కొన్ని వార్తలు మనుషుల మీద నమ్మకాన్ని గౌరవాన్ని కలిగిస్తాయి. ఇటీవలి కరోనా గత్తరతో మనలోని మానవీయత జాలి, దయ కొంచెం వైరాగ్యం మేల్కొన్నాయి. మొన్నటి సమస్యలో వేల లక్షలమంది వలసకూలీలు వేరేదారి లేక కాలినడకన స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళడం ఎంతోమందిని కలిచివేసింది. వేలమైళ్లు నడిచి వెళ్ళాలనుకోడం కేవలం సొంతవూరి మీది మమకారం. కొందరు రకరకాలుగా వారికి సాయపడ్డారు. ఒక తెలంగాణారైతు తన పొలంలో పండిన పుచ్చకాయల్ని వలస కూలీలకు ఉచితంగా ఉదారంగా పంచిపెట్టాడు. ఈ వార్త మనసుని ఎంతగానో సేద తీర్చింది. దీని తర్వాత నాకు బాగా తెలిసిన ఒక పెద్ద మనిషి తన శక్తి కొద్దీ సైకిళ్లు కొని వలస కూలీలకు పంచారు. రెండువేలు ఖర్చయింది. కాని వారెంత సంతోషించారో చెప్పలేను. మూడు రోజులు ముందు వూరు చేరతామని సంబరపడ్డారు. ఇలాంటప్పుడు చేసిన, చేస్తున్న ప్రభుత్వాల మీద బురద జల్లుతూ కూర్చోడం కంటే, మన మాజీ నేత చంద్రబాబు ఓ వెయ్యి సైకిళ్లు పంచిపెట్టవచ్చుగదా. పైగా సైకిల్ తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా.బాబుకి జిందాబాదుళ్లు కొట్టించుకోవడంలో ఉన్న నిషా ఇంకెందులోనూ లేదు. కావాలంటే పచ్చరంగుతో సైకిళ్లు పంచితే గొప్ప ప్రచారం కూడా కదా. వెయ్యి సైకిళ్లు టోకున కొంటే నాలుగు లక్షలకు వస్తాయి. ఎంత పుణ్యం? ఎంత పేరు, ఎంత ప్రచారం. చిన్న చిన్న త్యాగాలు కూడా చెయ్యరు గాని చేసే వారిపై విమర్శలు సంధిస్తూ నిత్యం వార్తల్లో ఉండాలని తాపత్రయ పడుతుంటారు.
ఇంకా ఆయన హెరిటేజ్ షాపుల ద్వారా వలస జీవులకు ఒక గ్లాసెడు చల్లటి మజ్జిగ యిచ్చినా వారి మేలు మర్చిపోలేరు. దాని విలువ పావలాకి మించి ఉండదు. ఈ పాటి త్యాగానికి కూడా పూనుకోలేకపోతున్నారు. హైవే మీద ఆకలి తీరుస్తున్న అమీనా బేగం అపర అన్నపూర్ణ. ఆమె నిజంగా ఆ పుచ్చ రైతుకి పై నుంచి ఎన్ని దీవెనలు వస్తాయో. ఈ తల్లికి. ఎన్నిపుణ్యాలు వస్తాయో. ఎప్పుడో చిన్నప్పుడు సానెట్లుగా చదివిన ఒక బైబిలు కథ జ్ఞాపకం వస్తోంది. చాలా పాతకాలంలో చక్రవర్తి తన రాజ్యంలో ఓ కొండమీద అద్భుతమైన చర్చి నిర్మించాలని ప్రారంభించాడు. దాని ద్వారా తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలనుకున్నాడు. రాళ్లని, యితర నిర్మాణ సామాగ్రిని చేర్చడానికి గాడిదల్ని పనిలోకి దింపారు. పాపం గాడిదలకి రోజంతా కొండరాళ్లు మోయడమే పని. ఒక వృద్ధుడు వాటి శ్రమని గమనించాడు. రోజూ కొండ కింద కూర్చుని గాడిదలకు లేత పచ్చికలు మేపేవాడు. గాడిదలకు అదొక సేదతీర్చే మజిలీ అయింది. వెళ్తూ ఆ వృద్ధుణ్ణి నాలిలుతో స్పృశించి వెళ్లేవి. అందుకే వృద్ధుడు పులకించిపోయేవాడు. కొన్నాళ్లు గడిచింది. చర్చి భూమిపై ఒక అద్భుతంగా నిలిచింది. దాన్ని గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ మర్నాడు చర్చిని చక్రవర్తి ఆవిష్కరించి ప్రజలకి అంకితం చేస్తాడు. చక్రవర్తి మంది మార్బలంతో సహా వచ్చి, చర్చిని పరిశీలనగా చూసి, దానిపై ప్రముఖంగా తన చిరునామాలతో సహా తన పేరు పాలరాతిపై ఎలా చెక్కాలో శిల్పులకు ఆదేశించాడు. తెల్లవార్లూ చెప్పింది అక్షరం పొల్లు పోకుండా శిల్పులు చెక్కారు. వెన్నెల వెలుగులో చక్రవర్తి పేరు ప్రతిష్టలు నక్షత్రాల్లా మెరిసాయి. తెల్లవారింది చక్రవర్తి చర్చి ఆవిష్కరించడానికి పెద్ద ఊరేగింపుతో వచ్చారు. కొండ దగ్గరకు వచ్చేసరికి చర్చిమీద పేరు చూసి రాజు నివ్వెర పోయాడు. అంతలోనే పట్టరాని కోపంతో ఊగిపోయాడు. తనపేరు శిలాక్షరాలతో ఉండాల్సిన చోట మరోపేరు చెక్కబడి ఉంది. స్వయంగా పేరుచెక్కిన శిల్పులు చక్రవర్తి కాళ్లమీద పడ్డారు. ఎవడిదా పేరు అని రాజు హుంకరించాడు. గాడిదలకి ఓర్పు సహనాలతో ప్రతిఫలం ఆశించకుండా పచ్చికలు అందించిన వృద్ధుడిపేరుగా గుర్తించారు. చక్రవర్తి నిర్ఘాంతపోయాడు. అన్ని పైనించి గమనించే రాజాధిరాజు, మహాచక్రవర్తి ఒకడుంటాడు ప్రభువా వందనం నన్ను మన్నించమని చక్రవర్తి తలదించుకున్నాడు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment