పై కోర్టుకి అప్పీల్‌ చెయ్యండి! | Sri Ramana Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పై కోర్టుకి అప్పీల్‌ చెయ్యండి!

Published Sat, May 4 2019 1:43 AM | Last Updated on Sat, May 4 2019 1:43 AM

Sri Ramana Article On Chandrababu Naidu - Sakshi

ఓర్పుకి, సహనానికి పరీక్షలా సాగుతోంది. లేని వాళ్లకి బీపీ అంటు కుంటోంది. ఉన్నవాళ్లకి పుంజుకుంటోంది. ఓటర్ల అభిప్రాయాలు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమై ఉన్నాయ్‌. ఫలితాలు నిద్రావస్థలో ఉన్నాయ్‌. ఇంకో మూడు వారాలు ఓపిక పట్టాలి. అంతా సవ్యంగా నడిస్తే అప్పటికి ఒడ్డున పడతారు అందరూ.

అభ్యర్థులకి ఇదొక మంచి సమయం. ఎవరికి వారు గెలుపు ధీమాతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. రేప్పొద్దున ఫలితాలు ఉల్టాసీదా అయినా ఎవరూ ఏమీ ప్రశ్నించరు. ప్రజాస్వామ్యంలో ఈ ఓట్ల తతంగం చిత్రమైంది. 
నా చిన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు, ఊరి ఓటర్లందర్నీ పెద్ద దొడ్డికి తోలేవారు. అభ్యర్థి పేరు చెప్పి, ఇష్టమైన వారిని చేతులు ఎత్తమనేవారు. వచ్చిన అధికారి చేతుల్ని లెక్కించేవాడు. ఈ పద్ధతివల్ల కొన్నాళ్లపాటు ఊళ్లో కక్షలు, కార్పణ్యాలు నడిచేవి.

సీజన్‌ని బట్టి పంట కుప్పలు తగలబడేవి. జనానికి తిన్నన్ని వరిపేలాలు. పూరిళ్లు, గడ్డి వాములు పరశురామ ప్రీతికి గురి అవుతుండేవి. తర్వాతి కాలంలో పంచాయతీలకి కూడా సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతి వచ్చింది. అయినా, అదేం చిత్ర మోగానీ ఓడిపోయిన అభ్యర్థి తనకి ఎవరెవరు ద్రోహం చేశారో ఫలితాలు రాగానే ఎలుగెత్తి అరిచేవాడు. ఊరికే పేరుకే సీక్రెట్‌గానీ అంతా ఓపెనే!

చంద్రబాబు ఏపీలో పోలింగ్‌ కాగానే, ఏ మాత్రం విశ్రమించకుండా అదే గుక్కలో మోదీపై తిట్ల వర్షం కొనసాగిస్తూ వస్తున్నారు. ఈవీఎంలను నూరు శాతం శంకిస్తున్నారు. ఈసీని మోదీ తొత్తుల్ని చేసి, బ్లాక్‌ లిస్ట్‌లో పడేశారు. టెక్నాలజీ మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. ఈ కౌంటింగ్‌ విరామం చంద్రబాబుపై బాగా ప్రభావం చూపిస్తోంది. జగన్‌ లాంటి నేతల్ని ప్రజలు ఎన్నుకోరని చెబుతూనే బాబు పూర్తిగా డీలా పడుతున్నారు. ప్రజల మీద అంత నమ్మకం ఉంటే, జగన్‌ మీ స్థాయి నీతి మంతుడు కాడని విశ్వాసం ఉంటే నిశ్చింతగా నిద్రపోండి. ఈ కలవరపాట్లు, కలవరింతలు దేనికి చంద్రబాబూ? 

ఇక్కడొక పిట్ట కథ చెప్పాలి. కోర్టులో ఖరీదైన వ్యాజ్యం నడుస్తోంది. నడిచి నడిచి చివరకు తీర్పు వచ్చింది. తన క్లయింటు దారుణంగా ఓడి పోయాడు. ఆ లాయర్‌కి ఈ సమాచారం ఎట్లా చెప్పాలో తెలియక, ‘అయ్యా, న్యాయం గెలిచింది’ అంటూ క్లుప్తసరిగా టెలిగ్రామ్‌ కొట్టాడు. ‘పై కోర్టుకి అప్పీల్‌ చెయ్యండి’ అంటూ ఆ క్లయింట్‌ జవాబు కొట్టాడు. 

నిజానికి ఈ తీరికలో చంద్రబాబు కేంద్ర రాజకీయాలమీద దృష్టి సారించవచ్చు. తిప్పబోయే చక్రానికి పదును పెట్టుకోవచ్చు. రాష్ట్రంలో పునాదుల్లోనే ఉండిపోయి మట్టి తింటున్న అనేక నిర్మాణాలని పరామర్శించవచ్చు. ఒకసారి సింగపూర్‌ వెళ్లి అందర్నీ పలకరించి రావచ్చు.

పోలింగ్‌ తర్వాత సాయంత్రంవేళ వచ్చి ముమ్మరంగా ఓట్లు వేసిన మహిళల మీద చంద్ర బాబు నమ్మకం పెట్టుకున్నారని వినికిడి. అంటే అప్పటిదాకా ఓటింగ్‌లో పాల్గొన్న వారిమీద నమ్మకం లేదనేగా? పసుపు కుంకుమ పేరుతో ఆడపడుచులకు ప్రభుత్వ ఖజానాలోంచి పంచిన డబ్బు వారిని ఓటింగ్‌ బూత్‌లకు పరుగులు తీయించిందని బాబు నమ్మకం.

ఇలాంటి ఊహాగానాలను బాబు డెబ్భై రెండు మేళ కర్త రాగాలలో ఆలాపిస్తూ ఆనందిస్తున్నారట. అన్ని రాగాలూ వారికి వచ్చా అని చెప్పిన సన్నిహితుణ్ణి అడిగాను. వారికి ఈ విశాల విశ్వంలో రానిదేముంది? వారు పాడింది పాట, ఆలాపిం చింది రాగం అన్నాడు.

ఇంతకీ ఆలస్యంగా పడిన మహిళల ఓట్లు ఖజానా సొమ్ముతో పడినవి కావని అనుభవజ్ఞులు అంటున్నారు. ఎప్పుడూ ఇంతే, చాలామంది నేతలు, ప్రజలు తమను అనుసరిస్తున్నారో, వెంబ డిస్తున్నారో విడమరిచి అర్థం చేసుకోలేరు. పండో పచ్చో ఫలితం నవ్వుతూ పెట్టెల్లో కులుకుతోంది. ధర్మం నెగ్గుతుంది.


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement