సీమ రూకలొస్తున్నాయ్..!
అక్షర తూణీరం
మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్షణం తీరిక లేకుండా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే దున్ని పారేస్తున్నారు. ఆయనంతే, అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. ఎవర్నీ నిద్రపోనివ్వరు. ‘‘పెట్టుబడుల గురించి వాకబు చేస్తున్నారు’’ అన్నాను. ‘‘అంటే ఆయన పెట్టడానికా...’’ అన్నాడు మావూరి ఆసామి ఒకాయన. ‘‘అబ్బో..! అందరికీ చమత్కారాలు పెరిగిపోయాయ్. మరీ ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల..’’ అన్నాను.
ఎందుకు పెరగవ్.. చచ్చినట్లు పెరుగుతాయ్. దగ్గరదగ్గర యాభైవేల ఎకరాల్లో సేద్యం లేదు. పాతికవేల మంది రైతులు రికామీగా ఉన్నారు. పైగా వారికి కరువులు లేవు. అకాల వర్షాల దెబ్బ లేదు. గాలి దుమారాలు లేవు. హాయిగా చెక్కులు గుమ్మంలోకి కొట్టుకు వస్తున్నాయ్. వాళ్లు రాబోయే విశ్వ నగరం తాలూకు బ్లూప్రింట్స్‌ని ఆస్వాదిస్తూ వినోదించడమే రోజువారీ కార్యక్రమం. అందరూ కార్లలో, బైకుల మీద ఓ రచ్చబండ మీదికి చేరడం, పేపర్లు నెమరేస్తూ, టీవీని చర్చిస్తూ పొద్దు పుచ్చడం మిగిలింది. హాయిగా చేతుల్లో సెల్‌ఫోన్లుంటాయ్. ఇంటి వ్యవహారాల్ని, ఒంటి వ్యవహా రాల్ని సెల్‌లో చక్కపెట్టుకోవచ్చు. పూర్వంలాగా అప్పుల బెడద, చీడపీడల బెడద అస్సలు లేదు. అందుకని ఆ ప్రాంతం రైతులంతా మాటకు ముందు చమత్కారాలు ఒలకపోస్తున్నారు– ఇదొక సర్వే రిపోర్టు.
ఇంతటి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉంది. ఒకే ఒక్క క్షణంలో ప్రపంచంలో ఎవరినైనా పలకరించవచ్చు, చూసి మాట్లాడవచ్చనేది యదార్థం. ప్రయాసపడి, బోలెడన్ని కోట్లు ఖర్చుతో సముద్రాలు దాటి వెళ్లడం అవసరమా అని రచ్చబండ మీద చర్చ నడుస్తుంది. పెట్టబడులు, వ్యాపారాలు అంటే పెళ్లి యవ్వారాల్లాంటివి. ‘‘ఫోన్లో పెళ్లిళ్లు సెటిలైపోతాయా? జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల! అవసరమైతే గెడ్డాలు పుచ్చుకు బతిమాలాల...!’’ అని ఇంకో గొంతు సమర్థిస్తుంది. ‘‘బాబాయ్! వాళ్లంతా ఇక్కడోళ్లే... మొహాలు చూస్తుంటే తెలియటంలా...’’ ‘‘ఇక్కడోళ్లైతే పెట్టుబళ్లు పెట్టకూడదా’’ అని సూటి జవాబు. ఎందుకు పెట్టకూడదూ... నిక్షేపంగా పెట్టవచ్చు. అసలు మన అవినీతి ఆఫీసర్ల లాకర్లు తీస్తే చాలు. అయితే ఎలాంటి కేసులూ ఉండవని భరోసా ఇవ్వాలి. వారి సొమ్ముని బట్టి, ఆయా పరిశ్రమల్లో వారికి వాటా ఇవ్వాలి.
ఇప్పుడు వందకోట్లు ఆ పైన కూడపెట్టిన వాళ్లు వెలుగులోకి వస్తున్నారు. పది, ఇరవై, యాభై కోట్ల వారిని ఈ స్కీము కింద గుర్తిస్తే, బోలెడు పెండింగ్ పనులు పూర్తవుతాయి. వారిని దేశభక్తులుగా ట్రీట్ చేసి, సముచిత రీతిని వారి పెట్టుబడులకు న్యాయం చెయ్యాలి–అన్ని చతుర్లు వింటున్న ఓ పెద్దాయన నోరు చేసుకున్నాడు. ‘‘బాబు తెచ్చేవి సీమ రూపాయలు. అరవై ఆరురెట్లు పలుకుద్ది. రెండు జేబుల్లో వచ్చే ఆ రూపాయల్తో కృష్ణమీద కొత్త బ్యారేజీ పూర్తవుతుంది’’.
శ్రీరమణ
(ప్రముఖ కథకుడు)