చంద్రబాబుకి ఎప్పుడూ వార్తల్లో ఉండాలి. లేకపోతే మనసు మనసులో ఉండదు. అప్పటికీ సొంత మీడియా ఉంది కాబట్టి ఏవో వార్తలు పెద్దక్షరాలతో వండి వారుస్తూ ఉంటారు. వాటన్నింటినీ నిజమేనన్న భ్రమలో పొద్దున్నే ఒకటికి రెండుసార్లు చదువుకుని సంతృప్తిపడుతూ ఉంటారు. ఇప్పుడు పొద్దుపోక కమలేతర కూటమిని కట్టకట్టే పనిలో కాలుకాలిన పిల్లిలా చంద్రబాబు తిరుగుతున్నారు. ఇదేదో ఆయనలో మొలిచిన గొప్ప ఆలోచనలా చెబుతున్నారు. ఇదంతా ఇదివరకటి ముఠాయే కదా. పునరేకీకృతం అవడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొంచెం కండబలం ఉన్న పార్టీ చుట్టూ గుమిగూడితే దాన్ని ‘పోలరైజేషన్’ అంటారు. అది కెమిస్ట్రీ. ఇదివరకు కలిసివున్నవారు రకరకాల కారణాలవల్ల విడిపోయి, దూరమై మళ్లీ దగ్గరగా జరగడాన్ని పునరేకీకరణ అంటారు. వీటికి సారూప్యతలు ఉండక్కర్లేదు. అదేదో ఆటలో అంతా కలిసి బంతిని కైవసం చేసుకున్నట్టు, ఈ కూటముల పరమార్థం కుర్చీని లాక్కోవడమే. కూటములు కట్టేవేళ కనిపించేది సైద్ధాంతిక ఏకాభిప్రాయం, ఐకమత్యం కాదు. ప్రత్యామ్నాయం లేక, వేరే దిక్కులేక అందరూ కలిసిపోతారు.
చంద్రబాబు, రాహుల్‌గాంధీ, స్టాలిన్, మమత అంతా సుహృద్భావ వాతావరణంలో మాటలు సాగిస్తారు. తమరధికులంటే, తమరు వందనీయులని పరస్పరం పొగుడుకుంటారు. ప్రస్తుతం పాలిస్తున్న వారిని గద్దెదింపడమే లక్ష్యంగా కూటమి ఆలోచిస్తుంది. అడుగులు వేస్తుంది. అదొక్కటే ఏకైక లక్ష్యం. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, చంద్రబాబు రాష్ట్రాలు తిరుగుతూ, కూటమి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారంటే చాలామందికి సందేహంగా ఉంది. తెలంగాణ సీట్లమీద కసరత్తు చెయ్యచ్చని సామాన్య ప్రజ అనుకోవడం సహజం. తెలంగాణలో చంద్రబాబు నోరెత్తి ఏం మాట్లాడాలి, ఏం చెప్పి టీడీపీకి ఓట్లు అడగాలన్నది పెద్ద ప్రశ్న. అగ్రనేత కేసీఆర్‌తో సహా చాలామంది పసుప్పచ్చ మూలాలున్నవారే. బాబు రాజకీయ మూలాలు కూడా అందరికీ విదితమే. మోదీ పాలన మీద నిప్పులు చెరుగుతూ కాలక్షేపం చేస్తున్న చంద్రబాబుకి అదొక అస్త్రంలాగా కనిపిస్తోంది.
రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమం కొన్నాళ్లు పక్కనపెట్టి దేశాన్ని బాగుచేసే పనిని బాబు తలకెత్తుకున్నారు. మోదీకంటే రాజకీయాల్లో సీనియారిటీ ఉందని పదే పదే చెబుతున్నారు. ఆ మాటకొస్తే దేశంలో ఇంకా సీనియర్లు అనేకులున్నారు. ఈ సందర్భంలో ఆలిండియా స్థాయి రాజకీయాల్ని తన చుట్టూ తిప్పుకుంటే జన సామాన్యం నివ్వెరపోతుందని అంచనా.‘మనకున్న పది పన్నెండు రాష్ట్రాల్ని చూసుకుంటే చాలు బాబూ’ అని జనం గగ్గోలు పెడుతున్నారు. చదువుకున్న యువతలో కొందరికి తొమ్మిదివందల తొంభై తొమ్మిది భృతి ఏర్పాటు చేశారు. అంటే రోజుకి ముప్ఫైమూడు రూపాయలు. దేనికి సరిపోతుందో ఎరుక పరచాలని యువకులు అడుగుతున్నారు. రైతుల సమస్యలేమీ తీరలేదు.
వాళ్లకి కావల్సింది బ్యాంకు రుణాలు కావు. ప్రకృతిని వారికి కావల్సినట్టు సంబాళించడం. అది ప్రభుత్వాల చేతుల్లో ఎలాగూ ఉండదు. కనీసం నాణ్యమైన విత్తనాలన్నా వారికి ఇప్పించండి. ఇప్పుడు రైతుకూలీలు దొరకడం కష్టంగా ఉంది. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొందరికే అందుబాటులో ఉన్నాయ్. వాటిని మండల స్థాయిలో ప్రభుత్వ వ్యవస్థ ద్వారా రైతుకి సరైన కిరాయికి పనిచేయిస్తే మేలు. అంతకంటే ముఖ్యంగా పండించిన వాటికి గిట్టుబాటు ధర కల్పించడం. ఈ పంటల తరుణం వచ్చిందంటే రైతులు ఆనందించడం కంటే, నిరుత్సాహపడటమే ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉత్తుత్తి కబుర్లన్నీ పక్కనపెట్టి, చంద్రబాబు అసలు సమస్యలమీద దృష్టి పెట్టాలి. అది ఆయన తక్షణ కర్తవ్యం.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment