గంజాయిపూత పండితే..! | Sri Ramana Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

గంజాయిపూత పండితే..!

Published Sat, Jun 15 2019 12:51 AM | Last Updated on Sat, Jun 15 2019 12:51 AM

Sri Ramana Article On Chandrababu Naidu - Sakshi

ఆనాడు కురుక్షేత్ర మహా సంగ్రామంలో కౌరవులదే ఘోర పరాజయమని సుయోధనుడికి మినహా అందరికీ తెలుసని చెబుతారు. సజ్జనులు, యోగులు, జ్ఞానులు ఈ భూమ్మీద ధర్మపక్షంఏదైతే, అదే విజయపతాకం ఎగురవేస్తుందని గట్టిగా విశ్వసించారు. సొంత మీడియాలు, అస్మదీయుల సర్వేలు కోళ్లై కూసినా ధర్మపక్షం, నిశ్శబ్ద విప్లవాన్ని అధర్మ పక్షానికి రుచి చూపించింది. మన చేతలు జనంలోకి వెళ్లి ఏ మాత్రం నష్టం చేయలేదని, మన నాయకుడి కబుర్లు పిచ్చి జనం చెవుల్లో అమృతం పోసినట్టు ఆనందపరిచి తెగ నమ్మించిందనీ తెగ నమ్మారు తెలుగుదేశం తమ్ముళ్లు. అదే చివరకు కొంప ముంచింది. ‘పచ్చజెండా మొన్నటి దెబ్బతో ఎక్కడో గుంటలోకి వెళ్లింది. అది పైకొచ్చి తలెత్తి చూసే ఎత్తుకి చేరడానికి ఎన్ని ఎన్నికల వ్యవధి పడుతుందో ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఎన్టీఆర్‌ తర్వాత టీడీపీకి నమ్మినబంట్లు లేనే లేరు. ఉన్నదల్లా అధికార దాహార్తులు మాత్రమే. చూరునీళ్లకి ఆశపడే వారితో గుండెలమీద చేయి వేసుకుని గుడ్‌ గవర్నెస్‌ని అందించడం అసాధ్యం. చంద్రబాబు గదినిండా కంప్యూటర్‌ పెట్టెలుంటే సుపరిపాలన ఆటోమాటిక్‌గా అందుతుందని అనుకున్నారో,లేదా అందర్నీ బ్రహ్మాండమని నమ్మించవ చ్చని పథక రచన చేశారో తెలియదు’ అంటూ వయసుపండిన అనుభవజ్ఞుడు విడమరచి చెప్పిన మాటలు.

ఎన్నికలు కోసెడు దూరంలో ఉన్నాయనగానే బాబు రకరకాల తంత్రాలు ఆరంభించారు. ‘చూడండి... చూడండి... ప్రజల్లో నా పరిపాలన పట్ల 75 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు.ఇంకా కృషి చేస్తా. కనీసం ఇంకో 15 శాతం మందిని సంతృప్తిలో మునకలు వేయిస్తా. ఇదే నా తక్షణ కర్తవ్యం’ అంటూ నినదించేవారు. అసలా కొలతలేమిటో, సంతృప్తి అనగా ఏ సందర్భంలో, ఏ విషయంలో... ఇవి ఎవ రికీ తెలియదు. జనాన్ని అయోమయంలో పడేద్దా మని బాబే అయోమయంలో పడ్డారు. చివరి దశలో మోదీని తిట్టడం, జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ని కలగలిపి విమర్శించడం మాత్రమే మిగిలింది. ఒకప్పుడు చంద్రబాబు పెద్ద కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అని అభి వర్ణిస్తూ సోనియాని, వైఎస్సార్‌ని కలగలిపి విమర్శిం చారు. అదేమీ లాభించలేదు. ఆ నినాదాన్ని తర్వాత వదిలేశారు. మొన్న పూర్తిగా దిగజారి సోనియా హస్తంతో చేయికలిపి మరో అరిష్టం కొని తెచ్చుకున్నారు. నాయకుడైన వాడికి ‘స్వస్వరూప జ్ఞానం’ ఉండాలి. లేదా ఎవరైనా చెబితే విని ఆచరించాలి. చంద్రబాబు ఎన్నిసార్లు హౌస్‌లో కూర్చున్నారన్నది కాదు పాయింటు. ఎప్పుడైనా ఒక్కసారైనా పూర్తి స్వశక్తితో గెలిచినట్టు దాఖలాలున్నాయా? వాజ్‌పేయితో, ఇంకా వారితో వీరితో కలిసి గట్టెక్కిన సందర్భాలు మాత్రమే చంద్రబాబుకి ఉన్నాయ్‌గానీ స్వయంప్రకాశం లేదు. 

ఓడిపోయిన పాలకపక్షం, మేము చేసిన గొప్ప పనులను ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్లలేకపోయాం – అని వాపోతుంటారు. ఇలా వారిని వారు ఓదార్చుకుంటారు. పంటకాల్వలోకి సకాలంలో నీళ్లొస్తే దానికి మళ్లీ ప్రచారం దేనికి? తీగెల్లో నాణ్యమైన కరెంటు సదా ప్రవహిస్తుంటే తిరిగి ఆ విషయాన్ని బాజా భజంత్రీలు వాయించి ప్రచారం చేయాల్సిన అగత్యం ఏముంది? అలాగే రోడ్లు, వంతెనలు, ఆసుపత్రులు, పాఠశాల భవనాలు ఇలాంటి ప్రజాహిత పనులు ఏవి చేసినా వాటి గురించి కంఠశోషతో ప్రజల ముందుకు వెళ్లక్కర్లేదు. ఆ సదుపాయాలు, ఆ సంస్థలే మౌనంగా ప్రచారం చేసుకుంటాయి. ఎక్కడో ఒక పొదలో సంపెంగ పువ్వు వికసిస్తుంది. పచ్చని ఆకు ల్లో కలిసిపోయి నిరాడంబరంగా తళుకుబెళుకులు లేని ఆ సంపెంగ ఎంతోమేర సువాసనలు వెదజల్లుతుంది. కనిపించకుండా తన ఉనికిని చాటుతుంది. ప్రజాహిత చర్యలు జరిగినప్పుడు కూడా ఇలాగే పరిమళిస్తాయ్‌. గంజాయి పుట్టినప్పుడు అచ్చం బంతి మొక్కలా ఉంటుంది. పెరిగి పెద్దయి పూతకి వస్తుంది. అయినా గంజాయి లోగుట్టు ఎవరికీ తెలియదు. పూత కొద్దిరోజులకి పక్వానికొస్తుంది. దాన్నే ‘కళ్లెకి రావడం’ అంటారు. ఇహ చూడండి కొన్ని మైళ్ల దూరం ఆ వాసన వ్యాపిస్తుంది. తెలిసిన వారికి ఆ పరిమళంలో ఓ ఆకర్షణ, ఓ పిలుపు ధ్వనిస్తుంది. అదొక చిత్రమైన మత్తు వాసన! అదే సొంత సామాజిక వర్గంమీద చెప్పరాని, అలవిమాలిన అభిమానాలున్నప్పుడు గంజాయి కళ్లె అయిస్కాంతం లాంటిదే! దీన్ని కప్పిపుచ్చడం చాలా కష్టం. ఇది చాలా ప్రమాదం!        


శ్రీరమణ

(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement