పౌరాణిక రంగస్థలంపై 80 వసంతాల ఉప్పాల రత్తయ్య మేష్టారు! మేష్టారే కాదు, ఆ రోజుల్లో ఉప్పాల వేంకట రత్తయ్యగారు ‘స్టారు’ కూడా! మా చుట్టు పక్కల ఎక్కడ పౌరాణిక నాటకం ఆడుతున్నా, మైకుల్లో చెబుతూ కర పత్రాలు పంచేవారు. అవి పోగు చేయడం చిన్నతనపు సరదాలలో ముఖ్యమైంది. ఆ కరపత్రాలలో మా మేష్టారి ఫొటో దాని పక్కన ఆయన హావభావాల గురించి నటనాను భవం గురించి రెండు వాక్యాల్లో అచ్చువేసేవారు. చివర్లో షరా మామూలే. స్త్రీలకు ప్రత్యేక స్థలము గలదు అని ఉండేది. ఆ కరపత్రాలు చదువు కోవడా నికి భలే తమాషాగా ఉండేవి. బెజవాడ రేడియో ద్వారా కూడా ఆయన సుప్రసిద్ధులు.
మా తెనాలి ప్రాంతం నేల, నీరు, గాలి తెలుగు పౌరాణిక నాటక పద్యాలను కలవరిస్తుండేవి. మరీ ముఖ్యంగా పాండవో ద్యోగ విజయాలు మొదలు బ్రహ్మంగారి నాటకం ద్వారా టికెట్ డ్రామాలు ఫ్రీ డ్రామాలు సదా నడుస్తూనే ఉండేవి. ప్యారిస్ ఆఫ్ ఆంధ్రాగా పేరుపొందిన తెనాలి టౌను పౌరాణిక డ్రామా వ్యాప కానికి ‘మక్కా’గా ఉండేది. కిరీటాలు, పూసల కోట్లు ధరించి లైటింగుల మధ్య నిలబడాలంటే తెనాలి చేరాల్సిందేనని వాడుక ఉండేది. ఎక్కడో ‘రాముడు వలస’ నించి వలసవచ్చి పిశుపాటి నరసింహమూర్తి కృష్ణ వేషధారిగా ఎనలేని ఖ్యాతి గడించారు. వేమూరు గగ్గయ్య, రామయ్యగార్లు నాటక రంగాన్ని, తెలుగు సినిమా రంగాన్ని సుసంపన్నం చేశారు. ఆ రోజుల్లో తెనాలిలో కొన్ని వీధుల్లో నడుస్తుంటే ఖంగున డబుల్ రీడ్ హార్మోణీ పెట్టెలు వినిపించేవి. ఎందరో మహా నుభావుల సరసన దశాబ్దాల తర బడి కమ్మని గాత్రంతో శ్రోతల్ని అలరించిన అదృష్టవంతులు ఉప్పాల రత్తయ్య మేష్టారు. శనగవరపు, ఓగిరాల, ఆరేళ్ల రామయ్య లాంటి తర్ఫీద్ ఒజ్జలుండేవారు. పంచ నాథం లాంటి ఆల్‌రౌండర్లు తెనాలిలోనే దొరికేవారు. డ్రెస్ కంపెనీలు, తెనాలి ప్రెస్సుల్లో ప్రసిద్ధ రంగస్థల నటుల ఫొటో బ్లాకులు రెడీగా దొరికేవి.
రావికంపాడు మొసలి పాడు గ్రామాలు కవల పిల్లల్లా జంట నగరాల్లో కలిసి ఉంటాయి. గుమ్మడి గారు పుట్టి పెరిగిన ఊరు. రత్తయ్య మేష్టారంటే గుమ్మడి గారికి ఎనలేని గౌరవం. మద్రాసులో వారిని ఎప్పుడు కలిసినా మొట్ట మొదటగా మేష్టారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. రత్తయ్య గారిది ఫెళఫెళలాడే గాత్రం, స్పష్టమైన వాచకం, భావం తెలిసి పద్యం పలికించే విధానం ఉప్పాల రత్తయ్యగారి స్వార్జితం. వేదిక మీద సహనటుల శృతుల్ని మతుల్ని వారి స్థాయిలను కలుపుకుంటూ, కాడిని లాగుతూ నటరాజు రథాన్ని ముందుకు నడిపించడం మేష్టారికి పుట్టుకతో వచ్చిన విద్య. ఆయన చాలామంచి సంస్కారి. ఎన్నో దశాబ్దాల స్టేజి అను భవం, పెద్దల సాంగత్యంతో నిగ్గుతేలిన సమయస్ఫూర్తి మేష్టారి నట జీవితానికి వన్నె కూర్చాయి. ఒకనాటి సురభి నాటకాల పంథాలో క్రమశిక్షణ ఆయన అలవరచుకున్నారు. సురభిలో ఎవరు ఏ వేషాన్నైనా ధరించి లీలగా, అవలీలగా పోషించి నాటకాన్ని రక్తి కట్టించేవారు. మా మేష్టారు పలు సందర్భాలలో పలు పాత్రలు పోషించడం నేను చూశాను. ఒక్కొక్క పాత్ర హావభావ ఉచ్ఛారణలు ఒక్కోలా ఉంటాయి. నడకలు, నవ్వులు ఎవరివి వారివే. వాటిని గుర్తెరిగి ప్రేక్షక శ్రోతల్ని రంజింప జేయాలి. అలాంటి స్వస్వరూప జ్ఞానం పుష్కలంగా కలిగిన విద్వన్మణి రత్తయ్యగారు. పైగా మేష్టారు నాడు కలిసి నడిచిన నటీనటులు అగ్రగణ్యులు, అసామాన్యులు! అన్నీ నక్షత్రాలే! అదొక పాలపుంత వారంతా ఆదరాభిమానాలతో గౌరవంగా రత్తయ్యగారిని అక్కున చేర్చుకున్నారు. అందరూ మన ట్రూప్ వాడే అని మనసా భావించే వారు. పౌరాణిక నాటక రంగంపట్ల మేష్టారికి గల అవ్యాజమైన ప్రేమాభిమానాలను వారి సమకాలి కులంతా గ్రహించి, గుండెలకు హత్తుకున్నారు.
నాడు నాటకరంగం గొప్ప ఆదాయ వనరైతే కాదు. కీర్తి ప్రతిష్టలా అంటే అదీ కాదు. తిన్న చోట తినకుండా తిరిగిన చోట తిరగక సరైన వసతులు లేక సకాలంగా గ్రీన్‌రూమ్‌కి చేరు కుంటూ జీవితం గడపాలి. చెప్పిన పదీ పాతిక ఇస్తారో లేదో తెలి యదు. ఉంగరాలు తాకట్టుపెట్టుకుని గూటికి చేరిన సందర్భాలు ప్రతివారికీ ఉండేవి. అయినా అదొక పిచ్చి. మేష్టారు మంచి క్రమశిక్షణతో, అలవాట్లతో ఈ ప్రపంచంలో ఉంటూ ఉత్సాహ ఆరోగ్యాల్ని కాపాడుకున్నారు. నిత్య విద్యార్థిగా కావాల్సినంత ప్రతిభని, అనుభవాన్ని గడించుకున్నారు. మా గ్రామంలో (వరహాపురం) ఉప్పాల రత్తయ్య మేష్టారు కొంతకాలం పని చేశారు. మా వూళ్లో పౌరాణిక నాటక పునర్ జాగృతికి ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఆయన మేలు ఎన్నటికీ మావూరు మర్చిపోదు. వ్యక్తిగతంగా ఎక్కడ ఆనందపడ్డారో అదే ఆనందం తనకు తెలిసిన ప్రతిభా వంతులకు పంచివ్వాలని సరదా పడేవారు. చేతనైన మేర చేసేవారు. సంస్కారశీలి.
‘చీకట్లను తిట్టుకుంటూ కూర్చోవద్దు. చిరు దీపాన్నైనా వెలిగించు’ అని చెప్పిన ప్రవక్త మాటల్ని తన జీవితంలో అక్ష రాలా అమలుపరిచిన ధన్యజీవి రత్తయ్య మేష్టారు. ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఎవరికైనా అరుదు. పద్య నాటకానికి కళాకాంతి జనం వన్స్‌మోర్‌లు. మా మేష్టారి వేయిపున్నముల ఈ బంగారు చరిత్రకి మా తెనాలి నేల చప్పట్లతో ‘వన్స్‌మోర్’ కొడుతోంది. నిత్యగారాల పంటగా శృతి సుఖంగా వర్ధిల్లండి! వారిని మేమూరు శ్రీలక్ష్మీ గణపతి స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలిచ్చి కాపాడుగాక!
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
రంగస్థలంపై 80 వసంతాలు
Published Sat, Aug 29 2020 2:00 AM | Last Updated on Sat, Aug 29 2020 2:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment