పనికిరాని డేటా!? | Sriramana Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పనికిరాని డేటా!?

Published Sat, May 11 2019 12:37 AM | Last Updated on Sat, May 11 2019 12:37 AM

Sriramana Article On Chandrababu Naidu - Sakshi

పూర్వం శ్రీకాళహస్తి దేవాలయం కట్టేటప్పుడు బోలెడుమంది శ్రామికులు, శిల్పులు ఏళ్ల తరబడి పనిచేశారు. ఆ గుడి ముందు నుంచే స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. పొద్దు కుంకగానే పనివారంతా వెళ్లి స్వర్ణముఖి రేవులో కాళ్లు చేతులు కడుక్కునేవారు. తర్వాత గోపుర ముఖంగా తిరిగి, దోసిలితో నిండా నదిలోనే ఇసుక తీసుకుని, ‘చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ!’ అని మనసా మొక్కేవారు. వారి శ్రమనిబట్టి, పనితనాన్నిబట్టి, చాకిరిలో నిజాయితీనిబట్టి దోసిలి ఇసుకలో బంగారు రేణువులు తేలేవట! సాక్షాత్తూ మహాదేవుడే కూలి నిర్ణయించేవాడు. అదీ ఒకనాటి స్వర్ణముఖి వైభవం. ఇప్పుడూ ఉంది, పాపం దాన్ని చూస్తున్నాం. సర్వావయాలకు సీళ్లు వేసుకుని ఆ దారిన పోవాల్సిందే. దీన్నిబట్టి మనుషుల్లో నీతి, నిజాయితీ, ధర్మంలాంటి దినుసులు ఎంతగా అడుగంటాయో అర్థమవుతుంది. నదులు, కొండలు, అడవులు ఇతర ప్రకృతి స్వరూపాలు ఆధునిక మానవుడి స్వార్థ చింతనని, ప్రవర్తనని ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు రౌద్రంగా హెచ్చరికలు చేస్తూ ఉంటాయి. కానీ మనిషి అర్థం చేసుకోడు. చేసుకున్నా పట్టించుకోడు.

ఈ విశాల విశ్వం నుంచి మనిషి తవ్వుకుని డబ్బు చేసుకోవలసినవి చాలా ఉన్నాయ్‌. వాటి కోసం మనిషి ఆశగా వెతుకులాడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు పైన ఈథర్‌ అనే ఓ శక్తి ఉందనీ, అది శబ్ద తరంగాలను చెప్పిన చోటికి చేరవేస్తాయని కనిపెట్టాడు. అదే రేడియో పెట్టెగా రూపు కట్టింది. ఆకాశవాణిగా బోలెడు సేవలు అందిస్తోంది. తర్వాత అదే నట్టింట్లో బొమ్మలు చూపిస్తోంది. ఆ రోజుల్లో రేడియోలకి లైసెన్స్‌లు ఉండేవి. సంవత్సరానికి పాతికో పరకో. కానీ చాలామంది చెల్లించేవారు కాదు. లైసెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు అప్పుడప్పుడు ఊళ్లమీద పడి అల్లరి చేసేవారు. ఇదంతా ఈథర్‌ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. తర్వాత వన్‌జీ, టూజీలు వరుసకట్టాయి. భూగోళం ఒకే గ్రామంగా మారింది. హలో అంటే హలో అంటూ వేర్వేరు ధృవాల్లో కూచుని మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఈ ‘జీ’లకి ఇంధనం అక్కర్లేదు. ఇండస్ట్రీలు అక్కర్లేదు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విస్తరించి ఎక్కడికో చేరింది. దాంతోపాటే జీలు పెరిగినకొద్దీ స్కాములు చేవ తేలాయి. పెద్దలకి అవకాశాలు పెచ్చు పెరిగాయి.

ఆనాడు మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం చేశాడు. కనీసం ఉప్పుకి ఒక రుచి, బరువు, ఒక లక్షణం అన్నా ఉన్నాయ్‌. ఈ అంతర్జాలం ఒక గొప్ప మాయాజాలం. కనిపించని ఓ దివ్యశక్తి భూగోళపు నైజాన్ని మార్చివేసింది. అయితే ఇది ఈథర్‌ లాగా కాదు. కోట్లు, బిలియన్లు ప్రభుత్వాలకు కురిపిస్తోంది. వీటిని ఒడిసి పట్టడానికి కావల్సినన్ని ఉప గ్రహాలు పైకక్ష్యలో నిరంతరం పరిభ్రమిస్తుంటాయ్‌. వీటితో ఒక కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఈ కోట్లు, బిలియన్లు గాలిలోంచి మానవాళికి అందు తున్న భిక్ష. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండి ఉంటాయ్‌. సముద్రాన్ని అతి చౌకగా మంచినీళ్లగా మారిస్తే– అది గొప్ప లాభసాటి వ్యాపారం అవుతుంది. ఇసు కని బంగారం చేసే వైనం తెలుసుకుంటే స్వర్ణముఖి బాగుపడుతుంది.  

అసలే మన రాష్ట్రం టెక్నాలజీ మీద అధికారం ఉన్న వాళ్లం. సముద్రం మీద ఇంకా విశాలంగా పరిశోధనలు జరగాలి. ఇప్పటికే పెట్రోలు, గ్యాసు సముద్ర గర్భం నుంచి తీస్తున్నాం. బంగారం, వెండి కూడా వెలికి తీయాలి. మన దేశం రత్నగర్భ. వాటిని కూడా తోడి పొయ్యాలి. అప్పుడు గానీ మన కరువు తీరదు. ప్రస్తుతం డబ్బుకంటే విలువైంది ‘డేటా’. ఏమిటీ డేటా అంటే సర్వం డేటాయే! ఇదొక చిత్తభ్రమ! ఎదుటివాడి గురించి సమస్త విషయాలు తెలుసుకుని మన గుప్పెట్లో ఉంచుకోవడం డేటా! ఎదుటివాడి కొలతలు, బరువులు, అభిరుచులు, ఆదాయ వ్యయాలు, డీఎన్‌ఏ, గోంగూర లాంటి పరమ చెత్తంతా కలిస్తే డేటా అవుతుంది. ఈ డేటాల కోసం కలవరించే చాలామందికి వారి గోడకింద వ్యవహారాలే వారికి తెలియవు. అందాక దేనికి, సొంత భార్య, కన్న కొడుకు, కోరి చేసుకున్న కోడలు ఎవరికి ఓటేద్దామనుకుంటున్నారో కరెక్ట్‌గా ఇంటి పెద్ద చెప్పలేడు. అయ్యాక కూడా ఓట్లు ఎవరికేశారో అంతుపట్టదు. అంతా జన జీవన స్రవంతిలో కలిసిపోతారు. దీనికి లిట్మస్‌ పరీక్ష కనిపెట్టాలి. ఇదే మన తక్షణ కర్తవ్యం.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement