శ్రీవారిని అంటు కట్టకండి!
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలదాచుకోవడానికి ‘గోవర్ధనగిరు’లను అక్కడక్కడ నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. స్వామి పేరిట భవనం లేని పాఠశాలలను ఉద్ధరించవచ్చు. ఇంకా ఈ ధార్మిక కేంద్రాల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచవచ్చు.
శక్తిమంతమైన ఆధారం దొరికితే చాలు, కొందరు పాలకులు దానిచుట్టూ వార్తలు పుట్టిస్తారు. అటు వంటి ఆధారాలలో తిరుపతి ముఖ్యమైంది. కలి యుగనాథుడిగా ఏడుకొండల మీద ఆయన వైభ వం సాగించుకుంటున్నాడు. వజ్రకిరీటాలూ, స్వర్ణ రథాలూ ఆయన స్వార్జితాలు. తరగని, చెరగని ప్రజల నమ్మకం, ఆయన పట్ల విశ్వాసం స్వామి వారి స్వార్జితాలే. వాటి లో ఏ ప్రభుత్వాలకూ, ఏ నాయకులకూ ప్రమే యం లేదు. కానీ చాతుర్యం గల నేత అనుకూలాల న్నిటినీ తన కాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉం టాడు. వాన కురిస్తే, వెన్నెల కాస్తే, నది ప్రవహిస్తే - అన్నీ నావల్లేనని జంకూగొంకూ లేకుండా చెప్ప గల పనితనం వారిలో ఉంటుంది.
ఇప్పుడు మనకు అంతో ఇంతో క్రెడిబిలిటీ ఉన్న మహాపురుషుడిగా ఒక్క వెంకటేశ్వరస్వామి మాత్రమే కనిపిస్తున్నాడు. అందుకని ఆయనని రాజమండ్రిలో, విజయవాడలో కూడా ప్రతిష్టించి, ఆలయాలు కడతామని ప్రభుత్వం ప్రకటించింది. శుభప్రదమైన ఆలోచన. కానీ స్థలాభోగం, శిలా భోగం అన్నారు. అన్ని స్థలాలకు ఆ శక్తి ఉండదు. అన్ని రాళ్లకు ఆ ఆకర్షణ ఉండదు. పూలతీగెకు అం టుతొక్కినట్టు దేవుళ్లని అంటు తొక్కడం మర్యాద కాదేమో! తిరుమల పరిసరాలలోనే ముమ్మూర్తు లా మూలవిరాట్ లాగే ఉండే, ఇంకో మూరెడు ఎత్తున్న మూర్తులు ఉన్నాయి. వాటికి ఎంత ప్రాచు ర్యం రావాలో అంతేగాని మూలవిరాట్‌తో సాటిరారు కదా!
ధార్మిక స్పృహ కలిగించే ఇలాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు గొప్ప వే. భక్తి ప్రచారం మంచిదే. వెంకటేశ్వరస్వామి ఆలయాలను కాదు ప్రారం భించాల్సింది, ఆయన పేరిట ధార్మిక కేంద్రాలు. సామాన్యులకు అందుబా టులో ఉండేలాగా కల్యాణ మండపాలు నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుంది. సంకీర్తనలూ, సత్సంగాలూ సాగించడానికి అనువుగా ఒక స్థావరం ఉంటే ఉభయ తారకంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తలదా చుకోవడానికి ‘గోవర్ధనగిరు’లను అక్కడక్కడ నిర్మి స్తే ఉపయుక్తంగా ఉంటుంది. స్వామి పేరిట భవ నం లేని పాఠశాలలను ఉద్ధరించవచ్చు. ఇంకా ఈ ధార్మిక కేంద్రాల ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ లను అందుబాటులో ఉంచవచ్చు. ఇప్పటికీ గ్రామీ ణ ప్రాంతాలలో తల్లులకు ప్రసూతి సౌకర్యాలు సరిగ్గాలేవు. సరైన వైద్యం లేక తల్లులు, పురిటికం దులు మరణిస్తూనే ఉన్నారు. అలాంటి చోట శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులను ప్రసరింపచేయడం అవసరం. ఆపదలో ఉన్నవారు బతికి బట్టకడ తారు. అక్కడ, అంటే కుగ్రామాలలో ఇది నేడు అత్యవసరం. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రా లు పేరుకు మాత్రమే ఉన్నాయి. డాక్టర్ల నుంచి కిందకు- అందరూ టౌన్‌లో ఉండడానికే ఇష్టపడు తున్నారన్నది నిజం. ఈ కేంద్రాలను స్వామికి దత్తత ఇస్తే అప్పుడు కొందరైనా సేవాధర్మంతో పనిచేయడానికి ముందుకు వస్తారు. భక్తి మూలా ల మీద విద్య, వైద్య సేవలను జనసామాన్యానికి అందిస్తే అదే నిజమైన గోవిందం. ప్రతి కేంద్రం లోనూ స్వామిని ప్రతిష్టించండి. కానీ దేవాలయంగా కాక, సేవాలయంగా పనిచేసేట్టు చూడండి. శ్రీవారిని అంటు కట్టకండి.
(శ్రీరమణ, వ్యాసకర్త ప్రముఖ కథకుడు)