‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి...’ అంటూ అమృత వాక్కులతో పల్ల వించారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఈ స్నేహో త్సవ వేళ ఈ సుకవిని, స్నేహానికి ప్రతీకగా నిలచిన బాపూరమణలని తలచు కోవాలి. ఇష్టాలు వేరు, పరిచయాలు వేరు, దగ్గరి తనాలు వేరు, స్నేహాలు వేరు. కృష్ణుడు, కుచేలుడు ఒక గురువు వద్ద శిష్యులు. ఇద్దరూ సన్నిహితులు. ఆ చనువుకొద్దీ మిత్రునివద్దకెళ్లి అర్థిస్తాడు. ఆ ఇష్టంకొద్దీ మిత్రుడు సంపదలిచ్చాడు. ఇదొక సందర్భం. కర్ణ దుర్యోధన సాన్నిహిత్యం మరో విధం. రాజరాజు తనపట్ల చూపిన ఔదార్యానికి కర్ణుడు జీవితమంతా శిరసువంచాడు. ఇష్టుడై సుయోధనుణ్ణి సరిదిద్ది కాపా డలేకపోయాడు కర్ణుడు. బంధుత్వాలు, వాటి ధర్మాల గురించి మన ప్రాచీన రుషులు అనేకచోట్ల ప్రస్తావిం చారు గానీ స్నేహధర్మాల ప్రస్తావనలు వినిపించవ్. యువరాణులకు చెలికత్తెలుంటారు. వాళ్లు చాలా హద్దుల్లో నడుచుకుంటూ యువరాణి కనుసన్నల్లో మెలగాలి. శిష్యుల్ని చతురోపాయాలతో శిష్యుల్ని సన్మార్గాన నడిపించిన గురువులున్నారు. రాజుకు అండదండగా నిలిచిన మహామంత్రులున్నారు. ఇవి స్నేహాలనిపించుకోవు. స్నేహమంటే... ఇక దానికి హద్దులుండవ్. ఈ సృష్టిలో అలాంటి దినుసు అదొక్కటే ఉంది.
తెలుగునాట అందమైన ద్వంద్వ సమాసంగా సత్కీర్తి పొందారు బాపూరమణ. ‘రెండు కళ్లు – ఒక చూపు’ అన్నారు ఆచార్య సినారె. తెలుగు సరస్వతికి వాళ్లిద్దరు వాగర్థాలన్నారు. మేం బొమ్మా బొరుసులం అనుకున్నారు వాళ్లిద్దరూ. అరవై ఏళ్ల పైబడి ఈ బొమ్మ బొరుసులు నానా సందడి చేశారు. ఒకరు కథలు రాస్తే, ఇంకొకరు బొమ్మలు వేశారు. ఒకరు జోకులు, ఇంకోరు కొంటె బొమ్మలు.. ఒకరు దేవుడి బొమ్మలు గీస్తే మరొకరు దేవుడి కథలు– ఇలా వంతులేసుకుని మరీ తెలుగు నేలన కావల్సినన్ని పంటలు పండించారు. రకరకాల వంటలు వండి వడ్డించారు. వంటా వార్పూ అయ్యాక, బాపు రమణ లేత పచ్చని అరిటాకులై తెలుగువారి ముందు ఒదిగి పోయారు. ఎప్పుడో అరవై ఏళ్లుగా ఆ ప్రాణ మిత్రుల స్నేహం గురించి వారి కథలతోబాటు కథలు కథ లుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. వారిద్దరూ బాల్యమిత్రులు. ఇద్దరూ ప్రతిభా సంపన్నులే. ఎవరి వృత్తి విద్యలు వారివే. అయినా అవేవీ స్నేహానికి అడ్డు రాలేదు. ఇద్దరూ ఒక శుభోదయాన సినీ నిర్మా తలుగా మారారు. ఆనక అద్భు తాలు సృష్టించారు.
విడిగా ఎవరి అభిరుచులు వారికుండేవి. కర్ణా టక సంగీతం రమణకిష్టం. బడే గులాం, మెహదీ హాసన్ గజళ్లంటే బాపుకి ప్రాణం. ఇవిగాక కలివిడిగా బోలెడిష్టాలుండేవి. అందులో ఆరుద్ర, కేవీ మహ దేవన్ ముఖ్యమైన కొన్ని. బాపూరమణ చాలా సార్లు విభేదించేవారు. చాలాసార్లు ఒకే రాగానికి కట్టుబడి తలలూపేవారు.
ఏ గోదావరి లంకలోనో, ఏ కత్తవపాడులోనో కారప్పచ్చడితో అట్టు తినేటప్పుడు, పక్కన ఆ ఇద్దర్లో ఎవరు లేకపోయినా ఆ తిండికి రుచి లేనట్టే. వారిద్దరే కాదు ఆ రెండు కుటుంబాలూ వేళ్లనించి చిటారు కొమ్మలదాకా కలిసిమెలిసి పోయాయి. ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ల సంగతి తెలిసిన చాలామందికి, వారి ద్దరి మధ్యా ఆర్థిక సంబంధాలు ఎట్లా ఉంటా యోననే ప్రశ్న వేధిస్తూ ఉండేది. ఔను, అది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్నే! ఒకసారి ఉన్నట్టుండి రమణ ఇల్లు పోయింది. బాపుకి తెలిసింది. ‘ఓస్! అంతే కదా, మా మేడమీద మేడ వేసుకో. దేవుడు మనిద్దర్నీ ఒకింట్లో పడుండమన్నాడు వెంకట్రావ్’ అని భరోసా ఇచ్చారు బాపు. ఆ భరోసా విలువ కొన్ని కోట్లు. బాల్య మిత్రులు స్నేహితులుగానే నడిచి నడిచి కుదు రుకట్టారు.
పిల్లలు పెరిగి పెద్దవాళ్లై, ప్రయోజకులై పెళ్లీడు కొచ్చారు. అప్పుడు మిత్రులిద్దరూ, పోనీ ఇచ్చి పుచ్చు కుంటే.. అని కొంచెం ఆశ, ఇంకొంచం సరదా పడ్డారు. ఆ పిల్లలు ఇంకోలా ఆశపడి, మరోలా సరదా పడ్డారు. ‘అయితే అలాగే కానిద్దాం’ అంటూ కళాత్మకంగా, కలర్‌ఫుల్‌గా శుభలేఖలు డిజైన్ చేశారు బాపూరమణలు. ఆ దేవుడు మనల్ని ఈ విధంగా స్నేహితులుగానే ఉండి పొమ్మన్నాడయ్యా. ఆ విధంగా బంధుత్వాలు కలుపుకోవద్దన్నాడయ్యా’ అని మురిసిపోయారు బాపూరమణలు.
అదొక విలక్షణమైన జంట, తాడూ బొంగ రంలా, గాలిపటం దారంలా, విల్లూ్ల అమ్ములా, స్నేహానికి నిర్వచనంలా.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment