసన్ గజళ్లంటే బాపుకి ప్రాణం. ఇవిగాక కలివిడిగా బోలెడిష్టాలుండేవి. అందులో ఆరుద్ర, కేవీ మహ దేవన్ ముఖ్యమైన కొన్ని. బాపూరమణ చాలా సార్లు విభేదించేవారు. చాలాసార్లు ఒకే రాగానికి కట్టుబడి తలలూపేవారు. ఏ గోదావరి లంకలోనో, ఏ కత్తవపాడులోనో కారప్పచ్చడితో అట్టు తినేటప్పుడు, పక్కన ఆ ఇద్దర్లో ఎవరు లేకపోయినా ఆ తిండికి రుచి లేనట్టే. వారిద్దరే కాదు ఆ రెండు కుటుంబాలూ వేళ్లనించి చిటారు కొమ్మలదాకా కలిసిమెలిసి పోయాయి. ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ల సంగతి తెలిసిన చాలామందికి, వారి ద్దరి మధ్యా ఆర్థిక సంబంధాలు ఎట్లా ఉంటా యోననే ప్రశ్న వేధిస్తూ ఉండేది. ఔను, అది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నే! ఒకసారి ఉన్నట్టుండి రమణ ఇల్లు పోయింది. బాపుకి తెలిసింది. ‘ఓస్! అంతే కదా, మా మేడమీద మేడ వేసుకో. దేవుడు మనిద్దర్నీ ఒకింట్లో పడుండమన్నాడు వెంకట్రావ్’ అని భరోసా ఇచ్చారు బాపు. ఆ భరోసా విలువ కొన్ని కోట్లు. బాల్య మిత్రులు స్నేహితులుగానే నడిచి నడిచి కుదు రుకట్టారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లై, ప్రయోజకులై పెళ్లీడు కొచ్చారు. అప్పుడు మిత్రులిద్దరూ, పోనీ ఇచ్చి పుచ్చు కుంటే.. అని కొంచెం ఆశ, ఇంకొంచం సరదా పడ్డారు. ఆ పిల్లలు ఇంకోలా ఆశపడి, మరోలా సరదా పడ్డారు. ‘అయితే అలాగే కానిద్దాం’ అంటూ కళాత్మకంగా, కలర్ఫుల్గా శుభలేఖలు డిజైన్ చేశారు బాపూరమణలు. ఆ దేవుడు మనల్ని ఈ విధంగా స్నేహితులుగానే ఉండి పొమ్మన్నాడయ్యా. ఆ విధంగా బంధుత్వాలు కలుపుకోవద్దన్నాడయ్యా’ అని మురిసిపోయారు బాపూరమణలు. అదొక విలక్షణమైన జంట, తాడూ బొంగ రంలా, గాలిపటం దారంలా, విల్లూ్ల అమ్ములా, స్నేహానికి నిర్వచనంలా. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పుట్టని బిడ్డకు పేర్లు
అక్షర తూణీరం ‘ఇంకా పన్నెండు ఈఎమ్ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం. ‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్. విశ్వనాథం మంచి కళాకారుడు. కల్చర్‌ని మూలధనంగా, వినయసంపదని, నోటిమాటని పరపతిగా కలిగినవాడు. కాళ్లనపడ్డ పామైనా కరవకుండా పోవచ్చుగానీ విశ్వనాథం మాత్రం కాటు వెయ్యకుండా పోడు. చురుకు, వృత్తికి తగిన వేగం విస్సు స్వార్జితాలు. మాది ఓ మాదిరి అంటే టాబ్లాయిడ్ సైజు టౌను. ‘పడింది రోయ్’ అని నలుగురూ చేరి వార్తలు చదువుకునే తీరిక, పదహారు పేజీల లోకల్ ఫీలింగూ పుష్కలంగా ఉందక్కడ. విశ్వం బుర్రలో బృహస్పతి సదా కొలువై ఉంటాడు. టెక్నాలజీ వినియోగించి బృహుణ్ణి లచ్చిందేవిలోకి మార్చుకుంటాడు. ‘‘బాబాయ్, ఈసారి కాదనకూడదు. ఇది ఆత్మగౌరవ అంశం’’ అన్నాడు– అప్పుడే షట్టర్ తీసి, సరుకు సద్దుకుంటున్న ఆసామితో. ‘‘ఛ... నాకేమిట్రా’’ అన్నాడాసామి ఉలిక్కిపడి. ‘‘కాదు. నీకే’’ రొక్కించాడు విశ్వనాథం. ‘‘ఛ.. పో...’’ ‘‘చచ్చినా పోను. పోనంటే పోను’’ ‘‘అఘోరించావ్ లే’’ అన్నాడు వాత్సల్య స్వరంతో. మూడొంతులు మింగుడు పడ్డట్టే! ‘‘కిందటేడు షాపులో బేరాలు మందకొడిగా ఉన్నాయంటే, నోట్ల రద్దు దెబ్బ పడిందంటే మెత్తబడ్డా. ఈసారి కుదర్దు బాబాయ్’’. ‘‘అయితే ఇంతకీ ఏమంటావురా?!’’ ఆశ్చర్యం ప్రశ్నార్థకం జమిలిగా ధ్వనించాయ్. ‘‘నేనిప్పుడే పేర్లు బయట పెట్టనుగానీ, ఇద్దరు మిని ష్టర్లు కనిపిస్తే తినేస్తున్నారు. వాళ్లకేం మైకులు దొరక్కనా’’ ‘‘ఇంతకీ ఏమంటావురా’’. ‘‘భోజనాలు పెట్టుకోవద్దు బాబాయ్ అలసిపోతాం. ఎటూ ఓ వందమందికి తప్పదు’’. ‘‘అది కాదురా విశ్వం...’’ ‘‘మన జై భవాని కల్యాణమండపం ఇప్పుడే ఖాయం చేద్దాం. మెయిన్ రోడ్డెంట మన షాపు ముందు నించి చిన్న ఊరేగింపు తీద్దాం. బాణాసంచా ఇక్కడ కొనద్దు అవసరమైతే ఓ పూట శివకాశి వెళ్లొస్తా. చెన్నై నించి కమ్మటి నాదస్వరం వస్తుంది. ఒక్కమాట ముందే చెబుతున్నా. ఇన్విటేషన్ మీద పిన్ని ఫొటో ఉండితీరాలి. నాకొదిలెయ్’’ ‘‘ఎందుకురా ఈ ఆర్భాటాలు? చెబితే వినే మనిషివికాదు’’ అని గొణుగుతూనే తొలి విడతగా కొంత రొక్కం అందించాడు. విశ్వం రెండో అడుగు సావనీర్ మీద పడింది. షాపులు, అంగళ్లు, కొట్లు, దుకాణాలు ఇలా టౌన్లో ఉన్న వాటన్నింటినీ తడిమాడు. టౌను చాంబర్ ఆఫ్ కామర్స్, శ్రీ సాధుసాయి డెవలపర్స్ హనుమ సూపర్ స్పెషాలిటీస్ అంటూ పుట్టని బిడ్డలకి పేర్లు పెట్టి, గొప్ప ఆశలు మొలిపించి ఫుల్‌పేజి యాడ్ డిజైన్లు అరచేతిలో చూపించాడు. ఈఎమ్ఐ వసతి ఉందని మొదటి కిస్తీ లాగేశాడు మధ్యే మధ్యే ఉదక పానీయంలాగా. స్థానిక రాతగాళ్లకి చక్కిలిగింతలో పెట్టాడు. బుగ్గన పెన్ను పెట్టించి సెల్లో వారి ముఖాల్ని బంధించాడు. ఇన్విటేషన్ డమ్మీ కాపీ, సావనీర్ కవరు జిరాక్సు ఓ ఫైల్లో వేసుకుని కుందేలు పరుగుల్లో విశ్వనాథం కనిపిస్తూ, ఈఎమ్ఐలు స్వీకరిస్తూ వారాలు, నెలలు, ఏళ్లు నెట్టుకొస్తున్నాడు. రాత కార్మికులెక్కడ కనిపించినా, మీదే ఆలస్యం అనేవాడు. పదమూడో వాయిదా ఇచ్చేసి ‘అయితే ఇంతకీ ఏమంటావురా’ అన్నాడు బాబాయ్ సౌమ్యంగానే. ‘ఇంకా పన్నెండు ఈఎమ్ఐలు డ్యూ’’ అన్నాడు విశ్వం. ‘‘నీ యవ్వారం చూస్తుంటే, అమరావతి మహా నిర్మాణం, దాని తాలూకు కబుర్లకు మల్లే ఆన్తున్నాయిరా’’ నిట్టూర్చాడు బాబాయ్. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
సీమ రూకలొస్తున్నాయ్..!
అక్షర తూణీరం మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్షణం తీరిక లేకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దున్ని పారేస్తున్నారు. ఆయనంతే, అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. ఎవర్నీ నిద్రపోనివ్వరు. ‘‘పెట్టుబడుల గురించి వాకబు చేస్తున్నారు’’ అన్నాను. ‘‘అంటే ఆయన పెట్టడానికా...’’ అన్నాడు మావూరి ఆసామి ఒకాయన. ‘‘అబ్బో..! అందరికీ చమత్కారాలు పెరిగిపోయాయ్. మరీ ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల..’’ అన్నాను. ఎందుకు పెరగవ్.. చచ్చినట్లు పెరుగుతాయ్. దగ్గరదగ్గర యాభైవేల ఎకరాల్లో సేద్యం లేదు. పాతికవేల మంది రైతులు రికామీగా ఉన్నారు. పైగా వారికి కరువులు లేవు. అకాల వర్షాల దెబ్బ లేదు. గాలి దుమారాలు లేవు. హాయిగా చెక్కులు గుమ్మంలోకి కొట్టుకు వస్తున్నాయ్. వాళ్లు రాబోయే విశ్వ నగరం తాలూకు బ్లూప్రింట్స్ని ఆస్వాదిస్తూ వినోదించడమే రోజువారీ కార్యక్రమం. అందరూ కార్లలో, బైకుల మీద ఓ రచ్చబండ మీదికి చేరడం, పేపర్లు నెమరేస్తూ, టీవీని చర్చిస్తూ పొద్దు పుచ్చడం మిగిలింది. హాయిగా చేతుల్లో సెల్ఫోన్లుంటాయ్. ఇంటి వ్యవహారాల్ని, ఒంటి వ్యవహా రాల్ని సెల్లో చక్కపెట్టుకోవచ్చు. పూర్వంలాగా అప్పుల బెడద, చీడపీడల బెడద అస్సలు లేదు. అందుకని ఆ ప్రాంతం రైతులంతా మాటకు ముందు చమత్కారాలు ఒలకపోస్తున్నారు– ఇదొక సర్వే రిపోర్టు. ఇంతటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. ఒకే ఒక్క క్షణంలో ప్రపంచంలో ఎవరినైనా పలకరించవచ్చు, చూసి మాట్లాడవచ్చనేది యదార్థం. ప్రయాసపడి, బోలెడన్ని కోట్లు ఖర్చుతో సముద్రాలు దాటి వెళ్లడం అవసరమా అని రచ్చబండ మీద చర్చ నడుస్తుంది. పెట్టబడులు, వ్యాపారాలు అంటే పెళ్లి యవ్వారాల్లాంటివి. ‘‘ఫోన్లో పెళ్లిళ్లు సెటిలైపోతాయా? జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల! అవసరమైతే గెడ్డాలు పుచ్చుకు బతిమాలాల...!’’ అని ఇంకో గొంతు సమర్థిస్తుంది. ‘‘బాబాయ్! వాళ్లంతా ఇక్కడోళ్లే... మొహాలు చూస్తుంటే తెలియటంలా...’’ ‘‘ఇక్కడోళ్లైతే పెట్టుబళ్లు పెట్టకూడదా’’ అని సూటి జవాబు. ఎందుకు పెట్టకూడదూ... నిక్షేపంగా పెట్టవచ్చు. అసలు మన అవినీతి ఆఫీసర్ల లాకర్లు తీస్తే చాలు. అయితే ఎలాంటి కేసులూ ఉండవని భరోసా ఇవ్వాలి. వారి సొమ్ముని బట్టి, ఆయా పరిశ్రమల్లో వారికి వాటా ఇవ్వాలి. ఇప్పుడు వందకోట్లు ఆ పైన కూడపెట్టిన వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. పది, ఇరవై, యాభై కోట్ల వారిని ఈ స్కీము కింద గుర్తిస్తే, బోలెడు పెండింగ్ పనులు పూర్తవుతాయి. వారిని దేశభక్తులుగా ట్రీట్ చేసి, సముచిత రీతిని వారి పెట్టుబడులకు న్యాయం చెయ్యాలి–అన్ని చతుర్లు వింటున్న ఓ పెద్దాయన నోరు చేసుకున్నాడు. ‘‘బాబు తెచ్చేవి సీమ రూపాయలు. అరవై ఆరురెట్లు పలుకుద్ది. రెండు జేబుల్లో వచ్చే ఆ రూపాయల్తో కృష్ణమీద కొత్త బ్యారేజీ పూర్తవుతుంది’’. శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
ఒక అంకుశం?!
అక్షర తూణీరం పవన్బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరిచినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరెత్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. రాష్ట్రంలో ఒకమూల మూత్రపిండాల వ్యాధి ప్రబలింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, వందల సంఖ్యలో అవస్థపడు తున్నారు. ప్రభుత్వం తన సహజ ధోరణిలో ఉదాసీనత వహించింది. ఉన్నట్టుండి జనసేన నేత ఆ స్పాట్‌కి వెళ్లాడు. జనం చేరారు. ప్రభుత్వాన్ని తనదైన ధోరణిలో ప్రశ్నించాడు. నిగ్గ దీశాడు. ఆపైన హెచ్చరించాడు. గంటైనా గడవకుండానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించారు. ‘‘తగు చర్యలు తీసు కున్నాం, ఇంకా తీసుకుంటాం మహా ప్రభో!’’ అంటూ సవిన యంగా మనవి చేశారు. ఉన్నవిగాక ఇంకా బోలెడన్ని డయాలసిస్ కేంద్రాలు ప్రారం భిస్తాం. అందరి రక్తాలు క్షాళన చేస్తామని మీడియా ముఖంగా విన్నవించారు. అంతే కాదు, ‘‘పవన్ కల్యాణ్‌గారు ఇలాగ స్పాట్‌లోకి వచ్చి సమస్యని బహిర్గతం చేసి ఎంతో మేలు చేశారు. ఆయన మేలు మర్చిపోలేం’’ అంటూ అమాత్యుల వారు అభినందించారు కూడా. అంతకు ముందు క్యాపిటల్ ఖాతాలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్నారని విని జననేత నినదించారు. ఇప్పుడు అలాంటిదే మరో అఘాయిత్యం జరిగిందని రైతులు జనసేనని ఆశ్రయించారు. ఆయన అభయం ఇచ్చాడని తెలియగానే ప్రభుత్వం విప రీతంగా స్పందిస్తుంది. ఇప్పుడది జనం గ్రహించారు. అందుకని ఏపీలో ఏ సమస్య తలెత్తినా అది పవన్ కల్యాణ్ గుమ్మంలో ప్రతిధ్వనిస్తోంది. క్షణా లలో అధికారగణం అతిగా స్పందిస్తోంది. ఈ తంతుని యావ న్మంది గమనిస్తున్నారు. భయానికి కారణాలు వాళ్లకి స్పష్టంగా తెలుసు. పవన్బాబు ఏ ఇష్యూ మీద నోరు తెరి చినా పర్వాలేదు. ఒక్క ప్రత్యేక హోదాపై నోరె త్తకుండా ఉంటే చాలని ఏలినవారు కోటి దేవుళ్లకి మొక్కుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం యువనేత వెంకయ్యనాయుడిపై విమర్శలు గుప్పించాడు. వాటిని అడ్డంగా ఘాటుగా ఎవరూ ఖండించలేదు. లౌక్యంగా మాట్లాడి తమని తాము సముదాయించుకున్నారు. ‘‘అందుకే గదా, అప్పుడు అన్ని ఆంధ్రా టౌన్స్లోనూ వెంకయ్యకి సన్మానాలు చేసి విమ ర్శల్ని మరిపించాం’’ అని ఒక పెద్దాయన క్లారిఫై చేశాడు. ప్రభుత్వం ప్రతిపక్ష నేత విమర్శలను పట్టించుకోనట్లు నటిస్తుంది. రాజకీయేతర, రాజ్యాంగేతర శక్తిగా, ఫ్రీలాన్సర్‌గా ప్రభుత్వాన్ని నిగ్గతీస్తున్న పవన్ కల్యాణ్‌కి కొంచెం బాగా భయపడుతున్నట్టే కనిపిస్తోంది. ఈ వైఖరి సామాన్య జనంలోకి ఎలాంటి ఆలో చనల్ని, సంకేతాలని పంపిస్తోందో పెద్దలు ఆలోచించాలి. జననేత పెదవి విప్పితే చాలు అరక్షణంలో మంత్రులు మైకుల ముందుకు వచ్చి సంజాయిషీలు ఇచ్చుకుంటున్నారు. సామాన్య ప్రజ సంతోషిస్తోంది. ఎవరైతేనేం, ఏదో ఒక అంకుశం పనిచేస్తోందని అనుకుంటున్నారు. ఈ ఫార్స్ మొత్తాన్ని గమనిస్తుంటే గొగోల్ ప్రసిద్ధ నాటకం ‘ఇన్స్పెక్టర్ జనరల్’ గుర్తొస్తోంది. మొన్న సంకురాత్రికి మా గ్రామం వెళ్లినప్పుడు మా ఊరి ప్రజలు రోడ్డు కోసం ఎమ్మెల్యేకి, మంత్రిగారికి పెట్టుకున్న అర్జీ చూపించారు. ‘‘మా ఊరు రోడ్డు వేసి పన్నెండేళ్లు దాటింది. మా ఎమ్మెల్యేకి మేం ఓట్లు వేయలేదని కోపం. కనీసం నడ వడానికి కూడా కష్టంగా ఉంది. మీరు, ఈ రోడ్డు సమస్యని వెంటనే పరిష్కరించకపోతే శ్రీ పవన్ కల్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని మా గ్రామం తీర్మానించింది’’ ఇదీ అర్జీ సారాంశం. బహుశా పని జరగచ్చు. శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
కోటమ్మగారి కొబ్బరి మొక్కు!
అక్షర తూణీరం కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరి మొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! ఆయన చిత్తూరు చాణక్యు డండీ! జనానికి మండు వేసవిలో చందమామని చూపిస్తున్నాడంటూ ఓ పెద్దమనిషి తెగ ఆశ్చర్య పడ్డాడు. మొన్నటికి మొన్న కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేసి పచ్చ పూల హారతి ఇచ్చాడు. నిన్నటికి నిన్న అమరావతి ముఖ్యపట్టణం తాలూకు సచివాలయం నూతన భవనంలోంచి ముఖ్యమంత్రి మహా సంతకాలు చేశారు. అసలు కొత్త క్యాపిటల్ నూతన సెక్రటేరి యట్ భవనాన్ని రిబ్బన్ కత్తిరించి, స్వజనం కరతాళ ధ్వనుల మధ్య ప్రారంభించడం భళారే చిత్రం! రాష్ట్రం ముందుకు పోతావుంది. సందేహం లేదు. పూర్వం ఎన్నో నిర్మాణాలు శిలాఫలకాల దగ్గరే నిద్ర పోతుండేవి. ఇప్పుడు అట్లా కాదు. ఎంతోకొంత పైకి సాగుతున్నాయి. ‘‘ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవని ముఖ్యమంత్రి పురిట్లోనే బారసాల చేశాడని’’ ఓ మాటకారి చమత్కరించాడు. అంతేగాని నేత చిత్త శుద్ధిని మెచ్చుకోలేదు. పైగా, అమరావతి నిండా కొత్త తాటాకు చలవ పందిళ్లు వెలుస్తాయి చూడండంటూ ప్రత్యక్ష వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ఉమ్మడి రాజధానిలో మనకు స్థానబలిమి లేకుండా పోయింది. గుట్టుగా ఓ ఫోను చేసుకుం దామన్నా రట్టయిపోతోంది. వేరుపడ్డాక భద్రాచల రామయ్య వాళ్ల పక్షానికి వెళ్లాడు. ఇక మన సంగతి ఎంతవరకు పట్టించుకుంటాడో అనుమానమే. మనం దిక్కులేక ఒంటిమిట్టని ఉన్నట్టుండి ఉద్ధరించే పనిలో పడ్డాం. రాముడు నిజం గ్రహించలేడా? గ్రహించినా లౌక్యంగా, పోన్లే ఇన్నాళ్టికి ఈ వైభవం దక్కిందని సరిపెట్టుకుంటాడా? వాటాల్లో మిగిలిన దేవుళ్లు ఎటు చెదిరినా, మనకి కొండంత అండ వెంకన్న మిగిలాడు. చాలు, అదే కోటి వరహాలు. కోటివరాలు! అంతేనా, ఇంకా అన్నమయ్య, ఆయన వేనవేల సంకీర్తనలు మనకు దక్కాయి. ఇంకానయం వాటాల పంపిణీలో పదివేలు మాకు చెందాలని, దాయి భాగాలకి పేచీ పెట్టరు కదా! ఒకవేళ పెడితే, వారి వాటాకి వెళ్లిన సంకీర్తనలు వారు తప్ప వీరు పలకరాదు. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు రాజధాని తరలింపుపై మునికాళ్ల మీద ఉన్నారు. హాయిగా హైకోర్టుకి నాలుగు చలవ పందిళ్లు, అసెంబ్లీకి ఓ పెళ్లిపందిరి- ఇలా వేసుకుంటూ వెళితే తప్పేముంది? ఒకప్పుడు కర్నూలు రాజధాని పటకుటీరాలలో అంటే డేరాలలో నడవలేదా? రాజధానికి భూమి మాత్రం కొదవలేదు. రైతులు వారికిచ్చిన కమ్మర్షియల్ స్థలాల్లో కూడా చక్కటి తాటాకు, కొబ్బరాకు పందిళ్లు వేసుకుని, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు అద్దెలకిచ్చు కుంటారు. దీని మీద విస్తృతంగా చర్చిస్తే అనేక లాభసాటి మార్గాలు, అడ్డదారులు కనిపిస్తాయి. కోటమ్మ గారు వాళ్ల పుట్టింటి నుంచి కొబ్బరి మొక్క తెచ్చి వాళ్ల పెరట్లో నాటింది. రోజూ దానికి నీళ్లు పోసి, ప్రదక్షిణ చేసి, ‘కాశీ విశ్వేశ్వరా! నీకు వెయ్యెనిమిది టెంకాయలు కొడతా’నంటూ మొక్కేది. ఒక్కో వారం ఒక్కో దేవుడికి టెంకాయల మొక్కు మొక్కేది. అది మారాకు తొడిగే సరికి మూడేళ్లు, మాను కట్టేసరికి పుష్కరం పట్టింది. కోటమ్మకి పెద్దతనం వచ్చింది. ఓపిక అయిపోయింది. ఒకరోజు కొడుకుని కోడల్ని పిలిచి, టెంకాయల మొక్కు సంగతి చెప్పింది. ‘‘నువ్వు చెప్పాలా? ఊరందరికీ తెలుసు. అన్నీ కలిపి లక్షన్నర కొబ్బరికాయల పైమాటే. మా నెత్తి మీదకు తెచ్చిపెట్టావ్’’ అని వేష్టపడ్డారు. కోటమ్మ చిన్నగా నవ్వింది. కొడుకు తల నిమురుతూ ‘‘పిచ్చి సన్నాసీ! కొబ్బరిమొక్క కాస్తేనే మొక్కు చెల్లించాలి. లేకపోతే తూచ్!’’ అంది. మన క్యాపిటల్ వాగ్దానాలు కూడా అంతే- మళ్లీ మళ్లీ కాపు దిగితేనే....! వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
ఇంకుడు గుంతలు అను మేధోబిలాలు
అక్షర తూణీరం చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి. ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింపచేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించుకోవాలి. పెద్దగా పనిలేనివాడు, బొత్తిగా బాధ్యత లేని వాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు. ‘‘తవ్వు కోండి... ఎవరి గొయ్యి వాళ్లు తవ్వుకోండి!’’ అని వ్యాఖ్యానించడంలో బోలెడు అనుభవరాహిత్యం కనిపిస్తుంది. ఏ మాటకామాట చెప్పుకోవాలి, దేనికదే ఒప్పుకోవాలి - చంద్రబాబు ఇంకుడు గుంతల మీద ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. కిందటిసారి పవర్లో ఉన్నప్పుడు ‘ఇం.తల’ ప్రచారానికి కోట్లాది రూపాయలు వెచ్చించారు. లక్షలాది కరపత్రాలు, ప్రచార సామగ్రి తయారు చేసిన మిత్రుడు అప్పట్లో మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుని, అందులో ఇంకుడు గుంత తవ్వించుకున్నాడు. వెంకయ్య లాంటి జాతీయ నాయకులు మొదలు మన ప్రాంతీయ నాయకుల దాకా రాబోయే నీటిచుక్కల్ని ఒడిసి పట్టేందుకు శ్రమదానం చేస్తున్నారు. చెమటోడుస్తున్నారు. ఇప్పుడు మనం పై చినుకుల్ని ఒడిసి పట్టడంతో పాటు, మునుపటి తరాల వారు అందించిన ఆదర్శాలను, త్యాగాలను కూడా ఇంకించుకోవలసిన చారిత్రక అవసరం ఉంది. అందుకోసం మన నేతలు, వివిధ వ్యాపార దిగ్గజాలు, శాస్త్రవేత్తలు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆచార్య దేవుళ్లు, న్యాయమూర్తులు తమ తమ మెదళ్లలో తగు పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఉంది. దీనికి పలుగులు, పారలతో పనిలేదు. మానసికంగా ఈ మేధోబిలాన్ని తవ్వుకోవచ్చు. మోదీ లాంటి అగ్రనేతలు ధర్మ, న్యాయ విచక్షణలను ఇంకింపచేసుకుంటే తరచు ఎదురు దెబ్బలు తగలకుండా ఉంటాయి. చంద్రబాబు సదా మెదడు గుంతల్ని మెయిన్‌టెయిన్ చేసుకోవాలి. పిచ్చి పిచ్చి ఆలోచనల ఆకులు అలమలు పడినప్పుడు పూడిక తీసుకోవాలి. ఉదాహరణకి వారసత్వంగా పవర్ సంక్రమింప చేద్దామనే ఆలోచన ఇంకుడు గుంతలో పడి, గుంటని పూడ్చేస్తుంది. ఇక ఆపైన ఏవీ కిందికి దిగవు. అప్పుడు ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీలను స్మరించు కోవాలి. వెంటనే పూడిక కరిగి మేధోబిలం ప్రతి అనుభవసారాన్ని ఒడిసి పట్టడానికి సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ నేతలు సామూహికంగా ఇంకుడు గుంతలు తవ్వుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే నూటనలభయ్ సంవత్సరాల ఊట ఇంకిపోయింది. పార్టీ పెద్ద చవిటిపర్రగా మిగిలింది. తక్షణం బిలాల మీద దృష్టి సారించండి. మంచి ఆలోచనలను ఒడిసి పట్టి, ఇంకింప చేసి పార్టీ జెండాని చిగురింప చేయండి. డాక్టర్లకిప్పుడు ఈ గుంతలు అత్యవసరం. బిలాలు కరెన్సీతో కవర్ కాకుండా చూసుకోవాలి. విద్య గరిపేవారు, వైద్యులు, నీతికోవిదులు వీరిని దైవసమానులుగా మనం భావిస్తాం. న్యాయ, నీతి, ధర్మశాస్త్రాలు ఎలాంటి అమృతవాక్కులు కురిపించాయో తెలుసు. వాటిని ఒడిసిపట్టి వారి వృత్తుల్ని పండించుకుంటే ఎంత బావుంటుంది! స్వామీజీలు, బాబాలు, మాతృశ్రీలు, అవధూతలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. మేము... మేము అని తమని తాము సంబోధించుకుంటూ ప్రసార మాధ్యమాలు సొంత ప్రచార మాధ్యమాలుగా మారిపోతున్నాయి. వీరంతా మేధోమథనం చేసుకోవాలి. తక్షణం వారంతా వారికి తగిన పరిమాణంలో ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి. పై కొలతలు ఎలా ఉన్నా వీరంతా లోతు పెంచుకోవడం శ్రేయస్కరం. వ్యాసకర్త: శ్రీరమణ (ప్రముఖ కథకుడు) -
ఎవరి పంచాంగం వారిదే!
అక్షర తూణీరం అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా! మన్మథ వేదిక దిగి చివరి మెట్టుపై నిలబడి ఉంది. దుర్ముఖి రంగ ప్రవేశం చేయడానికి పారాణి దిద్దుకుంటోంది. ఉగాది కోసం కొత్తచిగుళ్ల స్వాగత తోరణాలు, పూలు, బుక్కాలు సిద్ధంగా ఉన్నాయి. కోయిలలు వసంతగోష్టి కోసం గుట్టుగా రిహార్సల్స్ చేసుకుంటున్నాయి. పచ్చని చెట్టుకొమ్మలు కానరాక కరెంటు స్తంభాలను, సెల్టవర్స్ని ఆశ్రయిస్తున్నాయి. షడ్రుచుల ప్రసాదం దినుసులన్నీ కార్బైడ్ నిగారింపులతో నిలబడి ఉన్నాయి. మన్మథ మిగిల్చి వెళ్లిన మధుర జ్ఞాపకాలేవీ జుట్టు పీక్కున్నా గుర్తు రావడం లేదు. ఎటొచ్చీ గోదావరి పుష్కరాలు గొప్ప ఈవెంట్. ఇది మా ఘనతేనని చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మనది చాంద్రమాన సంవత్సరాది. ఔను, రెండు తెలుగు రాష్ట్రాలకీ చంద్రమానమే వర్తిస్తుంది. చచ్చు శ్లేషలు ఇలాగే అఘోరిస్తాయి. మన్మథ మాటల సంవత్సరంగా కాలక్షేపం చేసి వెళ్లిపోయింది. పశువులకు మేతలు లేవు, సరికదా కడుపు నిండా నీళ్లు కూడా లేని దుస్థితి. మరో వైపు రాబోయే మిగులు జలాలపై గంటలకొద్దీ ముచ్చట్లు. ఏడాది పైగా అమరావతి వైభవాలు వినీ వినీ చెవులు దిబ్బెళ్లెత్తాయి. వేరే సరుకు లేనందున దుర్ముఖి కూడా గొప్పలే వినిపిస్తుంది. మనకు వినక తప్పదు. కొత్త క్యాపిటల్ మిగతా హంగులేవీ అమర్లేదు గాని పేరు మాత్రం జనం నోళ్లల్లో నానిపోతోంది. వెనకటికి ఓ మొగుడు గారెలు వండమని పెళ్లాన్ని ఆదేశించాడు. ఆవిడ వేలొక్కటి చూపి, మగడా, గారెలకు చిల్లు పెట్టడానికి ఈ వేలు మాత్రమే ఉంది. మిగతా దినుసులేవీ కొంపలో లేవని చెప్పిందట. వేలు కాదుగానీ వేల ఎకరాలు సేకరించి, విదేశీ కంపెనీలకు గాలం వేసి కూచున్నారు. యాభైవేల ఎకరాల సుక్షేత్రాలు పచ్చదనాన్నీ, మట్టి వాసననీ కోల్పోయాయి. ఆవులు మేసే గడ్డిపై బుల్డోజర్లు పొగలు కక్కుతున్నాయి. తమలపాకు తోటలని ఉక్కుపాదాలు కర్కశంగా తొక్కేయగా ఆ నేలంతా ఎర్రబారింది. అవిశి పువ్వులు ఇక కనిపించవు. గోరువంకల కువకువలు, గువ్వపిట్టల రిక్కలు ఇక వినిపించవు. లక్ష అరకలకు శాశ్వతంగా సెలవిచ్చి పుణ్యం కట్టుకున్నారు. సహజ ప్రకృతినీ, పంట పొలాలనీ సమాధి చేసి ఆకాశహర్మ్యాలకు పునాదులు వేస్తున్నారు. అవినీతి సాంద్రత తగ్గిన దాఖలాలు లేవు. ఆశ్రీత కులపక్షపాతాలు గుర్రపుడెక్కలా ఏపుగా విస్తరిస్తున్నాయి. స్వపరాగ, పరపరాగ సంపర్కాలతో అవకాశమున్న అన్ని వర్గాలు కరెన్సీని పండించుకుంటున్నాయి. నేతలకిప్పుడు సొంత మీడియా హౌసులున్నాయి. నేతల కోతలక్కడ పదే పదే ప్రతిధ్వనిస్తాయి. ఆకలితో వస్తున్న కడుపు నొప్పులకు అపెండిసైటిస్ ఆపరేషన్లు చేస్తున్నారు అధ్యక్షా! సొంత మీడియాతో బాటు, ఒక సొంత స్వామి నేతలకు బులెట్ ప్రూఫ్ వాహనంలా తప్పనిసరి అయింది. స్వచ్ఛభారత్ నినాదాన్ని లౌక్యంగా గాంధీతాత కళ్లజోడులోంచి చూపిస్తూ పెద్దాయన ఏడాది గడిపేశారు. స్వచ్ఛభారత్లోకి ఆ చెత్త నోట్లు దేనికని స్విస్ ఖాతాలు తెరవేలేదంటున్నారు. మిషన్ కాకతీయ కాదు, ‘కమీషన్ కాకతీయ’ అంటూ ప్రతిపక్షాలు చమత్కరిస్తున్నాయి. కొయ్యగుర్రం మీద ఊగుతూ ఆ విధంగా ముందుకు పోతావున్నామని రెండేళ్లుగా జనాన్ని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు చంద్రన్న. అన్నీ ఉన్నట్టే పార్టీలకీ, నేతలకీ సొంత పంచాంగాలుంటాయి. పంచాంగవేత్తలు వేదికని బట్టి కందాయ ఫలాలని శ్రవణానందం చేస్తారు. అవి విని ఆనందించి ముగ్ధులైపోతారు. ఆ ఫలితాల స్క్రిప్ట్ మనం రాయించుకున్నదేనని మర్చిపోయి నాయక బృందం ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. ఆత్మలోకంలో దివాలా! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
శ్రీవారిని అంటు కట్టకండి!
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలదాచుకోవడానికి ‘గోవర్ధనగిరు’లను అక్కడక్కడ నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. స్వామి పేరిట భవనం లేని పాఠశాలలను ఉద్ధరించవచ్చు. ఇంకా ఈ ధార్మిక కేంద్రాల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచవచ్చు. శక్తిమంతమైన ఆధారం దొరికితే చాలు, కొందరు పాలకులు దానిచుట్టూ వార్తలు పుట్టిస్తారు. అటు వంటి ఆధారాలలో తిరుపతి ముఖ్యమైంది. కలి యుగనాథుడిగా ఏడుకొండల మీద ఆయన వైభ వం సాగించుకుంటున్నాడు. వజ్రకిరీటాలూ, స్వర్ణ రథాలూ ఆయన స్వార్జితాలు. తరగని, చెరగని ప్రజల నమ్మకం, ఆయన పట్ల విశ్వాసం స్వామి వారి స్వార్జితాలే. వాటి లో ఏ ప్రభుత్వాలకూ, ఏ నాయకులకూ ప్రమే యం లేదు. కానీ చాతుర్యం గల నేత అనుకూలాల న్నిటినీ తన కాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉం టాడు. వాన కురిస్తే, వెన్నెల కాస్తే, నది ప్రవహిస్తే - అన్నీ నావల్లేనని జంకూగొంకూ లేకుండా చెప్ప గల పనితనం వారిలో ఉంటుంది. ఇప్పుడు మనకు అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న మహాపురుషుడిగా ఒక్క వెంకటేశ్వరస్వామి మాత్రమే కనిపిస్తున్నాడు. అందుకని ఆయనని రాజమండ్రిలో, విజయవాడలో కూడా ప్రతిష్టించి, ఆలయాలు కడతామని ప్రభుత్వం ప్రకటించింది. శుభప్రదమైన ఆలోచన. కానీ స్థలాభోగం, శిలా భోగం అన్నారు. అన్ని స్థలాలకు ఆ శక్తి ఉండదు. అన్ని రాళ్లకు ఆ ఆకర్షణ ఉండదు. పూలతీగెకు అం టుతొక్కినట్టు దేవుళ్లని అంటు తొక్కడం మర్యాద కాదేమో! తిరుమల పరిసరాలలోనే ముమ్మూర్తు లా మూలవిరాట్ లాగే ఉండే, ఇంకో మూరెడు ఎత్తున్న మూర్తులు ఉన్నాయి. వాటికి ఎంత ప్రాచు ర్యం రావాలో అంతేగాని మూలవిరాట్‌తో సాటిరారు కదా! ధార్మిక స్పృహ కలిగించే ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు గొప్ప వే. భక్తి ప్రచారం మంచిదే. వెంకటేశ్వరస్వామి ఆలయాలను కాదు ప్రారం భించాల్సింది, ఆయన పేరిట ధార్మిక కేంద్రాలు. సామాన్యులకు అందుబా టులో ఉండేలాగా కల్యాణ మండపాలు నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుంది. సంకీర్తనలూ, సత్సంగాలూ సాగించడానికి అనువుగా ఒక స్థావరం ఉంటే ఉభయ తారకంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలదా చుకోవడానికి ‘గోవర్ధనగిరు’లను అక్కడక్కడ నిర్మి స్తే ఉపయుక్తంగా ఉంటుంది. స్వామి పేరిట భవ నం లేని పాఠశాలలను ఉద్ధరించవచ్చు. ఇంకా ఈ ధార్మిక కేంద్రాల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ లను అందుబాటులో ఉంచవచ్చు. ఇప్పటికీ గ్రామీ ణ ప్రాంతాలలో తల్లులకు ప్రసూతి సౌకర్యాలు సరిగ్గాలేవు. సరైన వైద్యం లేక తల్లులు, పురిటికం దులు మరణిస్తూనే ఉన్నారు. అలాంటి చోట శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులను ప్రసరింపచేయడం అవసరం. ఆపదలో ఉన్నవారు బతికి బట్టకడ తారు. అక్కడ, అంటే కుగ్రామాలలో ఇది నేడు అత్యవసరం. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు పేరుకు మాత్రమే ఉన్నాయి. డాక్టర్ల నుంచి కిందకు- అందరూ టౌన్లో ఉండడానికే ఇష్టపడు తున్నారన్నది నిజం. ఈ కేంద్రాలను స్వామికి దత్తత ఇస్తే అప్పుడు కొందరైనా సేవాధర్మంతో పనిచేయడానికి ముందుకు వస్తారు. భక్తి మూలా ల మీద విద్య, వైద్య సేవలను జనసామాన్యానికి అందిస్తే అదే నిజమైన గోవిందం. ప్రతి కేంద్రం లోనూ స్వామిని ప్రతిష్టించండి. కానీ దేవాలయంగా కాక, సేవాలయంగా పనిచేసేట్టు చూడండి. శ్రీవారిని అంటు కట్టకండి. (శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ..
అక్షర తూణీరం ‘‘జీవితానికి కావల్సినవి రెండే రెండు. ఒకటి మమ్మీ, రెండు మ్యాగీ’’ అని ఒక తరం ప్రగాఢంగా నమ్ముతున్న తరుణం లో ఒక్కసారి తేడా పడింది. అసలు మన దేశంలో యింతే. ఏదైనా సరే, బావుందిలే అని మొదలు పెట్టి అలవాటు పడగానే -అది తింటేనో తాగితేనో అయి పోతారంతేనంటూ వార్నింగులు వస్తాయి. అమెరికన్ కోడి వేపుడు ముక్కలు తింటే కిడ్నీలు, కళ్లు పోతాయంటున్నారు. మనకి ఏదొచ్చినా విడ్డూరమూ, విపరీతమే. సిగరెట్టు తయారీని పరిశ్రమగా గౌరవిస్తారు. పొగాకు పంటని ప్రో త్సహిస్తారు. సిగరెట్లు కాల్చడం హానికరమని టాంటాం వేస్తారు. ఎక్కడంటే అక్కడ పొగ తాగరాదంటారు. చిల్లరగా ఒకటీ అరా అమ్మకానికి దొరకవు. టోకున ప్యాకెట్ కొనుక్కోవల్సిందే. మళ్లీ బీడీల జోలికి వెళ్లరు. అక్కడ పుర్రె బొమ్మ పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే బీడీ తయారీ ఒక పెద్ద కుటీర పరిశ్రమ. పొగాకుని కూడా గంజాయిని నిషేధించినట్లు పూర్తిగా పక్కన పెట్టచ్చు. దేనికైనా చిత్తశుద్ధి వుండాలి. మా నాయనమ్మ నవగ్రహాలకి ఒక్క కొబ్బరి కాయ చాలు, విడివిడిగా తొమ్మిది అక్కర్లేదని అరిచి కేకలు పెట్టి మరీ చెబుతుండేది. మన ప్రభుత్వాలవి కూడా నాయనమ్మ ఆలోచనలే. నిజంగానే ప్రజల ఆరోగ్యం కాపాడాలనే చిత్త శుద్ధి ఉంటే, ముందస్తుగా మన మంచినీళ్లను నిషేధించాలి. పాలు, పెరుగు, బియ్యం, నెయ్యి, కూరగాయ-సమస్తం రసాయన కలుషితం. ఆఖరికి అరటిపళ్లను, మామిడిపళ్లను భయం కరమైన కెమికల్స్‌లో ముందే పండించి సిద్ధం చేస్తున్నారు. మనం తాగే ఎన్ని శీతల పానీయాలు స్వచ్ఛమైనవి? పాన్ సుపారి, గుట్కా నమలచ్చా? అసలిప్పుడు సెల్‌ఫోన్ అత్యంత ప్రమాదభరితమై పోయింది. సెల్‌ఫోన్ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, నైతిక అంశాలపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది. అంతమాత్రం చేత నిషేధిస్తామా అంటే, మరి చిత్తశుద్ధి ఉంటే నిషేధించాల్సిందే. మనం శుక్రనీతిని పాటిస్తాం. ప్రాణవిత్త మానములకు భంగం వాటిల్లినప్పుడు బొంకవచ్చు అని రాక్షస గురువు స్పష్టంగా చెప్పాడు. మనం కూడా ఆ గణంలో వాళ్లమే కాబట్టి అటువైపు మొగ్గుతున్నాం. లేకపోతే, మద్యం ఎందుకు నిషేధించరు? కల్లుపై ఎందు కు నిఘా పెట్టరు? ఇదంతా ఒక తీరు అయితే మ్యాగీ నుంచి కోడిగుడ్డు దాకా ప్రచారకులుగా నిలబడే పెద్ద మనుషులు కొందరు. సామాన్య ప్రజలే వారిని సెలెబ్రిటీలను చేస్తారు. వారా ముఖం తొడుక్కొ ని అనేక చెత్త సందర్భాలకు బ్రాండ్ దూతలుగా నిలబడి సొమ్ము చేసుకుంటారు. దీన్నే విధి వైపరీత్యం అంటారు. ఫలానా వారి బంగారు ఆభరణాలకు ఒకాయన భరోసా యిస్తుంటాడు. ఇంకో రియల్ ఎస్టేట్ గొప్పతనాన్ని మరొకాయన వల్లిస్తుంటాడు. చిట్‌ఫండ్ కంపెనీలకి, రుణ సౌకర్యాలకు పక్కన నిలబడి వాళ్లేం చెప్పమంటే అవి చెప్పేసి సొమ్ములు చేసుకుంటారు. మన దురదృష్టం కొద్దీ కొన్ని విలువలు మూలాల్లోనే సడలిపోయాయి. విచిత్రమేమంటే యీ మహానుభావులే స్వచ్ఛ భారత్‌కి కూడా ప్రచార దూతలుగా ప్రచార మాధ్యమాలను అలంకరించడం. ఇటీవల రోజుల్లో వరదలా వస్తున్న చిత్ర విచిత్రమైన వార్తలను వింటున్నప్పుడు ఎవరికైనా మనసు వికలం అవుతుంది. ఒక పెద్దాయనని మీకెలా అనిపిస్తోందండీ అని మాట వరసగా అడిగాను. ఆయన నిర్లిప్తంగా నవ్వి, ఏ అలవాటు లేకుండా యీ దేశాన్ని యిన్నేళ్లు కాపాడాను. చాలా వృథా. నాకిప్పుడు ఆత్మహత్య చేసుకోవా లనుంది అన్నారు. పాపం! - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎక్కడేసిన గొంగళి అక్కడే
అక్షర తూణీరం ‘‘ఇంతకీ స్విస్ బ్యాంక్‌ల నుంచి డబ్బంతా వచ్చిందా’’ అని ఆత్రంగా మొదటి ప్రశ్న వేశాడు. మేమంతా మొహమొహాలు చూసుకున్నాం. ‘‘పట్టాభిషేకం రోజున పెద్దాయన చెప్పాడు కదా’’ అని మావయ్య గుర్తు చేశాడు. మేమంతా అపరాధుల్లా తలలు దించుకున్నాం. ఢిల్లీ గవర్నమెంటు ఎక్కిదిగి ఎక్కిన వైనం చెప్పగా విని ‘అహా’ అన్నాడు. ఒక్కసారి ఉలిక్కిపడి లేచి, ‘‘అప్పుడే మనవూరి స్టేషన్ వచ్చేసిందా’’ అని అడిగాడు మావయ్య కళ్లు నులుపుకుంటూ. చుట్టూ చేరిన మా ఆనందానికి అవధులు లేవు. మావయ్య చుట్టూ కలయచూసి వెర్రిమొహం పెట్టాడు. అయోమయంలో పడ్డాడు. ఎందుకంటే - మావయ్య కోమాలోకెళ్లి ఎనిమిది నెలల ఎనిమిది రోజులైంది. ఎలా వెళ్లాడంటే - చిన్న రిపేర్ వచ్చి పెద్ద ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాల ఉందో, దీనికనుబంధంగా అది ఉందో ఆ భగవంతుడికే తెలియాలి. అయితే, మావయ్య అక్కడి అర్ధాపావు మెడికోలకి మంచం మీద దొరికిపోయాడు. వాళ్లు ఎవరికి తోచిన వైద్యం వాళ్లు చేశారు. కొందరు నీళ్ల ఇంజెక్షన్లిచ్చారు. మరి కొందరు పొట్టనొక్కి చూశారు. స్టెత్‌తో గుండె చప్పుళ్లు విని ఆనందిం చారు కొందరు. ఎవరో మత్తు మందు మాస్క్‌ని ప్రయోగాత్మకంగా మావయ్య ముక్కుకి తగిలించారు. ఒక్కసారి నిశ్శబ్దం అలుముకుంది. మావయ్య కోడి మెడ వేశాడు. పెద్ద డాక్టర్లు వచ్చి, ఇది పిల్ల చేష్టల వల్ల జరిగింది కాదు, షుగర్ ఎగతన్నడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ‘‘స్మారక స్థితికి తెస్తాం, డోంట్ వర్రీ’’ అని హామీ కూడా యిచ్చారు. విషయం పొక్కకుండా వుంటుందని జరిగిన కథని, మావయ్యని గదిలోనే ఉంచేశారు. వైద్యం కూడా ఉచితంగానే నడిపించారు. మాకు అసలు సంగతి తెలుసు. అనవసరంగా చానెల్స్‌కి ఎక్కి, గొడవ చేసి ఉచిత వైద్యాన్ని వదులుకోవడం దేనికని మేమంతా పెద్ద డాక్టర్ల మాట నమ్మినట్టే నటించాం. ఎందుకంటే మావయ్యకే కాదు మూడు తరాలు వెనక్కి వెళ్లినా వంశంలో షుగర్ లేనేలేదు. క్లుప్తంగా జరిగింది మావయ్యకి ఎరుక పరిచాం. ‘‘ఇంతకీ స్విస్ బ్యాంక్‌ల నుంచి డబ్బంతా వచ్చిందా’’ అని ఆత్రంగా మొదటి ప్రశ్న వేశాడు. మేమంతా మొహమొహాలు చూసుకున్నాం. ‘‘పట్టాభి షేకం రోజున పెద్దాయన చెప్పాడు కదా’’ అని మావయ్య గుర్తు చేశాడు. మేమంతా అపరాధుల్లా తలలు దించుకున్నాం. ఢిల్లీ గవర్నమెంటు ఎక్కిదిగి ఎక్కిన వైనం చెప్పగా విని ‘అహా’ అన్నాడు. చంద్రబాబు అప్పుడెప్పుడో చెప్పిన రైతుల రుణమాఫీ అమలైందా అని అడిగాడు ‘అవుతోంది’ అన్నాం. క్లారిటీ ఇవ్వండని అరిచాడు మావయ్య. ‘వాళ్లకే లేదు ఇంక మేమేం ఇస్తాం’ అని గొణిగాను. ఇంతకు కాపిటల్ ఎక్కడో తేలిందా అన్నాడు. అమరావతి విశేషాలన్నీ చెప్పాం. బాబు అనుచరులతో సహా సగం ప్రపంచం చుట్టివచ్చారని, పెట్టుబళ్లు రావచ్చనీ చెప్పాం. ముందు మనకి కావల్సింది అప్పులు. పెట్టుబళ్లు ఆనక చూసుకోవచ్చని మావయ్య స్పష్టంగా చెప్పాడు. ఏదైనా ఎదురు మాట్లాడితే మళ్లీ కోమాలోకి వెళ్తాడే మోననే భయంతో చచ్చినట్టు విని ఊరుకుంటున్నాం. టీవి తెర మీద వ్యాపార ప్రకటన వస్తుంటే మావయ్య చూశాడు. ‘‘ఏవిట్రా ఇది, మిషన్ కాకతీయ అంటే...’’ అన్నాడు. వివరంగా చెప్పాం. ‘‘అయితే మాత్రం, వాళ్ల ఊరి చేపల కోసం పగటి కలలేమిటి’’ అన్నాడు మందలింపుగా. ‘తెలంగాణ కేబినెట్లోకి కొత్తగా సొంత చుట్టాలెవరైనా వచ్చారా’’ అని అడిగాడు. వినీ విననట్టు ఊరుకున్నాం. ‘పదండి... ఇంటికి పోదాం’’ అని కదిలాం. మావయ్య మా వంక తీవ్రంగా చూశాడు. ‘ఎనిమిది నెలల తరవాత సంగతు లేవిట్రా అంటే ఒక్కటీ చెప్పరు. ఇన్నాళ్లూ మనశ్శాంతిగా బతికాను’’ అంటూ మావయ్య తలపట్టుకున్నాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఈ చేతా ఆ చేతా బొమ్మలేసిన గోపులు
గోపులుకి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పడిపోయింది. చూడ్డానికి వెళితే, ‘నాకు బ్రష్ స్ట్రోక్ రాదనేవారు, ఎట్టకేలకు స్ట్రోక్ వచ్చింది’ అంటూ నవ్వారు. ఎడమ చేత్తో బొమ్మలు సాధించి, ఆనక కుడిచేతిని స్వాధీనం చేసుకుని సవ్యసాచి అయినారు. ఆయన గొప్ప ఆర్టిస్టు. ఆయ న గొప్ప కార్టూనిస్టు. ‘నేను ఆ ర్టూనిస్టుని’ అని చెప్పుకునే వారు గోపులు. అసలు పేరు గోపాలన్. తమిళనాడు, తం జావూరులో పుట్టి పెరిగారు. భయమూ, భక్తీ పుట్టుకతోనే అబ్బాయి. చిత్రకళ తర్వాత అబ్బింది. అన్నీ కలసి ఏడు దశాబ్దాల పాటు తమిళదేశంలో గోపులు ఇంటింటి పేరు గా నిలిచారు. మొన్న - ఏప్రిల్ 29న కన్నుమూసిన సవ్య సాచికి నివాళిగా- బాపు బొమ్మ తెలుగుజాతి ప్రతి నిధి అయినట్టే, గోపులు బొమ్మ తమిళ త్వానికి ప్రతీక. ఇద్దరూ మంచి మిత్రు లు. ‘నాకు గురువు’ అని బాపు, కాదు ‘నాకే గురువు’ అని గోపులు ఇష్టంగా చెప్పుకునేవారు. బాపు ఒక వారధిగా లేకపోతే, తెలుగువారికి గోపులు ఇం తగా తెలియడానికి అవకాశం లేదు. బాపు పబ్లిసిటీ సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో పరిచయం, కడదాకా కొనసా గింది. బాపు ఆ రోజుల్లో అత్యధిక పారి తోషికం తీసుకునే ఆర్ట్ డెరైక్టరు. అయి నా, వద్దని వచ్చేసి సాక్షితో నిర్మాతగా, దర్శకుడిగా మారారు. అప్పట్లో గోపులుని సొంతంగా ఏజెన్సీ పెట్ట మని బాపు చెబుతూ ఉండేవారట. ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో బాపు గోపులు ఇంటికి వెళ్లేవారు. చాలాసార్లు నన్ను కూడా తీసుకువెళ్లారు. అప్పుడప్పుడే చీకటి వేళలో గోపులు బాపు కోసం ఎదురుచూస్తూ ఉండే వేళలో వెళ్లే వాళ్లం. వారింట్లో వంట మామి ఇడ్లీలు వండి వడ్డించేది. అవి పరమాద్భుతంగా ఉండేవి. గోపులు రాత్రిళ్లు అవే తినేవారు. నాకు ఇడ్లీలు ప్రత్యేక ఆకర్షణ, ఆ తర్వాత గోపులు స్వచ్ఛమైన తమిళయాస. వేడివేడి ఇడ్లీలు వడ్డిం చి, ‘రొంబసూడు’ అనేవారు. ఆ మాటలో వేడిని అనుభ వించేవాడిని. బాపు, గోపులు మాట్లాడుకుంటుంటే నాకు అనేక సంగతులు అర్థమయేవి. ఎయిర్ ఇండియాకి మహారాజాని డిజైన్ చేసిన ఉమేశ్‌రావు గొప్పతనాన్ని గురించి మాట్లాడుకునే వారు. తమిళనాట తొలినాళ్ల ఇలస్ట్రే టర్, కార్టూనిస్ట్ మహాలింగం మాటలూ వచ్చేవి. ‘మాలి’ పేరుతో ఆయన ప్రసి ద్ధులు. ఆయనే గోపాలన్ని ప్రోత్సహిం చి గోపులుగా మార్చారట. ఏజెన్సీలో మరో మిత్రుడు థాను గురించిన కబు ర్లు వచ్చేవి. ‘ఆయన గీత అంతగా బావుండదనేవారు గాని బాపు అతని గీత అద్భుతం కదూ!’ అంటూ గోపులు మొదలుపెట్టారు. క్లెయింట్స్ అతని బొమ్మలను వద్దనేవారట. ఆయనకు విసుగువేసింది. ఫ్రెంచ్ భాష వచ్చిన థాను పది మందికి ఫ్రెంచ్ ట్యూషన్లు చెప్పడం మొదలు పెట్టాడు. త్వర త్వరగా ఎదిగాడు. ఆ త్రివిక్రముడు తర్వాత బ్రిలియంట్ ట్యుటోరియల్స్ అయినాడు. రీడర్స్ డెజైస్ట్ లాంటి పత్రి కల్లో బ్రిలియంట్స్ వ్యాపార ప్రకటనలు వచ్చేవి. ‘బాపూ! సామ్రాజ్యాన్ని పిల్లలకు అప్పగించి థాను ఇప్పుడు కొడెకైనాల్లో విశ్రాంతిగా కాలక్షేపం చేస్తు న్నాడు. ఎప్పుడూ మనిద్దర్నీ రమ్మంటాడు’ అని సం తోషంగా చెప్పేవారు. గోపులు చిత్రకళలోని అన్ని శాఖలకీ కొత్త చిగుళ్లు తొడిగారు. కామిక్స్ నుంచి రాజకీయ కార్టూన్ల దాకా, కథల బొమ్మలు, కవర్‌పేజీలు, లోగోలు, వ్యాపార ప్రకటనలూ- ఇలా అన్నింటా అవుననిపించుకున్నారు. ‘యాడ్ వేవ్’ పేరిట సొంత ఏజెన్సీ ప్రారంభించి ప్రథమ స్థానంలో నిలిపారు. ఆరుద్ర అనువాద కావ్యం ‘వెన్నెల- వేసవి’కి బాపు గోపులుతో బొమ్మలు వేయిం చారు. గోపులు మాట్లాడని కార్టూన్ల గురించి బాపు తెగ చెప్పి నవ్వేవారు. గోపులుకి పక్షవాతం వచ్చి కుడిచెయ్యి పడిపోయింది. చూడ్డానికి వెళితే, ‘నాకు బ్రష్ స్ట్రోక్ రాదనేవారు, ఎట్టకేలకు స్ట్రోక్ వచ్చింది’ అంటూ నవ్వా రు. ఎడమ చేత్తో బొమ్మలు సాధించి, ఆనక కుడిచేతిని స్వాధీనం చేసుకుని సవ్యసాచి అయినారు. కళా ప్రపం చానికి స్ఫూర్తి గోపులు. ( శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
అరచేతిలో అమరావతి
శ్రీరమణ చంద్రబాబు తన జీవితంలో ఎన్నో ఆలోచనల్ని చురుగ్గా పెట్టుబడిలోకి మార్చుకున్న ధీశాలి. మద్యంతో బండిని కుదుపుల్లేకుండా నడపొచ్చని ఆలోచన చేసింది ఆయనే. మనకి వెంకటేశ్వరస్వామి గొప్ప అండదండ. తరుగులు పోకుండా వస్తే శ్రీవారి ఆదాయం రాష్ట్ర ఆదాయానికి సరితూగుతుంది. నవ్యాంధ్ర ముఖ్యపట్టణం పేరు ఖాయం చేసేశారు. పురాణాలలో అమరావతిని ఇంద్రనగరంగా, సర్వసుఖ, సర్వభోగ, సర్వాంగ సుందర నగరంగా తెగ వర్ణిస్తూ ఉంటా రు. కాళిదాసు మేఘసందేశం లో అలకాపురిని వర్ణించి వర్ణిం చి మనసులని ఊరించాడు. మనకి గొప్ప చరిత్ర ఉన్న ముఖ్యపట్టణం అమరావతి. ‘అమరావతి గుహల అపురూప శిల్పాలు’ అన్నారు మా తెలుగుతల్లి కవి. తరువాత అక్కడ గుహలు లేవని, ‘అమరావతి నగర’ అని సవరించి పాడడం మొదలు పెట్టారు. ఒకవైపు మిషన్ కాకతీయ అంటూ చెరువుల మీద పడ్డారు. ఇటువైపు కూడా కాకతీయ వైభవాన్ని పునరు ద్ధరిస్తామని చంద్రబాబు, ఆయన సహచరులు కంకణ ధారులైనారు. ‘నాడా దొరికింది, ఇహ కావల్సింది గుర్రం మాత్రమే’నని కొందరు నిరాశావాదులు పెదవి విరుస్తున్నారు. ‘శేషమ్మ మేడ చందంగా ఉంది’ అన్నా డొక పెద్దాయన. ‘ఎవరా శేషమ్మ? ఏమా కథ?’ అని ప్రాధేయపడ్డాను. అయ్యో! ఆవిడిది మీ ప్రాంతమే. మీకు తెలియదా అంటూ మూడు ముక్కల్లో కథ చెప్పా డు. శేషమ్మకి బోలెడు ఆస్తి ఉంది కాని అదంతా వ్యాజ్యం లో చిక్కుపడి ఉంది. ఆవిడ తీవ్ర ఆశావాది. అందుకని వ్యాజ్యం తేలగానే కట్టే మేడ గురించి ఆమె అందరికీ వివరంగా చెబుతుండేది. మెట్ల మీద నిలబడి కోడలు తలారపోసుకునే దృశ్యాన్ని, డాబా మీంచి మనవడికి చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించే ముచ్చట్లని చెప్పేది. ఇరుగు పొరుగు వారు కూడా పై డాబా మీద ఉప్పులు పప్పులు హాయిగా ఎండ పెట్టుకోవచ్చని అనుమతి కూడా ఇచ్చేది. ప్రతిసారీ కొత్త కొత్త ఊహలు కలుస్తూ ఉండేవి. అందుకని ఊరి వారు కాలక్షేపం కావాలనుకుంటే శేషమ్మ గారికి కీయిచ్చేవారు. ప్రతిసారీ కొత్త సంగతులు ఉండడం వల్ల వినవేడుకగా ఉండేది. వ్యాజ్యం నడుస్తూ ఉండగానే శేషమ్మ నడవడం మానేసింది. అక్కడ వాయిదాలు పడుతున్నా, ఇక్కడ సమవర్తి దగ్గర వాయిదా పడలేదు. ఏళ్ల తరబడి మేడ ముచ్చట్లు విన్న ఊరి వారికి ఇదొక సామెతగా గుర్తుండి పోయింది. ఆ మాటకొస్తే ‘నవ్విన నాపచేను పండు తుంద’ని కూడా సామెత ఉంది. చంద్రబాబు పరమ ఆశావాది. ఆ వాదమే ఆయనని ఇంతదూరం నడిపించింది. మొన్నామధ్య చంద్రబాబు ఉన్నట్టుండి ‘ఆలోచనే పెట్టుబడి’ అని ఒక సందేశం విసిరారు. ‘ఇన్నాళ్లూ మనకి తట్టలేదు. ఎంత జడ్డి బుర్రలం’ అని రాష్ట్ర మేధావులు తలలు వంచుకుని బాధపడ్డారు. విద్యుచ్ఛక్తిని కని పెట్టడం ఒక ఆలోచన. మరి ఆ ఒక్క ఆలోచన ఎన్ని లక్షల కోట్లని జనరేట్ చేస్తోందో చూడండి! చంద్రబాబు తన జీవితంలో ఎన్నో ఆలోచనల్ని చురుగ్గా పెట్టు బడిలోకి మార్చుకున్న ధీశాలి. మద్యంతో బండిని కుదుపుల్లేకుండా నడపొచ్చని ఆలోచన చేసింది ఆయనే. మనకి వెంకటేశ్వరస్వామి గొప్ప అండ దండ. తరుగులు పోకుండా వస్తే శ్రీవారి ఆదాయం రాష్ట్ర ఆదాయానికి సరితూగుతుంది. ఇక మీద యాత్రికులకి వైద్య పరీక్షలు, వైద్యసేవలు స్వామి సొమ్ముతో చేయిస్తే ఉభయ తారకంగా ఉంటుందనే ఆలోచన వినిపించింది. నిధులు శ్రీవారివి, పేరు శ్రీస ర్కారుది. కావాలంటే ‘ఆరోగ్య గోవిందం’తో క్రెడిట్స్ గోవిందుడికే ఇవ్వొచ్చు. రేపు అమరావతిలో కూడా ఒక కొత్త దేవుణ్ణి ప్రతిష్టిస్తే, ఆ దేవుడు క్లిక్ అయితే మంచి ఆదాయం కదా! అంతర్జాతీయస్థాయి దేవుడై ఉండాలి. కావాలంటే పబ్లిక్ ప్రైవేటు పంథాలోనే సాగించవచ్చు. దీని మీద ఆర్థికవేత్తలు, మేధావులు, స్వామీజీలు విలు వైన సూచనలిచ్చి అమరావతిని కుబేరపురి చేయాలని ప్రార్థిస్తున్నా. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇక అంతా రామమయం!
శ్రీరమణ ఇది ఈ క్షేత్ర మహిమగాని, మీ తప్పు కాదు. దివ్యశక్తితో చూశాను. ఈ గడ్డ మీద ద్వాపరంలో కురుసభ ఇక్కడే మొలుస్తుంది. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభ ఇక్కడే వెలుస్తుంది. ఈ నేల నైజం వల్ల మీరిట్లా ప్రవర్తించారు. పదండి నాయనలారా! అంటూ ముందుకు నడిపించాడు. అప్రజాస్వామిక భాష.. అస లా కరచరణాదుల కదలికలేం టి? ఆ వెక్కిరింతలేంటి? ఆ కవ్వింపులేంటి? హ వ్వ..! ఇది దారుణం. ఇది కలికాలం! ఎక్కడ చూసి నా ఇవే వ్యాఖ్యానాలు. అందరూ ముక్కుల మీద వేళ్లేసుకుంటున్నారు. దీని కంతటికీ కారణం ప్రత్యక్ష ప్రసారాలు అన్నాడొక పెద్దమనిషి. అప్పుడూ ఇంతకంటే తక్కువేంకాదు. మైకులు విరిచెయ్యడం, పేపర్ వెయిట్లు విసురు కోవడం, కాగితాలు చింపి పారెయ్యడం మన చట్ట సభలో సర్వసాధారణం. అరుపులు, కేకలు, ఈలలు కొత్తేమీ కాదు. అయితే, అప్పుడు విషయాలు నాలు గ్గోడల మధ్యా ఉండిపోయేవి. ప్రెస్ గ్యాలరీ నుంచి విశేషాలు చక్కగా ఫిల్టరై ప్రజలు పీల్చడానికీ, ఆస్వా దించడానికీ వీలుగా బయటకు వచ్చేవి. ఇప్పుడా జల్లెడలు లేవు. పచ్చిగా బయటపడుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల తర్వాత తమ తమ నాయకులను సభలో తరచూ చూస్తూ ఉండటంవల్ల వారిని గుర్తిం చి ఓటర్లు గుర్తుపెట్టుకోగలుగుతున్నారు. వీరినా నేను నా పవిత్రమైన ఓటుతో గెలిపించిందని త్రికరణశుద్ధిగా దిగులు పడుతున్నారు. వేడి వాడి నిట్టూర్పులతో సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ ఉంటారు. త్రేతాయుగంలో విశ్వామిత్రుడు యాగ రక్షణ నిమి త్తం రామలక్ష్మణులను వెంట తీసుకుని తన ఆశ్రమానికి బయలుదేరాడు. వారు ముగ్గురూ అరణ్యంలో అలా నడిచి వెళుతుంటే మూడు పడగల నాగుపాము వెళుతు న్నట్టుందని కవిగాయకులు గానం చేశారు. వేళ మిట్ట మధ్యాహ్నమైంది. ఉన్నట్టుండి లక్ష్మణుడు విశ్వామిత్రు డికి ఎదురు నిలిచి, ఏం రుషివి! నువ్వుత్త బోడి రుషివి! ఇద్దరు రాక్షస వెధవలని ఎదిరించలేని వాడివి ఈ యాగం తలపెట్టడం దేనికి? హాయిగా తిని తిరిగే మమ్మల్ని అడవులకు అడ్డం పడేసి తేవడం దేనికి? అం టూ తుపుక్కున ఉమ్మేశాడు. విశ్వామిత్రుడు నిశ్చేష్టుడై నాడు. రాముడందుకుని, ‘‘మహర్షీ! నువ్వు వాజమ్మవి. మా తండ్రి పరమ వీర దద్దమ్మ!’’ అనగానే రుషి తల తిరిగిపోయింది. ‘‘ఇక్ష్వాకు కుల తిలకా! రామ భద్రా! నీవేనా...ఈ...’’ ‘‘ఔను నేనే. కౌశికా! నువ్వొక భ్రష్ట యోగివని మా గురువు వశిష్టుల వారు ఎప్పుడో చెప్పా రు. నా తండ్రి పిరికిపంద...’’ రాముడి మాటలు వినిపించుకోకుండా విశ్వామిత్రుడు అంగలార్చు కుంటూ ముందుకు సాగాడు. రామలక్ష్మణులు తిట్ల దండకం కొనసాగిస్తూ అనుసరించారు. మార్గమ ధ్యంలో ఒకచోట సన్నటి వాగు సరిహద్దు రేఖలా ప్రవహిస్తోంది. దాన్ని దాటగానే రామలక్ష్మణులను ఆవహించిన శక్తేదో దిగిపోయినట్టయింది. వారి ద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకుని బేషరతుగా మహర్షి కాళ్ల మీద పడ్డారు. రుషి చిరునవ్వుతో వారి ని దువ్వి, ఇది ఈ క్షేత్ర మహిమగాని, మీ తప్పు కాదు. దివ్యశక్తితో చూశాను. ఈ గడ్డ మీద ద్వాపరం లో కురుసభ ఇక్కడే మొలుస్తుంది. కలియుగంలో ఆంధ్రప్రదేశ్ చట్టసభ ఇక్కడే వెలుస్తుంది. ఈ నేల నైజం వల్ల మీరిట్లా ప్రవర్తించారు. పదండి నాయన లారా! అంటూ ముందుకు నడిపించాడు. ప్రచారం లో ఉన్న గాథలలో ఇదొకటి. మరి రేపు న్యూ క్యాపి టల్ వచ్చినా ఇంతేనా- అని సందేహం వచ్చింది కొందరికి. అది సింగపూర్ వాస్తు, జపాన్ టెక్నాలజీ లతో నిర్మితమవుతోంది. అక్కడి సభా ప్రాంగణా లలో ప్రత్యేక సదుపాయాలుంటాయి. అసభ్య, అశ్లీల పదజాలమంతా మధురమైన రామనామంగా హాయిగా వినవస్తుంది. ఇక అప్పుడు ‘‘రామా!’’ అంటే బూతనీ, ‘‘శ్రీరామా’’ బండబూతనీ ప్రేక్షక శ్రోతలు అర్థం చేసుకో వాలి. అయితే, రికార్డ్స్ కోసం ఒక్క సభాపతికి మాత్రం ఆ మహా సూక్తులు యథాతథంగా వినిపిస్తాయి. ఎం తైనా వారు గౌరవనీయులు కదా! కల్యాణ శుభవేళ రాముడు అందరినీ అనుగ్రహించుగాక! (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
మా పదకోశం మాదే!
ఇద్దరివీ వజ్ర సంకల్పాలే. అదేదో కథలో చెప్పినట్టు- యజ్ఞజలంలో తడిసిన ముంగిస ఒక్కసారి బంగరు ముంగిస అయిపోయిందట. వీటిలో ఏ ఒక్కరి వజ్ర సంకల్పం ఫలించినా చాలు. ఎందుకంటే బోర్డర్ జిల్లాల మీద ఉభయ సంకల్పాలలో కామన్‌గా ఉన్న గోల్డ్ ప్రభావం పడి తీరుతుంది. అది చాలదా సామాన్యుడి బతుక్కి! విద్యార్థి పరీక్ష రాసేట ప్పుడు గుర్తు చేసుకోవడం ఉంటుంది కానీ, ఆలో చించడం ఉండదు. సొంతంగా ఆలోచించి లెక్కలు, సైన్సు, గ్రామ రు కనీసం సోషల్ గాని రాయలేడు కదా! అస లు చదివి ఉంటే కదా గుర్తుకు రావడానికి! అయితే ఇప్పుడు మీరేవం టారు? బడ్జెట్‌కి ముందు మానిఫెస్టో మేం చదవలేదంటారా? ఊరికే కాకుల్లాగా అరవద్దు. ‘‘మమ్మల్ని కాకులంటారా?’’ ‘‘లోకులు పలుగాకులు అన్నాడు శాస్త్రకారుడు. కాకుంటే ప్రతిపక్షులని అర్థం’’ ‘‘కుక్కలు అని కూడా సెలవిచ్చారు’’ ‘‘ఔను. ఇచ్చాను. విశ్వాసానికి కుక్క మారు పేరు. ఓటిచ్చిన విశ్వాసంతో మీ మాన ధన భద్ర తకు అయిదేళ్లు రేయింబవళ్లు కుక్క కాపలా కాస్తా నన్నాడొక మంత్రిగారు. అందాకా దేనికి ఒక బ్యాం కు తమ చిహ్నంగా కుక్క బొమ్మని పెట్టుకోలేదా? అసలిట్లా ప్రతిమాటనీ తప్పు పడితే నేనూరుకోను. వచ్చే అసెంబ్లీ నాటికి మా నిఘంటువు మేము తయారు చేసుకుంటాం. సన్నాసి అంటే సర్వదృష్టి కలవాడని, స్వార్థం లేని వాడనీ అర్థం. అట్లాగే వెధవ కోర్నాసి లాంటి పదాలక్కూడా పెడార్థాలు తీస్తున్నారు.’’ ‘‘ఇక మీద పదార్థాలే తీసుకుంటాం గానీ, మాతృభాషలో సరే గణితంలో కూడా మీ అంకెలు, మీ లెక్కలు వేరే ఉన్నాయా?’’ ‘‘ఇదేం వాగుడు?’’ వాగుడు అంటే వాక్ మీంచి వచ్చిన సంస్కార వంతమైన సంస్కృత శబ్దంగా గ్రహింతురు గాక! ‘‘ఎన్నికలప్పుడు ఉద్యమంలో బలిదానాల వారి మొత్తం నాలుగు సంఖ్యల్లో చెప్పారు. ప్రతి సభలోనూ సత్యాలూ సంఖ్యలూ అనగా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వల్లిస్తూ వచ్చారు కనుక, అవి విన్న కరెంటు స్తంభాలకు కూడా అవి గుర్తున్నాయి. మనం బడ్జెట్ ప్రతిపాదించే వేళకు ఆ అంకె బలహీన పడేసరికి అనుమానం వచ్చింది- ఒకవేళ మన గణితం కూడా తేడాగా ఉంటుందేమోనని...’’ ‘‘అతి తెలివికి పోతే నాలిక కోస్తా. అప్పుడు అపోజిషన్‌లో ఉండి లెక్కలు తీశాం. ఇప్పుడు పొజి షన్లో ఉండి పక్కాగా లెక్కలు కట్టాం. సమజైందా?’’ అయింది బాబూ అయింది. ఇప్పుడు మళ్లీ తమ సొంత నిఘంటువు విప్పద్దు. బంగారు తెలంగాణ నా లక్ష్యం! స్వర్ణాంధ్రప్రదేశ్‌గా చేశాకే నిద్రపోతా! ఇద్దరివీ వజ్ర సంకల్పాలే. అదేదో కథలో చెప్పి నట్టు- యజ్ఞజలంలో తడిసిన ముంగిస ఒక్కసారి బంగరు ముంగిస అయిపోయిందట. వీటిలో ఏ ఒక్కరి వజ్ర సంకల్పం ఫలించినా చాలు. ఎందు కంటే బోర్డర్ జిల్లాల మీద ఉభయ సంకల్పాలలో కామన్‌గా ఉన్న గోల్డ్ ప్రభావం పడి తీరుతుంది. అది చాలదా సామాన్యుడి బతుక్కి! ‘‘ఏందిర... వ్యంగ్యం వెలిగిస్తున్నావా? బొంద పెడతా... పోతావ్... వచ్చిన కాడికి పోతావ్...!’’ యాదగిరి నరసింహస్వామిని బాగా గుర్తు పెట్టుకున్నారు. ఉదారంగా వందకోట్లు దయ చేశారు. ‘‘చేస్తాం. ఇంకా చేస్తాం. దౌర్జన్యానికీ, దాష్టీకా నికీ ఎదురు నిలబడి చీల్చి చెండాడినవాడు. మా దేవుడు. ఆలిని వెతుక్కుంటూ నేలకి దిగొచ్చిన బాపతు కాదు. మరి అన్ని దిక్కుమాలిన వరాలున్న ... అవేటవి ... పగలు కాదు రాత్రి కాదు, మనిషి కాదు మృగం కాదు, లోపల కాదు బయట కాదు... ఇంత గజిబిజిని గోళ్లతో చీరేశాడు. ఇదొక సందేశం. అది మా గుట్ట మీంచి వెళ్తావుంది’’ ‘‘అటు కూడా ఒక కొండ మీద ముమ్మూర్తులా ఇట్లాంటి దేవుడు ఉన్నాడు సార్! సందేశాలు అట్నించి కూడా వస్తాయేమో కదండీ!’’ ‘‘నీ... నీదేదో నెలల తక్కువ పుటకలాగుందే. ఆ స్వామిని చూడడం అందరికీ సాధ్యమేనా? ఆ ఉగ్రరూపాన్ని చూడలేక, ఆ గాండ్రింపులు వినలేక గంధపు పూతలు పెట్టుకుంటూ... హు వద్దులే. -శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ రచయిత)