పాదయాత్రకి మూడేళ్లు | Sriramana Guest Column On Three Years Of YS Jagan Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

పాదయాత్రకి మూడేళ్లు

Published Sat, Nov 7 2020 12:54 AM | Last Updated on Sat, Nov 7 2020 12:54 AM

Sriramana Guest Column On Three Years Of YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

జగన్‌ పాదయాత్రకి, మహాజైత్ర యాత్రకి మూడేళ్లు. ఆయన కన్నాడు, ఆయన విన్నాడు, ఆయన సాధించాడు. నాడు బుద్ధుడు బయట సంచారంలో ఏమి చూశాడు? వాటినిబట్టి పూర్తిగా మారిపోయాడు. అప్పటి దాకా రాజ ప్రాసాదంలో పుట్టి పెరిగిన గౌతముడికి జర రుజ మరణాలు గురించిన స్పష్టత లేదు. తన రథం నడిపిన సారథిని అడిగి తెలుసుకున్నాడు. జర రుజ మరణాలు ప్రతి మనిషిని ఆవహి స్తాయ్‌ అని సారథి తేటతెల్లం చేశాడు. ఒక్కసారిగా రాకుమారుడికి బుద్ధి వికసించింది. 

జగన్‌మోహన్‌రెడ్డి అప్పటిదాకా అంతఃపురంలో పెరి గాడు. ఒక్కసారిగా విశాల ప్రపంచాన్ని చూడాలని, చూసి అర్థం చేసుకోవాలనుకున్నాడు. పాదయాత్రకి బయలు దేరాడు. ఎండనక, వాననక.. చీకటిని, వెన్నెలని సమంగా సమాదరిస్తూ, పేద గుడిసెల్లో రాజ్యమేలే దరిద్య్రాన్నీ, లేమినీ జాగ్రత్తగా ఆకళింపు చేసుకున్నాడు. రాష్ట్రంలో ఇంతటి కరువు రాజ్యమేలుతోందా? అని జగన్‌ నివ్వెర పోయాడు. వీళ్లకి ఏదైనా చెయ్యాలని ఎంతో కొంత మేలు చెయ్యాలని అడుగడుగునా ప్రతిజ్ఞ చేస్తూ జగన్‌ నడిచాడు. జనం ఆడామగా, పిల్లాజెల్లా నీరాజనాలు పలికారు. ప్రతి చిన్న అంశం ఆయన గమనించారు.

స్కూల్‌ బ్యాగుల నుంచి యూనిఫారమ్‌ల నించీ అన్నీ అందరికీ సమకూర్చాలని సంకల్పించారు. గ్రామాల పాఠశాలల రూపు రేఖలు మారిపోయాయి. పిల్లలు గర్వంగా ‘ఇది మా బడి’ అనుకునే స్థాయికి తెచ్చారు. గ్రామ సుపరిపాలనకి నాంది పలికారు. చాలా ఉద్యో గావకాశాలు కల్పించారు. ఇది మన రాజ్యం అనే స్పృహ కల్పించారు. గతంలో పాలకులు పల్లెల్ని బాగు చేయడం ఎవరివల్లా కాదన్నారు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదన్నారు. 

గ్రామాల్లో ఎందరో పెద్దలు అనేకానేక ప్రయోగాలు చేసి చక్కని సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో ప్రతి గ్రామంలో కొద్దిమందైనా ఆదర్శరైతులుండేవారు. మావూళ్లో చిదంబరానికి మంచి పేరుండేది. ఆయనని, ఆయన సేద్యాన్ని చూడటానికి అడపాదడపా పొరుగూరి రైతులు వచ్చేవారు. ఆయన పెద్ద భూస్వామి కాదు. కేవలం ఒక ఎకరం భూమి వసతులన్నీ ఉన్నది ఉండేది. పొలంలో రెండు కొబ్బరి చెట్లు, రెండు నిమ్మ మొక్క లుండేవి. బాగా కాసేవి. ఆ నేలలోనే ఐదు సెంట్ల చిన్న చెరువు ఓ మూల ఉండేది. దాంట్లో చేపల పెంపకం నడిచేది. చుట్టూ అరటి మొక్కలు పెంచేవారు.

ఏటా మూడు పంటలు పొలంలో పండించేవారు. ఒక ఆవు వారి పోషణలో ఉండేది. పది బాతులు పంటచేలో తిరుగుతూ ఉండేవి. సేంద్రియ వ్యవసాయానికి ఆవు, దూడ విని యోగానికి వచ్చేవి. పొలం పనులన్నీ చిదంబరం కుటుంబ సభ్యులే సకాలంలో బద్ధకించకుండా చేసుకునేవారు. తక్కువ భూమి కావడంవల్ల శ్రద్ధ ఎక్కువ ఉండేది. రాబడి అధికంగా ఉండేది. మంచి దిగుబడికి మూలం మంచి విత్తనం అన్నది చిదంబరం నమ్మిన సిద్ధాంతం. ఇప్పుడు ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. పెట్టుబడికి సకాలంలో డబ్బు అందిస్తోంది. రైతుకి గిట్టు బాటు ధర కల్పిస్తోంది. ఇవ్వాళ రైతులకు ముఖ్యంగా సన్నకారు రైతుకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. 

జగనన్న పాదయాత్రలో తెలుగునేల ప్రతి అంగుళం నడిచి చూశారు. అందరి గోడు విన్నారు. వాటికి విరు గుడుగా ఏమి చెయ్యాలో కూడా అప్పుడే పథక రచన చేశారు. దాని పర్యవసానమే ఇప్పుడీ ప్రభుత్వం తెచ్చిన పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. ఇంకా చెయ్యాల్సినవి ఎన్నో ఉన్నాయి. సుమారు ఏడాది కాలం కోవిడ్‌వల్ల నష్టపోయాం. విలువైన పౌష్టికాహారం మనమే యథాశక్తి పండించుకోవచ్చు. పల్లెల్లో పళ్లు, పచ్చికూరలు రసాయనాలు లేకుండా పండించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో వస్తున్న పరిశోధనా ఫలి తాలు ఎప్పటికప్పుడు చిన్న రైతులకు చేరాలి. హైబ్రిడ్‌ విత్తనాలు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులిచ్చే ధాన్యాలు ధారాళంగా అందుబాటులోకి రావాలి. రైతులకు ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు నడపాలి. వారికి ఉండే మూఢ నమ్మకాల్ని వదిలించాలి. చిన్న చిన్న రైతులు వినియోగించుకోగల వ్యవసాయ పనిముట్లు అందు బాటులోకి రావాలి. నాగళ్లు, హార్వెస్టర్లు, డ్రోన్‌లు తక్కువ ధరలకే అద్దెలకు దొరకాలి. వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సందర్భాన్ని పేదరైతులకు అంకితం చేసి, ప్రతి ఏటా వారి వికాసానికి ఒక కార్య క్రమం చేపట్టాలి.
-శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement